రుచుల డబ్బా!


Thu,June 13, 2019 12:11 AM

Student-food
స్కూళ్లు మొదలయ్యాయి.. అమ్మలంతా బిజీబిజీ అయిపోయారనుకుంటా! పొద్దున లేవగానే.. పిల్లలకు ఏం చేయాలనే ఆలోచనతో సతమతమవుతున్నారా? ఇక పిల్లలేమో డబ్బా ఖాళీ చేయకుండా.. సగం తిని.. సగం ఖాళీ కడుపుతో ఇంటికొచ్చేస్తున్నారా? పిల్లలకు కాస్త టేస్టీగా.. యమ్మీగా ఉన్నప్పుడే.. లొట్టలేస్తారు.. అందుకే అన్నాన్నే.. తీరొక్క రకంగా రోజూ వండి వడ్డించండి.. అప్పుడు మెతుకు మిగలకుండా తినేస్తారు..

కొబ్బరి రైస్

COCONUT-RICE

కావాల్సినవి :

కొబ్బరి చిప్ప : 1, అన్నం : 2 కప్పులు,
పచ్చిమిర్చి : 4, ఎండుమిర్చి : 2, కొత్తిమీర : ఒక కట్ట, నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, ఆవాలు : అర టీస్పూన్,
పల్లీలు : ఒక టేబుల్‌స్పూన్, శనగపప్పు : అర టీస్పూన్, మినుపపప్పు : అర టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, నూనె : 3 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కొబ్బరి తురుము చేసి పెట్టుకోవాలి. ముందుగానే అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేట్లు వండుకోవాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినుపపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
స్టెప్ 3 : ఇవి వేగాక.. కరివేపాకు, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలుపాలి. కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు కలుపుతుండాలి.
స్టెప్ 4 : ఇప్పుడు నిమ్మరసం వేసి ఒక నిమిషం సన్నని మంట మీద ఉంచి అన్నం వేయాలి. మరో నిమిషం కలిపి కొత్తిమీర వేసి దించేయాలి. అంతే.. టేస్టీ కొబ్బరి రైస్ రెడీ!

పుదీనా కొత్తిమీర రైస్

CORIANDER-RICE

కావాల్సినవి :

కొత్తిమీర : అర కప్పు, పుదీనా ఆకులు : అర కప్పు, అన్నం : ఒక కప్పు, అల్లం ముక్కలు : ఒక టీస్పూన్, పచ్చిమిర్చి : 2, ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు,
కాకరకాయ పొడి : ఒక టీస్పూన్ , నెయ్యి : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో నెయ్యి వేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుతుండాలి.
స్టెప్ 2 : ఇవి బాగా దగ్గరకు అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు వేసి కలుపాలి.
స్టెప్ 3 : రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి.. చివరగా కాకరకాయ పొడి వేసి దించేయాలి.

టోఫు ఫ్రైడ్ రైస్

TOFU-RICE

కావాల్సినవి :

అన్నం : 2 కప్పులు, ఉల్లిగడ్డ : 1, క్యాప్సికం ముక్కలు : ఒక కప్పు,
ఆలుగడ్డ ముక్కలు : ఒక కప్పు, క్యారెట్ ముక్కలు : ఒక కప్పు, పసుపు : అర టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్,
జీలకర్ర పొడి : అర టీస్పూన్

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇందులో క్యాప్సికం ముక్కలు, ఆలు ముక్కలు వేయాలి.
స్టెప్ 2 : రెండు నిమిషాలు వేగనిచ్చాక.. క్యారెట్ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు కలుపాలి. ఇప్పుడు పసుపు వేసి దాదాపు ముక్కలు 80శాతం వేగనివ్వాలి.
స్టెప్ 3 : ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, టోఫు వేసి రెండు నిమిషాలు సన్నని మంట మీద కలుపుతుండాలి.
స్టెప్ 4 : దీంట్లో అన్నం వేసి కలిపి దించేయాలి. ఈ ఫ్రైడ్ రైస్‌ని పిల్లలు ఇష్టంగా తింటారు.

ఎగ్ రైస్

EGG-RICE

కావాల్సినవి :

అన్నం : ఒక కప్పు, కోడిగుడ్లు : 2, ఆవాలు : అర టీస్పూన్,
కరివేపాకు : ఒక రెమ్మ, పచ్చిమిర్చి : 2, అల్లం,
వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్,
క్యారెట్ : 1, నూనె : 3 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో నూనె పోసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కలుపాలి.
స్టెప్ 2 : ఇవి కాస్త వేగిన తర్వాత.. కోడిగుడ్లు కొట్టి పోయాలి. వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతుండాలి.
స్టెప్ 3 : ఇందులో క్యారెట్ ముక్కలు వేసి మరి కాసేపు కలుపాలి. చివరగా అన్నం వేసి రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద అలాగే ఉంచి దించేయాలి. నోరూరించే ఎగ్ రైస్ మీ ముందుంటుంది.
-సంజయ్ తుమ్మ సెలబ్రిటీ చెఫ్

811
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles