నర్మద పరిక్రమ


Fri,July 5, 2019 12:57 AM

మహాత్ముల సమాధుల వద్ద నిద్ర!
(గత సంచిక తరువాయి)
Narmada
గోవింద స్వామి సమాధి సమీపంలో నిద్ర చేయడం ఈ యాత్రలో మాకు బోనస్. మహాత్ముల సమాధి దగ్గర నిద్రించడం మంచిదని దత్త సాంప్రదాయులు నమ్ముతారు.

దేశాయ్ నన్ను పిలిచి సమాధులను శుభ్రం చేయమని, అది సుకార్యం అని చెప్పారు. నిజానికి నేను గోవిందస్వామి సమాధి పక్కనే కూర్చుని జపం చేసుకోవాలని అనుకొన్నాను. కానీ, అవి గోవిందస్వామి మాటలుగా భావించాను. అప్పటికే ప్రసన్న బక్కెట్‌తో నీళ్లు, పాతబట్టని తెచ్చి ఓ సమాధిని శుభ్రం చేస్తున్నారు. అతను ప్రభు మిత్రుడు. మితభాషి, ముప్పై అయిదేళ్లుంటాయి. బ్రహ్మచారి. చెప్పులు వాడరు. ఇతరులకు సేవ చేయడంలో ముందుంటారు. నడవ లేని మిసెస్ కపాలిని చెయ్యి పట్టుకొని అనేక చోట్ల నడిపించి తీసుకువెళ్లారు. నిత్యం వడ్డనలో పాలు పంచుకొన్నారు. పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లిష్ రాదు. మా అందరిలోకి నాకు అతని మొహంలోనే తేజస్సు స్పష్టంగా కనిపించింది.

సమాధులను శుభ్రం చేయడంలో నేను కూడా భాగం పంచుకుంటానని అతనితో చెప్పాను. అతనికి ఈ పని కొట్టిన పిండి. తన గురువు ఆశ్రమంలో అతనికి ఈ రకం సేవ అలవాటే. బక్కెట్‌తో బట్టని తడిపి, దాన్ని నేలమీద ఉంచి, వంగుని ఆ బట్ట అంచులని రెండువైపులా రెండు చేతులతో పట్టుకొని, కాళ్లమీద వెనక్కి నడుస్తూ తడిబట్టతో కింది నేలను శుభ్రం చేయాలి. అలా కుడివైపు అంతా శుభ్రం చేసి, ఆ బట్టని బక్కెట్‌లో ముంచి మురికి నీళ్లను పిండేసి, నాకు ఇచ్చి ఎడమవైపు భాగాన్ని నన్ను శుభ్రపరచమన్నారు.

అలవాటు లేని పని కాబట్టి, అది శారీరకంగా ఎంతో కష్టం అనిపించినా నా భాగాన్ని శుభ్రపరిచాను. వాసన వేసే అనేక రెక్కల పురుగులు నేలమీద పడి ఉన్నాయి. వాటి వాసన ఆ బట్టకు, నా చేతులకు అంటుకుంది. మధ్యమధ్యలో ఆ బట్టని బక్కెట్‌లో ముంచి, పిండేసి తిరిగి నేలను తుడవాలి. ఆ సమాధిని శుభ్రం చేశాక ప్రసన్న మురికినీళ్లను పారపోసి బయట పంపులోంచి కొత్త నీటిని పట్టాక, రెండో సమాధి దగ్గరకు వెళ్లాం. అక్కడా ఇద్దరం ఇదే విధంగా సమాధి నేలను శుభ్రం చేశాం. ఆ తర్వాత గోవింద స్వామి సమాధి దగ్గరకు వెళ్లి దాన్నీ శుభ్రం చేశాం. పని పూర్తయ్యాక అతను బక్కెట్, బట్టతో వెళ్లిపోయారు. నేను చేతులు కడుక్కొని అక్కడ కూర్చుని, గంటన్నర దాకా శివపంచాక్షరి మంత్రజపం చేసుకొన్నాను.

రాత్రి భోజనంగా అన్నం, చపాతీలు, దొండకాయ కూర, కొబ్బరిపొడి, మజ్జిగ పులుసు ఇచ్చారు. తన పూర్వీకులు కొంకణి ప్రాంతం నుంచి ముంబైకి వచ్చారని, కొంకణి సంప్రదాయం ప్రకారం వంటలో కొబ్బరిని అధికంగా వాడతామని దేశాయ్ చెప్పారు. గోవింద స్వామి సమాధి సమీపంలో నిద్ర చేయడం ఈ యాత్రలో మాకు బోనస్. మహాత్ముల సమాధి దగ్గర నిద్రించడం మంచిదని దత్త సాంప్రదాయులు నమ్ముతారు.

అక్టోబర్ 20, 2008. సోమవారం: రెండోరోజు

ఉదయం నాలుగున్నరకు నిద్ర లేచాను. ఏ ఆశ్రమాల్లోనైనా పొదుపు అంతా సాధారణంగా వారి బాత్‌రూమ్‌లలోనే కనిపిస్తుంది. అక్కడ ఉన్నవి రెండే బాత్‌రూమ్‌లు. వాటిలో జీరో వాల్ట్ బల్బులే వెలుగుతున్నాయి. మా దగ్గర దేశాయ్ ఈ యాత్రకు భోజనం, బసకు కలిపి ఒక్కొక్కరి వద్ద పన్నెండు వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. రాత్రి బస చేసినందుకు గోవింద స్వామి సంస్థానానికి తను ఇచ్చేది ఇచ్చానని, అంతా తమకు తోచిన విరాళం ఇస్తే బావుంటుందని దేశాయ్ సూచించారు. అందరితోపాటు మేం కూడా తలో ఏభై రూపాయలు ఇచ్చాం. దేశాయ్ వసూలైన ఆ మొత్తాన్ని వాళ్లకు ఇచ్చి వచ్చారు. ఉదయం ఆరుకి బస్సెక్కాం.

ముందు చెప్పిన సీటింగ్ నియమం ప్రకారం వెంకటేశ్వరరావు, నేను బస్‌లో ఓ వరుస ముందుకి జరిగి కూర్చున్నాం. దేశాయ్ సాధారణంగా అందరికన్నా ముందు బస్సు దిగి, చివరగా ఎక్కుతారు. బస్ బయలు దేరబోయే ముందు దేశాయ్ ఆ రోజు కార్యక్రమం వివరించారు. ఆ రోజు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాం. అక్కడ సరిహద్దు చెక్‌పోస్ట్‌లో లంచాల తాకిడి అధికం అని, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో మరీ అధికమని దేశాయ్ వాపోయారు. మా బస్‌లో సీట్లు రెండు అటు- రెండు ఇటు చొప్పున వరుసకు నాలుగు సీట్లు. రెండు అటు- మూడు ఇటు అంటే వరుసకి అయిదుగా ఉండే బస్‌లకు ట్యాక్సు తక్కువని, మా బస్‌కి ఎక్కువని చెప్పారు.

ఓం నర్మదే హర అన్న అందరి స్మరణతో బస్ బయలుదేరింది. ఉదయం ఏడున్నరకు బస్‌ని రోడ్డుపక్క ఆపారు. పనివాళ్లు ఇద్దరూ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌తో కిందికి దిగారు. మిసెల్ (మిక్చర్)ని ఇచ్చారు. ముంబైనుంచి కొని తెచ్చిన మిక్చర్‌మీద ఉడికించిన బఠాణీలు, ఉల్లిపాయ ముక్కలు చల్లి, నిమ్మరసం పిండి దాన్ని మిసెల్ పేరుతో మహారాష్ర్టులు స్నాక్‌గా తింటారు. అక్కడి హోటళ్లలో ఇది సర్వ్ చేస్తారు. మా యాత్రలో రోజూ పుష్పమౌసి తెల్లవారు ఝామునే లేచి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం వండి బస్‌లోకి ఎక్కిస్తుంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

narmada4

తీర్థయాత్ర

narmada5

-సశేషం

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles