మలబార్ కేరళీయం!


Fri,July 12, 2019 01:13 AM

viharam
ఆకాశంలో తెలతెల్లగా తేలిపోతున్న మబ్బులు.. వాటిని అందుకునేందుకా అన్నట్టు నిటారుగా పెరిగిన దట్టమైన చెట్లు.. ఆకుపచ్చ దుపట్టా కప్పుకున్నట్టు వరుసగా కనిపించే మట్టి కొండలు.. ఇవీ దైవభూమి కేరళలో ఉత్తరాన మలబారు జిల్లాల్లో ఎటుచూసినా కనిపించే దృశ్యాలు. ఇటు పశ్చిమ కనుమలు, అటు అరేబియా కడలి అంచున పర్చుకున్న మలబార్ జిల్లాల్లో పర్యాటకులను కట్టిపడేసే ప్రాంతాలు ఎన్నో. మలబార్ జిల్లాల్లో కొబ్బరి, అరటి తోటలు కనువిందు చేస్తుంటాయి. ఇక కేరళకు పెట్టింది పేరైన సుగంధద్రవ్యాలు, కాఫీ తోటలు పచ్చదనాన్ని పర్చుకొని కనిపిస్తాయి. దక్షిణ కేరళలోని బ్యాక్‌వాటర్స్‌లో ట్రాఫిక్ జామ్‌లా కనిపించే పడవల సందడి ఈ జిల్లాల్లో కనిపించదు. మలబార్ జిల్లాల్లో జీవనంలోనూ, నీటి ప్రవాహాల్లోనూ నిలకడ కనిపిస్తుంటుంది. అందుకే బ్యాక్‌వాటర్స్‌లో పడవల్లో విహరిస్తే ఏ హడావుడిలేని ప్రశాంతత మదినిండా నిలిచిపోతుంది.
viharam4
మలబార్ జిల్లాల్లో పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆసక్తిని కలిగించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తర కేరళలో చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రధానమైన జిల్లా కన్నూర్. పర్షియా, అరేబియాతో 12వ శతాబ్దం నుంచే వాణిజ్య సంబంధాలున్న తీరప్రాంత పట్టణం ఇది. ఇక్కడ పోర్చుగీసు వైస్రాయ్ క్రీ.శ. 1505లో నిర్మించిన సెయింట్ ఆంజిలో ఫోర్ట్ ప్రసిద్ధిగాంచింది. ఈ కోటను తదనంతర కాలంలో డచ్చివారు స్వాధీనపర్చుకున్నారు. పలు యుద్ధాల అనంతరం 1772లో డచ్చివారు దీనిని అరక్కల్ వంశస్థులైన అలీరాజాకు విక్రయించారు. త్రికోణంలో ఉండే ఈ కోట బురుజులపై పటిష్ఠమైన తోపులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మన కాకతీయ రాజులు ఖిలా వరంగల్ కోట చుట్టూ శత్రువులను నిరోధించేందుకు తవ్విన అగడ్తలలాంటివే ఇక్కడ ఈ కోట చుట్టూ మనకు కనపడతాయి. సముద్రమార్గంలో దాడికి వచ్చే శత్రుసైన్యాలను తిప్పికొట్టేందుకు సముద్రముఖంగా ఉన్న తోపులు ఇక్కడ ఆకర్షిస్తాయి. కోట బురుజులపైనుంచి కడలి అందాల్ని మనం వీక్షించవచ్చు.
viharam5
viharam6
అరక్కల్ వంశీయులకు ఈ కోట చేజిక్కిన తరువాత దానిని అభివృద్ధి పరిచారు. ఇప్పుడు ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. 17వ శతాబ్దంలోనే కన్నూర్ కేంద్రంగా కేరళలో ఒక ముస్లిం వంశం మొదటిసారి రాజ్యపాలన చేసింది. ఈ వంశస్థుల పాలనకు చిహ్నంగా కన్నూర్‌లో మ్యూజియంను నిర్వహిస్తున్నారు. అరక్కల్ మ్యూజియంగా పిలిచే ఈ మ్యూజియంలో అరుదైన వస్తువులున్నాయి. అయితే పెద్ద గోదాంలో నిర్వహిస్తున్న ఈ మ్యూజియం పైకప్పు శిథిలావస్థకు చేరడం దురదృష్టకరం. వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి.. హిందూ, ముస్లింలను ఏకం చేసి సాంస్కృతికంగా చక్కని సామాజిక పాలన అందించిన రాజులుగా అరక్కల్ వంశీయులకు మంచిపేరుంది.
viharam1

బాణాసుర సాగర్ డ్యాం

వయనాడ్‌లో ప్రత్యేక ఆకర్షణ బాణాసుర సాగర్ డ్యాం. కాల్‌పెట్ట నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆనకట్ట మట్టితో కట్టింది. ఇలా మట్టితో కట్టిన ఆనకట్టగా మన దేశంలో ఇదే మొదటిది.. ఆసియాలోనే రెండోదని చెబుతారు. ఎత్తైన మట్టికొండల మధ్య ఈ డ్యాం చాలా విశాలంగా కనిపిస్తుంది. ఈ ఆనకట్టను కొండలపైనున్న రిసార్ట్‌ల నుంచి చూడగలిగితే అద్భుత దృశ్యమే.
viharam2

తక తెయ్యం!

కాసర్‌గోడ్ జిల్లాలో చూడాల్సిన అనేక ప్రాంతాల్లో చారిత్రాత్మకమైంది బేకాల్ ఫోర్ట్. కోటలో విశాలంగా పరుచుకొని ఉండే పచ్చగడ్డిపై నడుస్తూ కడలి అలల శబ్దాన్ని వినడం నిజంగా ఓ అపురూప అనుభూతి. మలబార్‌లో తెయ్యం జానపద కళారూపం ప్రసిద్ధి. కాసర్‌గోడ్‌లో తెయ్యం ఉత్సవాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ జిల్లాలో నీలేశ్వర్‌లోని తేజస్విని నదిలో హౌస్‌బోట్ల అందమే వేరు. నిశ్చలంగా కనిపించే నీటిలో.. కొబ్బరిచెట్ల వరుసల మధ్య హౌస్‌బోట్‌లో ప్రయాణం ఆహ్లాదకరం.
viharam7

కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం

కన్నూర్‌కు తూర్పువైపు 28 కిలోమీటర్ల దూరంలో గత ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయింది. 2300 ఎకరాల్లో ఈ విమానాశ్రయం చాలా విశాలంగా కనిపిస్తుంది. మలబార్ జిల్లాలకు ఇప్పుడు ఇది ప్రధాన కేంద్రంగా మారింది. మధ్యప్రాచ్య దేశాల్లో అనేక వృత్తుల్లో ఉన్న మలబార్ జిల్లాల వాసులు ఇప్పడు తమ స్వస్థలాలకు రాకపోకలకు సాగించేందుకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఉత్తర కేరళకే కాకుండా కర్ణాటకలోని సరిహద్దు ప్రాంత జిల్లాలకు కూడా ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రతిఏటా ఈ విమానాశ్రయాన్ని 10 లక్షల మంది ప్రయాణీకులు వినియోగిస్తారని అంచనా.
viharam3

వయనాడ్ కార్నివాల్

రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఎడతెరిపిలేని వర్షాలు కేరళను కుదిపేస్తుంటాయి. వర్షంలోనూ బయటకు వచ్చి ఆటపాటల్లో పాల్గొంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచననుంచే పుట్టుకొచ్చింది వయనాడ్ జిల్లాలో జరిగే మాన్‌సూన్ కార్నివాల్ (splash). కేరళ టూరిజం, వయనాడ్ టూరిజం ఆర్గనైజేషన్ కలిసికట్టుగా 2009 నుంచి వర్షాకాలంలో ఈ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నారు. టూరిస్టులకు, ప్రకృతి ఆరాధకులకు ఈ కార్నివాల్ ఆకర్షణీయంగా మారింది. బురదమడుల్లో ఫుట్‌బాల్ ఆడడం, చెట్ల మధ్య సన్నటి దారుల్లో సైక్లింగ్ వంటి అనేక ఆటలు ఈ కార్నివాల్‌లో యువతను కట్టిపడేస్తున్నాయి. వయనాడ్ కొండప్రాంతాల్లోని స్థానిక గిరిజనుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడాది గురువారం (జూలై 11) నుంచి ఈ కార్నివాల్ మొదలైంది. 14న ఈ ఉత్సవం ముగుస్తుంది. దాదాపు 55మంది ఎస్టేట్ల యజమానులు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

- కాకతి
[email protected]

908
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles