నర్మద పరిక్రమ


Fri,July 12, 2019 01:03 AM

నీళ్లలోంచి బంగారు నాణేలు!
(గత సంచిక తరువాయి)
Narmada-maatha
-నీళ్లలోని ఆయన కాళ్లమీది చర్మాన్ని, మాంసాన్ని చేపలు ఇతర జలచరాలు తినేశాయి! కేవలం ఎముకలే మిగిలాయి!! ఆర్నెల్ల తర్వాత నర్మదా మాత ఆయనకు దర్శనం ఇచ్చింది.

రాత్రి భోజనం మేం బస చేసే చోట వండి పెడుతారు. ఏ రోజు ఏం వండాలో మొత్తం మెనూను దేశాయ్ ముందే నిర్ణయించి ఆమెకు చెప్పారు. ఆ ప్రకారం సరుకులను తీసుకువచ్చారు. ఈ యాత్రలో ఆ ఇద్దరు సేవకులు, పుష్ప మౌసి ఏ విషయంలోనూ ఎవరిమీదా చిరాకు పడగా నేను చూడలేదు. ఎప్పుడూ నవ్వు మొహాలతోనే కనిపించారు. వారికి దేశాయ్ ఇది చెయ్యి, అది చెయ్యి అని పనిని పురమాయించగా కూడా నేను చూడలేదు. తాము చేయాల్సింది ఎవరూ చెప్పకుండానే వారు చకచకా చేసుకు వెళ్లడం విశేషం. దేశాయ్ కూడా ఎప్పుడూ చిరునవ్వుతో కనపడేవారు. అంతమందితో చేసే ఆ యాత్ర తాలూకు ఒత్తిడి ఎన్నడూ ఆయన మాటల్లో, మొహంలో లేదా చర్యల్లో కనపడలేదు.

బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మళ్లీ అంతా బస్సు ఎక్కాం. కొద్దిసేపటికి మా బస్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోని షెండ్లా అనే ఊళ్లోకి ప్రవేశించింది. పక్కనే ఓ పురాతన కోట కనిపించింది. కూరలు కొనడానికి రద్దీగా ఉన్న రోడ్డుపక్కన బస్‌ని ఆపారు. చాలామంది బస్ దిగి చిరుతిళ్లు కొన్నారు. ఓ అరటిపళ్ల దుకాణంలోంచి పళ్లు కొని ఒకరు బస్‌లోని అందరికీ తలా ఒకటి పంచారు. ఆ అరటి పళ్ల దుకాణం అతనికి మేం నర్మద పరిక్రమ చేస్తున్నామని తెలిసి, బస్‌లోని అందరికీ ఇవ్వమని ఉచితంగా నలభై అరటిపళ్లని ఇచ్చాడు. పరిక్రమ వాసులు (నర్మదా నదికి ప్రదక్షిణం చేసేవారు) దొరకడం తన అదృష్టమని, ఆ పళ్ల దుకాణం యజమాని, దేశాయ్ డబ్బు ఇచ్చినా తీసుకోలేదు. నర్మద పరిక్రమ చేసేవాళ్లకు ఆహారం ఇవ్వడం పుణ్యకార్యంగా నర్మదా నదికి సమీపంలో నివసించే వారు భావిస్తారు. బీదవారే అయినా ఆదివాసులు, భిల్లులు కూడా యాత్రికులతో తమ భోజనాన్ని పంచుకోవడం మామూలే. నేనా అరటిపండును దారిలో కనబడ్డ మేకకు వేశాను.

మా బస్సు మధ్యాహ్నం ఒంటిగంటకు బేడియా అనే గ్రామం దగ్గర నేషనల్ హైవేకి పక్కనే ఉన్న ఓ శివాలయం దగ్గర ఆగింది. నీటి వసతి ఉందో లేదో చూసి వచ్చాక పనివాళ్లు పాత్రలు దింపారు. బోరింగ్ పంపునీటితో మా కంచాలని కడుక్కున్నాం. పావ్ బాజి, బ్రెడ్, అరటిపండు, ఓ స్వీట్ లంచ్‌కు ఇచ్చారు. నేను, వెంకటేశ్వరరావు దైవదర్శనం చేసుకున్నాం. నేను బ్రెడ్‌ను అక్కడున్న ఉడుతకి వేశాక భోజనానికి ఉపక్రమించాను.

గౌరీశంకర్ మహారాజ్

లంచ్ అయ్యాక బస్ బయలుదేరే లోగా దేశాయ్ 150-200 ఏండ్ల క్రితం నర్మద ఒడ్డున, హోషంగాబాద్‌కి 28 కి.మీ. దూరంలోని కౌసల్య, నర్మదల సంగమ స్థలం అయిన ఖోక్సర్‌లో జీవించిన గౌరీశంకర్ మహారాజ్ అనే మహాత్ముడి గురించి చెప్పారు. గౌరీ శంకర్ నర్మదా నదీమధ్యలో నీళ్లలో నిలబడి నర్మద మాత దర్శనం కోరి ఓం నర్మదా నమ: అనే మంత్రాన్ని ఆర్నెల్లపాటు జపించారు. నీళ్లలోని ఆయన కాళ్లమీది చర్మాన్ని మాంసాన్ని చేపలు, ఇతర జలచరాలు తినేశాయి! కేవలం ఎముకలే మిగిలాయి!! ఆర్నెల్ల తర్వాత నర్మద మాత ఆయనకు దర్శనం ఇచ్చింది.

నువ్వు ఏ భూతానివో కావని, నర్మద మాతవే అని నాకు నమ్మకం ఏమిటి? అడిగారు గౌరీ శంకర్. బదులుగా నర్మదా నది అతని చుట్టూ పెద్ద సుడిగుండాన్ని సృష్టించింది. కానీ, దానిలో అతను మాత్రం నిశ్చలంగా ఉన్నారు. సుడిగుండం తనను ఏమీ చేయకపోవడంతో ఆమె భూతం కాదని, నర్మదా మాతేనని, భూతానికి ఇంత శక్తి ఉండదని గౌరీ శంకర్‌కి నమ్మకం కలిగింది. తన తపస్సు భగ్నం కాలేదని ఆయన నమ్మాక- నర్మద చెప్పింది.

నా దర్శనం కావాలనే నీ కోరిక తీరింది. ఇక నువ్వు నా దగ్గరే ఉండిపో. ఆయన నదిలోంచి బయటకు రాగానే కాళ్లల్లో తిరిగి మాంసం, చర్మం వచ్చాయి! ఆ తర్వాత జీవితాంతం ఆయన శరీరంలోని కిందిభాగం తెల్లగా, పైభాగంలో పుట్టిన చర్మం రంగులో నల్లగా ఉండేది. ఆయన నర్మదా నది పక్కనే ఖోక్సర్‌లో ఆశ్రమం నిర్మించుకొని జీవించారు. నర్మద పరిక్రమ చేసే సాధువులకు భోజనం పెట్టేవారు.

ఓసారి అయిదు వేలమంది సాధువులకి గౌరీ శంకర్ మహారాజ్ భోజనం పెట్టారు. ఇది తెలిసిన బ్రిటిష్ అధికారులు వచ్చి ఆయనను, అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తనకు నర్మదా నది ఆ డబ్బు ఇచ్చిందని అంటే బ్రిటిష్‌వాళ్లు దానిని ఋజువు చేయమన్నారు. ఆయన నవ్వుతూ నర్మదా జలంలోంచి బంగారు నాణేల సంచీ ఒకటి బయటకు తీశారు!

మల్లాది వెంకట కృష్ణమూర్తి
mvk murthy

తీర్థయాత్ర
theertha-yatra

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles