వర్షాకాలం.. పిల్లలు పైలం!


Sun,July 7, 2019 01:16 AM

వర్షాకాలం మొదలైంది. తొలకరి జల్లులతో వాతావరణం అంతా చల్లబడి చాలా బాగుంది. ఇన్ని రోజులు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఈ చిరుజల్లులు ఎంతో హాయినిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షం హాయితో పాటు రోగాల్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ చిన్న వ్యాధులు పెద్దలకంటే పిల్లలకు త్వరగా వ్యాపిస్తాయి. పిల్లలకు ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఈ వారం అల్లరిలో తెలుసుకుందాం.
suffering-with-fever
వర్షాకాలంలో శరీరంలోని పేగులు, జీర్ణ వ్యవస్థ కొంత బలహీనపడుతాయి. దీనికి తోడు నీటి కాలుష్యం, అపరిశుభ్రత పరిసరాలు, రోగనిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల పెద్దలకంటే ఎక్కువగా పిల్లలే వ్యాధులకు గురవుతూ ఉంటారు. దీంతో పలురకాల వైరల్ ఇన్‌ఫెక్షన్స్ దాడి చేస్తాయి. వాతావరణంలో పెరిగిన తేమ వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు రావడం ఈ కాలంలో సర్వసాధారణం.


బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్..

వర్షాకాలంలో తలెత్తే ప్రధానమైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఏంటంటే డిఫ్తీరియా. దీన్నే టాన్సిల్స్ అని కూడా అంటారు. ఇది గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. కలుషిత నీరు, ఆహారం, ఈగల ద్వారా బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. నోటి శుభ్రత పాటించని పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు నొప్పి ఉంటుంది. పిల్లలు నొప్పి అని చెప్పినప్పుడు పెద్దలు వారి నోరు తెరిచి లోపలి భాగంలో వాపు, ఎరుపుదనం, తెల్లని పొర ఉందో లేదో గమనించాలి. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కలిపి దాడి చేస్తూ ఉంటాయి.
చికిత్స : ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే నోటిని శుభ్రపరుచుకోవడం, మెడికేటెడ్ సొల్యూషన్‌తో నోరు పుక్కిలించడం లాంటి తేలికపాటి చికిత్సలతో తగ్గించవచ్చు. అప్పటికీ తగ్గకుంటే యాంటీ బయాటిక్స్ వాడడంతో వ్యాధి అదుపులోకి వస్తుంది.

ఫంగల్ ఇన్‌ఫెక్షన్..

వర్షాకాలంలో పిల్లల చర్మానికి సంబంధించిన ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. వీటిలో రింగ్ వార్మ్ ప్రథమం. ఇది వచ్చిందంటే దురద, చెడు వాసన ఉంటాయి. ఇది చర్మంపై గుండ్రటి ఆకారంలో మొదలై రింగులా మారుతుంది. ఆ ఆకారం మధ్య ప్రదేశం నున్నగా, చుట్టూ ఉన్న రింగు పెలుసులుగా తయారవుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. ఈ వ్యాధి సోకిన వారి టవల్స్, దుస్తులు, దువ్వెనలు, దుప్పట్లు వాడడం వల్ల ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. దీని మాదిరిగా ఉండే మరొక వ్యాధి గజ్జి. దురద, పుండ్లతో కూడిన ఈ వ్యాధి కూడా ఇతరుల నుంచి తేలికగా వ్యాపిస్తుంది.
చికిత్స : రోజుకి రెండుసార్లు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు, లోదుస్తులు ధరించడంలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా గోర్లు కత్తిరించుకోవాలి. తగ్గకుంటే వైద్యుల సహాయం తీసుకోవాలి.

న్యుమోనియా..

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు స్పాంజిని పోలి ఉంటాయి. స్పాంజిని తడిపినప్పుడు రంధ్రాలు మూసుకుపోయి గాలి ప్రసరణ ఎలాగైతే మందగిస్తుందో, తేమతో నిండిన ఊపిరితిత్తుల్లో కూడా గాలి సరఫరా తగ్గుతుంది. దాంతో ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే న్యుమోనియా అంటారు. దీనికి కారణం ఎయిర్‌బార్న్ ఇన్‌ఫెక్షన్స్ పిల్లల్లో దగ్గు, ముక్కు దిబ్బెడ, గొంతు నొప్పి కనిపించినప్పుడు వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ స్వర పేటిక నుంచి ఊపిరితిత్తులకు పాకుతుంది.
చికిత్స : ఇన్‌ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయడానికి ఎక్స్‌రే తీయించాలి. అవసరాన్ని బట్టి మందులు వాడాలి. పిల్లలు త్వరగా కోలుకునేందుకు పోషకాహారం ఇవ్వాలి. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఐదేండ్ల పిల్లలకు న్యుమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. ఒకవేళ అలా తీసుకోలేకపోయినా 15 యేండ్లలోపు పిల్లలకు వర్షాకాలానికి మూడు నెలల ముందుగానే ఫ్లూ వ్యాక్సీన్ తీసుకొని వ్యాధిని నియంత్రించవచ్చు.
suffering-with-fever1

డయేరియా..

వర్షాకాలంలో కనిపించే మరో సమస్య డయేరియా. దీంట్లో రెండు రకాలుంటాయి. వాంతులు, విరేచనాలు మూడు, నాలుగుసార్లు అయి వాటంతటవే తగ్గిపోతే దాన్ని అక్యూట్ డయేరియా అంటారు. జ్వరం, కడుపునొప్పితో క్రమంగా తగ్గకుండా ఎక్కువగా వాంతులు, విరేచనాలు అవుతుంటే దాన్ని క్రానిక్ డయేరియాగా భావించాలి. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల జీర్ణాశయం, పేగులు వ్యాధి బారిన పడుతాయి. దీంతో ఆహారంగా తీసుకున్న ద్రవ, ఘన పదార్థాలన్నీ అరగకుండా వాంతి అవ్వడం జరుగుతుంది.
చికిత్స : శరీరంలో నీటి పరిమాణం, లవణాలు తగ్గి డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ ద్రవాలు ఇవ్వాలి. తేలికగా అరిగే ఆహారాన్ని ఇవ్వడం వల్ల వాంతులు తగ్గుముఖం పడుతాయి. శరీర శుభ్రతతో పాటు వైద్యులు సూచించిన మందులు వాడాలి.

టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ..

కలుషిత నీటివల్ల వైరల్ ఫీవర్లు, దోమల వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తాయి. వైరల్ ఫీవర్‌లో జ్వరం, తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు ఉంటాయి. పగలు కుట్టే దోమల వల్ల డెంగ్యూ, రాత్రి కుట్టే దోమల వల్ల మలేరియా వస్తుందని డాక్టర్లు చెబుతారు. సాల్మనెల్లా బ్యాక్టీరియా మురుగు నీటిలో ఉంటుంది. ఈ నీరు మంచి నీటితో కలవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది.
చికిత్స : వీటన్నింటికీ ప్రధాన కారకాలు దోమలే కాబట్టి అవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలి. దోమ తెరలు వాడాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అప్పటికీ జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గాలి కాలుష్యం

వర్షం వల్ల దుమ్ము అణిగి గాలి శుభ్రపడుతుంది అనుకుంటాం. కానీ, అలా భారీ వర్షం కురిస్తేనే దుమ్ము అణుగుతుంది. సన్నని జల్లుల వల్ల నేల మీది నుంచి లేచిన దుమ్ము గాల్లో నిలిచి ఉంటుంది. ఈ గాలిని పీల్చడం వల్ల వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియా తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలర్జీ ఉన్న పిల్లలను బయటకు పంపించేటప్పుడు తప్పనిసరిగా ముక్కుకు గుడ్డ కట్టుకోవడం అలవాటు చేయాలి.

వానాకాలం జాగ్రత్తలు!

-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
-ఇంటి పరిసరాల్లోని వాన నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
-శుభ్రమైన దుస్తులు ధరించాలి.
-శారీరక శుభ్రత పాటించాలి.
-దోమ కాటుకు గురికాకుండా దూరంగా ఉండాలి.
-జనం ఎక్కవగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
-గోరువెచ్చని నీటిని తాగాలి.
-ఈగలు వాలకుండా ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి.
-బయటకు వెళ్లినప్పుడు చల్లని, కలుషిత గాలి పీల్చకుండా ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
-రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి.
-ఎన్ని చికిత్సలు చేసినా వ్యాధులు తగ్గకుంటే వైద్యుడుని కలువాలి.

1084
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles