ఈయనది దారం లాంటి నటన


Sun,June 30, 2019 01:06 AM

అన్నిటికీ అన్నీ కుదిరినై. అందిరి జీవితాల్లో ఎదురయ్యే సంఘర్షణలను మల్లేశం సినిమా కండ్లకుగట్టింది. ఆకట్టుకుంది, ఆసక్తిగొల్పింది. అందరి గుండెల్నీ హత్తుకుంది. కారణం కథలో బలం. అలాంటి బలం.. దర్శకుని ప్రతిభకు పదును పెట్టిస్తది. బృందంలో నమ్మకాన్ని కల్గిస్తది. సినిమాపై ధైర్యాన్ని పెంచుతది. ఈ రకమైన సినిమా నటుల్లో సహజత్వం కన్పిస్తది. అప్పుడే పాత్రకు ప్రాణం అస్తది. ఇట్లాంటి నటులే ఈ సినిమాలో కన్పిస్తరు. తండ్రి పాత్రలో నరసింహులుగా నటించి ఆ పాత్రకు ప్రాణం తెచ్చిండ్రు చక్రపాణి ఆనంద. ఇప్పుడు అందరి ప్రసంశలూ అందుకుంటుండ్రు. ఈ సందర్భంగా ఆయన గురించి సింగిడీకథనం.
Mallesham
గాలిపటం ఎగరడానికి దారం ఎంత ముఖ్యమో కథను నడిపించడానికి నటీనటులూ అంతే ముఖ్యం. తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచేయగలగాలి. హావభావాలతో, కండ్లతోనే ఎన్నో భావాలతో ప్రేక్షకులను కట్టిపడేయాలి. కథతో పాటు ప్రేక్షకుల్నీ నడిపించాలి. అట్లనే చేసిండు తండ్రి పాత్రలో చక్రపాణి. అచ్చం మల్లేశం లాగానే మధ్య తరగతి కుటుంబం నుంచి అచ్చిన ఆయన నటనలో ఒదిగిపోయిండ్రు. దాదాపు 25 యేండ్ల కిందట చిత్రపరిశ్రమకు అచ్చి వివిధ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించిండ్రు. మధ్యలో కొంత కాలం అవకాశాలు రాలేదు. అయిన నటన కోసం తన ప్రయత్నాలను మానలేదు. నటన మీద ఆయనకున్న అమితమైన ఆసక్తి చాలా రోజుల తర్వాత మల్లేశంలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. తండ్రి పాత్రలో నటించి ప్రతిభను కనబర్చిండ్రు. ముప్పయేండ్ల సంది ఆయన అనుభవాలు, ప్రయత్నాలన్నిటి గురించీ ఇట్లా చెప్పిండ్రు..

మారుమూల ఊరు నుంచి..

మాది మిర్యాగలగూడ దగ్గర కొండ్రాపోల్ గ్రామం. చాలా చిన్న ఊరు. నాకు ఇద్దరు కూతుర్లు. నాకు చిన్నప్పటి నుంచీ నటన అంటే ఇష్టముండె. అప్పుడే పదో తరగతి కంటే ముందే హైదరాబాద్ వచ్చినం. ఇక్కడే చదువుకున్న. అట్లనే సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేసిన. ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, సినిమావాళ్లతో సంబంధాలు లేకున్నా నా ప్రయత్నాలు మానలేదు.

తొలి చిత్రంలోనే ప్రశంసలు అందాయి..

అప్పుడు 1990. బి.నరసింగ్‌రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం దాసిలో నేను నటించాను. ఆ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నది. అప్పట్లో అందులో నా నటన నాకు మంచి పేరు తెచ్చింది. దొర బావమరిది పాత్ర పోషించాను. అది చూసి చాలా మంది ప్రశంసించారు. అక్కడ నుంచే నటన మీద మరింత పట్టుదల పెరిగింది. తర్వాత కొన్నాండ్లు ఏడెనిమిది సినిమాల్లో ప్రాధాన పాత్రల్లో నటించాను. వాటికీ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కొన్ని రోజులు సరైన అవకాశాలు రాలేదు. నా పనిలో నేను నిమగ్నం అయ్యాను. అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చేవి. అయినా నటన మీద ఆసక్తి, ప్రయత్నాలు మాత్రం వదులుకోలేదు.

మార్చేసిన మల్లేశం

ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్న క్రమంలో మల్లేశం సినిమా గురించి తెలిసింది. నా గురించి తెలిసిన ఏలె లక్ష్మణ్ ఈ సినిమాలో తండ్రి పాత్ర గురించి చెప్పారు. కచ్చితంగా నువ్వు అయితేనే బాగుంటుందని ఆడిషన్స్‌కు హాజరవడానికి సాయం చేశాడు. ఆడిషన్స్‌లో నా ప్రతిభ చూసి డైరెక్టర్ రాజ్ రాచకొండ మెచ్చుకున్నారు. షూటింగ్‌లోకి దిగాకా అందిరితో చాలెంజింగ్‌గా అనిపించింది. చాలా సందర్భాల్లో పలు సన్నివేశాల్లో నటన చూసి మా దర్శకులు నన్ను అభినందించేవారు. ఎందుకంటే కథ నన్ను అంతగా ప్రభావితం చేసింది. కేవలం నన్నే కాదు.

దర్శకులను, చిత్ర బృందాన్ని ప్రభావితం చేసింది. దర్శకులు కథ నడిపించిన తీరు మమ్ములను ఆ పాత్రలోకి ప్రవేశించేలా చేసిందని చెప్పాలి. కథ అధ్యయనం కోసం ఆయన కృషి, చిత్రీకరణ కోసం బృందం శ్రమ వృథా కాలేదు. కథకు తగ్గ యాస, సామాజిక పరిస్థితులు, పాత్రలు, వాతావరణం సృష్టించారు. మమ్మల్ని కొత్త జీవితంలోకి తీసుకెళ్లినట్టు అనిపించింది. చిత్రంలో ప్రియదర్శి, ఝాన్సీ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వారితో పోటీ పడుతూ నటించడం నాకూ చాలెంజింగ్‌గా అనిపించింది. ఫలితంగా చాలామంది ప్రశంసించారు.

మల్లేశం కండ్లలో నీళ్లు ఆగలేదు..

సినిమా చూసి సీట్లో నుంచి వచ్చిన మల్లేశం.. నా చేతిలో చేయివేసి అన్నా ఎంత బాగా చేశావ్. మా నాన్నను గుర్తు చేశావ్. ముప్పె ఏండ్ల కింద ఎట్లుండెనో అట్లనే అనిపించింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మల్లేశం వాళ్ల కూతురు కూడా ఏడ్చేసింది. అప్పుడు అనిపించింది. ఒక పాత్ర ద్వారా ఇంత మందిని ప్రభావితం చేయగలమా అని, బయోపిక్ ఎవరిదో వారే వచ్చి నా పాత్ర పట్ల ఎమోషనల్ అవడం నటునిగా నాకు ఇంకేం కావాలి.

Mallesham3

నమ్మలేకపోయాను..

మల్లేశం సినిమా ప్రివ్యూ షోకు కేటీఆర్ హాజరయ్యారు. వారితో కలిసి మేమూ చూశాం. సినిమా అయిపోయాక కేటీఆర్‌కు మిత్రులు ఏలె లక్ష్మణ్ నన్ను పరిచయం చేశారు. అప్పుడు కేటీఆర్ ఇంత సహజంగా ఎలా చేయగలిగారు అన్నారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే డైరెక్టర్ నందిని రెడ్డి కూడా ఉన్నారు. నన్ను గమనించి నా దగ్గరకు వచ్చి పలకరించారు. తర్వాత ప్రొడ్యూసర్ సురేశ్ బాబు అభినందించారు. మా దర్శకులు, చిత్రబృందం ఎంతో కొనియాడారు. సినిమా రిలీజ్ తర్వాత అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా మంది కాల్ చేశారు. గుమ్మడి, ఎస్వీఆర్‌లను గుర్తుచేశావ్ అన్నారు.

కొందరైతే నానా పటేకర్ స్థాయిలో నటించినట్టు చెప్పారు. వీర శంకర్, ప్రొడ్యూసర్ ఎస్ రంగినేని వారు స్పందించారు. ఇదంతా ఆనందాన్ని కలిగించింది. ఇంకా నటించాలనే ఆసక్తిని పెంచింది. చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. ఆయన మొదటి నుంచి నా వెన్నంటే ఉన్నారు. చాలా విషయాల్లో నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమా కోసం నన్ను ప్రోత్సహించిన ఏలె లక్ష్మణ్, దర్శకులు రాజ్, యాక్టింగ్ ట్రైనర్ మహేశ్‌కు, చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. మేం అంతా కుటుంబం లెక్క కలిసి పని చేశాం..

Mallesham2

ఇంకా నటించాలనుంది

ఇప్పుడు పూర్తి స్థాయిలో నటనకు నేను అంకితం అవ్వాలనుకుంటున్నా. నటనకు ప్రాధాన్యం ఉండే ప్రాతలు చేస్తా. పాత్రను అర్థం చేసుకొని లీనమై నటించగలుగుతాను. ప్రస్తుతం ఓ సినిమాలో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్న. అట్లాగే విరాట పర్వం, స్పెషల్, ఏబీసీడీ సినిమాల్లో నటించాను. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంచి నటునిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.

-వినోద్ మామిడాల రాజేశ్ నర్రా

1243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles