దయాగుణమే ప్రధానం


Fri,July 12, 2019 01:00 AM

Bhakti-margam
పోతనామాత్యుని విరచితమైన తెలుగు శ్రీమద్భాగవతం అటు భక్తికి, ఇటు ధార్మిక జీవనానికి అద్దం పట్టింది. పలు చోట్ల వివిధ సందర్భాలలో ఈ విషయాలు వెల్లడవుతాయి. చేతులారంగ శివుని పూజింపడేని / నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని/ దయయు సత్యంబు లోనుగా దలపడేని/ కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అనే పద్యం ఎంతో ప్రసిద్ధం. భక్తి తత్పరతతోపాటు భూతదయ భగవత్సేవతో సమానమని చెప్పిన ఇందులోని నీతి ప్రతి ఒక్కరికీ ఆచరణీయం. మానవులు అవలంభించవలసిన అన్ని సుగుణాలకంటే దయాగుణమే ప్రధానమని, లోకల్యాణానికి అదే శ్రీరామరక్షగా నిలుస్తుందని దీనితో స్పష్టమవుతున్నది. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లడానికి ప్రతి వ్యక్తీ దయాగుణాన్ని కలిగి ఉండాలి.

భాగవతంలోనే మరొకచోట భూతముల కెగ్గు సేసిన/ భూతంబులు నీకు నెగ్గులు బుట్టించె వృథా/ భూతమగు మనిషికి యెల్లను/ భూతద్రోహికిని శుభము పొంద వధీశా! అన్నారు పోతన. భూతదయ మనిషికి సహజ గుణాభరణం కావాలి. అంతేకాని, భూతద్రోహం ఎప్పటికీ, ఎవరికీ పనికిరాదు. అది అత్యంత ప్రమాదకరం కూడా. ఈ దయాగుణాన్నే ఆ మహత్ గ్రంథం మానవజాతికి ఇచ్చిన గొప్ప సందేశంగానూ మనం భావించాలి. మహాభారత గాథతోనే శ్రీమద్భాగవతం కూడా ప్రారంభమవుతుంది. ఉపపాండవులుగా ప్రఖ్యాతులైన తన అయిదుగురు కుమారులను ఘోరంగా వధించిన అశ్వత్థామను అర్జునుడు బంధించి, తన ముందుకు తెచ్చినప్పుడు ద్రౌపదీ సాధ్వి అన్న మాటలు ఇక్కడ సందర్భోచితం.

భూసురుడవు బుద్ధి దయా/ భాసురడవు, శుద్ధవీర భట సందోహా/ గ్రేసరుడవు, శిశుమారణ/ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ (భాగ. 1-161) అన్నది ఆమె నిలదీత. దీనికి అశ్వత్థామ వద్ద సమాధానమెక్కడిది? ఏది ధర్మమో, ఎవరికి దయాగుణం ఉండాలో ఇందులో ఆమె చెప్పకనే చెప్పారు. శ్రీమద్భాగవతంలోని 7వ స్కంధంలో వచ్చే ప్రహ్లాదుని కథ మనకు తెలిసిందే. ఒక సందర్భంలో సర్వభూతములందు దయా సుహృద్భావములు కర్తవ్యంబులు.. (7-217) అన్న ఆ మహాబాలభక్తుని మాటలూ ఈ సందర్భంలో గమనార్హం. అన్ని ప్రాణుల యెడ మానవాళికి ఉండవలసిన దయ ఎంత తప్పనిసరో ఇలా ఆయా సన్నివేశాల ద్వారా భాగవతం మనకు తెలియజేసింది. దయలోనూ ఉన్నదీ దైవభక్తే కదా!
- గన్నమరాజు గిరిజా మనోహరబాబు

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles