విశ్వవేదికపై 3 స్వరాలు!


Sun,June 9, 2019 12:58 AM

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ యుద్ధంలో మహిళా కామెంటేటర్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈసారి క్రికెట్ ప్రపంచకప్‌లో వ్యాఖ్యాతలలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషా గుహ, ఇంగ్లండ్ హాకీ క్రీడాకారిణి అలీసన్ మిషెల్, ఆస్ట్రేలియా మాజీ ఉమెన్ క్రికెటర్ మెల్ జోన్స్ ఉన్నారు. 11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్‌లుగా సాగే ఈ టోర్నీ కోసం.. మొత్తం 10 దేశాలకు చెందిన 24 మంది కామెంటీటర్ల జట్టును స్టార్ నెట్‌వర్క్ ఎంపిక చేసింది. వీరిలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్, హర్షా బోగ్లే చోటు దక్కించుకొన్నారు. మైకేల్ క్లార్క్, మైకేల్ స్లేటర్, వసీం అక్రం, రమీజ్ రాజా, కుమార సంగక్కర, పామీ ఎంబాగ్వా, అతర్ అలీ ఖాన్, మైకేల్ హోల్డింగ్, ఇయాన్ బిషప్, మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ వార్డ్, సైమన్ డూల్, మార్క్ నికోలస్, ఇయాన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, గ్రీమ్ స్మిత్, షాన్ పోలాక్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురి మహిళా వ్యాఖ్యాతల ప్రొఫైల్స్ మీ కోసం. ప్రపంచం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతున్నది. విశ్వవేదికలపై నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది వరల్డ్‌కప్ సమరం. ఆ యుద్ధాన్ని ఒకరు మాటలతో రేకెత్తిస్తుంటే.. మరొకరు తన వాక్చాతూర్యంతో హుషారెత్తిస్తున్నారు. ఇంకొకరు
ఆ హోరాహోరీ పోరును ఉచ్ఛస్థితికి తీసుకెళ్తున్నారు. ఆ ముగ్గురూ మాటలతో మాయ చేయగలరు. తియ్యటి స్వరాలతో ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించగలరు. వారే వరల్డ్‌కప్ మహిళా కామెంటేటర్స్.

isa-guha

అలీసన్ మిషెల్

Alison-mitchell
ఇంగ్లండ్ స్పోర్ట్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు అలీసన్ మిషెల్. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్న మిషెల్.. హాకీలో యూనివర్సిటీ లెవల్లో ఆడింది. స్పోర్ట్స్ జర్నలిజం చేసి పలు చానెళ్లలో యాంకర్‌గా వ్యవహరించింది. కెరీర్ మొదట్లోనే బీబీసీ స్పోర్ట్స్‌లో చేరి రేడియో యాంకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నది. హైస్కూల్ నుంచే తనకు రేడియోలో జాకీగా అనుభవం ఉండడంతో ఎలాంటి క్రీడ అయినా చాలా సులువుగా, ప్రేక్షకులకు అర్థమయ్యేలా మాట్లాడేది. బీబీసీ రేడియోలో పనిచేస్తున్నప్పుడే ఒలింపిక్, కామన్‌వెల్త్, వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఓపెన్ గోల్ఫ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ క్రమంలో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడల కామెంటరీపై దృష్టిపెట్టి, అన్ని విషయాలు అవగాహన చేసుకొని బెస్ట్ లేడీ కామెంటేటర్‌గా దూసుకుపోతున్నది మిషెల్.

2007లో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు వ్యాఖ్యతగా పరిచయం అయింది. ఎస్‌జేఏ స్పోర్ట్స్ బ్రాడ్‌క్యాస్టర్-2013గా ఎంపికైంది మిషెల్. ఆస్ట్రేలియాలోని ఏబీసీ రేడియో గ్రాండ్‌స్టాండ్‌లో బాల్ బై బాల్ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొట్టమొదటి మహిళ మిషెల్. బీబీసీ చానెల్‌లోనే కాకుండా ఈఎస్‌పీఎన్, చానెల్-4, చానెల్-9, చానెల్-5, స్కై స్పోర్ట్స్, బీటీ స్పోర్ట్స్ వంటి చానెళ్లలో యాంకర్‌గా వ్యవహరిస్తున్నది. 2014 ఈబీసీ ఇంగ్లండ్ క్రికెటర్ అవార్డు అందుకున్నది. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రపంచంలోని టాప్ క్రీడాకారులను ఇంటర్య్యూ చేసింది మిషెల్. క్రికెట్ నేపథ్యం లేకపోయినా తన మాటలతో క్రీడాభిమానులను మాయ చేయగలదు మిషెల్. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌నకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న వారందరికీ క్రికెట్ నేపథ్యం ఉన్నది. ఒక్క అలీసన్ మిషెల్‌కు తప్ప. అయినా తనను ఎంపిక చేశారు. అదీ టాలెంట్ అంటే.

మెలానీ జోన్స్

mel-jones
ఆస్ట్రేలియాకు చెందిన మెలానీ జోన్స్ మహిళా క్రికెట్‌కు ఎన్నో సేవలు అందించింది. కుడిచేతి వాటం కలిగిన జోన్స్ 5 టెస్ట్ మ్యాచ్‌లు, 61 వన్డేలు ఆడింది. 1998లో క్రికెట్ కెరీర్ ప్రారంభించి 2003 లో ముగించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా విక్టోరియన్ స్పిరిట్, టస్మనియన్ రోర్ లీగ్‌లు ఆడింది. 2007లో క్రికెట్ కామెంటేటర్‌గా కొత్త కెరీర్‌ని ప్రారంభించింది జోన్స్. అంతేకాకుండా ఆస్ట్రేలియా చానెల్9, ఏబీసీ రేడియోలో స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేసింది. ఆటలో ఎంత చురుగ్గా ఉంటుందో.. సామాజిక కార్యక్రమాల్లో కూడా అంతే చురుగ్గా ఉంటుంది జోన్స్. ఆస్ట్రేలియాకు చెందిన రెడ్‌డస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ దేశంలోని ఆదిమవాసీల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నది. ఈ సంస్థకు తాను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నది.

తనకు వచ్చిన డబ్బులో చాలా వరకు ఎన్జీఓకు విరాళంగా ఇస్తూ మానవతను చాటుకుంటున్నది. ఈ క్రమంలో విక్టోరియన్ హానర్ రోల్ ఆఫ్ ఉమెన్-2017గా ఎంపికైంది. ఇక వ్యాఖ్యాతగా మైక్ పట్టుకుంటే మాటల్లో వేగం అందుకోలేరు. మన దేశంలో జరిగిన ఐపీఎల్ లీగ్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది జోన్స్. దీంతోపాటుగా బిగ్‌బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో, యాషెష్ ట్రోఫీకి కూడా కామెంటరీ చేసి ప్రేక్షకులను అలరించింది. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ సారథ్యంలో కోచింగ్ తీసుకొని క్రికెట్‌లోకి అడుగుపెట్టింది జోన్స్. ఈమెని అంతా ముద్దుగా మెల్ జోన్స్ అని పిలుస్తుంటారు. జోన్స్ తన వాక్చాతూర్యంతో ప్రేక్షకులను మెప్పించగలదు.

ఇషా గుహ

isa-guha2
భారత సంతతకి చెందిన ఇషాగుహ ఇంగ్లండ్ మహిళా క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం. తన 16వ యేటనే అంటే 2001లో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. కుడిచేతివాటం మీడియం పేస్‌తో బౌలింగ్‌లో రాణించింది ఇషా. 2009లో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ టోర్నీ మొదటి నుంచి చివరి వరకూ తనదైన శైలిలో బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లో రాణించింది ఇషా. వరల్డ్‌కప్‌ను ఫైనల్‌లోనూ సత్తా చాటింది. ఇంగ్లండ్ మహిళల జట్టు కప్పు గెలిచేందుకు తనదైన పాత్ర వహించింది. తన క్రికెట్ కెరీర్‌లో 2009 వరల్డ్‌కప్ ది బెస్ట్ అంటున్నది ఇషా. ఆ తర్వాత ఇంగ్లండ్ మహిళా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రాడ్‌క్యాస్టింగ్‌లో రాణించింది. ఐటీవీ, స్కైస్పోర్ట్స్ పేరుతో టీవీ, రేడియో ప్రసారాలు ప్రారంభించింది. ప్రస్తుతం వ్యాఖ్యాతగా ఉంటూనే బీబీసీ స్పోర్ట్స్‌కు కాలమ్స్ రాస్తున్నది ఇషా.

తన క్రికెట్ కెరీర్‌లో 8 టెస్టులు, 83 వన్డేలు, 22 టీ-20లు ఆడింది. అన్ని ఫార్మెట్లలో కలిపి 1,218 పరుగులు, 234 వికెట్లు తీసింది ఇషా. మెరుపు వేగంతో బంతులు సంధించి.. ప్రత్యర్థిని ఇక్కట్లు పెట్టగల సామర్థ్యం ఆమెది. అంతేకాకుదు మైక్ పట్టుకుంటే గలగలా మాట్లాడగలదు. గతంతో ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ చానెల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించింది. గతంలోనూ పలు క్రికెట్ టోర్నీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఇషా గుహ. బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది. గతేడాది సెప్టెంబర్‌లో మ్యుజీషియన్ రిచార్డ్ థామస్‌ను వివాహం చేసుకున్నది. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. ఆమె పూర్తిపేరు ఇషా తారా గుహ. ఇటు క్రికెట్ రంగంలోనూ, ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది ఇషా. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌నకు పురుష వ్యాఖ్యాతలతో దీటుగా రాణిస్తున్నది.

-డప్పు రవి

1338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles