ఈ దుర్వినీత పర్వానికి కారకులెవ్వరు


Wed,June 26, 2019 01:55 AM

వసివాడని పసిపాపల్ని చిదిమేసే క్రూరత్వం... చిగురుటాకు ప్రాయాన్ని చెరిపేసే అమానుషత్వం... చిట్టిపొట్టి చిన్నారులను పశువాంఛకు బలిచేస్తున్న దానవత్వం.. పాలబుగ్గల బోసినవ్వుల్ని నలిపేసే రాక్షసత్వం. . పొత్తిళ్లలోంచి మాయంచేసే కర్కశత్వం.. ముద్దులొలికే బాల్యాన్ని, మురిపాల భవితవ్యాన్ని మృగమై, పశువుకన్నా హీనమై.. బలితీసుకుంటున్నరు. కేర్.. కేర్ అంటూ ఏడ్వడం తప్ప అమ్మా అంటూ చెప్పుకోలేని పసితనాన్ని మృత్యువు కౌగిలిలో నలిపేస్తున్నరు. సాంకేతిక ముసుగులో వశం తప్పిన మనసు అశ్లీలత నిండిన వయసు, వ్యసనాలకు బానిసై, ఆలోచన కోల్పోయి తొమ్మిది నెలలు నిండని పసివారిని మొదలు తొంభై సంవత్సరాలు నిండిన ముసలివారిని సైతం వదలని మానసికరోగిగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని చట్టాలు. మృగాళ్ల మృత్యుకేళిని అడ్డుకోలేకపోతున్నాయి. ఈ రాక్షసత్వానికి చరమగీతం పాడాలంటే పసిహృదయాల ఆర్తనాదాలు హాహాకారాలు ఆగాలంటే చట్టాలు సవరించాల్సిందే. కఠిన శిక్షలు అమలు కావాల్సిందేనన్నది నేటి సమాజ నినాదం. రేపటి జగతి నడక తీరు సవ్యంగా సాగాలంటే తప్పు చేసినవారిని ఆలస్యం చేయకుండా వెంటనే దండించాలన్నది అందరి అభిప్రాయం.
Rape
ఎందుకు అన్న ఇలాంటి వాడిని జైల్లో పెట్టి పోషిస్తున్నారు. ఇలాగే మీ వాళ్లలో ఎవరికైనా జరిగితే కోపం రాదా? అన్న చంపాలన్న కోపం వచ్చింది. ఎందుకు అన్న.. వాడిని చంపెయ్యండి అన్న బాధగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. జూన్ 21 వ తేదీన, వరంగల్‌లో 9 నెలల పాపను రేప్ చేసిన వ్యక్తి గురించి ఫేస్‌బుక్‌లో ఇలా రాశాడొకడు. ఈ పోస్ట్ చూడగానే పాపం ఎంతగా బాధపడి పెట్టాడో అనుకుంటాం. కానీ వాడు మనసు చలించిన సామాన్యుడుకాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు బస్టాండ్‌లో మొబైల్ రీఛార్జ్ షాపు నడిపే దివ్యాంగుడు ఎస్‌కె బాజీ తన ఫ్రెండ్స్ ఐదుగురితో కలిసి గుంటూరుకు చెందిన బాలికను గదిలో బంధించి, జూన్ 17 నుండి జూన్ 22 వరకూ, ఐదు రోజుల పాటు రేప్ చేసి హింసించాడు. ఈ పోస్టు తను నాలుగు రోజులు రేప్ చేశాక, ఆ బాలిక ఇంకా బంధించి ఉండగా పెట్టాడు.


అంతేకాదు మూడురోజులుగా ఒక అమ్మాయిని బంధించి, రేప్ చేస్తూ కూడా, అదే సమయంలో తొమ్మిది నెలల పాప రేప్ గురించి, హృదయాన్ని తాకేలా, అమాయకమైన, ఆవేదనా పూరిత ఎక్స్‌ప్రెషన్స్‌ని ముఖంలో పలికిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ వీడియో కూడా పెట్టాడు. చాలామంది వాడి పోస్ట్ చూసి స్పందించారు. వాడి మాటలను సమర్థించారు. కానీ బాలికను రేప్ చేశాడని తెలిసి రెండు రోజులకే వాడు ఇలా ఎలా మారాడు అంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. అలాంటి వాడి మనస్తత్వం ఇంత క్రూరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేరు.

అన్నీ తెలిసే చేస్తున్నారు..

sujatha-rajamani
భారతదేశంలో ధనానికి లక్ష్మీని, చదువుకి సరస్వతిని పూజిస్తున్నారు. కానీ ఆడవాళ్లు ఎక్కడ గౌరవింపబడతున్నారు? ఏ విషయంలోనైనా మన వ్యవస్థ బలంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. అప్పుడే ఇంకొకసారి తప్పు చేయరు. పైగా ఇప్పుడు నేరాలు చేసేవారు కూడా తెలియక చేయడం లేదనిపిస్తున్నది. అన్నీ తెలిసి తప్పు చేస్తూ, ఇతరులను తప్పు చేయమని ప్రేరేపిస్తున్నారంటే ఎంత క్రిమినల్‌గా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్లు రేప్ చేస్తున్నది ఆ అమ్మాయిలను కాదు.. వారి భవిష్యత్తును, వారి పూర్తి జీవితాన్ని. ఒకసారి వాళ్లు ఆ ట్రోమాలోకి వెళ్లిపోతే దాంట్లోంచి బయటపడడం ఎంత నరకమో మాకు తెలుసు. కొంతమంది ఈ ట్రోమాలోంచి బయటకు రావడానికి మూడు నుంచి ఆరు నెలలు పడితే, మరికొంతమందికి సంవత్సరాలు పడుతున్నది. ఇక పోర్న్ సైట్స్‌ను కూడా బ్యాన్ చేయాలి. పదమూడు సంవత్సరాల వయసులోనే వీటికి అడిక్ట్ అయిపోతున్నారంటే ఎంతగా వ్యవస్థ దిగిజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
- సుజాత రాజమణి, క్లినికల్ సైకాలజిస్ట్

విలువలు నేర్పాలి..

subbayamma
పిల్లలకు చిన్నప్పటి నుంచే మానవతా విలువలు నేర్పాలి. తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలు తప్పుచేయాలంటే భయపడతారు. తల్లిదండ్రులు పట్టించుకోని పిల్లలు ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారు. తమనెవ్వరూ పట్టించుకోవడం లేదనే భావనలో బతుకుతుంటారు. ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలుసుకోలేని స్థితిలో తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలు బాధ్యతగా సమాజంపై గౌరవంతో పెరుగుతుంటారు. యువత భవిష్యత్తులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రే కీలకం. మనుషులు కూడా మృగాలుగా మారడానికి సమాజం కూడా ఒక కారణం.
- సుబ్బాయమ్మ, ఉపాధ్యాయురాలు

యువత తప్పటడుగులు

swapna-mekala-gruhini
సాంకేతికత ముసుగులో యువత తప్పటడుగులు వేస్తున్నది. అశ్లీలత నింపుకొన్న ఫోన్లు యువతను తప్పు దారిలో నడిపిస్తున్నాయి. హాస్టళ్లలో ఉండి చదవడం, వివిధ ప్రాంతాల స్నేహితుల ప్రభావం యువతపై పడుతున్నది. క్షణికావేశంలో తప్పు చేసే వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. తప్పు జరిగిన తర్వాత కేసులు, శిక్ష, తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ ఆలోచిస్తే అసలు తప్పు చేయాలనే భావనే రాదు. న్యాయ స్థానాలు శిక్ష విధింపు విషయంలో జాప్యం చేయకుండా ఉంటే మంచిది.
- మేకల స్వప్న, గృహిణి, హైదరాబాద్

సామాజిక, మానసిక రుగ్మతలివి

kathi-mahesh
రేప్ అనే ఒక విష సంస్కృతిని సినిమాల్లో పెట్టడం వల్ల కొంత ప్రభావం ఉన్నది. స్త్రీలను, మహిళలు కేవలం ఒక సెక్స్ కోణంలోనే పనికొస్తారన్న ఆలోచనను ముందు తీసెయ్యాలి. సినిమాలు కూడా సమాజంలో భాగమే. సమాజంలో జరిగిన కథల నుంచి, సంఘటనల నుంచి, సందర్భాల నుంచి పుట్టుకొస్తాయి. పిల్లల్ని రేప్ చేయడం అనేది ఒక మానసిక వ్యాధి. పీడోపిడీయా అనే భయంకరమైన మానసిక జబ్బు ఉండడం వల్ల ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి రుగ్మతలు ఉన్న వాళ్లను గమనించి ముందే తెలుసుకొని చర్యలు తీసుకోకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా తప్రవర్తిస్తే వారిని తీసుకెళ్లి పోలీసులకు పట్టించడం గానీ, సైకాలజిస్టును సంప్రదించడం గానీ చేయాలి. కోర్టులు ఇప్పటికే ఇలాంటి వందల కేసులు ఉన్నాయంటుంది కానీ దేన్ని ఇప్పటి వరకు తీర్పునిచ్చి శిక్షించిన పాపాన పోవడం లేదు.
-మహేశ్ కత్తి, సినీ విమర్శకుడు

శిక్షలు కఠినం చేయాలి..

Rajini-student
ఇటీవల 9 నెలల శిశువుపై జరిగిన అత్యాచారం నన్ను కంటతడి పెట్టించింది. అభం శుభం తెలియని చిన్నారిపై పాశవికంగా దాడి చేసి చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. న్యాయ వ్యవస్థలో శిక్షల్ని కఠినం చేయాలి. కఠిన శిక్షలను అమలు చేస్తే తప్పు చేయడానికి కూడా భయపడతారు. మగ పిల్లల పెంపకంలో లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి మగ పిల్లల్లో సోదర భావాన్ని పెంపొందించే బాధ్యత తల్లిదండ్రుల్లోనే ఉంది. ఏదైనా రేప్ జరిగిందంటే ఆడవాళ్ల డ్రెస్సింగ్ మీద మాట్లాడుతుంటారు. చిన్న పాప ఎలాంటి కామోద్రేకానికి గురి చేసింది. అశ్లీల చిత్రాలను గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. మందు, సిగరెట్‌లాగే ఇది కూడా ఒక అలవాటు. ఒక్కసారి చూడడానికి అలవాటు పడితే దాన్నే మళ్లీ మళ్లీ చూసి తప్పులు చేస్తుంటారు. కాబట్టి వీటిని కూడా బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- సాధిని రజిని, పీజీ విద్యార్థిని, ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఆమెకు రక్షణేది?

varalaxmi
వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనం ఎవరిని అడుగాలి? చట్టం, న్యాయం, ప్రభుత్వం.. ఎక్కడి నుంచి మనకు న్యాయం దొరుకుతుంది. తప్పు చేసినవాడు తప్పుకొన్న పర్వాలేదు.. కానీ తప్పు చేయని వాడు శిక్షించబడకూడదని మాత్రమే పని చేస్తున్నాం. కానీ తప్పు చేసినవాడికి.. ఆ తప్పు ఎందుకు చేశానో అని బుద్ధి వచ్చేలా శిక్ష పడేలా చేయాలి. మన దగ్గర పోలీస్ వ్యవస్థ చాలా తక్కువ. దానివల్ల ఆడవాళ్లకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కేంద్రప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో అని మాత్రమే తీసుకొచ్చారు. పుట్టకముందు కాపాడడం కాదు.. పుట్టిన తర్వాత ఆమెకు రక్షణ ఏది? అందరికీ సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు ఎన్జీవోల సహాయం తీసుకొని వారిని వలంటీర్లుగా నియమించి అన్నిచోట్ల రక్షణగా నిలబెట్టండి.

వరంగల్‌లో జరిగిన ఇష్యూ, ఒంగోలులో జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి మనకు తెలిసింది. ఇలా తెలియని ఎన్నో సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. నిర్భయ చట్టం తీసుకురావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ కేసులో యావజ్జీవ శిక్ష విధించారు. అలాకాకుండా తక్షణ శిక్ష అమలులోకి రావాలి. ఇలా కంటిన్యూగా జరుగుతున్నప్పుడు ఈ కేసులకు నాన్‌బెయిలబుల్‌గా ఉంటే అప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నిర్భయ ఫండ్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుతున్నారనేది లెక్కలోకి లేదు. వాటిని సరైన రీతిలో అమలులోకి తీసుకువచ్చినప్పుడు మహిళలకు రక్షణ ఉంటుంది.
-వరలక్ష్మి, యాంటీ రెడ్ ఐ వ్యవస్థాపకురాలు

పరిష్కారం ఏనాటికో కావొద్దు!

ramya-akula
పన్నెండు సంవత్సరాల వయసు లోపల ఉన్నవాళ్లు ఆడ, మగ ఎవరి మీదనైనా అబ్యూజ్ జరిగిందని తెలిస్తే.. పోస్ట్ యెమెన్యుమెంట్ అనే చట్టం ఉంది. ఇది ఎంతమందికి తెలుసు. ఫాస్ట్రాక్ కోర్టులో ఆరునెలల్లో పరిష్కారం దొరుకాలి. కానీ అప్పీల్ చేసుకుంటే పై కోర్టులకు వెళుతుంది. అక్కడ పరిష్కారం ఏనాటికి దొరికేనో? ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. మళ్లీ తప్పులు చేస్తుంటారు. లా అండ్ ఆర్డర్‌కి ఎమోషన్స్‌తో పని లేదు. పుస్తకాల్లో ఏముందో అదే చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఎవరైనా మానవత్వంతో స్పందించినా మళ్లీ సమాజమే వారిని బతుకనీయదు. అందుకే పన్నెండేళ్లలోపు ఉన్నవాళ్ల కేసుల్లో కచ్చితంగా కఠిన శిక్ష పడేలా చూడాలి. వారికి అప్పీల్ చేసుకొనే చాన్స్ ఇవ్వకూడదు. అయితే హ్యాంగింగ్ లేదా లైఫ్‌లాంగ్ జెయిల్‌లో ఉండేలా శిక్షలు అమలు చేయాలి. దొంగతనం చేసినవాడి ఫొటోలు పోలీస్ స్టేషన్‌లో పెట్టినప్పుడు.. రేపిస్ట్‌ల ఫొటోలను కూడా మనుషులు తిరిగే ప్రతీచోటా అతికించండి. చిన్న పిల్లల్ని కామంతో చూసే వాళ్లకి ఈ భూమ్మీద స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు.
- రమ్య ఆకుల, అడ్వకేట్

తక్షణ శిక్ష అవసరం..

kalyani
టెక్నాలజీ పుణ్యమా అని యూట్యూబ్, వాట్సాప్ వంటి మీడియాలో అశ్లీల చిత్రాలు చూస్తూ అదే ధ్యాసలో చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తాము చేస్తున్నది తప్పా ఒప్పా అనే కనీస ఆలోచన లేక పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాగే ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, సంబంధిత అధికారులపై ఉంది. అత్యాచారం చేస్తే వెంటనే శిక్షించే సెక్షన్‌లేవి లేకపోవడం వారికి వరంగా మారుతున్నది. తప్పు చేస్తే శిక్షిస్తారు అనే భయం ఉన్నపుడే ఇలాంటి ఘోరాలు ఆగుతాయి. తొమ్మిది నెలలు అంటే అమ్మ స్పర్శ తప్ప మరేమీ తెలియని పసికూన. ఆమెపై అత్యాచారం అంటే సమాజం ఎంతగా దిగజారిపోయిందో స్పష్టమవుతుంది. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి నేరం జరిగిన వెంటనే శిక్షించగలగాలి. పసిపిల్లలే కాదు ఆడవారెవ్వరిపైనా ఇలాంటి సంఘటనలు జరిగినపుడు వెంటనే శిక్షలు పడేలా చట్టాలను సవరించాలి.
-కళ్యాణి గొర్రె, శ్వాస ఫౌండేషన్

సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం

gayatri-guptha
ఆకలి అయినవాడు అన్నం దొంగతనం చేస్తడు. పైసలు లేకపోతే, తిండి లేకపోతే దొంగతనం వాడి ముందున్న లక్ష్యంగా కనిపిస్తుంది. కోరికలు పుట్టినప్పుడు సెక్స్ చేయాలనిపిస్తుంది. మన దేశంలో పెళ్లయ్యాక సెక్స్ చేయాలి. పెళ్లికి ముందు అధికారికంగా సెక్స్ చేసే అవకాశమే లేదు. కానీ సెక్స్ చేయాలనే ఆశ పెళ్లికి ముందే పుడుతుంది. అందరూ నైతిక విలువలు పాటించాలని కానీ, ప్రతి ఒక్కరికీ నైతిక విలువలు ఉండాలని కానీ లేదు. ఆకలి వేసినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ఆలోచిస్తాడు కానీ దొంగతనం చేసినప్పుడు, ఆ తర్వాత జరగాల్సిన పర్యవసానాల గురించి ఆలోచించడు. క్రైమ్ చేసేవాడు చట్టాల గురించి అస్సలే ఆలోచించడు. అసలు వాటి మీద వాడికి కనీస అవగాహన కూడా ఉండదు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచి మనకు ఎవ్వరూ చట్టాలపై అవగాహన, సెక్స్ మీద అవగాహన కల్పించలేదు.

ఇదే ప్రధాన కారణం. పితృస్వామ్య వ్యవస్థలో అదే రేపిస్టులను తయారు చేస్తుందని బలంగా నమ్ముతున్నా. ముందు అమ్మాయిలను ప్రతీ విషయంలో కంట్రోల్ చేయడం మానేయాలి. పురుషాహంకారం వల్ల కూడా మహిళలపై ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు ఊహ తెలిసి బయటికి వెళ్లేటప్పటి నుంచే శరీర అవయవాలు ఏంటి? సెక్స్ ఏంటి? ఎదుటి వాళ్లు ముట్టుకుంటే ఎలా స్పందించాలనే అంశాలను వారికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా మార్పు వస్తుంది. ఇక రేప్ చేయాలనుకునే వాడు మృగాడు. చిన్నా పెద్ద తేడా లేకుండా పసిపాపలపై కూడా దాడికి దిగడం అంటే దాన్ని మించిన నీచత్వం లేదు. చట్టాలను కూడా కఠినతరం చేస్తే ఇలాంటి పనులు చేయాలనుకునేవాడు జంకుతాడు.
-గాయత్రి గుప్త, నటి
rape2

2437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles