వుడ్‌బాల్ ఆణిముత్యం


Wed,June 12, 2019 01:16 AM

మ్యాచ్ స్టార్ట్ అయిందా? స్కోరెంత? బ్యాటింగ్ ఎవరిది? గెలుస్తుండొచ్చా? అంటూ యువతకు క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ పట్టుకుంది! కానీ.. క్రికెట్ ఒక్కటే ఆటనా? వుడ్‌బాల్ లాంటి ఆటలు ఎన్ని లేవు? ఆదర్శ్‌లాంటి వుడ్‌బాల్ ఆణిముత్యాలు ఎంతమంది లేరు? అందరూ క్రికెట్ వెంట పరుగులు తీస్తుంటే తాను వుడ్‌బాల్‌లో ఆరితేరి వరల్డ్‌కప్‌కు ఎంపికైన కందిక ఆదర్శ్ పరిచయం ఈ కథనం.
wood-ball
ఉడ్‌బాల్ ఆటనా? ఇదెలా ఉంటుంది? అని చాలామంది ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఇదో అంతర్జాతీయ క్రీడ. పచ్చని మైదానాల్లో లేదా ఇసుక మీద ఆడే ఆట. ఒలింపిక్స్‌లో కూడా వుడ్‌బాల్‌కు అవకాశం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే ఉల్లాసవంతమైన ఇండోర్ గేమ్. చాలా తక్కువమంది ఛాంపియన్లు ఉన్న వుడ్‌బాల్ ఆటనే ఎంచుకున్నాడు తెలంగాణ తేజం జనగామ జిల్లా చెన్నూరు యువకుడు ఆదర్శ్.

ఎవరు ఆడతారు? : తైవాన్‌లో ఎక్కువగా ఆడే వుడ్‌బాల్ చూడటానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఈ ఆటను 2008లో ఏషియన్ బీచ్‌గేమ్స్‌లో విలీనం చేశారు. అదే సంవత్సరం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాలో చేర్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉడ్‌బాల్‌ను ఆడుతున్నాయి. అరిస్ సుమరియాంటో, కిమ్ ప్యో హ్వాన్ లాంటి తక్కువ మంది ఛాంపియన్లు ఈ ఆటలో ఉన్నారు. అలాంటి అరుదైన ఆట కోసం కలలుగని వాటిని సాకారం చేసుకున్నాడు ఆదర్శ్. తెలంగాణలోని ఓ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన అతను ఒలింపిక్స్‌లో ప్రవేశమున్న ఇలాంటి ఆటలో రాణించడం మనందరికీ గర్వకారణం.

ఎలా ఆడతారు?: చెక్కతో చేసిన బాల్ ఉంటుంది. దానిని బ్యాట్‌తో కొద్దిదూరంలో ఉన్న వికెట్స్‌కు కొడతారు. బాల్ సెంటర్ వికెట్‌ను కొట్టాలి. వుడ్‌బాల్ ఆటలో బ్యాట్‌ను మాలెట్ అనీ.. వికెట్స్‌ను గేట్ అని అంటారు. ఇలా కొన్ని రౌండ్లు ఉంటాయి.

wood-ball3
ఆదర్శ్ ప్రవేశం ఎలా? : 2014లో ఆదర్శ్ పదో తరగతి పూర్తి చేసి వరంగల్‌లోని ఇంటర్‌లో చేరాడు. ఆ సమయంలో చెన్నూర్‌కు చెందిన పీఈటీ సందీప్‌ను వుడ్‌బాల్ గేమ్‌లో ప్రోత్సహించారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సందీప్ ఆదర్శ్‌కు వుడ్‌బాల్ నేర్పించేవారు. ఆదర్శ్ వేరే వ్యాపకం ఏమీ లేకుండా సెలవు వచ్చిన ప్రతిసారి ఊరికొచ్చి సందీప్ వద్ద దీనిని నేర్చుకునేవాడు. అదే పనిగా ప్రతిరోజు నాలుగింటికి లేచి 8 గంటల దాకా ప్రాక్టీస్ చేసేవాడు. ఓ వైపు చదువుకు ఆటంకం కలుగకుండా మరో వైపు ఆటలో రాణిస్తూ ఆదర్శ్ ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.

దక్షిణాదిలో ఒకే ఒక్కడు: వుడ్‌బాల్‌లో ప్రావీణ్యం సాధించిన ఆదర్శ్ 2017లో మహారాష్ట్రలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. అనంతరం కొన్ని రోజులకు ఆదర్శ్‌కు ఒక లెటర్ వచ్చింది. మలేషియాలో జరిగే అంతర్జాతీయ వుడ్‌బాల్ పోటీల్లో పాల్గొనాలని ఆ లెటర్ సారాంశం. ఈ పోటీల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఒకే ఒక్కడు ఆదర్శ్. విశేష ప్రతిభ కనబర్చినప్పటికీ అక్కడి పిచ్ సమస్య కారణంగా విజయాన్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశకు లోనవకుండా ఆటను మరింత ప్రాక్టీస్ చేశాడు. ఇది వరకటి ఆటలో ప్రతిభ కనబర్చిన ఆదర్శ్ కు మహారాష్ట్ర వుడ్‌బాల్ బోర్డు వరల్డ్ కప్ పోటీలకు ఆదర్శ్ ఎన్నికైనట్లు లేఖ పంపింది.

టార్గెట్ 2020: 2018లో థాయిలాండ్‌లో నిర్వహించిన వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొని ప్రత్యర్థి పాకిస్తాన్ మీద 17 పాయింట్లు సాధించాడు. కంబోడియా, కొరియా, శ్రీలంక, ఉక్రేన్‌లపై విజయం సాధించాడు. ఉగండాపై ఆడి ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయాడు. ఉగండాపై గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకునే వాడు. 2020లో జరిగే ఏసియన్ బీచ్ గేమ్‌లో ఇండియాకు మెడల్ తేవడమే లక్ష్యంగా ఆడుతున్నాడు ఆదర్శ్. 2020లో విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు.

మెడల్ నా లక్ష్యం

ప్రస్తుతం డిగ్రీలో బీఏ చదువుతున్నా. ఐఏఎస్ అధికారిని కావాలని నా జీవిత కల. 2020లో ఏసియన్ బీచ్ గేమ్‌లో ఇండియాకు మెడల్ తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇందుకోసం రోజుకు 8 గంటలు కష్టపడుతున్నా. ఎండా, వాన ఏమీ లెక్క చేయకుండా సాధన చేస్తున్న. రెప్పపాటులో విజయం నా నుంచి దూరమైంది. ఈసారి కచ్చితంగా మెడల్ సాధిస్తా అనే బలమైన నమ్మకం ఏర్పడింది. వుడ్‌బాల్ ఆటలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలు నిర్వహించే సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపించాయి. ఆర్థిక స్థోమత లేని కారణంగా సదస్సుకు హాజరు కాలేకపోతున్నా. ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నా.
- కందిక ఆదర్శ్

wood-ball2
నాన్నే ఆదర్శం : ఆదర్శ్ వాళ్ల నాన్న అంజయ్య పోస్ట్ మాస్టర్. బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. 1989లోనే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. కుటుంబ బాధ్యతలు మీద పడడంతో, ఆర్థిక స్థోమత లేక ఆటకు దూరమయ్యారు. ఉద్యోగ రీత్యా బిజీగా ఉండే అంజయ్య సమయం దొరికినప్పుడల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. తాను సాధించలేని విజయాలను తన కొడుకు సాధించాలని కలలు కన్నాడు. ఆదర్శ్ మూడో తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రతీరోజు ఉదయం నాలుగింటికి ఊరి చివరి ఖాళీ స్థలంలో ఆడించేవారు.

రచయిత కూడా: ఆదర్శ్ వుడ్‌బాల్ ఆటలోనే కాకుండా సామాజికాంశాలపైనా స్పందిస్తున్నాడు. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు. ఎక్కడుంటారు? భూమి పుట్టుకనుంచి గ్రహాంతర వాసులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా? ఇలా అన్నింటినీ క్రోడీకరిస్తూ 200 పేజీల వరకు రాశాడు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మన సంస్కృతి, ఇదీ మన చరిత్ర అంటూ ఎన్నో కొత్త విషయాల్ని తన అక్షరాల్లో బంధించాడు. వీటిని పుస్తకం వేస్తానని ఆదర్శ్ చెబుతున్నాడు.

యూనివర్సిటీల ఆహ్వానం : రైలుపట్టాల్లాగా ఆదర్శ్ జీవితంలో క్రీడలు, చదువు సమానంగా సాగాయి. అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తి ఉండడంతో ఐర్ స్టూడెంట్ అప్డేట్స్‌ను తరచూ ఫాలో అవుతూ ఉండేవాడు. ఇంటర్న్‌షిప్‌కోసం ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ క్లబ్‌లు నిర్వహించిన పరీక్షలో ఆదర్శ్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షలో మతం- మౌఢ్యం అనే అంశంపై అప్పటికప్పుడు వ్యాసం రాశాడు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్శిటీ క్లబ్‌లు తాము నిర్వహించే సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పంపాయి. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయా యూనివర్శిటీ జర్నల్స్‌లో ప్రచురిస్తాయి. అనంతరం ఆ విద్యార్థి చదువుకున్నన్ని రోజులు ఉపకార వేతనం పొందుతాడు.
-పడమటింటి రవికుమార్

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles