తామరాకు తడి నిరోధకత


Mon,June 17, 2019 11:24 PM

ప్రకృతిలో అరటి, తామర ఆకుల స్వచ్ఛత మరి వేటికీ రావు. ఎలాంటి దుమ్ము, ధూళి, నీరు వంటి వాటిని అవి తమ తలాలపై ఎంతమాత్రం నిలువనీయవు. ప్రత్యేకించి తామర ఆకులోని జలనిరోధక (water proof) గుణాన్ని స్ఫూర్తిగా తీసుకొని శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న అద్భుతాలకు కొదువలేదు. పెయింట్ల నుంచి సౌరవిద్యుత్ పలకల (solar panels) వరకు ఎన్నో అసాధారణ ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి.
Prakrity-Paatham
తామరాకును నెలుంబా నుసిఫెరా (Nelumbo nucifera) గా పిలుస్తారు. జర్మనీకి చెందిన వృక్ష శాస్త్రవేత్త విల్‌హెల్మ్ బార్త్‌లట్ (Wilhelm Barthlott) 1973లోనే తామరాకు నిర్మాణ రీతిని అధ్యయనం చేసి, దాని ధర్మాల్ని వెల్లడించారు. ఈ ఆకులలోని జలనిరోధక లక్షణాన్ని ఆధారంగా చేసుకొనే సిలికాన్ నానోకణాలతో శాస్త్రవేత్తలు అతిసూక్ష్మ తలాలతోకూడిన రంగులను రూపొందించారు. ఈ పెయింట్స్‌ను భవనాలకు వేసుకొంటే దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలు దరి చేరవని అంటున్నారు. కార్లకూ ఈ రంగులను వాడుతున్నారు. సిలికాన్ డయాక్సైడ్ నానోపార్టికల్స్ (అతిసూక్ష్మకణాలు), హైడ్రోఫోబిక్ పాలిమర్ల సంయుక్త కలయికతో ఈ రంగులు తయారవుతున్నాయి.
సిరమిక్ రూఫ్ టైల్స్‌ను, ప్రత్యేక గ్లాసులను కూడా తామరాకు శక్తి ఆధారంగా శాస్త్రవేత్తలు తయారుచేశారు. కొంత మార్పుతో ముడతలు పడని వస్ర్తాలను కూడా ఇదే సాంకేతికతతో సృష్టిస్తున్నారు. ఇవి తామరాకు మాదిరిగానే దుమ్ము, ధూళి, నీటిని తమపైకి చేరనీయవని వారు అంటున్నారు. తామరాకు గుణంతో తయారైన పాలిస్టర్ డ్రెస్‌లు (షర్ట్‌లు, ప్యాంట్‌లు) అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. లోటస్ ఎఫెక్ట్, నానోసాంకేతికతలతో తయారైన స్టాప్ వాచీలు, పుస్తకాలు, టిష్యూ పేపర్లు వంటి వస్తువులు సైతం నీళ్లలో తడవ్వు. ఇలా తయారైన సాక్స్ అయితే బ్యాక్టీరియా చర్యలకు లోనుకాక చెమట దుర్వాసన వేయవనీ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తామరకు గల ఈ జలనిరోధక సాంకేతికతను సౌరవిద్యుచ్ఛక్తి ఉత్పాదనకు వినియోగించే ప్యానెల్స్ (పలకలు)కూ వర్తింపజేస్తున్నారు. దీంతో అవి వర్షపు నీటిని నిరోధిస్తూ మరింత ఎక్కువ కాంతిని గ్రహించగలుగుతాయని వారు తెలిపారు.
- డా॥ రాజూరు రామకృష్ణారెడ్డి

1268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles