ఆడుతూ.. పాడుతూ..


Sun,June 30, 2019 01:30 AM

school
బిడ్డ పుట్టింది మొదలు. వారిని ఏ స్కూల్‌లో చేర్పించాలి. ఎలాంటి చదువు చెప్పించాలి. ఈ ఆలోచనలతో తల్లి తపించిపోతుంది..భారత్‌లో గల్లీకో స్కూల్. లెక్కలేనన్ని పుస్తకాలు. చేయలేనంత హోమ్‌వర్క్..ఈ విద్యవల్ల ఉపయోగం కన్నా, పిల్లల చేతులు పడిపోతున్నాయి.ఈ బాధల నుంచి తమ కొడుకు, కూతురిని బయట పడేసేందుకు కొంతమందిప్రపంచంలోని ది బెస్ట్ స్కూల్స్ వెతకగా ఈ నాలుగు దేశాలలోని విద్య ఎంతో మేలని తెలిసింది..ఆయా దేశాల ఎడ్యుకేషన్ పద్ధతి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకూ తప్పనిసరి.


సెలవుల్లేని పాఠశాల..

సౌత్ కొరియాలో స్కూల్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. పాఠశాలలో పనిచేసే టీచర్లు ఉన్నత చదువు చదివిన వారు కావడం విశేషం. వీరికి నెలకి ఒకసారి పాఠాలు చెప్పే విధానంపై ట్రైనింగ్ ఇస్తుంది యాజమాన్యం. మంచి జీతంతో పాటు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. రోజులో ఒక పూట చదువు. మధ్యాహ్నం నుంచి ఆటలు, పాటలతో సరదాగా గడిచిపోతుంది. ఆ దేశంలో చదువుని బట్టి ఉద్యోగాలు ఉంటాయి. భారతదేశంతో పోలిస్తే కొరియాలో ఎక్కువ శాతం పిల్లలు చదువుకుంటున్నారు.

ఈ రోజుల్లో పిల్లలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయాన్నే నిద్రలేవాలంటే మారాం చేస్తారు. మరికొందరు ఏడుస్తుంటారు. కారణం వారికి స్కూల్‌కి వెళ్లడం ఇష్టంలేదు. స్కూల్‌కి వెళ్లిన మొదలు చదవాలి, రాయాలి అంటూ టీచర్లు ప్రాణం తోడేస్తుంటారు. స్టూడెంట్స్‌కు కూడా ఈ రెండు తప్ప మరే విషయంపై అవగాహన ఉండదు. చదువు కూడా బట్టే పట్టడం తప్ప సబ్జెక్ట్ నేర్చుకోరు. ఆటల విషయానికి వస్తే ఆడుకోవడమే మర్చిపోయారు. ఇలా ఉన్నది భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్. స్కూల్స్ తీరు మారాలి. ఇతర దేశాల్లో విద్యార్థులు, చదువు పట్ల చూపుతున్న శ్రద్ద మన దేశంలోనూ రావాలి.
school1

నిబంధనలు లేని పాఠశాల..

స్విట్జర్లాండ్.. పేరుకి తగ్గట్టే ఉంటుంది ఆ దేశం. ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంగా స్విట్జర్లాండ్ పరిగణించబడింది. అక్కడ స్కూల్‌లో టీచర్లకంటే విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలు అడిగింది ఏదీ కాదనరు. వారు ఎలా చెబితే అలా చెయ్యాల్సిందే. అలా అని వారిని గారాబం చెయ్యరు. పిల్లలకు పాఠాలు వారి పద్ధతిలోనే చెబుతారు. పెయింటింగ్, సంగీతం, డ్రాయింగ్ వాళ్లకి ఇష్టం వచ్చింది వారు చేయవచ్చు. ఎలాంటి నిబంధనలు లేవు. నర్సరీ నుంచి యూకేజీ వరకు ఒక స్కూల్. 1 నుంచి 5వ తరగతి వరకు మరొక స్కూల్. 6 నుంచి 10 వరకు హై స్కూల్ అంటూ విడివిడిగా పిల్లలను పాఠశాలకు పంపించాలి. వీరికి చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తారు.
school2

ఉచిత కళాశాల..

ఫిన్‌లాండ్ లా ప్రకారం అక్కడ అబ్బాయి, అమ్మాయి ఎవరికైనా కచ్ఛితంగా ఏడేండ్లు నిండాలి. ఆ తర్వాతే వారిని స్కూల్‌లో చేర్చుకుంటారు. స్కూల్‌కి వెళ్లగానే 45 నిమిషాలు పాటు సూచనలు ఇస్తారు. పెద్దవాళ్లను ఎలా గౌరవించాలి. తోటి విద్యార్థులతో ఎలా మెదలాలి. టీచర్లతో ఎలా మాట్లాడాలో నేర్పుతారు. తర్వాత 15 నిమిషాల బ్రేక్ ఇస్తారు. అప్పుడు వారి మెదడు కుదుటపడుతుంది. పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యాయో లేదో అన్న సంగతి తెలుసుకుంటారు. హోమ్‌వర్క్ ఇవ్వకూడదు. టెస్టులంటూ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టరు. నిజం చెప్పాలంటే అక్కడి విద్యార్థులకు పరీక్షలు అంటే ఏంటో కూడా తెలియదు. పాఠం తర్వాత స్టూడెంట్స్ ఫీడ్‌బాక్ తీసుకుంటారు. ఈ పద్ధతి క్రమం తప్పకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిల్లలపై టీచర్లకు బంధం ఏర్పడుతుంది. ఈ దేశంలో కళాశాల విద్యను ఉచితంగా అందిస్తారు. పిల్లల స్కూల్ ఫీజు కోసం తల్లిదండ్రులు ఎలాంటి రుణం తీసుకోనవసరం లేదు.
school3

సమాజంపై అవగాహన

నెదర్లాండ్‌లోని పాఠశాలలు విద్యార్థులకు గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుతున్నాయి. ఇక్కడ పదేండ్లు నిండే వరకు విద్యార్థులకు ఎలాంటి హోమ్‌వర్క్ ఇవ్వకూడదన్న పద్ధతి అమలులో ఉన్నది. నాలుగు గోడల మధ్య చెప్పే పాఠాల కంటే బయటకు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా చెప్పిన పాఠాలే విద్యార్థులకి గుర్తుంటున్నాయని గుర్తించారు టీచర్లు. అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. విద్యార్థులకు చదువు పట్ల ఎలాంటి పోటీలు పెట్టరు. ఏ విషయంపై అయినా అనుభవం తెచ్చుకోవాలి. థీయరిటికల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా పాఠాలు చెప్పడం నెదర్లాండ్ పాఠశాల విశేషం.

- వనజ వనిపెంట

1032
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles