చెట్లకింద జీవిత పాఠాలు!


Sun,June 9, 2019 12:52 AM

పదవీ విరమణ పొందిన తర్వాత అందరిలాగే ఇతను రెస్ట్ తీసుకోలేదు. నిరుపేద పిల్లలకోసం చెట్ల కింద పాఠశాలను ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. పదేండ్ల నుంచి 700మంది పిల్లలకు చదువు చెప్పాడు.
gurugram-free-school
హర్యానాకు చెందిన 66 ఏండ్ల గోపాల్ కృష్ణ భట్నాగర్ ఓ బ్యాంకులో ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. తన వంతుగా సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉచితంగా పాఠశాలను ఏర్పాటు చేశాడు. 2009లో చెట్ల కింద 70మంది పిల్లలతో పాఠశాలను ప్రారంభించాడు. ఇందులో మురికివాడల్లోని పేద పిల్లలకు, యాచకవృత్తిలో ఉన్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. మొదట్లో భిక్షాటన చేసేవారి పిల్లలను స్కూల్‌కు పంపమని కోరినప్పుడు ఆయన్ను చాలామంది వ్యతిరేకించారు. దీంతో చదువుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి వారికి అవగాహన కల్పించాడు. అలా అవగాహన కల్పిస్తూ వారిలో సరికొత్త మార్పును తీసుకువచ్చాడు.

పిల్లలందరికీ చదువుకోవడానికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చాడు. కొద్దిరోజుల తర్వాత తన కుమార్తెను ఆ స్కూల్‌కు టీచర్‌గా నియమించాడు. తండ్రి, కూతురు కలిసి సుధా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ సహకారంతో అక్కడి విద్యార్థులకు హిందీ, ఇంగ్లిష్, గణితంపై శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా సమాజంలో అణగారిన వర్గాలకు ఆర్థిక భరోసా ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నాడు భట్నాగర్.

878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles