నృత్య తరంగం నిహారిక


Wed,July 3, 2019 12:54 AM

కళ్లల్లోంచి వీరం. కనుబొమ్మల్లోంచి రౌద్రం. ముఖ కవళికల్లోంచి భయానకం. పెదాల్లోంచి హాస్యం. హృదయాంతరాలలోంచి కరుణ. చేతులు చూపించే శాంతం, ఆద్యంతం ఆమె నృత్యం అద్భుతం. నవరసాలు పలికించే ప్రతిభ ఆమె సొంతం. ఆమె స్టేజీ ఎక్కితే ప్రతిధ్వనిస్తాయి చప్పట్ల శబ్దాలు. నటరాజును తలపించే నృత్యం, కోయిలమ్మను అనుసరించే గాత్రం.. భావం, రాగం తాళం ఏకమైన సమయం. మనసు పులకించే సమయం. అతిచిన్న వయసులోనే భరతనాట్యంతో అద్భుత భావాలు పలికిస్తూ ఇటీవలే అరంగేట్రం చేసిన యువతి మనోగతమిది..
Niharika
పాదం నేలను ముద్దాడే సమయంలో ఆమె చేతులు పంచభూతాలకు ప్రణామం చేస్తాయి. రాగం చెవిని చేరే సమయాన ఆమె గుండె లయ తాళమై ప్రతిధ్వనిస్తుంది. నవరసాలు పలికించే పురాతన నృత్యంలో ఆమె తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటుంది. ఒక్కో భంగిమ వేల భావాల్ని పలికిస్తుంటే రోజులు గడిచినా ఆమె నాట్యం ప్రేక్షకుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటుంది..

దొంతినేని నిహారిక స్వస్థలం హైదరాబాద్. ఆమె ప్రస్తుతం బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నది. బాల్యం నుంచి నిహారికకు కళలంటే ఆసక్తి. ఇంట్లోని వారు కూడా ఆమెకు సహకరించడంతో 9వ ఏట నుంచే భరతనాట్యం సాధన చేయడం ప్రారంభించింది. తన సోదరి మాళవిక కూచిపూడి నృత్యకారిణి కావడంతో ఆమె ప్రోత్సాహంతో నిహారికకు భరతనాట్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. కొన్నాళ్లు ఇంట్లోనే సాధన చేసింది. ఆ తర్వాత నృత్య గురువు హేమమాళిని దగ్గర భరత నాట్యం నేర్చుకున్నది. నిత్యం సాధన చేస్తూ కళ కోసం ఏండ్లుగా తపస్సు చేస్తున్నది. తన సోదరి మాళవిక ప్రోత్సాహంతో ఇంట్లో చిన్నచిన్నగా సాధన చేసిన నిహారిక ప్రారంభంలో చాలా ఇబ్బంది పడినప్పటికీ హేమమాళిని ఆర్ని దగ్గర మెళకువలు నేర్చుకున్నది.

Niharika1
మొదటి ప్రదర్శన: హైదరాబాద్‌లోని కొండాపూర్ రామాలయంలో 2012లో నృత్యరూపక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొదట ఇద్దరు ముగ్గురు నృత్య ప్రదర్శనలు చేసిన తర్వాత ప్రదర్శన ఇవ్వాలని చిన్నారుల బృందాన్ని స్టేజీపైకి పిలిచారు. అక్కడున్న వారంతా ఈ చిన్నారులేం ఏం ప్రదర్శన ఇస్తారులే అని అనుకున్నారు. కానీ ఆ బృందంలోని చిన్నారి నిహారిక మాత్రం అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది. నృత్యం ప్రారంభించిన తర్వాత ఆ ప్రదేశం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 12 ఏండ్ల వయసులో నిహారిక మొదటిసారి తన కళను అద్భుతంగా ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి మరింత కష్టపడుతూ నిత్యం సాధన చేసింది నిహారిక. 15 ఏండ్ల వయసులో భరత నాట్యగురువు గీతా గణేషన్ దగ్గర మరిన్ని మెళకువలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 20కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

కూతురు కోసం ఇంజినీర్ ఉద్యోగం వదిలి: దొంతినేని రవీందర్ రావు, రమ్య దంపతుల మూడో కుమార్తె నిహారిక. వీరి కుటుంబానికి కళలకు విడదీయలేని బంధం ఉంది. నిహారిక సోదరి మాళవిక కూచిపూడి నృత్యకారిణి. మరో సోదరి రిషిక సంగీతంలో దిట్ట. బాల్యం నుంచి కళల ప్రపంచంలో పెరగడంతో నిహారికకు కూడా భరతనాట్యంపై, సంగీతంపై ఆసక్తి బాగా పెరిగింది. నిహారిక తల్లి రమ్య ఇంజినీర్. తన కూతుళ్ల కోసం వృత్తిని వదిలేసింది. కూతుళ్లకు కళలు నేర్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. నిహారిక పాఠశాల స్థాయి నుంచి ఎన్నో అవార్డులు, బహుమతులు గెలుచుకుంది.

ప్రత్యేకతలు: భరతనాట్యం అందరూ చేస్తారు. కానీ కొందరే అన్ని రసాలను పలికిస్తారు. ఒక్కసారి చూస్తే కండ్లల్లో మెదిలే కళను ప్రదర్శిస్తారు. ఆ కోవకు చెందిన వారే నిహారిక. తన కళ ద్వారా ముఖ కవలికల ద్వారా అద్భుత కళను నిహారిక ప్రదర్శిస్తున్నది. ఒక్క భరతనాట్యమే కాకుండా బేకరీ ఐటమ్స్ తయారు చేయడంలోనూ నిష్ణాతురాలు. అంతేకాకుండా ఐదేళ్ల క్రితం నుంచి ఫణినారాయణ దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకుంటున్నది.
-పడమటింటి రవికుమార్
-జి. చిన్న యాదగిరిగౌడ్


కళను పేదలకు పరిచయం చేస్తా..

భరతనాట్యం కేవలం కళ మాత్రమే కాదు. ఆత్మ ైస్థెర్యం పెంపొందించడానికి సాధనం. బాడీలాంగ్వేజ్ డెవలప్ కావడానికి మార్గం. జీవితంలో తన కాళ్లమీద తాను నిలబడగలననే ఆత్మైస్థెర్యం. నిత్య జీవితంలో సన్మార్గంలో జీవించడానికి భరతనాట్యం ఒక మార్గం. ఈ కళను పేద కళాకారులకు నేర్పిస్తా. 2020లో మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం మాళవిక, రిషిక నేను కలిసి దొంతినేని సిస్టర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ కల్చర్ ఆర్ట్స్ అని ట్రస్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. గ్రామీణ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి కళల్ని నేర్పించాలనుకుంటున్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అండగా నిలిచిన గురువులకు రుణపడి ఉంటాను.
- దొంతినేని నిహారిక, భరతనాట్య కళాకారిణి

814
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles