నిశీధి నుంచి నిండు పున్నమి దాక


Wed,July 10, 2019 01:01 AM

అంతా బాగుంది అనుకున్నప్పుడే జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ కుదుపు మరెన్నో కష్టాలకు దారితీస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు దొరసాని చిత్ర దర్శకులు కేవీఆర్ మహేంద్ర. సమస్యలు వెంటాడినట్టే ఆయన్ను ఓ కథ కూడా వెంటాడింది. ఎప్పుడో ఇరవై ఏండ్ల కిందట మొదలైన సంఘర్షణ ఇప్పుడు దొరసాని సినిమాకు ప్రాణం పోసింది. ప్రేమ అనే యూనివర్సల్ కంటెంట్‌కు కొత్త ట్రీట్‌మెంట్ ఇస్తూ చక్కటి సాంకేతిక విలువలతో తీర్చిదిద్దారు. ఈ నెల 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా కేవీఆర్ మహేంద్ర చెప్పిన దొరసాని సంగతులేంటో.. ఆయన ప్రస్థానమేంటో తెలుసుకుందాం.
kvr-mahendra
ప్రేమ కోసం సముద్రాలు ఈదితే ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచాన్నే జయిస్తే చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఇలాంటి ప్రేమకోసం ఓ యువకుడు గడి గోడలను దాటి మేడలోని దొరసానిని ప్రేమిస్తే ఎదుర్కొన్న పరిస్థితులేంటో సహజంగా, వాస్తవికంగా, గాఢంగా చూపించానంటున్నారు కేవీఆర్ మహేంద్ర. ట్రైలర్.. సాంగ్స్ ద్వారా అందరిలో ఆసక్తిని పెంచారు. దొరసాని వెనక కేవీఆర్ ప్రయాణం ఎలాంటిది? ఆయన మాటల్లోనే..

ఓ ఉదయం.. ఒక పోస్టర్..

వరంగల్ జిల్లా జయగిరి మా ఊరు. మధ్య తరగతి కుటుంబం. అక్కడ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితులు ఉండేవి కావు. హైదరాబాద్ రావడం అంటే అందరికీ ఒక కల. అది నాకూ ఉండేది. చిన్నప్పుడు ఒకరోజు కమ్యూనిస్టు పార్టీవాళ్లు మా ఊర్లో చలో హైదరాబాద్ పోస్టర్ వేస్తే దాన్ని చూశాను. ఎలాగైనా హైదరాబాద్ వెళ్లాలని ఇంట్లో వాళ్లతో ఫైట్ చేశాను. టికెట్ తీసుకొనే అవసరం ఉండదు కాబట్టి ఊర్లో వాళ్లతో కలిసి వెళ్లడానికి అమ్మానాన్న ఒప్పుకున్నారు. అలా వాళ్లతో హైదరాబాద్ వచ్చాను. ఫిల్మ్‌నగర్‌లో హీరోలు, వాళ్ల ఇండ్లు ఉంటాయని వెళ్లాం. గుట్టలలో ఓ షూటింగ్ జరుగుతుంది. దాన్ని చూడగానే సినిమా షూటింగ్ అంటే ఇలా ఉంటుందా? అనిపించింది.

ఓ సాయంత్రం.. ఒక స్పర్శ..

ఫిల్మ్‌నగర్ గుట్టల్లో ఒక సాయంత్రం. అక్కడ ఓ సినిమా షూటింగ్ చూశాను. అది రాజశేఖర్ నటించిన అన్నా సినిమా. నాకు అద్భుతంగా అనిపించింది. షూటింగ్ అంతా అయిపోయాక హీరో రాజశేఖర్ కారు ఎక్కుతున్నారు. అప్పుడే ఆ గుంపులోంచి నేను ఆయన చేతిని తాకాను. ఆ ఒక స్పర్శ నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణం అయింది. అప్పుడు చాలా చిన్నవాడిని, ఏం చేయాలో తెలియదు. కానీ బలంగా అనుకున్న ఇండస్ట్రీలో ఉండాలని. ఆ మూమెంట్ లేకుండా ఉంటే నా జర్నీ ఉండేది కాదు. నేను దర్శకున్ని అయుండేవాడినీ కాదు. అంత చిన్నప్పుడే నా లైఫ్‌కు బీజం పడింది. ఇంకా అక్కడి నుంచి చదువులు వదిలేసి హైదరాబాద్ వచ్చాను.

ఇక్కడికి వచ్చి సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే చదువు పూర్తి చేశాను. చాలా ప్రయత్నాలు, స్ట్రగుల్స్ తర్వాత 2002లో మొదటి సారి ఒక సినిమాకు పని చేశాను. అది పీపుల్స్ భారతక్క సినిమా. డైరెక్టర్ నాకు పెద్ద సపోర్ట్ ఉండె. అంతా బాగుంటుందని అనుకున్న. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మూడు నెలల్లో డైరెక్టర్ చనిపోయారు. అది నాకు పెద్ద లోటును మిగిల్చింది. తర్వాత అనేక ప్రయత్నాలు కొనసాగాయి. పెద్ద అనుభవాలను పొందుతూ ప్రయాణం సాగించాను. నా కలల ప్రయాణం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది.

kvr-mahendra4

ఒక రాత్రి.. ఓ ఆవిర్భావం

ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. హైదరాబాద్ అంతా వెలుగుల జిలుగులతో మెరిసిపోతుంది. ఎక్కడికక్కడా సంబురాలు జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రి నేను, నా ఫ్రెండ్ కారులో ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ పరిసరాల్లో తిరుగుతున్నాం. ఈ వెలుగులకు కారణమైంది ఎవరు? ఇంత పండుగ వాతావరణం వెనుక ఎవరి త్యాగం దాగి ఉంది? ఈ సంబురాలు చేసుకోవడానికి అర్హులు ఎవరు? అనే ప్రశ్నలు వెంటాడాయి. కానీ వాళ్లెవరూ లేరిప్పుడు. వాళ్లు అంటే అమరులు. సినిమా మాధ్యమం ద్వారా దీని గురించి ఏదో చెప్పాలనిపించింది.

మరి ఇదంతా సినిమా చేయగలనా? ప్రొడ్యూసర్ దొరుకుతాడా? దొరకడు.. అందుకే షార్ట్ ఫిలిమ్ తీయాలనుకున్నా. తెలంగాణ మూమెంట్ అంటే మనకు తెలుసు. ఆ పోరాటం మనకు తెలుసు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి. ఒక సంఘం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. అట్లా మనం కూడా తెలంగాణలో చేశాం. దీన్నే నేను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. నా ప్రయత్నం మొదలు పెట్టాను.

14 నిమిషాలు.. ప్రపంచ స్థాయి..

ఆ రాత్రి పుట్టిన సంఘర్షణల ఫలితం నిశీధి షార్ట్ ఫిలిమ్. 14 నిమిషాలు బ్లాక్ అండ్ వైట్‌లో తీశాను. ఒక పోరాటంలో అమరుని పాత్ర ఏంటి, ఉద్యమం తాలూకు ఫలితం సమాజంలో ఎలా ఉంటుంది అనేదాన్ని చూపించగలిగాను. ఇది అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శితమైతే తెలంగాణ ఉద్యమ విలువ ప్రపంచానికి తెలుస్తుందనుకున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టా. దీని కోసం కూడా చాలా కష్టపడ్డా. ఆర్థిక సమస్యలూ వెంటాడాయి. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఒక దశలో నా ఉంగరాలు కుదువ పెట్టిన సందర్భాలున్నాయి.

నిశీధి కోసం పడ్డ కష్టానికి ఫలితంగా 18 దేశాల నుంచి 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. చాలా గొప్ప విషయం. ఎన్నో ఈ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఆదరణ పొందింది. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఆ షార్ట్ ఫిలిమ్ చూసి దేశంలో ప్రముఖ ఫిలిమ్ మేకర్ శ్యాం బెనగల్ ప్రశంసిస్తూ మెయిల్ రాశారు. ఈ నిశీధితో వచ్చిన స్పందన నాలో మరింత ఆత్మస్థయిర్యాన్ని పెంచింది. నేను ఇంకా సీరియస్ గా పని చేయడానికి కారణం అయింది.

kvr-mahendra2

42 వెర్షన్లు.. ప్రేక్షకుల మదిలోకి..

నిశీధి తర్వాత నన్ను మరో కథ వెంటాడింది. దాన్ని 42 వెర్షన్లు రాశాను. దానికి పట్టిన కాలం మూడేండ్ల ఎనిమిది నెలలు. ఆ కథే ఈ దొరసాని. ఏంటి ప్రత్యేకత అంటారా? ఇది టీనేజ్ ప్రేమకథే. కానీ చూపించిన విధానం, సెటప్ చేసిన ప్రదేశం కొత్తది. 1987 నాటి పరిస్థితుల్లో ఒక దొర కూతుర్ని ఒక సామన్య యువకుడు ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది? అప్పటి తెలంగాణ గ్రామీణ, సామాజిక పరిస్థితులు ఎలాంటివి? అన్నీ చూపించాలి. ఆ వాతావరణ్నాన్ని సృష్టించాలి. ఆ మట్టి పరిమళాన్ని అందించాలి. ఒక దొరల సామ్రాజ్యంలో, గడీల వాతావరణాన్ని చూపించాలి. అందుకు తెలంగాణ అంతా తిరిగాం. 105 ఏండ్ల నుంచి ఉన్న గడీని ఎంచుకున్నాం. ఆ వాతావరణంలో అమ్మాయి ఉంటుంది. బయట ఒక పేద అబ్బాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుందో చూపించాం. చాలా సహజంగా, వాస్తవికంగా నిజాయితీగా ఉంటుంది సినిమా.

kvr-mahendra3

కథే ధైర్యాన్నిచ్చింది

డైరెక్టర్‌గా ఇది నా తొలి సినిమా. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మిక కూడా తొలిపరిచయమే. ఇది చాలెంజింగ్ అంశం. అయినా స్వీకరించాం. నిర్మాతలు చాలా నమ్మకంగా సపోర్ట్ చేశారు. కథ వినగానే సురేశ్ బాబు ఓకే అన్నారు. ఈ కథలో మ్యాజిక్ జరుగుతది అన్నారు. మధుర శ్రీధర్, యశ్ రంగినేని ఎలాగైనా ఈ సినిమా చేయాల్సిందే అన్నారు. ఫుల్ సపోర్ట్ చేశారు. కారణం కథలో బలం. నా మీద నమ్మకం. ఈ కారణలతో ఈ కాస్టింగ్ ఎంపిక జరిగింది. మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ శివాత్మిక గురించి చెప్పారు. వాళ్లకు కథ నచ్చడంతో వాళ్లూ ఒప్పుకున్నారు. అప్పటికే ఆనంద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ యాక్టర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉంది ఆయనకు. ఆనంద్ , శివాత్మిక జోడీ బాగుంటుందనిపించింది. ఈ కారణంగా ఆనంద్‌ను తీసుకున్నాం. ఇద్దరికీ యాక్టింగ్‌లో, యాస మీద శిక్షణ ఇచ్చాం. షూటింగ్‌లోకి దిగాకా వాళ్లు చాలా ప్రభావితం అయ్యారు. పాత్రల్లో లీనమయ్యారు. బయట కూడా వాళ్లు అలాగే ఉండడాన్ని గమనించాను. అంటే కథ తాలూకు ప్రభావం వాళ్ల మీద అంతగా పడింది. అట్లాగే ఈ సినిమాలో కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చాం. దాదాపు యాభై నుంచి అరవై మంది కొత్తవాళ్లతో నిర్మించాం.
- వినోద్ మామిడాల
-జి. చిన్న యాదగిరిగౌడ్

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles