ఈ వర్షం సాక్షిగా


Fri,July 19, 2019 01:02 AM

వేసవి సెలవులు ముగిసాయి.వర్షకాలం మొదలైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రకృతి కొత్త చివురులు వేస్తూ పచ్చదనాన్ని పరుచుకుంటున్నది. ప్రకృతితో మమేకమై విహారయాత్రలు చేయాలనుకునేవారికి ఈ కాలం ఎంతో బాగుంటుంది. ఒకవైపు ఎత్తునుండి లోయల్లోకి దూకే జలపాతాలు, మరోవైపు పచ్చందాలను పరుచుకున్న అడవులు, నిండుగా నీటితో నిండి రా..రమ్మని పిలిచే చెరువులు ఒక్కటనీ కాదు వర్షకాలపు ప్రకృతిని ఆరాధించేవారి కోసం ఆకుపచ్చని రంగేసుకున్న తెలంగాణ నిండుగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నది.


తెలంగాణలో ఎన్నెన్నో చూడదగిన ప్రాంతాలు. నదులు, లోయలు, జలపాతాలతో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రభుత్వం ఒకవైపు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికోసం పాటు పడుతూనే ఏకో-టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నది. ప్రకృతి ఒడిలో విహరించాలనుకునేవారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణలో ఎకో టూరిజంను ప్రమోట్ చేయడానికి అనేక ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. ఎకో టూరిజానికి ఆలవాలమైన ప్రదేశాలు ఎన్నో మనల్ని ఆకట్టుకుంటాయి.

Waterfalls

భోగథ జలపాతాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏకో-టూరిస్ట్ స్పాట్ భోగథ వాటర్ ఫాల్స్. దీనిని చూడడానికి మన రాష్ట్రం నుండే కాకుండా.. పక్క రాష్ర్టాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతాలు జిల్లా కేంద్రమైన భూపాలపల్లి నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఏటూరునాగారానికి కేవలం 23 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. వారంలో అన్ని రోజులు పర్యాటకులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జలపాతాలను చూసేందుకు అనుమతిస్తారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్ , లైట్ హౌస్ కూడా పర్యాటకులని బాగా ఆకర్షిస్తున్నాయి.

Laknavaram

లక్నవరం చెరువు

కనుచూపు మేరలో కనిపించే నిండైన నీటి చెరువు లక్నవరం. ప్రధానంగా ఇక్కడ చెరువు పైన ఎల్ ఆకారంలో ఉండే వంతెన ఈ ప్రాంతానికి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ రాత్రి పూట బస చేయడానికి ప్రత్యేకంగా కాటేజెస్ ఉన్నాయి. అలాగే ఈ చెరువులో షికారు చేయడానికి బోటు సౌకర్యం కూడా ఉంది. ఇటీవలే ఇక్కడ రెండో వంతెన కూడా నిర్మించారు. ఇక్కడికి చేరుకోవడానికి వరంగల్ నుండి 70 కిలోమీటర్లు కాగా.. హైదరాబాద్ నుండి సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది.

Akka-Mahadevi

అక్కమహాదేవి గుహలు

ఈ గుహలు కూడా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్‌కు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర నుండి బోటులో వెళ్లాల్సిందే. ఇది కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉండే ప్రదేశమే. 12వ శతాబ్దంలో అక్కమహాదేవి ఈ గుహల్లో పరమశివుడిని కొలిచినట్లు చెబుతారు. అందుకు రుజువుగా ఆ గుహల్లో శివుని విగ్రహం మనకి కనిపిస్తుంది.ఇక ఈ గుహలని సందర్శించినవారు ఎప్పటికి కూడా ఈ అనుభవాన్ని మర్చిపోలేరు. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ చేసే బోటు ప్రయాణం.. ఒక్క గొప్ప అనుభవం.

mallela-theertham

మల్లెల తీర్థం జలపాతాలు

ఈ జలపాతాలు కూడా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్- శ్రీశైలం హైవేలో వచ్చే వత్వార్లపల్లి దగ్గరి నుండి.. సొంత వాహనాల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఈ జలపాతాలు సందర్శించడానికి అనువైన సమయం - అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనే చెప్పాలి. మిగతా సమయంలో ఇక్కడ జలపాతాలలో నీటి ప్రవాహం అంతగా ఉండదు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుండి 185 కిలోమీటర్లు ఉండగా.. శ్రీశైలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Octopus-View-Point

ఆక్టోపస్ వ్యూ పాయింట్

శ్రీశైలం డ్యామ్ పైన ఉన్న వ్యూ పాయింట్ పేరు ఆక్టోపస్. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉంది.ఇక్కడకు చేరుకోవడానికి హైదరాబాద్ - శ్రీశైలం హైవే రోడ్ మన్ననూర్ నుండి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్లాలి. ఇక ఈ వ్యూ పాయింట్ నుండి కృష్ణా నది బ్యాక్ వాటర్‌తోపాటు నది నల్లమల అడవుల్లోకి ప్రవేశించే మార్గాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇది చూడడానికి ఆక్టోపస్ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి..అదే పేరుని పెట్టారు.దీన్ని జూన్ -జనవరి నెలల మధ్యలో సందర్శిస్తే బాగుంటుంది. దగ్గరలోని ఫర్హాబాద్ వ్యూ పాయింటు కూడా పర్యాటణకులకు అనువైన ప్రదేశం.

ETURU_NAGARAM

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

తెలంగాణలో అటవీ ప్రాంతం కూడా పర్యాటక రంగానికి ఆనుకూలమైందే. ఇక్కడ విశేషంగా ఆకర్షిస్తున్న అటవీ ప్రదేశాల్లో ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి. వరంగల్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యంలో రాత్రిపూట బస చేసేందుకు వీలుగా టూరిజం శాఖ తాడ్వాయి హట్స్ పేరిట గృహాలు ఏర్పాట్లు చేశారు. సుమారు 6 గుడిసెలను సకల సదుపాయాలతో రెడీ చేశారు. వీటిని ముందుగానే మనం బుక్ చేసుకోవడానికి తగు ఏర్పా ట్లు కూడా ఉన్నాయి. సుమారు 800 కిలోమీటర్ల అభయారణ్యంలో ఒక రాత్రి బస చేయడమంటే ఎంత థ్రిల్‌గా ఉంటుందో ఊహించుకోండి.

NELLIKALLU

నెల్లికల్ వ్యూ పాయింట్

నాగార్జున సాగర్ డ్యామ్ వద్దనున్న నెల్లికల్ వ్యూ పాయింట్ పర్యాటకులని బాగా ఆకర్షిస్తున్నది. ప్రధానంగా డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వ్యూ పాయింట్ ద్వారా డ్యామ్‌తో పాటు.. ఆ చుట్టుపక్కల ఉన్న అడవులను కూడా చూడవచ్చు.ఈ వ్యూ పాయింట్ ప్రధాన రహదారి నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. అక్కడికి కాలి నడకన వెళ్లేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌ను కూడా టూరిజం శాఖ వారు ఏర్పాటు చేశారు.

pandavula

పాండవుల గుట్ట

ఈ గుట్టనే పాండవుల గుహలు అని కూడా అంటారు. వీటిని 1990లో గుర్తించారు. ఇవి వరంగల్ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో, రేగొండ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ రాక్ క్యాబ్లింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడి గుహల్లో ఎంతో గొప్ప చిత్రకళా సంపదను కూడా చూడవచ్చు. వారంలో అన్ని రోజులు కూడా ఈ గుట్టను సందర్శించవచ్చు. ర్యాపెల్లింగ్, హైకింగ్ వంటి అడ్వెంచర్ గేమ్స్‌లో కూడా ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టూరిస్టులు సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

మరింకెందుకు ఆలస్యం.. వీటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని.. మీ కుటుంబసభ్యులతో ఈ వర్షకాలంలో ఒక చిన్నపాటి విహారయాత్రకు వెళ్లిరండి.

- మధుకర్ వైద్యుల

1155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles