నవలల రాజు మృగేంద్ర రాజ్‌


Sun,July 21, 2019 12:44 AM

వయసు 13, రాసిన పుస్తకాలు 135, ప్రపంచ రికార్డులు 4, బయోపిక్‌లు 2, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. వయసుతో పనిలేకుండా రికార్డులు సృష్టిస్తూ రచయితగా మారిపోయాడు. ఆడిపాడాల్సిన వయసులో ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్న ‘మృగేంద్ర రాజ్‌' సెలబ్రిటీ అయిపోయాడు. మున్ముందు మరిన్ని పుస్తకాలు ఆవిష్కరిస్తానంటున్న మృగేంద్ర గురించి తెలుసుకోవాల్సిందే..
mrugendra-raj
ఉత్తరప్రదేశ్‌లోని ఫజియాబాద్‌కు చెందిన మృగేంద్ర రాజ్‌ అపర మేథాశక్తివంతుడు. ఆరేండ్ల నుంచే సమాజాన్ని నిశితంగా గమనించడం మొదలుపెట్టాడు. ఇంట్లో తల్లిదండ్రులను, బయట సమాజాన్ని చూస్తూ అందరిలో ఎలా మెలగాలో నేర్చుకున్నాడు. రాజ్‌ కథల్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. పుస్తకాలు చదవడంతో పాటు రాయడం మొదలుపెట్టాడు. చదివిన ప్రతి పుస్తకం గురించి డైరీలో రాసుకుంటాడు. సొంతంగా కొన్ని కథలు కూడా రాసుకున్నాడు. స్కూల్‌, చదువు, ఆటలతో పాటు రచనలు చేయడం మొదలుపెట్టాడు. తనలోని భావాల్ని పద్యాల రూపంలో పొందుపరిచేవాడు. రాసిన పద్యాలను తల్లిదండ్రులకు చూపించాడు. ఎంతో అనుభవం ఉంటే గాని పద్యాలు రాయలేరు. అలాంటిది 12 యేండ్ల రాజ్‌ రాసేసరికి తల్లిదండ్రులకు నోట మాటరాలేదు. కొడుక్కి భవిష్యత్తు ఉంటుందనుకుంటే తల్లిదండ్రులు మాత్రం ఎందుకు కాదంటారు. మృగేంద్రాను రచనల దిశగా ప్రోత్సహించారు తల్లిదండ్రులు. దీంతో ‘నేటి అభిమన్యు’ అనే కలం పేరుతో బావాల్ని పద్యాలుగా మార్చి తొలి పుస్తకానికి నాంది పలికాడు.


mrugendra-raj1

రామాయణంలోని పాత్రలు

స్కూల్‌లో చలాకీగా తిరిగే మృగేందర్‌కు, ఉపాధ్యాయులతో మంచి అనుబంధం ఉన్నది. క్లాస్‌లో చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాడు. రామాయణం, మహాభారతం పురాణాలపై అసక్తి ఎక్కువ. పెద్దవాళ్లకు సైతం రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా ముఖ్యమైన పాత్రలు తప్ప అందులో ఉండే మిగతా పాత్రల గురించి తెలీదు. ఇందులోని ప్రతి పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్ధేశంతో రామాయణంలోని 51 పాత్రలను అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాడు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందే విధంగా పుస్తకాలు రచించాడు.

ఇంతటితో ఆగలేదు. పధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జీవిత చరిత్రలను పుస్తక రూపంలోకి తీసుకొచ్చి వారి దృష్టిలో పడ్డాడు. ఈ విధంగా మృగేంద్ర రాజ్‌ రచనలు హిందీ భాషలో సుమంత్‌, పినాక్‌, రామ్‌, ప్రహస్త్‌ పేరుతో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 25 నుంచి 100 పేజీల్లోపే ఉంటాయి. ఎక్కువ బయోగ్రపీలు రాసిన బాలుడిగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో చోటు సంపాదించుకున్నాడు. లండన్‌లోని ‘వరల్డ్‌ రికార్డ్‌ యూనివర్సిటీ’ క్యాంపస్‌లో డాక్టరేట్‌ చేయాలని మృగేందర్‌ను ఆహ్వానిస్తున్నది. ఇప్పటివరకు మృగేంద్ర నాలుగు ప్రపంచ రికార్డులు సాధించగా పలువురు ప్రముఖుల చేతులమీదుగా ఎన్నో బహుమతులు అందుకున్నాడు. భవిష్యత్తులో వివిద అంశాలతో కూడిన ఎన్నో పుస్తకాలు రాస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

నేనూ అల్లరిపిల్లాడినే..

అందరిలా నేను కూడా అల్లరి చేస్తుంటా. ఖాళీ దొరికినప్పుడు మాత్రం సమయాన్ని రచనలకు కేటాయిస్తా. మా తండ్రి ఉత్తరప్రదేశ్‌లోని షుగర్‌ ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. తల్లి ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. నా మొదటి గురువు మా అమ్మనే. నాకు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే బాగా ఇష్టం. చదువులోనూ ముందుండాలనుకుంటాను. భవిష్యత్తులో రచనలతో పాటు దేశం గర్వించేస్థాయికి ఎదుగుతాను. ఇప్పటి తరానికి నేను ఆదర్శంగా నిలువాలనుకుంటున్నాను.
- మృగేంద్ర రాజ్‌

254
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles