సాయంకాలపు స్నాక్స్!


Wed,June 19, 2019 11:53 PM

vantalu
స్కూళ్లు తెరిచారు.. బిలబిలమంటూ పిల్లలు పరుగులు తీస్తుంటారు.. ఆఫీసుకు వెళ్లినవాళ్లు సైతం.. ఉదయం హుషారుగా టిప్‌టాప్‌గా వెళుతుంటారు.. కానీ వీళ్లు సాయంత్రం అయ్యేసరికి.. ఉసూరుమంటూ ముఖం వేలాడదీసుకుంటారు.. వాళ్ల ఎనర్జీని పెంచేలా స్నాక్స్ ఉంటే.. టేస్టీ ఐటమ్స్ కళ్లముందు కనిపిస్తే.. ఆవురావురుమంటూ తిని.. నూతన ఉత్తేజంతో రోజు ముగించేస్తారు.. కాబట్టి సూపర్ స్నాక్స్‌ని ఈ వారం మీకోసం తీసుకొచ్చాం..

ఆవకాయ కోడి వేపుడు

avakaya-kodi-vaypudu

కావాల్సినవి :

చికెన్ : 200 గ్రా. (బోన్‌లెస్), ఆవకాయ పచ్చడి : అర కప్పు, కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్స్, మైదా : ఒక టీస్పూన్,
వెల్లుల్లి : 4 రెబ్బలు,
అల్లం ముక్కలు : అర టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి : 4,
ఉల్లిగడ్డ : 1, క్యాప్సికం : 1,
రెడ్ చిల్లీ సాస్ : పావు కప్పు,
ఉల్లి ఆకు : 1,
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

చికెన్‌ని చిన్న ముక్కలుగా చేసి కడిగి పెట్టుకోవాలి. ఇందులో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె పోసి ఈ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేసి దోరగా వేయించాలి. ఇందులో రెడ్ చిల్లీ సాస్, ఆవకాయ వేసి బాగా కలుపాలి. రెండు నిమిషాలు సన్నని మంట మీద కలిపి నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్ వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత ఉల్లి ఆకు వేసి కలిపి దించేస్తే సరి. టేస్టీ ఆవకాయ కోడి వేపుడు రెడీ!

పాలవెల్లి మష్రూమ్


palavelli-mashrooms

కావాల్సినవి :

మష్రూమ్ : 200 గ్రా., ఉల్లిపాయ పేస్ట్ : ఒక కప్పు, పచ్చిమిర్చి : 2, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, కొత్తిమీర : చిన్న కట్ట, ధనియాల పొడి : పావు టీస్పూన్, గరం మసాలా : పావు టీస్పూన్, కారం : పావు టీస్పూన్, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

మష్రూమ్స్‌ని ముందుగా శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్లలో వేసి.. చల్లారిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేయాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపాలి. ఇందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కలుపాలి. మరో నిమిషం ఉంచి మష్రూమ్స్ వేసి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. టేస్టీ పాలవెల్లి మష్రూమ్స్ మీ ముందుంటాయి.

అరటికాయ వడలు

aaratikaya-vadalu

కావాల్సినవి :

అరటికాయలు : 3, ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు, పచ్చిమిర్చి : 6, అల్లం ముక్కలు : 2 టీస్పూన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్ , పసుపు : పావు టీస్పూన్, కరివేపాకు : నాలుగు రెమ్మలు, కొత్తిమీర : చిన్న కట్ట, శనగపిండి : అర కప్పు, ఉప్పు : తగినంత

తయారీ :

అరటికాయలు ఉడకబెట్టి మెత్తగా మెదుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఉడకబెట్టిన మెత్తగా మెదుపుకొన్న అరటికాయ వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. అది వేడయ్యేలోపు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి దోరగా వేయించాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

కీమా బ్రెడ్ టోస్ట్

kheema-bread-toast

కావాల్సినవి :

మటన్ కీమా : ఒక కప్పు, పసుపు : పావు టీస్పూన్, గడ్డ పెరుగు : అర కప్పు, క్రీమ్ : అర కప్పు, బ్రెడ్ : 2 స్లయిస్‌లు, పుదీనా ఆకులు : అర కప్పు, ఉల్లిగడ్డ : 1, పచ్చిమిర్చి : 2, మయొనీస్ సాస్ : అర కప్పు, నెయ్యి : అర కప్పు, ఉప్పు : తగినంత

తయారీ :

కీమాని ముందుగా కడిగి అందులో ఉప్పు, పసుపు, నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మొత్తం వంపేసి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కీమాని ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను రెండు వైపులా దోరగా వేయించాలి. వీటికి మయొనీస్ సాస్ అప్లయి చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కీమాలో గడ్డ పెరుగు, పుదీనా ఆకులు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్రీమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లయిస్‌లను రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఒక ముక్క మీద కీమా మిశ్రమాన్ని వేసి మరో ముక్కతో దీన్ని కవర్ చేయాలి. ఇలా అప్పటికప్పుడు చేసి తింటే యమ టేస్టీగా ఉంటుంది.

సీసామె ఫ్రైడ్ వెజ్జీస్

sesame-friede-veggies

కావాల్సినవి :

క్యారెట్ : సగం ముక్క, బీన్స్ : 5, క్యాబేజీ తురుము : అర కప్పు, స్వీట్‌కార్న్ : అర కప్పు, బేబీకార్న్ : 4, రెడ్ చిల్లీ పేస్ట్ : 2 టీస్పూన్స్, గ్రీన్ చిల్లీ సాస్ : ఒక టీస్పూన్, సోయాసాస్ : అర టీస్పూన్, మష్రూమ్ : ఒక కప్పు, పచ్చిమిర్చి : 4, కార్న్‌ఫ్లోర్ : అర కప్పు,
మైదా : అర కప్పు, తెల్ల నువ్వులు : 2 టీస్పూన్స్, టమాటా సాస్ : ఒక టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు, అల్లం : చిన్న ముక్క, వెల్లుల్లి : 5 రెబ్బలు, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

ముందుగా నువ్వులు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. వీటిలో కొంచెం ఉప్పు, కార్న్‌ఫ్లోర్, మైదా, కొంచెం నీరు పోసి కలుపాలి. కడాయిలో నూనె పోసి ఈ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపాలి. ఇందులోనే రెడ్ చిల్లీసాస్, గ్రీన్ చిల్లీసాస్, టమాటా సాస్, సోయాసాస్ వేసి ఒక నిమిషం పాటు ఉడుకనివ్వాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత పై నుంచి నువ్వులు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

-జి.యాదగిరి కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్ పార్క్‌లైన్, సికింద్రాబాద్

1207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles