పల్లె విద్యా వికాసంలో.. లీడ్ రోల్


Wed,June 26, 2019 12:56 AM

నేటి విద్యా ప్రమాణాలు.. ఉద్యోగావకాశాల దృష్ట్యా ఆంగ్ల బోధన తప్పనిసరి. రాబోయేతరం భవిష్యత్ ఆంగ్లంపైనే ఆధారపడి ఉంటుందేమో? కానీ రూరల్ ఏరియాల్లో ఇప్పటికీ ఏబీసీడీలు రానివాళ్లు చాలామంది ఉన్నారు. ప్రతిజ్ఞను ఆంగ్లంలో చెప్పే నైపుణ్యం లేనివాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంకోటి.. ఆంగ్లం అంటే పిల్లల్లో భయం. ఆ భయం తొలగిపోకపోతే వారి భవిష్యత్ ఏంటి? అని ఆలోచించాడు రవికుమార్. ఆయన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. లీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దాని ద్వారా పల్లె విద్యా వికాసానికి కృషి చేస్తున్నాడు.
ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ.. ఐయామ్ ప్రౌడాఫ్ ఇట్స్ రిచ్ అండ్ వారీడ్ హెరిటేజ్ స్కూల్లో ప్రతిజ్ఞను ఇలా ఇంగ్లీష్‌లో టకటకా చదివే రూరల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ప్రతిజ్ఞే చెప్పలేకపోతే.. ఇంకా పాఠాలేమి అప్పగిస్తారు? అలాంటి రూరల్ ఏరియా పిల్లలందరికీ విద్యా వికాసం కల్పించడంలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు కాసుల రవికుమార్.

Ravikumar
ఏంటీ లీడ్?: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన చేయాలనేది ఆయన ఆలోచన. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి విద్యా ప్రమాణాలను పరిశీలించాడు. తాను ఉచితంగా ఆంగ్లం నేర్పిద్దామనుకుంటున్నానని పాఠశాలల్లో సమాచారం ఇచ్చాడు. పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం నినాదంతో LEAD కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇది Leader ship qualities, Education to the poor, Aim in life, Development to the rural youth వంటి అంశాలపై పనిచేస్తున్నది. 50 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా బోధనా తరగతులు, విద్యా సామగ్రి, వ్యాకరణం, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నారు.

19 బ్యాచ్‌లు పూర్తి: ఒకే వేదిక ద్వారా సమానంగా విద్యాభ్యాసం చేయాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకే శిశు స్థాయి నుంచే తరగతులు ప్రారంభించాడు. ప్రతీ సంవత్సరం 45 రోజులు లీడ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నలబై ఐదు రోజుల్లోనే విద్యార్థుల్లో చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నాడతను. దీనికోసం తానే సొంతంగా ఆంగ్ల వ్యాకరణం రాశాడు. దీనిని 2011లో పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రత్యేకంగా లీడ్ విద్యార్థులకు అందుబాటులో ఉండేట్లు ప్రణాళిక చేశాడు. అలా 2007లో మొదలైన లీడ్ తరగతుల్లో ఇప్పటివరకు 19 బ్యాచ్‌లు పూర్తిచేసుకొని దాదాపు రెండు వేలమందికి పైగా విద్యార్థులకు శిక్షణ పొందారు. పేద పిల్లలు చదువుతున్న కస్తూర్బా, గురుకుల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు.

సేవే మార్గంగా: లీడ్ ద్వారా రవికుమార్ సామాజిక సేవాకార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాడు. పర్యావరణ దినోత్సవం, జీవ వైవిధ్య దినోత్సవం, ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఇలా పర్యావరణానికి సంబంధించి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాల్లో లీడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నాడు. ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే రవికుమార్ సోమవారం నుంచి శనివారం వరకు విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సామాజిక కార్యక్రమాలకు కేటాయించాడు.
విస్తరిస్తూ : వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి సైతం రవికుమార్ నిర్వహించే తరగతులకు హాజరవుతున్నారు. వారికోసం గ్లోబల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని రూపొందించాడు. గెస్ట్‌లను పిలిపించి వారితో విజయగాథలు చెప్పిస్తూ గ్రామీణ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. రవికుమార్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

స్వీయ అనుభవ ప్రేరణ: రవికుమార్‌ది వరంగల్ జిల్లాలోని నర్సంపేట. తల్లి బీడీలు చుడుతూ, తండ్రి కూలీ చేస్తూ రవికుమార్‌ను చదివించారు. రవికుమార్‌కు ఉన్నత చదువులు చదవాలనే ఆశైతే ఉంది కానీ.. ఆ ఆశకు ఆంగ్ల మాధ్యమం అడ్డుపడింది. ఇది తన ఒక్కడి సమస్యే కాదు. తెలుగు మాధ్యమంలో చదివిన ప్రతీ ఒక్కరి సమస్య. ఈ సమస్యను గ్రామీణ విద్యార్థులు అధిగమించేందుకు రవికుమార్ ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే లీడ్. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనేది రవి ఉద్దేశం. ఆ ఆలో చనతోనే ప్రతి ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నాడు.

దారి చూపుతూ..

2003లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత 17 ఏండ్లకే ప్రైవేటు టీచర్‌గా మారిన రవికుమార్ దూర విద్యలో ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేశారు. 2007లో కొంత నగదు సమీకరించుకుని తన ఆలోచనలకు రూపం ఇచ్చాడు. ప్రస్తుతం ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే లీడ్ క్లాసుల ద్వారా వేలాది మందికి దారి చూపుతున్నాడు. సేవాభావంతో పాటు సామాజిక సమస్యలపై స్పందించే గుణమే కాకుండా తనలో రగిలే వేదనకు అక్షర రూపం ఇచ్చి 2018లో ముగింపు లేని వాక్యం కవితా సంపుటిని తీసుకొచ్చారు. అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు.
Ravikumar1
నేను చేసే కార్యక్రమంలో కుటుంబీకులు, స్నేహితుల ప్రోత్సాహం మరువలేనిది. గ్రామీణ విద్యార్థిగా ఉన్నత చదువులు, ఉద్యోగ ప్రయత్నంలో ఇంగ్లీషు రాక చాలా ఇబ్బంది పడ్డాను. నేనే కాదు చాలా మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయాణానికి ఆంగ్ల మాధ్యమం అడ్డుగా నిలుస్తున్నది. నా వంతుగా కొంతమందికైనా ఆంగ్లం నేర్పించాలనుకున్నా. లీడ్ ప్రారంభించి 12 ఏండ్లుగా తరగతులు కొనసాగిస్తున్నా. పేదరికంపై చదువుతో యుద్ధం చేయాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నా. భవిష్యత్‌లో మరికొన్ని చోట్ల లీడ్ తరగతుల్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంది. తప్పకుండా ప్రారంభిస్తా.
-కాసుల రవికుమార్, ఉపాధ్యాయుడు
surender

లీడ్ ఎంతో నేర్పింది

రవికుమార్ సార్ దగ్గర నేను 2007లో ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఉన్నత చదువులు చదివేందుకు సార్ నేర్పిన ఇంగ్లీష్ బాగా ఉపయోగపడింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో సార్ నేర్పిన బేసిక్స్ బాగా ఉపయోగపడ్డాయి. వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. ఎలా మాట్లాడాలి, స్టేజి ఫియర్‌ను ఎలా తొలిగించుకోవాలి, ఇంటర్వ్యూను ఎలాఎదుర్కోవాలి తదితర విషయాల్ని చాలా బాగా చెప్పారు. సార్ ఇచ్చిన మెటీరియల్‌ను జిరాక్స్ తీసి మా బంధువుల పిల్లలకు చాలామందికి ఇచ్చా.
- సురేందర్ నాయక్

...? పడమటింటి రవికుమార్

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles