అభిరుచే.. ఆదాయ బాట!


Wed,June 19, 2019 01:21 AM

కొత్తగా ఏదైనా చేయాలి.. అందరికంటే భిన్నంగా ఉండాలి అనుకునేవాళ్లుంటారు.. కానీ అన్నిసార్లు అనుకున్న రీతిలో పనులు జరుగకపోవచ్చు.. అప్పుడు సమయం వృథా అనే బాధ తప్ప ఏం మిగలదు.. అలా కాకుండా ఏదైనా ఒక అభిరుచిని అలవర్చుకోవడం మంచి ఉద్దేశం.. అదే అభిరుచి మీ ఆదాయానికి బాటలు వేయొచ్చు.. మీ చేతులు అద్భుతాలు చేస్తున్నప్పుడు.. ఆదరణ ఆటోమేటిక్‌గా వస్తుందనేది సత్యం.. ఈ మాట హైదరాబాద్‌కి చెందిన నేహా అగర్వాల్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఖాళీ సమయంలో క్రాఫ్ట్ డిజైనింగ్ మీద అభిరుచి పెంచుకొని.. దాన్నే ఇప్పుడు వృత్తిగా మార్చుకున్న వైనం గురించే ఈ కథనం.
Agarwal
Art is the only place you can do what you like. Thats freedom.
మీకు నచ్చింది నచ్చినట్టు చేయడానికి వీలుండే ఏకైక ప్రపంచంఆర్ట్. ఇంగ్లిష్‌లో ఇదొక సామెత. కాస్త సమయం కేటాయించి, ఓపికగా ప్రయత్నిస్తే అద్భుతాలే సృష్టించవచ్చు. అలాగే చేసింది నేహా. ఖాళీగా ఉండలేక క్రాఫ్ట్ డిజైనింగ్ నేర్చుకున్న ఆమె కొద్ది రోజుల తర్వాత అది ఆమెకు వృత్తిగా మారింది. బెంగళూర్ పట్టణంలో మొదలైన ఆమె కళా జీవితం ఇప్పుడు హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. కేవలం కళాత్మక ఉత్పత్తులను తయారు చేయడమే కాదు. వాటిని ఎలా తయారు చేయాలి, వాటి ప్రాముఖ్యం ఏంటి? అనే విషయాలను మహిళలకు, పిల్లలకు తెలియచేస్తున్నది. ఇప్పటి వరకూ యాభైకి పైగా వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించి వందల మంది మహిళలకు క్రాఫ్ట్ డిజైనింగ్ నేర్పించింది.

ఇలా మొదలైంది

నేహా అగర్వాల్‌ది రాజస్థాన్. కానీ హైదరాబాద్‌లో స్థిరపడింది. చిన్నప్పటి నుంచి ఆమెకు కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. స్కూల్‌లో పెయింటింగ్, డ్రాయింగ్‌లో చురుగ్గా ఉండేది. పనికిరాని వస్తువులతో కొత్త కొత్త కళాకృతులు చేసేది. బయోటెక్‌లో ఇంజినీరింగ్ చేసిన నేహా.. జెనిటిక్స్‌లో డిప్లొమా చదివింది. చదువు అయిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఆమె క్రాఫ్ట్ పనుల కోసం ఉపయోగించుకొనేది. ఇదే సమయంలో నేహాకు పెండ్లయింది. భర్త చార్టర్డ్ అకౌంటెంట్. బెంగళూర్‌లో ఉద్యోగం కావడంతో నేహా కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆమెకు ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో తన అభిరుచిని ఎలా అయినా అభివృద్ధి చేసుకోవాలనుకుంది. బెంగళూర్‌లో క్రాఫ్ట్ డిజైనింగ్ సెంటర్ల కోసం వెతికి ఒక దాంట్లో జాయిన్ అయింది. అక్కడ తెలియని ఎన్నో డిజైనింగ్‌లు ఆమెను ఆకర్షించాయి. మొదట్లో నేహా హ్యాండ్‌మేడ్ జువెలరీలు, చిన్న చిన్న ఇయరింగ్స్ చేసేది.
VRK1

పట్టు సాధించింది..

రోజులు గడిచే కొద్ది నేహా వివిధ రకాల హ్యాండీ క్రాఫ్ట్‌లు నేర్చుకోవడం, వాటిని తయారు చేయడం ప్రారంభించింది. తయారు చేసిన వాటిని తెలిసిన వాళ్లకు బహుమతిగా ఇచ్చేది. ఇలా వారి నుంచి మంచి స్పందన వచ్చింది. క్రమంగా ఆమె ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. వీటిని బయటి వాళ్లకు కూడా విక్రయించాలని.. అలాగే వీటి తయారీ కూడా అవసరమైన వారికి నేర్పాలని అప్పుడే అనుకుంది. సోషల్‌మీడియా ద్వారా తన ఉత్పత్తులను అందరికీ తెలియజేయడం ప్రారంభించింది. వాటిపై ఆసక్తి ఉన్న వారు కొనుక్కొనేవారు. ఆమె స్ట్రింగ్ ఆర్ట్, టెర్రాకోటా జువెల్లరీ, డెకోపాజ్, క్యాలిగ్రఫీ, క్లే నేమ్ ప్లేట్స్, పేపర్ క్విల్లింగ్, కిరిగామి వంటి హ్యాండీ క్రాఫ్ట్‌లను తయారు చేయగలిగింది.

టీచింగ్‌పైనా ఆసక్తి

నేర్చుకోవడం వేరు.. దాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం వేరు. ఇలా చాలా తక్కువ మంది చేస్తుంటారు. విద్య అనేది పంచుకుంటేనే సార్థకమవుతుందన్న మాటను నిజం చేస్తూ.. తనకు తెలిసిన నైపుణ్యాలను ఇతరులకూ నేర్పించాలనుక్నుది నేహా. ఆమెకు క్రాఫ్ట్ మీద ఎంత ఆసక్తి ఉందో టీచింగ్ మీద కూడా అంతే ఆసక్తి ఉంది. కాబట్టి నేహా తనకు తెలిసిన విద్యను గృహిణులకు, ఇతర మహిళలకు, పిల్లలకు నేర్పించాలనుకుంది. బెంగళూర్‌లో ఉన్నప్పటి నుంచే ఈ పనిలో నిమగ్నమైంది. ఒకవైపు డిజైన్లు తయారు చేయడం, మరో వైపు వర్క్‌షాప్‌లు, క్లాస్‌లు నిర్వహించడం చేసింది. రెండేండ్ల తర్వాత భర్త ఉద్యోగరీత్యా మళ్లీ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా తన కార్యక్రమాలను కొనసాగించింది నేహా. అపార్ట్‌మెంట్, కాలనీ పరిధిలో మహిళలు, పేరెంట్స్‌తో మాట్లాడి తన క్లాస్‌ల గురించి, డిజైనింగ్ గురించి వివరించింది. వారి నుంచి చక్కటి స్పందన వచ్చింది. ఇట్లా ఉదయం పూట మహిళలకు, సాయంత్రం పూట పిల్లలకు డిజైనింగ్ బోధిస్తున్నది. కేవలం హ్యాండీ క్రాఫ్ట్‌లే కాకుండా పిల్లల కోసం ప్రత్యేకంగా క్యాలీగ్రఫీని కూడా నేర్పుతున్నది.
VRK

మహిళలకు ఉపయోగం

ఈ జనరేషన్‌లో మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉంది. పిల్లలను సరైన మార్గంలో నడిపించాలన్నా కూడా తల్లిదండ్రులకు ముందు అవగాహన ఉండాలి. రాజస్థాన్‌లో నాకు తెలిసిన ఓ నాలుగేండ్ల అబ్బాయి పెయింటర్. అతని పెయింటింగ్స్‌లో వారి తల్లిదండ్రులు విదేశాలలో అమ్ముతారు. లక్షల ఆదాయం వస్తున్నది. నిజంగా ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నిజం. కళా రంగంలో ఉత్పత్తులకు ఇంతటి డిమాండ్ ఉంది. నేను కూడా అభిరుచిగా ఎంచుకున్న పనులు ఇప్పుడు వృత్తిగా మారి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇందుకు నాకు సంతోషంగా ఉంది. అట్లాగే మహిళలు, వారి పిల్లలూ ఇలాంటి అభిరుచులు పెంచుకోవాలి అని నేహా కోరుతున్నది.
Agarwal1

ఆర్ట్ స్టూడియో పెట్టాలని..

నేహా ఏడు రకాల హ్యాండీ క్రాఫ్ట్ డిజైనింగ్ నేర్చుకున్నది. వాటి ఉత్తత్తులను పెంచాలనే ఆలోచనలో ఉన్నది. ఆమెకు డిజైనింగ్‌లో కస్టమైజేషన్ ప్రత్యేకత ఉంది. అదే తన ప్లస్ పాయింట్. ఇష్టమైన మోడల్, డిజైన్ ఇచ్చినా దాన్ని హ్యాండీక్రాఫ్ట్ మీద వేసిస్తుంది. అలాగే మహిళలకు, పిల్లలకు నేర్పించే సంఖ్య పెంచాలనుకుంటున్నది. ఇందుకోసం ఒక ఆర్ట్ స్టూడియో పెట్టాలని భావిస్తున్నది నేహ. కళాకృతుల నైపుణ్యాలను అందరికీ అందించాలనుకుంటున్నది. ఇప్పటి వరకూ అనేక ఎగ్జిబిషన్లలో, ఈవెంట్లలో ఆమె వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ప్రత్యేక సందర్భాల్లో తను ఉండే కాలనీలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అవసరమైతే నేహా కార్పొరేట్ కంపెనీల్లో, స్కూళ్లలో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించేందుకు సిద్ధం అని చెబుతున్నది.
-వినోద్ మామిడాల, వీరగోని రజినీకాంత్ గౌడ్

884
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles