డిస్క్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేసుకోవచ్చా?


Mon,June 17, 2019 12:14 AM

Counselling
నా వయసు 38 సంవత్సరాలు. నాలుగు నెలల నుంచి మెడనొప్పి వస్తున్నది. కుడిచెయ్యి బాగా లాగుతున్నది. చేతుల్లో తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. బరువులు ఎత్తలేకుండా ఉన్నాను. కొద్దిరోజులుగా మందులు వాడుతున్నాను. అవి వాడినంతసేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత మళ్లీ నొప్పులు వస్తున్నాయి. దీనివల్ల ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదిస్తే మెడకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. సీ5సీ6 మధ్యలో ఉండే డిస్క్ విరిగిపోయి కుడిచేతిలోకి వచ్చే నరాలను ఒత్తిడి చేస్తుందని ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో తేలింది. ఎముక రెండు కొనలను కలిపే ఫుజన్ ఆపరేషన్ చేయాలన్నారు. గూగుల్‌లో సెర్చ్ చేయగా దానికంటే డిస్క్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్ ఉత్తమం అని తెలిసింది. ఇది చేసుకోమంటారా వద్దా?
- పునార్జనరావు, హైదరాబాద్

మెడలో డిస్క్ సమస్యలకు ఎముక కొనలను అతికించే ఆపరేషన్, డిస్క్ రిప్లేస్‌మెంట్ ఏదైనా చేయొచ్చు. రెంటి శస్త్రచికిత్సల ప్రభావం ఒకేలా ఉంటుంది. కానీ డిస్క్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌కు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. చెయ్యి, మెడనొప్పి వంటివి దీనితో ఎక్కువగా తగ్గుతాయి. ఆపరేషన్ తర్వాత సర్వైకల్ కాలర్ వాడాల్సిన అవసరం ఉండదు. ఫుజన్ ఆపరేషన్‌లో తుంటి దగ్గర ఎముకను తీసి మెడలో అమరుస్తారు. అంటే తుంటి దగ్గర కూడా చిన్న ఆపరేషన్ చేస్తారన్నమాట. ఇలాంటి రెండో ఆపరేషన్ డిస్క్ రిప్లేస్‌మెంట్ పద్ధతిలో అవసరం ఉండదు. రీఆపరేషన్ రేట్స్ ఫుజన్ ఆపరేషన్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే మీ సమస్యకు డిస్క్ రిప్లేస్‌మెంట్ ఆపరేషనే బెటర్ అనిపిస్తున్నది. మంచి నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించి ఆలస్యం చేయకుండా ఈ ఆపరేషన్ చేయించుకోండి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి. తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.

833
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles