ఈ సర్దార్.. ఓ సంచలనం


Mon,June 17, 2019 11:37 PM

స్వతంత్ర దేశంలో చావు కూడా పెండ్లిలాంటిదే బ్రదరూ అంటూ మనిషి చనిపోయిన తర్వాత జరిగే ఖర్చు గురించి ఓ కవి ఆనాడే వ్యంగ్యంగా స్పందించాడు. కారణం.. అంత్యక్రియలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి. ధనికులైతే పర్వాలేదు. పేదింట్లో పీనుగెల్లితే అప్పులు.. అవి తీర్చలేక ఎన్నో తిప్పలు పడాల్సిందే. చనిపోయిన దగ్గర్నుంచి దహనక్రియలు, కర్మకాండల వరకూ వేల రూపాయలు ధారపోస్తూనే ఉండాలి. ఇవన్నీ కళ్లారా చూసాడు ఈ సర్దార్. జనం మెచ్చిన ఆలోచన చేశాడు. కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలు ప్రారంభించాడు. జనమందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు. అది కరీంనగర్ మున్సిపాలిటీ.. నెల రోజుల కిందట మున్సిపాలిటీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో ఒకాయన చనిపోయాడు. అతనిది నిరుపేద కుటుంబం. ఇన్నాళ్లూ అతని సంపాదనతోనే ఇల్లు గడిచింది. తెలిసిన వారు, బంధుమిత్రులు అతన్ని కడసారి చూడ్డానికి వచ్చారు. అందరిలాగే ఈ సర్దార్ కూడా అతనికోసం వచ్చాడు. ఎర్రటి తలపాగ, నెరిసిన గడ్డంతో ఉన్నాడు. పేరుకు కరీంనగర్ మేయర్ అయినా.. ఆ దర్పం ఎక్కడా లేదు. సామాన్యుల్లో సామాన్యుడతను. మృతుని ఇల్లు, పరిసరాలు చూశాడు. తినడానికి తప్ప.. వారికి ఏమీ లేదని అర్థమైంది అతనికి. వెంటనే రూ.5వేలు ఇచ్చి దహన సంస్కారాలు చూడమన్నాడు. కారు ఆఫీసు వైపు వెళ్తున్నా.. అతని ఆలోచనలు మాత్రం ఆ పేదల వాడలోనే ఉన్నాయి. కోరి తెచ్చుకున్న తెలంగాణలో మేయర్‌గా తాను ఉండి.. పేదలకు సాయం చెయ్యలేమా? అంటూ తనని తానే ప్రశ్నించుకున్నాడు. అప్పుడే ఓ మహత్తర నిర్ణయం తీసుకున్నాడు. ఆ మరుసటి రోజే కరీంనగర్ మున్సిపాలిటీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కారణం.. ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించడం. ఇది సాధ్యమేనా? అంటూ ఎందరో విమర్శిస్తే.. తెలంగాణ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. మంచి పనులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అభినందించారు. రెట్టింపు ఉత్సాహంతో మొన్నటి ఆదివారమే ఒక్కరూపాయికి అంత్యక్రియలు నిర్వహించి.. కరీంనగర్ కార్పొరేషన్‌ను ఆదర్శంగా నిలిపాడు ఈ సర్దార్ మేయర్. విప్లవాత్మక మార్పుతో నూతన అధ్యయానికి నాంది పలికాడు.
sardhar

రూపాయి చెల్లిస్తే చాలు

ఒక వ్యక్తి చనిపోతే చావు డప్పులు, పూలు, ఇతర సామగ్రి.. మొదలుకొని మధ్య తరగతి వర్గాలైతే దాదాపు రూ. 10 నుంచి రూ. 15 వేలు, పేద వర్గాలైతే రూ. 7 నుంచి రూ. 10 వేలు ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేద, మధ్య, ధనిక వర్గాలు అనే భేదం లేకుండా కరీంనగర్ కార్పొరేషన్‌లో మాత్రం రూపాయి చెల్లిస్తే అంత్యక్రియలన్నీ జరిగిపోతున్నాయి. ఆ రూపాయి కూడా రషీదు తీసుకోవడానికే. ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఎందుకంటే శవాన్ని నడిరోడ్డుపై పెట్టుకుని, అంత్యక్రియల కోసం చేతులు చాచే పరిస్థితులు రావద్దని ఈ ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందింతే..శానిటేషన్‌తో పాటు దీనికోసం నియమించిన ప్రత్యేక విభాగం అక్కడకు వెళ్తారు. అంతిమయాత్రకు అవసరమైన వాహనాన్ని తీసుకువస్తారు. అవసరాన్ని బట్టి బాడీ ఫ్రీజర్‌ను సమకూరుస్తారు. ఇది కూడా రూపాయి స్కీంలో భాగమే. ఆయా మతాల ఆచారం ప్రకారం అవసరమయ్యే కట్టెలు, కిరోసిన్ ఇస్తారు. ఖననం చేస్తే కార్పొరేషన్ ఖర్చులతోనే గుంత తీయడం, పూడ్చడం కూడా వారిదే బాధ్యత. మొత్తం శ్మశానం వరకు తీసుకుపోయి, చితిలో పెట్టి, కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. ఎక్కడా, ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఎవరైనా డబ్బులడిగినా అక్కడే నిలదీసే అధికారం కల్పించారు మన సర్దార్. ఈ ఒక్కరూపాయి అంత్యక్రియలు పథకంలో భాగంగా.. మృతుని బంధువులకు 50మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా కేవలం ఐదు రూపాయలకే. ఎందుకంటే చనిపోయిన కుటుంబం శోకంలో ఉంటుంది. వారికి కనీసం వండిపెట్టే వారు కూడా ఉండరు. వంటావార్పు చేయలేని ఆ కుటుంబాలకు రూ. 5 చొప్పున 50 భోజనాలు వారి ఇంటికే పంపిస్తారు.

త్వరలో కర్మకాండ నిలయం

ఒక్క రూపాయికే అంత్యక్రియలు పథకానికి రూ.కోటిన్నర కేటాయించారు. అవసరమైతే అంతిమ యాత్ర, అంత్యక్రియల పథకం కోసం విరాళాలు కూడా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్దార్ ప్రకటించారు. ఎందుకంటే శ్మశాన వాటికల నిర్వహణ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఇబ్బందులేమీ రావనే మంచి ఆలోచన సర్దార్‌ది. అయితే త్వరలో అద్దె ఇండ్లలో ఉండే వారి కోసం కర్మకాండ నిలయం కూడా నిర్మించనున్నారు. సాధారణంగా అద్దె ఇంటికి శవాన్ని తీసుకురానీయరు. అలాంటి వారి కోసమే ఈ కర్మకాండ నిలయం.

విప్లవాత్మక పథకాలు

కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఎన్నో విప్లవాత్మక పథకాలు చేపట్టారు. వాటిల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ముఖ్యమైంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. కార్పొరేషన్ పరిధిలోసర్కార్ పాఠశాల విద్యార్థుల కోసం సరస్వతి ప్రసాదం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా సాయంత్రం 4 గంటలకు విద్యార్థులకు స్నాక్స్ పెడుతారు. వీటిల్లో ఓ రోజు ఇడ్లీ, మరో రోజు వడ, ఇంకో రోజు కిచిడీ వంటివి ఉంటాయి. ఈ పథకాన్ని సొంతంగా నిర్వహిస్తున్నారు మేయర్ రవీందర్‌సింగ్. మహిళా కళాశాలలు, మహిళా వసతి గృహాల దగ్గర రవీందర్‌సింగ్ సానిటరీ న్యాప్‌కిన్స్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మిషన్‌లో రెండు రూపాయలు వేస్తే ఒక న్యాప్‌కిన్ వస్తుంది. ఇది పేద మహిళలు, విద్యార్థినులకు బాగా ఉపయోగపడుతున్నది. ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు సర్దార్. ఉత్తర తెలంగాణలో ఉద్యమకారులందరికీ ఈయన సుపరిచితం. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ సహకారంతో పేద, మధ్య తరగతి వర్గాల కోసం మంచి పథకాలు చేపడుతున్నారు సర్దార్.

దేశమంతా చర్చ

కరీంనగర్ మేయర్ సర్దార్ రవీంద్రసింగ్ తీసుకున్న నిర్ణయంతో దేశమంతా ఒక్కసారిగా చర్చించింది. ఒక్క రూపాయికే అంత్యక్రియులు పథకంతో ఆయన వార్తల్లో నిలిచారు. రవీందర్‌సింగ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసిస్తూ దీని అమలుకు అన్ని ప్రాంతాల వారూ ఆలోచన చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విటర్ వేదికగా మేయర్ కృషిని అభినందించారు. ఈ పథకాన్ని అన్ని పట్టణాల్లో అమలు చేసేలా సాధ్యసాధ్యాలను పరిశీలించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి సూచించారు. అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా అక్కడ దీనిపై ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. సర్దార్ రవీందర్‌సింగ్‌ను తమ రాష్ర్టానికి ఆహ్వానించి, రూపాయి అంత్యక్రియలపై సలహా ఇవ్వాలని కోరారు. సర్దార్ ఆలోచనతో సిరిసిల్లలో తక్కువ ఖర్చుకే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

sardhar1

అంతిమయాత్ర ప్రారంభం

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ఒక్క రూపాయికి అంతిమయాత్ర కార్యక్రమాన్ని నగర మేయర్ రవీందర్‌సింగ్ గత ఆదివారం ప్రారంభించారు. కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన మంచాల లలిత మరణించగా ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించారు. రూపాయి చెల్లింపు రశీదు అందించి పాడె కట్టటం నుంచి డప్పు చప్పుళ్లు, అంతిమయాత్ర, దహన సంస్కారాల వరకూ అన్ని సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే చేపట్టారు. మృతురాలి పాడెను మేయర్ రవీందర్‌సింగ్ మోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం బల్దియా నుంచి రూ.1.50 కోట్లు కేటాయించామని మేయర్ చెప్పారు.

sardhar2

కేసీఆర్ స్ఫూర్తితోనే

ఉద్యమకాలం నుంచీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా దగ్గరుండీ చూశాను. ఆయన నుంచి ఎప్పటికప్పుడు స్ఫూర్తిపొందుతాను. అందుకే ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సాయంత్రం కూడా టిఫిన్‌లాగా పెడితే ఉత్తీర్ణత, బడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సరస్వతీ ప్రసాదం పెట్టాను. ఇక రూపాయికే నల్లా కనెక్షన్‌ను రాష్ట్రమంతా అమలు చేస్తున్నారు. ఇప్పుడు రూపాయికే అంత్యక్రియలు కూడా పేదలు, మధ్య తరగతి వర్గాల చావు ఖర్చుల ఇబ్బందులు తీర్చేందుకు చేపట్టాం. దీనికోసం తొలిసారిగా కార్పొరేషన్‌లో బడ్జెట్ మీటింగ్ పెట్టాం. ఈ స్కీం కోసం అవసరమైతే చందాలు కూడా వసూలు చేస్తాం. కరీంనగర్ పరిధిలో అంత్యక్రియలకు చేతులు చాచే పరిస్థితి ఉండకూడదు. దహనమైనా, ఖననమైనా చనిపోయిన వారిని సగౌరవంగా సాగనంపేందుకు శ్మశాన వాటికలు పలు ప్యాకేజీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. రూపాయికే అంత్యక్రియలు జరగడం చాలా గొప్ప విషయం.
- సర్దార్ రవీందర్‌సింగ్, మేయర్ కరీంనగర్ కార్పొరేషన్

- తంగళ్లపల్లి సంపత్, స్టేట్ బ్యూరో, హైదరాబాద్

2913
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles