గురువు కాని గురువు నాన్న


Sun,June 16, 2019 01:52 AM

ఒకనాడు నన్ను, నా తమ్ముడిని బజారుకు తీసుకెళ్లిన చిన్నాన్న, వాడికి ఒక టీ-షర్టు కొనిచ్చాడు (తన కొడుకే కాబట్టి). పక్కనే ఉన్న నాకు ఏమీ లేదు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చాక, నేను ముభావంగా ఉన్నట్లు నాన్న కనిపెట్టాడు.
ఏం జరిగింది నాన్నా? అని అడిగితే జరిగింది చెప్పాను. ఆయన తన తమ్ముడిని ఏమీ అనలేదు. ఇప్పుడే వస్తాను అని అమ్మతో చెప్పి, వెంటనే నన్ను సైకిల్ మీద తీసుకెళ్లి, అదే షాపులో, అదే టీ-షర్టు కొనిచ్చాడు. ఇంటికి తిరిగిచేరుకున్నాక,
తమ్ముడు నా షర్టు చూసి, నీకెక్కడిది అన్నాడు. మా నాన్న కొనిచ్చాడు అన్నాను గర్వంగా..

Fathers---Day
మిట్ట మధ్యాహ్నం... దాదాపు 3 గంటలు దాటింది. వరంగల్‌లోని కాశిబుగ్గ ప్రాంతం. సర్కారు బావికి దగ్గర్లో, మెయిన్ రోడ్డు మీది ఒక ఇంట్లోని రేడియోలో సిలోన్ స్టేషన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా అమ్మ దగ్గర ఏదో ఆడుకుంటున్న పిల్లాడి మొహం విప్పారింది. అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా రివ్వున బయటకు పరుగెత్తాడు. మెయిన్ గేటు దగ్గర నిలబడి రోడ్డు వైపే చూస్తున్నాడు. ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు. దాదాపు ఇరవై నిమిషాల తర్వాత దూరంగా ఒక ఆకారం కనబడింది. ఖాకీ అంగీ, ప్యాంటుతో, చేతిలో క్యారియర్ సంచీ పట్టుకొని నడిచొస్తున్న ఆ ఆకారాన్ని తేలిగ్గానే గుర్తు పట్టాడు ఆ పిల్లాడు. అంతే.. సంధించిన బాణంలా ఆ వైపునకి దూసుకుపోయాడు. ఎవరితోనో మాట్లాడుకుంటూ వస్తున్న ఆ ఆకారం తన వైపు వస్తున్న పిల్లాడిని చూసి నవ్వింది. దగ్గరికి రాగానే ఆ పిల్లాడు ఎగిరి మీదకు దూకగానే అలాగే అందుకొని భుజానికి హత్తుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న సంచీని తీసుకున్న పిల్లాడు దాన్ని తనే మోస్తున్నట్టు ఫోజొకటి పెట్టాడు. అది చూసిన ఆయన పెద్దగా నవ్వి ఇంటి వైపు నడక సాగించాడు. ఆయన మా నాన్న.. ఆ సంచీ మోస్తున్నది నేనే!

రామాయణ, మహాభారతాలు, పురాణాలు, పద్యాలు, శ్లోకాలు.. ఇలా చాలా వచ్చేవి ఆయనకు.
మా నాన్న పనిచేసింది తెలంగాణలోని ఒకప్పటి గొప్ప బట్టల మిల్లయిన ఆజం జాహీ మిల్లులో. అందులో పనిచేసే వారందరూ కూడా దాదాపు చుట్టుపక్కలనే ఉండేవారు. ఆ మిల్లుకి సమీప ప్రాంతమే కాశిబుగ్గ. చారిత్రక రంగనాథస్వామి ఆలయం ఇక్కడే ఉంటుంది. అన్నట్లు ఆ గుళ్లోనే బడి కూడా. అప్పట్లో అది అప్పర్ ప్రైమరీ స్కూల్. గుడిబడిగా చాలా ప్రఖ్యాతి చెందిందది. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్లే దారిలోనే మిల్లు రెండవ ప్రధాన గేటు. ఒకటవది వరంగల్ స్టేషన్ పక్కనే ఉంటుంది. వందల ఎకరాల విస్తీర్ణంలో, వేలాదిమంది కార్మికులతో, మైళ్లకొద్దీ వినబడే సీటీ(సైరన్)లతో ఎప్పుడూ కళకళలాడుతుండేది. ఈ సీటీలతోనే చుట్టుపక్కల ఊళ్లకు టైం తెలిసేది ఆరోజుల్లో. ఆ మిల్లు క్యాంటీన్లో లభించే బోందు (బూందీ) చాలా ఫేమస్. కార్మికుల పిల్లలందరూ కేవలం బోందు కోసమే వాళ్ల తండ్రులకు క్యారేజీ మోసుకెళ్లేవాళ్లు. క్యారేజీ తీసుకొని, పిల్లలకు బోందు ఇప్పించి లోపలికి వెళ్లేవారు తండ్రులు.

మా నాన్న ఆజం జాహీ మిల్లులో జాబర్గా పని చేసేవాడు. అంటే బట ్టనేసే యంత్రానికి ఏదైనా సమస్య వచ్చినపుడు దాన్ని పరిష్కరించేవాడన్నమాట. మూడు షిఫ్టులుండేవి. ఒకటి పొద్దున ఆరు గంటలకు, రెండోది మధ్యాహ్నం రెండు గంటలకు, రాత్రిది 10 గంటలకు ఉండేవి. ప్రతీవారం మారేవి అవి. ఒక్క రాత్రి షిఫ్టే నాకు ఆనందాన్నిచ్చేది. ఎందుకంటే నేను తిని పడుకున్నాక, ఆయన డ్యూటీకి వెళ్లేవాడు. నేను లేవకముందే వచ్చేవాడు. ఒక్క రాత్రి డ్యూటీలో తప్ప, నేను ఎప్పుడూ నాన్న దగ్గరే పడుకునేవాన్ని. ఆయన చిన్నప్పుడు నైజాం జమానాలో కొంతకాలం గిర్దావర్గా పనిచేశాడట. ఉర్దూలో రాయడం, చదవడం బాగా వచ్చు. ఆయన తెలుగు రాత కూడా గొలుసుకట్టు రాత. సరిగా అర్థం అయ్యేదికాదు. రామాయణ, మహాభారతాలు, పురాణాలు, పద్యాలు, శ్లోకాలు.. ఇలా చాలా వచ్చేవి ఆయనకు. ఆయనకు నా సిలబస్ అందుబాటులో ఉన్నంతవరకు నాకు ఇంట్లో చదువు చెప్పేవాడు. పొద్దున్నే లేచినప్పటి నుంచీ, మళ్లీ రాత్రి పడుకునేంతవరకు ఏ సందర్భంలో ఏ శ్లోకం చదువాలో మొత్తం నాకు నేర్పాడు. ఈ రోజుకీ నేను పడుకునేముందు చదివే రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం

మా నాన్న, ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడు కాదు. నిష్కల్మషంగా ఉండేవాడు. ఎప్పుడైనా, ఎవరిమీదనైనా కోపం వచ్చినా, అది ఆ క్షణం వరకే.

శయనీయం సస్మరేనిత్యం దుస్వప్నం తస్య నశ్యతిః

అన్న శయనమంత్రం నాన్న నేర్పిందే. ఎక్కాలయితే 20 వరకు వచ్చేవి నాకు. అవి నేర్చుకునేంతవరకు నాన్న పట్టుపట్డాడు. బెత్తం పట్టుకున్నాడంటేనా.. వణుకుడే. కొట్టడం దాకా ఎక్కడిది? ఉరిమి చూస్తేనే చుక్కలు పడేవి కింద. గురువు కాని గురువుగా ఉన్న మా నాన్నే నాకు మొదటి గురువు. నాకు నాలుగేండ్లు దాటగానే, ఇక బళ్లో వేయాలని తీర్మానించుకున్నారు అమ్మానాన్న. మా ఇంటికి దగ్గర్లోనే ఒక ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది. అందులో పంతులు గోవిందరాజుల గుట్ట గుళ్లోని అయ్యగారు బుచ్చయ్య పంతులు. నాలుగో తరగతి దాకా ఉండేది ఆ బళ్లో. అక్షరాభ్యాసం రోజున మా అయ్యగారు, బడిలోని మొత్తం పిల్లలందరూ మా ఇంటికి వచ్చారు. అందరు పిల్లలకు నాతో బలపాలు, చాక్లెట్లు ఇప్పించింది మా అమ్మ. తరువాత ఒక కొత్త సంచీలో కొత్త పలక పెట్టి నా భుజానికి వేస్తే పిల్లలతో కలిసి మొదటిసారి బడికి వెళ్లాను. రెండేండ్లలో నాలుగు తరగతులు పూర్తిచేసి, ఐదో తరగతి కోసం గుడిబడికి వెళ్లాను. ఒకనాడు, టీకాలు వేయడానికి డాక్టర్లు వస్తున్నారన్న వార్త బళ్లో దావానలంలా వ్యాపించింది. అంతే.. చిల్లపెంకుల్లా.. చెట్టుకొకడు, పుట్టకొకడు. మా కాస్‌లో అందరూ నాకన్నా పెద్దవాళ్లే. ఓ మాదిరి ఎత్తులో ఉన్న గోడ దూకి పారిపోయారు కొందరు. నేను కూడా ఇదే సాహసాన్ని రిపీట్ చేద్దామనుకొని, పరిగెత్తుకొచ్చి, ఎగిరి గోడ చివరను అందుకున్నాను. కానీ, ఇక కాళ్లు లేపి పూర్తిగా గోడ ఎక్కడం కుదరడంలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంతలో ఆ టీకా వేసేవాడు రావడం, నా నిక్కరు పట్టుకోవడం జరిగిపోయాయి. ఆ భయానికి ఒక్క ఉదుటున జంప్ చేసి, బయటపడ్డాను. కానీ, నిక్కరు మాత్రం లోపలే ఉండిపోయింది. అంగీలు బాగా పొడుగు కాబట్టి శీల రక్షణ జరిగిపోయింది. పరుగున ఇంట్లో పడేసరికి, నా ఖర్మ కాలి, మా నాన్న ఉన్నాడు. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చినట్టున్నాడు. ఇంకా ఖాకీ డ్రెస్‌లోనే ఉన్నాడు. ఇంతలో ఒక దోస్తుగాడొచ్చి.. ఓరేయ్.. ఇళ్లళ్లకు కూడా వస్తున్నారట అని బాంబేశాడు. మా అమ్మ కంగారుపడి, నన్ను ఎక్కడైనా దాచే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా నిశ్శబ్దంగా గమనిస్తున్న నాన్న ఒక్క ఉదుటున నన్ను భుజాన వేసుకొని బడికి బయలుదేరాడు. నేను గగ్గోలు.. మా అమ్మ గగ్గోలు. విచిత్రంగా రోడ్డంతా అలాగే ఉంది. బడికి తీసుకెళ్లి, దగ్గరుండి టీకా వేయించి, మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు నాన్న. ఆరోజుకి ఆయన్ను మించిన రాక్షసుడు ఎవరూ లేరు నాకు.

మా నాన్న, ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడు కాదు. నిష్కల్మషంగా ఉండేవాడు. ఎప్పుడైనా, ఎవరిమీదనైనా కోపం వచ్చినా, అది ఆ క్షణం వరకే. మేముండే కాశిబుగ్గలో అందరూ దాదాపుగా మిల్లులో పనిచేసేవారే. మా ఇంటి చుట్టూ కూడా వాళ్లే. వీళ్లందరితో కలిసి, నాన్న చిట్టీలు నడిపేవాడు. అందరూ నాన్నను మాస్టర్ అని పిలిచేవాళ్లు. మా ఊరివాళ్లు, మా అమ్మా ఆయన్ను పటేలా అని పిలిచేది. చిట్టీల విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఒక్కపైసా కూడా తేడా రాకపోయేది. ఇచ్చేవాళ్ల విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించేవాడు. మా అసలు ఊరు అప్పట్లో పరకాల తాలుకా, ఇప్పుడు శాయంపేట మండలం, నేరేడుపల్లి గ్రామం. వరంగల్-ములుగు రహదారిపై ఉండే కటాక్షపురం దగ్గర దిగి, ఓ రెండుమూడు కిలోమీటర్లు లోపలికి వెళితే వచ్చేది. అక్కడ ఉన్న కొద్దిపాటి పొలాన్ని చూసుకొని వచ్చేవాడు నాన్న అప్పుడప్పుడు. వచ్చేటప్పుడు, కటాక్షపూర్ చెరువులోని బొమ్మె (కొరమీను) చేపలను కొని, ఒక ప్లాస్టిక్ సంచీనిండా నీళ్లు నింపుకొని, దాంట్లో చేపలేసుకొని వరంగల్ వచ్చేవాడు. అవి చచ్చిపోతే రుచి ఉండవని ఆయన చేసుకున్న ఏర్పాటది. ఇది ప్రత్యేకంగా నా కోసమే. నేను చిన్నచేపలు తిననని ఆయనకు తెలుసు.

నేను ఇప్పుడు అమ్మానాన్న గా భావిస్తున్నవారు అసలు అమ్మానాన్నలు కాదనీ, చిన్నాన్నే నా అసలు తండ్రి అని చెప్పింది.
మా వాడలో మొదటి రేడియో, మొదటి టేబుల్ ఫ్యాన్ మా ఇంట్లోనే. నాకు చిన్నప్పుడు అమ్మవారు పోస్తే, గాలి బాగా తగలాలని టేబుల్ ఫ్యాన్ తెచ్చాడు నాన్న. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. 1987లో ఆజంజాహీ మిల్లు నష్టాల్లో కూరుకుపోవడంతో, కార్మికులందరికీ బలవంతంగా వీఆర్‌ఎస్ ఇచ్చి ఇంటికి పంపారు. మా నాన్న కూడా అందులో ఉన్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితి అనుమతించినవరకు నా చదువుకు ఎలాంటి లోటు రానీయలేదు. ఆయన నన్ను ఎంత ఇష్టపడ్డాడో, ప్రేమించాడో.. నాకు కొడుకు పుట్టాక, వాడు చదువుకోవడానికి వేరే ఊళ్లో దించినపుడు నాకు తెలిసింది. ఒక నాలుగు గంటల నాన్‌స్ట్టాప్ ఏడుపు తర్వాత. చిన్నప్పుడు సెలవుల్లో మాఊరికి, చిన్నాన్నవాళ్లింటికి వెళ్లినపుడు, ఓరోజు తమ్ముళ్లతో ఇంటిముందు ఆడుకుంటుంటే పక్కింటి ముసల్ది, ఓ విషయం చెప్పింది. నేను ఇప్పుడు అమ్మానాన్నగా భావిస్తున్నవారు అసలు అమ్మానాన్నలు కాదనీ, చిన్నాన్నే నా అసలు తండ్రి అని చెప్పింది. నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోవడంతో, పిల్లలు లేని మా పెద్దమ్మ, పెదనాన్నలు నన్ను తీసుకెళ్లి పెంచుకున్నారని, మా చిన్నాన్న మళ్లీ పెళ్లిచేసుకొని నా తమ్ముళ్లను కన్నాడని తర్వాత తెలిసింది నాకు. ఆ రోజు ఆ ముసల్ది చెప్పినప్పుడు అయితే ఏంటి? అన్న నేను, ఎప్పటికీ అదే భావనతో ఉన్నాను. ఇప్పుడు కూడా.. నాకు సంబంధించినంతవరకు అది అంత ముఖ్యమైన విషయమే కాదు. అయితే, నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగా మిగిలిపోయే అంశం, పెంచిన కొడుకును కూడా ఇంత ప్రేమగా చూసుకుంటారా అనేదే. మా నాన్న శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతూ, తన మనవడ్ని ఒళ్లో కూర్చోబెట్టుకొని నా వారసుడు అని వచ్చినవాళ్లకి, వచ్చిపోయేవాళ్లకి పరిచయం చేయడం.. నాకు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం.

ఇక్కడ ఒకసారి మనం మళ్లీ మొదటికి వద్దాం. ఆరోజు తమ్ముడికి టీ-షర్ట్ కొనిచ్చింది చిన్నాన్న కాదన్నమాట.. నాన్నే. వెంటవెళ్లిన నేను అన్న కొడుకును కాదన్నమాట.. కొడుకునే. కానీ, వెంటనే నన్ను తీసుకెళ్లి కొనిచ్చింది మాత్రం నాన్న కాని నాన్న. కాదు... నాన్నని మించిన నాన్న. నా నాన్న. ఆయన స్వర్గీయ శ్రీ చెర్మాల లక్ష్మయ్య గారు.

-చెర్మాల శ్రీనివాస్

1871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles