ఫేస్ బుకింగులు!


Mon,June 17, 2019 11:26 PM

ఒక దేశం తర్వాత మరొక దేశం, ఒక ఉపగ్రహం తర్వాత మరో ఉపగ్రహం ప్రయోగిస్తున్నాయి కదా! ఇలా పంపుతూ పోతే అంతరిక్షంలో శాటిలైట్ జామ్ ఏర్పడదా? అని ఓ రచయిత పరిహాసానికి రాశారు. ఈ చమత్కారం మది నుంచి ఇంకా తొలగక ముందే శాటిలైట్ గార్బేజ్ అనేది అంతరిక్షంలో పెద్ద సమస్య అనే వార్త వచ్చింది. సౌలభ్యాలున్న చోటే సమస్యలు కూడా పొంచి ఉంటాయి. ఇదెందుకు గుర్తుకు వచ్చింది? ప్రతి రోజు ఉదయం 8-9 గంటల సమయంలో ఫేస్‌బుక్ నోటిఫికేషన్లలో ఆ రోజు పుట్టిన వారి జాబితా కనబడుతుంది. చక్కగా మనకు నచ్చిన వారికి, వీలైనంత మేర శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇదే సమయంలో ఇంకో విషయం గమనిస్తుంటాను. వారిలో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారు అని.
Antarjaalam
ప్రతి రోజు కొందరు ఇనాక్టివ్ ఫ్రెండ్స్ కనబడుతారు. ఆరు నెలలకు పైగా అప్‌డేట్ చేయలేదంటే, ఇనాక్టివ్ ఫ్రెండ్‌గా పరిగణించి, నేను అన్‌ఫ్రెండ్ చేస్తా. లేకపోతే కొత్త మిత్రులు, మెరుగైన మిత్రులు ఎలా అదనంగా రాగలరు? అలాగే, తొలిదశలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలాని యాక్సెప్ట్ చేసి ఉంటాం. కనుక ఫ్రెండ్స్ జాబితాను తగ్గించడం, అలాగే కొందరిని వదిలించుకోవడం జరుగుతుంది. వాళ్లు యాక్టివ్‌గా లేరు అంటే వారు చూడటం గాని, అప్‌డేట్ చేయడం గాని ఉండదు. ఇదే సమయంలో మరి కొందరు కేవలం బర్త్ డే గ్రీటింగ్స్ పెట్టేస్తూ ఉంటారు. అందుకే కొందరి అకౌంట్లలో కొన్ని తాజా గ్రీటింగులు, అంతకు ముందు సరిగ్గా సంవత్సరం క్రితపు గ్రీటింగ్ మెసేజ్‌లు కనబడతాయి.
ఇంకో తమాషా కూడా జరుగుతుంటుంది. ఒక ఫేస్‌బుక్ ఫ్రెండ్ మరణిస్తారు. అది ఇతరుల ఫేస్‌బుక్ అప్‌డేట్స్ ద్వారా తెలుస్తుంది. ఐతే, గతించిన వ్యక్తి ఫేస్‌బుక్ అప్‌డేట్ చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. ఇదెలా సాధ్యమంటే, కనుమూసిన వ్యక్తి అకౌంట్‌కు మరొకరు అదే పాస్‌వర్డ్ వాడుతూ ఉంటారు. అదే పాస్‌వర్డ్ వాడితే ఫేస్‌బుక్ అభ్యంతరం చెప్పజాలదు. కానీ, ఇది సవ్యమైన పద్ధతి కాదు. హుందాతనం కాదు. ఠక్కున చూసేవారికి కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నిజానికి ఫేస్‌బుక్‌లో ఇటువంటి సమస్యకు కొంత పరిష్కారముంది. మనకు తెలియక పోవడం లేదా తెలుసుకొనే ఆసక్తి లేకపోవడం ఒక రకం సమస్య కాగా, సాయం చేయడానికి వేరొకరి సాయం తీసుకోవడం ఇంకో రకమైన విషయం.
ఫేస్‌బుక్ మొదలై 15 సంవత్సరాలు అయినా, అది మన మధ్య ప్రచారంలోకి వచ్చి ఏడెనిమిది సంవత్సరాలు. లేదా ఒక దశాబ్దం మాత్రమే అయ్యింది. ఈ మధ్య కాలంలోని ఫేస్‌బుక్ విధివిధానాలు మారుతూ, మెరుగవుతూ వస్తున్నాయి. కొంత సమాచారం ఇవ్వకపోతే అకౌంట్ ప్రారంభించడం వీలు పడదు. అందుకే కొన్ని పేర్లు గోపాల్ గోపాల్‌లాగా ఉంటాయి. అలాగే, ఒక ప్రఖ్యాత రచయిత బర్త్‌డేకు మూడుసార్లు నోటిఫికేషన్లు కనబడ్డాయి. పరిశీలిస్తే తేలింది ఏమంటే, వారు వేరు వేరు వయసు వివరాలతో అకౌంట్లు తెరిచారని. సినీతారల బొమ్మలతో అకౌంట్లు కొనసాగించడంలా ఇదో అనందం. ఫేస్‌బుక్‌లో అకౌంట్ తొలగించవచ్చు లేదా స్మత్యర్థం (మెమరలైజ్) చేయవచ్చు. ఈ రెండింటికీ సదరు వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం అవసరం. ఇది కూడా బ్యాంక్ అకౌంట్ వంటిదే. మనకు మనం సమాచారం అందజేస్తే కానీ సాధ్యం కాదు. బ్యాంకు అకౌంట్‌లో నామిని ఉన్నట్టు ఇక్కడ కూడా ఫేస్‌బుక్ అకౌంట్ హోల్డర్ తన తర్వాత ఎవరు ఫేస్‌బుక్ అకౌంట్ నిర్వహిస్తారో స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. (Note: How to delate/ memorialize a facebook account అనే వివరాలు వాట్సప్‌లో విడిగా పంపుతున్నారు).
ఒకరి అకౌంట్‌ను మరొకరు నిర్వహించినపుడు రిమెంబరింగ్ అనే మాట ప్రొఫైల్ నేమ్ తర్వాత కనబడుతుంది. ఇలాంటి అకౌంట్లకు అన్ని సదుపాయాలుండవు. ప్రొఫైల్ ఫొటో మార్చవచ్చు. స్మృత్యర్థం రాయవచ్చు. లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు స్పందించవచ్చు! ఇలాంటి సదుపాయం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంది. ట్విట్టర్‌లో అకౌంట్ కొనసాగించే సదుపాయం లేదు. కానీ, నడపకుండా డీ యాక్టివేట్ చేయవచ్చు. మరో యాభై ఏండ్లకు అంటే 2070కు 1.4 బిలియన్ల మంది ఫేస్‌బుక్ వాడతారనీ, 2100కు ఈ సంఖ్యతో సమానమైన మంది మరణించే ఫేస్‌బుక్ అకౌంట్ హోల్డర్స్ అని గత సంవత్సరం సమాచారం ఆధారంగా ఆక్స్‌ఫర్డ్ ఇంటర్‌నెట్ ఇన్‌స్టిట్యూట్ లెక్కించింది. అంటే సమస్య తీవ్రంగా ఉందని తెలుస్తున్నది. మరో సమస్య ఏమంటే సగటున ఏడెనిమిది అకౌంట్లు కలిగి ఉన్నారనీ, వాటిల్లో చాలా వ్యక్తిగతమైన, విలువైన సమాచారం ఉందని తెలుస్తున్నది. పత్రికల్లో స్మృతి ప్రకటనల సమాచారం ఆధారంగా హ్యాకర్స్, గతించిన వారి ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడతారని! ఇది సరే, వాడని అకౌంట్లలో ఉండే సమాచారం, గార్బేజ్‌గా మారిన సమాచారం ఏమవుతుంది? ఈ సందేహం తీరలేదు.
-డా॥ నాగసూరి వేణుగోపాల్

543
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles