అమృత ఫలం వైపు..


Mon,June 17, 2019 11:30 PM

ఈనెల 26 నుంచి జూలై 3వ తేదివరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో జరుగనున్న 32వ ఇస్టా (International Seed Testing Association: ISTA) కాంగ్రెస్ (సదస్సు) సందర్భంగా
విత్తన వైవిధ్యం, నాణ్యతలపై ప్రత్యేక వ్యాసం చదువండి.

Varii
విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. విత్తనాలు ఎంత గొప్పవైతే బంగారం లాంటి పంటలు పండుతాయి? ఒకనాటి వైభవోపేతమైన అమృత ఫలసాయం వైపు రైతులను నడిపించడానికి అద్భుత విత్తనాలు కావాల్సిందే. ఎంతటి వ్యావసాయిక సవాళ్లనైనా ఎదుర్కొంటూ అనేక విభిన్న పంటలతో సస్యశ్యామలంగా వెలుగొందిన వారి సుసంపన్నమైన విత్తన వైవిధ్యం, నైపుణ్య విధానాలు ఇవాళ ఏమైనాయి? 2050 కల్లా వెయ్యికోట్లకు పడగలెత్తనున్న ప్రపంచజనాభా ఆహారధాన్యాల అవసరాలను తీర్చడానికి జన్యుపరివర్తిత వ్యవసాయమే (Genetically modified agriculture) శరణ్యమా? రైతు ప్రపంచం కోల్పోయిన బీజసంరక్షణ ప్రావీణ్యాలను భవిష్యత్ తరాలకైనా అందించవలసిన బాధ్యత మనపైన లేదా? జీవకోటి కంతటికీ ప్రాణశక్తిని ప్రసాదించే విత్తనాలకు తిరిగి అంతటి సామర్థ్యాన్ని ఆపాదింపజేయడానికి మనమేం చేయాలి? 32వ ఇస్టా సదస్సు నేపథ్యంలోనైనా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఈ మౌలిక అంశాలపై ఒక కార్యాచరణను సిద్ధం చేసుకోగలిగితే మంచిది.
అభివృద్ధి వేగంలో ఆధునిక మానవుడు అంతకంతకూ దూసుకుపోతున్నా ఆకలి రహిత సమాజాన్ని మాత్రం సాధించలేక పోతున్నాడు. ఎందుకిలా జరుగుతున్నది? ఎక్కడుంది లోపం? ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఆయా దేశాల వ్యవసాయ రంగాలు కావలసినంత స్థాయిలో ఫలసాయాన్ని సాధించలేకపోతున్నాయి. తత్ఫలితంగానే ప్రపంచప్రజల క్షుద్బాధ తీరడం లేదన్నది చాలా స్పష్టం. ప్రామాణిక గణాంకాల మేరకు ప్రతి పదిమందిలో ఒకరికి ఆకలి మంట తీరకుండానే తెల్లవారుతున్నది. సమీప భవిష్యత్తు దృశ్యాలైతే మరింత భయానకం. ఈ క్రమంలోనే పలు సాగు వ్యవస్థలను బాగు పరిచే లక్ష్యాలలో కీలకమైందిగా పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల అధిక దిగుబడినే సూచిస్తున్నారు. కానీ, వాస్తవానికి అంతకంటే ముఖ్యమైన అంశం విత్తనాల వైవిధ్యం, వాటి నాణ్యత అని పలువురు పరిశోధకులు అంటున్నారు.

విత్తు, చెట్టు రెండింటిలో ఏది ముందు అన్నది అప్రస్తుతం. విత్తు చెట్టులా ఎదగడానికి క్షేత్రం (భూమి) తప్పనిసరి. భూమికి విత్తనం, విత్తనానికి భూమి- రెండూ అవినాభావ సంబంధం కలవి. ఒకటి లేకపోతే మరొకటి వృథా. విత్తులోని బలాన్ని బట్టే ఫలసాయం వస్తుంది. అది అమృత తుల్యం కావడానికి భూసారంతోపాటు నీరు, సేంద్రియ ఎరువులు, పోషకాలు, వాతావరణ పరిస్థితులు అన్నీ తప్పనిసరి. అయితే, ఇవన్నీ ఎంత సవ్యంగా, సమపాళ్లలో ఉంటున్నా విత్తులో అసలు సత్తువ లేకపోతే ఫలితం శూన్యమే. అందుకే, విత్తన వైవిధ్యం, నాణ్యత ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నాయి.

భూమ్మీద ఇతరేతర వృక్షజాలమంతా ఒక ఎత్తయితే ఒక్క మానవజాతికి మనుగడను ప్రసాదించే ఆహారధాన్యాల కోసం పండించే పంటల ప్రపంచం ఒక్కటీ మరో ఎత్తు. నాణ్యమైన విత్తనాల వల్ల పంట ఉత్పాదకతలో కనీసం 15-20 శాతం మేర పెరుగుదల సాధ్యమని నిపుణుల అంచనా. కారణాలు ఏవైనా, భూసారం వలె విత్తనాల్లో కూడా కాలం గడుస్తున్న కొద్దీ శక్తి, సామర్థ్యాలు తగ్గుముఖం పడతున్నాయన్నది నిజం. దీని ఫలితం దిగుబడి, ఆహారధాన్యాల నాణ్యతలపైన తీవ్రంగా పడుతున్నది. దిగజారిన వ్యవసాయ స్థితిగతులలో విత్తన వైవిధ్యం, నాణ్యత అత్యంత ప్రాధాన్యాన్ని కలిగివుంటున్నాయి. అందుకే, మన తాత ముత్తాతలు తిన్న తిండిగింజల్లోని నాణ్యతకు ప్రస్తుత తిండిగింజల్లోని బలానికి చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. అసలే విత్తనాల్లో నాణ్యత లోపిస్తున్నదనుకుంటుంటే మరొకవైపు వ్యవసాయ రంగంలో సేంద్రియ, ప్రాకృతిక విధానాలు సన్నగిల్లి పోతుండడం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడిని, గింజల్లోని శక్తిని తగ్గిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా సంకర (hybrid) విత్తనాలు రాజ్యమేలుతున్నై.

వేల సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా రైతులు అవలంభించిన విత్తన వైవిధ్య విధానాలు, సంరక్షణ, నిలువ పద్ధతులు అన్నీ గత కొన్ని దశాబ్దాలుగా నాటకీయంగా అడుగంటి పోయాయి. ఈ పరిణామం మానవ వ్యవసాయరంగ చరిత్రలోనే తొలిసారి అని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. కోల్పోయిన విత్తన వైవిధ్యాన్ని తిరిగి పొందడానికి జన్యుపరివర్తనా వ్యవసాయమే శ్రేయస్కరమని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ వాస్తవ దృశ్యం!
ప్రపంచ ఆహార ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపిన రైతు నైపుణ్య మార్పిడి పర్యవసానం పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయిలో పంటల వైవిధ్యం, నాణ్యతలపైన సుమారు 75 శాతానికి పైబడిన నష్టాలే సంభవించినట్టు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ సంస్థ (UN Food and Agriculture Organisation: FAO) అంచనా వేసింది. అనేకమంది రైతులు ఏవో ఒకటో లేక రెండో విభిన్నమైన విత్తనాలనే కొనుగోలు చేసే పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ వర్షం పంట పక్వానికి రావడానికంటే ముందే కురిసినా, లేక ఆలస్యంగా వచ్చినా మొత్తం పంట దెబ్బ తినే దుస్థితి. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నందున వివిధ రకాల వైవిధ్యకరమైన విత్తనాలు లేకపోవడం రైతులకు పెద్ద లోపంగా కనిపిస్తున్నది. దశాబ్దాల కిందటి తమ సాంప్రదాయిక విత్తన సంరక్షణ విధానాలు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి అని ఒక పరిశోధనాత్మక నివేదిక ఇటీవల వెల్లడించింది. దీనిని ఎక్యుమెనికల్ అడ్వొకెసీ అలయెన్స్ (Ecumenical Advocacy Alliance), గెయా ఫౌండేషన్ (Gaia Foundation), ఆఫ్రికన్ బయోడైవర్సిటీ నెట్‌వర్క్ (African Biodiversity Network) సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.

- దోర్బల బాలశేఖరశర్మ

1408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles