సృష్టికర్తే అసలు సంస్కర్త!


Fri,June 7, 2019 01:18 AM

స్వార్థానికి మరోపేరు మనిషి అని ఊరకే అనరు. దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక కథ ఒకటి ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. భగవంతుడు సృష్టి చేసిన తర్వాత పంచభూతాలకు ఆకలేసింది. అవి భగవంతునితో తమ ఆకలిని తీర్చమని అడిగాయట. అప్పుడు భగవంతుడు గోవును సృష్టించి అందులో ప్రవేశించి, తద్వారా మీ ఆకలి తీర్చుకొనండి అని ఆదేశించాడట. అవి వెంటనే గోవులోకి ప్రవేశించాయి. కానీ, వాటి ఆకలి తీరలేదు. ఆ కారణంగా అవి తిరిగి భగవంతుడిని గోవు మా ఆకలి తీర్చజాలదు. మరొక దాన్ని సృష్టించండి అని కోరాయట. అప్పుడు భగవంతుడు బాగా ఆలోచించి మనిషిని సృష్టించాడట. పంచభూతాలు వెంటనే మనిషిలోకి ప్రవేశించి, మనిషే తమ ఆకలి తీర్చడానికి అనువైన వాడని నిశ్చయించుకొని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాయట! ఈ కథవల్ల మనకు తెలుస్తున్నదేమంటే, మనిషి స్వార్థపరుడుగా పుట్టాడని. అందుకే, భగవంతుడు మనుషులను తీర్చిదిద్దే క్రమంలో దానగుణం అలవర్చుకోండి. స్వార్థపరులు కాకండి అని సందేశమిచ్చాడు మూడు దాల కథలో. ఏమిటా మూడు దాలకథ? చదవండి మరి!
Spiritual-story
మానవులందరూ భగవంతుని సంతానమే. అతనికందరూ ప్రేమపాత్రులే. అందరి సుఖదు:ఖాలనూ పట్టించుకొనే వాడు, దు:ఖం నుంచి బయట పడవేసి, మోక్షాన్ని ఇచ్చేవాడు భగవంతుడే. ఆయనెంత కరుణాలువో తెలియజేసే కథే ఈ మూడు దాలకథ. ప్రకృతికి మూడు గుణాలున్నవి. ఒకటి: సత్వగుణం, రెండు: రజోగుణం, మూడు: తమోగుణం. ఈ గుణాల న్యూనాధిక్యతల వల్లనే మనుషులు మూడుపేర్లతో వ్యవహరింపబడుతున్నారు.

నిజానికి భగవంతుడు ఇతర ప్రాణికోటి లాగానే మానవజాతిని సృష్టించాడు. ఆకృతి గ్రహణాజ్జాతి: అని దర్శనం చెపుతుంది. ఆకారం వల్లనే జాతి గుర్తింపబడుతుంది. అందువల్ల మానవులదంతా ఒకే జాతి. కాని స్వభావాలను బట్టి ఆయా పేర్లతో పిలువబడుతారు. సత్వగుణాధిక్యతవల్ల మానవులు దేవతలుగాను, రజోగుణాధిక్యత వల్ల కేవలం మానవులుగాను, తమోగుణాధిక్యత వల్ల రాక్షసులుగాను వ్యవహరింపబడుతారు. కావాలని భగవంతుడు రాక్షసులను సృష్టించడు. మన స్వభావంతోనే రాక్షసులమనిపించుకుంటాం.

అదే విధంగా దేవతలు కూడా ప్రత్యేకంగా సృష్టింపబడరు. దేవలోకం ప్రత్యేకంగా ఉండదు. మానవులలో జ్ఞానులెవరైతే ఉన్నారో వారే దేవతలు. వారున్న లోకం దేవలోకం. అంతేగాని, దేవతలకు ప్రత్యేకంగా ఒక లోకం సృష్టింపబడడం గాని, దానికి వెయ్యి నేత్రాలున్న పెద్ద మనిషి ఒకరిని అధిపతిగా చేయడం గాని వట్టి కల్పన మాత్రమే. విషయం ఏమంటే, మనలోనే దేవతలున్నారు, రాక్షసులున్నారు. ఐతే, సృష్టికర్త కోరిక ఏమంటే, మనమంతా మానవులుగా పుట్టినప్పటికీ రాక్షసులం కాకుండా, దేవతలం కావాలని మాత్రమే. సమాజం సజావుగా నడవాలంటే ఎప్పటికప్పుడు దాన్ని పునర్నిర్మిస్తూ ఉండాలి. అందుకు తల్లిదండ్రులు, గురువులు, పాలకులు పూనుకోవాలి. వీరినే ఒకమాటలో మార్గదర్శకులని చెప్పవచ్చు. భగవంతుడు సమస్త జీవుల క్షేమం కోరేవాడని మొదటనే చెప్పుకొన్నాం కదా! ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, సంస్కర్త కూడా అనడానికి ఈ మూడు దాలకథ చక్కని నిదర్శనం.

భగవంతుని ఆదేశం మేరకు మొదట దేవతలు సమీపించి మేం అందరిలో కలిసి పోవడానికి, కీర్తిమంతులం కావడానికి మాకేదైనా ఉపదేశించండి అని కోరారట. అప్పుడు భగవంతుడు వారికి ద అనే అక్షరాన్ని ఉపదేశించాడట. ద అంటే దామ్యత- దమనం అని అర్థం. జ్ఞానంతోపాటు సకల సంపదలుండడం వల్ల దేవతలకు గర్వమెక్కువ. అందువల్ల వారు అందరితో కలవరు. కనుక, గర్వాన్ని వదులుకొమ్మని భగవంతుడు ద అనే అక్షరాన్నిచ్చి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి అనే సందేశమిచ్చాడు. దేవతలని అనుకొంటున్న వారు భగవంతునివల్ల ఒక లాభాన్ని పొందుతున్నప్పుడు తక్కిన వారూ ఊరుకుంటారా? అనంతరం మానవుల వంతు వచ్చింది.

వారు భగవంతుడిని సమీపించి, ఉపదేశించవలసిందిగా కోరారు. అప్పుడు భగవంతుడు వారికి కూడా ద అనే అక్షరాన్నే ఉపదేశించాడు. ద అంటే దానమని అర్థం. మానవులకు స్వార్థం ఎక్కువ కనుక వారు ఇతరులతో కలువ లేకపోతున్నారు. వారిని కూడా సంస్కరించే ఉద్దేశంతో దానగుణాన్ని అలవర్చుకొమ్మని ఉపదేశించడం గమనార్హం. ఈ విధంగా దేవతలు, మానవులు భగవంతుని వల్ల ప్రయోజనం పొందగానే రాక్షస స్వభావం కలిగిన వారు (రాక్షసులు) భగవంతుని దగ్గరకు వచ్చి తమకు కూడా ఉపదేశం ఇవ్వండని కోరారు. వారికి కూడా భగవంతుడు యథాపూర్వకంగా ద అనే అక్షరాన్నే ఉపదేశించాడు. ఇక్కడ ద అంటే దయ. దయాగుణం లేని మానవులే రాక్షసులు. అందుకే భగవంతుడు దయాగుణం ద్వారా సమాజంలో మంచివారుగా రాణించాలని వారికి ఉపదేశించాడు.

ఒకరికంటే మరొకరు గొప్పవారమనే గర్వానికి రానీయక, తోటివారిని తమతో సమానంగా చూసుకొమ్మని భగవంతుడు దేవతలకు సందేశమిచ్చాడు. కేవలం తిండికోసమే బతుకక, త్యాగబుద్ధితో వ్యవహరించాలని భగవంతుడు మానవులకు సందేశమిచ్చాడు. హింసకు పాల్పడుతూ సమాజ శ్రేయస్సుకు భంగకరంగా మెలగకుండా, సమస్త ప్రాణులమీద దయ కలిగి ఉండాలని భగవంతుడు రాక్షసులకు సందేశమిచ్చాడు. దేవతలు, మానవులూ, రాక్షసులూ ఈ ముగ్గురూ సమాజంలో భాగమే. శరీరంలో ఒక అవయవం చెడిపోతే శరీరానికెంతటి నష్టమో, సమాజంలో ఎవరు దుర్మార్గంగా వ్యవహరించినా సమస్త మానవకోటికి అపకారమే జరుగుతుంది.

Spiritual-story2

ఆ వేదవాక్కు నిజం కావాలంటే?

ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్న మూడు దాలకథ బృహదారణ్యకోపనిషత్తులో చోటు చేసుకొన్నది. భగవంతుని సందేశాన్ని అందుకున్న మేఘాలు, లోకక్షేమం కోరి ఇప్పటికీ ఆకాశంలో ద ద ద అని ఉరుముతుంటాయట! అందుకే, మనిషి తన చిన్న పొట్టకీ శ్రీరామరక్ష అనుకోకుండా పరహిత బుద్ధితో నడుచుకొన్న నాడు సర్వేజనా: సుఖినోభవంతు అనే వేదవాక్కు సార్థకమవుతుంది.
a-chennappa
-ఆచార్య మసన చెన్నప్ప
సెల్: 9885654381

1292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles