మట్టి లేకుండా మొక్కల పెంపకం!


Sun,July 7, 2019 01:17 AM

ఏవండోయ్ ఇది విన్నారా..? మట్టి లేకుండానే మొక్కలు పెంచుతున్నారు! కాయగూరలు పండిస్తున్నారు తెలుసా? ఏంటీ.. మట్టి లేకుండా మొక్కల పెంపకమా? అసాధ్యం.. అనుకుంటున్నారా? అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ యువకుడు. ఇందుకు వందల ప్రయోగాలు చేసి, విజయం సాధించాడు. అందానికి అందం, ఆహ్లాదానికి ఆహ్లాదం పంచుతున్న ఆ కొత్త విధానం గురించి ఈ వారం సింగిడి కథనం.
mahagro
ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కలను వదిలేసి రెండుమూడ్రోజులు ఇల్లు వదిలి వెళ్లాలంటే భయమేస్తుందా? వాటికి నీళ్లు ఎవరు పోస్తారో అని దిగులు చెందుతున్నారా? మట్టి కుండీలను మెయింటేన్ చేయలేక.. మొక్కల పెంపకానికి దూరం అవుతున్నారా? అయితే మీకో సలహా.. ఇకనుంచి మీరు అలా చింతించకండి. ఎందుకంటే పాట్ మిక్స్ అందుబాటులోకి వచ్చేసింది. దీనివల్ల బోలెడు ఉపయోగాలున్నాయి. అపార్ట్‌మెంట్ కల్చర్‌లో స్థలం లేదనో, మట్టి దొరకడం లేదనో, నీరు అందుబాటులో లేదనో చాలామంది మొక్కలపై ఇష్టాన్ని చంపుకుంటారు. ఇలాంటి వారికోసం పాట్ మిక్స్ వరంగా మారింది. పూలు పెంచుకోవాలంటే స్థలం లేకున్నా, మట్టి దొరకకున్నా, నీరు అంతగా లేకున్నా ఏం ఫర్వాలేదు. ఇవేమీ అవసరం లేకుండానే ఎంచక్కా మీరు కోరుకున్నట్లే పూల మొక్కలను, కాయగూరలను పెంచుకోవచ్చు. అందానికి అందం.. ఆహ్లాదానికి ఆహ్లాదం ఇక మీ సొంతం. దీనిని తయారు చేసి, మనకు పరిచయం చేశాడు మన హైదరాబాద్ కుర్రోడు కృష్ణ కార్తీక్.

ఏంటీ పాట్ మిక్స్?

పాటింగ్స్ మిక్స్ అంటే.. కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమం. ఇది మట్టి కాని మట్టి. ఖనిజాలతో నిండిన పదార్థం. ఈ విధానంలో మొక్కల పెంపకానికి మట్టి అవసరమే ఉండదు. నీటి వినియోగం కూడా చాలా తక్కువ. వారానికొకసారి నీళ్లు పోస్తే చాలు. ఈ పాట్ మిక్స్ వల్ల మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. దీని ధర కూడా చాలా తక్కువ. పది కేజీల పాట్ మిక్స్ బ్యాగ్ రూ. 699. ఇది 15 కుండీలకు ఉపయోగపడుతుంది. మూడేండ్ల వరకూ పాట్ మిక్స్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు. మొక్క కుండీ పరిమితిని దాటినప్పుడు, కుండీ మార్చుకుంటే సరిపోతుంది. ఈ విధానం వల్ల మట్టి మరకల బాధ తప్పుతుంది. అన్ని నేలల్లో, అన్ని రకాల మొక్కలకు సరిపడే విధంగా తయారు చేసిన పోషకాల మిశ్రమం పాట్ మిక్స్. ఇది బరువు ఉండదు. తేలిగ్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఇది పూర్తి సేంద్రియ మిశ్రమం. జీరో మెయింటెనెన్స్ ఉండే ఈ మట్టికాని పదార్థం తయారీ వెనుక చాలా కృషి దాగి ఉందంటాడు కార్తీక్.

mahagro2

పాట్ మిక్స్‌కు డిమాండ్ ఎక్కువే..

తక్కువ స్థలం ఉండే అపార్ట్‌మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రేట్లు తేలికగా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్ మిక్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. ఇక్రిశాట్‌లో జొన్న పంట కోసం పాటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్‌డీఎల్, మోన్ శాంటో, నేషనల్ పోలీస్ అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్, పార్క్‌హయత్, డాక్టర్ రెడ్డీస్‌తోపాటు తాజాగా ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి పాట్ మిక్స్‌ను అందించాడు కృష్ణకార్తీక్. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వేల మొక్కలు పాట్‌మిక్స్ మట్టిలోనే చిగురిస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, ఫలాలను ఇస్తున్నాయి.

mahagro3

170 ప్రయోగాల ఫలితం!

హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ బీకాం చేశాడు. మొక్కలతో అంతకుముందు వరకూ అతనికెలాంటి పరిచయం లేదు. వాళ్లమ్మ గిరిజకు మొక్కలంటే ప్రాణం. వాళ్ల అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై రకరకాల మొక్కలు పెంచేవారు. గార్డెనింగ్‌కు కింద నుంచి పైకి కార్తీక్ మట్టి మోసుకెళ్లేవాడు. ఒక్కోసారి చాలా కష్టమనిపించింది. అంత కష్టపడి మొక్కలు పెంచినా.. కొన్ని చనిపోయేవి. ఈ క్రమంలో మట్టికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు కార్తీక్. 2012లో గార్డెనింగ్ గురించి గూగుల్‌లో వెతికితే, ప్రపంచంలో భారత్, చైనా వాళ్లు తప్ప.. ఎవ్వరూ ఇంట్లో మొక్కల పెంపకానికి మట్టిని వాడడం లేదని తెలిసింది. మట్టికి బదులు పాట్ మిక్స్‌ను వాడుతున్నారని గ్రహించాడు. మన వాతావరణానికి తగ్గట్లుగా తయారీ ప్రారంభించాడు. మొక్క మొక్కకు, దుంపలకు, పూల మొక్కలకు విడివిడిగా తయారీ మొదలు పెట్టాడు. ఇందులో ప్రధానంగా వాడే పదార్థం కోకోపిట్. అంటే కొబ్బరిపొట్టు. ఆ తర్వాత వాడేది వర్మిక్యులైట్ అనే ఓ ఖనిజం.

ఇవికాక కీలకమైన కొన్ని ప్లాంట్ న్యూట్రియంట్లని కలిపేవాడు. ఆశించిన ఫలితాలు రాబట్టడం కోసం 17,000 మొక్కలకి ఈ పాట్‌మిక్స్‌ని వేసి చూశాడు. మధ్యలో వచ్చే సందేహాలు తీర్చుకోవడానికి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీని సంప్రదించాడు. ఫార్ములా విషయంలో వాళ్లిచ్చిన సలహాలతో 170కి పైగా ప్రయోగాలు చేసి, చివరికి విజయం సాధించాడు కార్తీక్. మొదట్లో వారి తోటలోనే ప్రయత్నించాడు. అవి మంచి ఫలితాలు ఇవ్వడంతో తెలిసినవారు తమకూ పాట్ మిక్స్ కావాలని అడిగేవారు. గార్డెన్ ప్రియులు ప్రత్యేకంగా కార్తీక్‌ను సంప్రదించడంతో వ్యాపారం దిశగా అడుగులు వేశాడు. మహాగ్రో పేరుతో ఒక సంస్థను ప్రారంభించి రిటైల్‌గా అమ్మడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులను భాగస్వాములను చేసి, దేశవ్యాప్తంగా ఈ పాట్‌మిక్స్‌ని సరఫరా చేస్తున్నాడు.

భవిష్యత్ ప్రణాళిక భేష్

ప్రస్తుత మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులు, ఆహార పదార్థాలకు భారీ డిమాండ్ ఉంది. దీంతో వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సేంద్రియ ఉత్పత్తులను సామాన్యులకు కూడా అందించాలనే ఉద్దేశంతో కార్తీక్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫుడ్, క్లాతింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన మహాగ్రో కంపెనీ ద్వారా 13మంది యువతకు ఐదేండ్ల నుంచి ఉపాధి చూపిస్తున్నాడు. వచ్చిన లాభాలతో 30 మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నాడు కార్తీక్. ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ ఇలా అన్ని ఈకామర్స్ సైట్‌లలో కార్తీక్ తయారు చేసిన పాట్‌మిక్స్ అందుబాటులో ఉన్నది. మట్టిలో పెరిగే మొక్కతో పోలిస్తే ఇందులో 4 రెట్లు వేగంగా పెరుగుతుంది. మొక్కల వేర్లకు గాలి సమృద్ధిగా అందుతుంది. పురుగులు రావు.. తెగుళ్లు సోకవు. వారానికి ఒకసారి గ్లాసు నీళ్లు పోస్తే చాలు.
-డప్పు రవి

mahagro4

అసాధ్యాన్ని సుసాధ్యం చేశా!

మొదట్లో ఈ విధానాన్ని చాలామంది నమ్మలేదు. ఇది సాధ్యమేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేము ప్రయోగాత్మకంగా మొక్కలు పెంచి, విజయం సాధించడంలో చాలామంది నమ్మారు. నగరాల్లో, పట్టణాల్లో.. పల్లెల్లో మాదిరిగా మొక్కలు పెంచుకోవడానికి స్థలం ఉండదు. తప్పనిసరిగా టెర్రస్ గార్డెనింగ్‌నే ఆశ్రయించాలి. కానీ అపార్ట్‌మెంట్ వాసులకు మట్టితో వచ్చే చిక్కులు అన్నీఇన్నీ కావు. వేళకు నీళ్లుపోయాలి. ఏ కిచెన్‌లోనో, బాల్కనీలోనో నాలుగు మొక్కలు పెంచుకోవాలంటే మట్టి కరిగి మరకలు ఏర్పడతాయి. వీటికితోడు తెగుళ్లు. ఇలాంటి సమస్యలేవీ పాట్‌మిక్స్‌తో ఉండవు. అయితే పాట్‌మిక్స్‌తో పంటలు కూడా పండించొచ్చు. ఇలా సాగు చేయాలనుకునే 98850 78151 నంబర్‌కు, www.mahagro.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
- కృష్ణకార్తీక్, పాట్‌మిక్స్ సృష్టికర్త

8838
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles