అలలపై కలల ప్రయాణం!


Wed,June 5, 2019 01:09 AM

సెయిలింగ్ వాటర్ స్పోర్ట్.. సముద్రపు అలల మీద అలవోకగా వెళుతూ.. లక్ష్యాలను దాటుతూ ఆడే ఖరీదైన క్రీడ.. ఈ ఆటకు మన దేశంలో ఆదరణ తక్కువే.. స్పాన్సర్లు కూడా పెద్దగా ఉండని ఈ ఆటను.. సవాలుగా తీసుకొని విజయాలను సాధిస్తున్నది.. అలలపై తానూ ఓ కెరటంలా ఎగిసిపడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది.. త్వరలోనే స్పెయిన్‌లో జరిగే మరో పోటీకి సిద్ధమైంది.. హైదరాబాద్‌కి చెందిన అలేఖ్య మహారాజు. సాహస క్రీడలో ఆమె పయనం గురించే ఈ కథనం.
Alhekya
Leave who you were,
love who you are.
dont think about age
look forward
to who you will become..
- Robert louis stevenson
గతంలో మీరేంటో వదిలేయండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వయసుతో సంబంధం లేదు. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాని కోసం అడుగులేయండి. లక్ష్యం మీద సరైన పట్టుదల ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులనైనా లెక్కచేయం. నలుగురిలో స్ఫూర్తి నింపాలనే బలమైన ఆలోచన ఉన్నప్పుడు దేన్నయినా ఎదుర్కోగలం అని రాబర్ట్ లూయిస్ స్టీవెన్‌సన్ అనే ఒక ప్రముఖ రచయిత చెప్పాడు. ఈ మాటలు అలేఖ్య మహారాజుకు సరిగ్గా సరిపోతాయి. ఆమె జీవితపు కలల ప్రయాణానికి వయసు అడ్డం రాలేదు. ఖరీదైన ఆటలో రాణించడానికి ఆర్థిక భారం ఉన్నా అడ్డంకులను ఎదుర్కొన్నది. ఆదరణ తక్కువ ఉన్న ఆటలో ఆమె పడిలేచింది. మహిళల ప్రాతినిధ్యం కనబడని ఆ క్రీడలో ఆమె అద్భుతాలే సృష్టించింది. ఇదంతా పదేండ్ల క్రితం. మరి ఇప్పుడు ఆమె ఇల్లాలు, మూడేండ్ల పాపకు తల్లి. ఆమె మనసు మనసులో లేదు. సెయిలింగ్‌లో ఆమె లక్ష్యం ఇంకా పూర్తి కాలేదనుకుంది. పదేండ్ల తర్వాత మళ్లీ సెయిలింగ్‌లోకి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచి సెయిలింగ్ వాటర్ స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరిచి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నది. 2011లో ఇంటర్నేషనల్ సెయిలింగ్‌లో బంగారు పతకాన్ని అందుకొని విరామం తర్వాత ఇప్పుడు మరో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నది.

నీళ్లు అంటే ఇష్టం..

అలేఖ్యకు చిన్నప్పటి నుంచీ నీళ్లంటే ఇష్టం. పాఠశాల సెలవుల్లో తరచూ స్విమ్మింగ్‌కు వెళ్లేది. అప్పుడే ఆమెకు బోట్‌రైడింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇంట్లో వాళ్లను తరచూ బోట్‌రైడింగ్‌కు తీసుకెళ్లమని అడిగేది. దీంతో ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు సికింద్రాబాద్ బోట్ క్లబ్‌లో చేర్పించారు. అక్కడ స్విమ్మింగ్, బోట్ రైడింగ్ నేర్చుకుంది అలేఖ్య. అక్కడి ట్రెయినర్ నీకు నీళ్లు అంటే ఇంటే ఇష్టం కదా.. సెయిలింగ్ నేర్చుకో అని చెప్పారు. అప్పుడే ఆమెకు సెయిలింగ్ గురించి తెలిసింది. ఇటు చదువుతూనే సెలవులు దొరికినప్పుడు సెయిలింగ్ నేర్చుకొనేది. అప్పుడు ఆమెకు పదేండ్లు ఉంటాయి. సెయిలింగ్ నేర్చుకున్న మూడేండ్లలోనే పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కూడా సాధించింది. 2011లో ఇంటర్నేషనల్ సెయిలింగ్‌లో బంగారు పతకాన్ని అందుకున్నది.
Alhekya1

ప్రాక్టీస్ ఆషామాషీకాదు

సెయిలింగ్ అంటే చాలా మందికి తెలియదు. ఆదరణ కూడా తక్కువ. చాలామంది దీన్ని రోయింగ్ అనుకుంటారు. ఇది ఖరీదైన క్రీడ. మహిళలు ఈ ఆటలో చాలాతక్కువ మంది కనిపిస్తారు. స్పాన్సర్లు కూడా పెద్దగా ఉండరు. కేవలం నీటిలో ఉండి మాత్రమే సెయిలింగ్‌ను ప్రాక్టీస్ చేయలేం అంటున్నది అలేఖ్య. శిక్షణ కోసం తీవ్రమైన శ్రమ తీసుకోవాలి. నీటి బయటా అదనపు సాధన అవసరం ఉంటుందని చెప్తున్నది. ప్రాక్టీస్ సజావుగా సాగాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రాక్టీస్ కోసం హైదరాబాద్‌లోని చెరువులు, సరస్సులు సెయిలింగ్ సాధనకు అనుకూలంగా ఉండవని అంటున్నది అలేఖ్య. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే సముద్రాల్లో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. అందుకే ఆమె ప్రాక్టీస్ కోసం తరచూ ముంబై, చెన్నయ్ వెళ్తుంటుంది. పోటీల్లో సింగిల్ హ్యాండ్ బోట్, గ్రూప్ బోటింగ్ వేర్వేరుగా ఉంటాయి. రెండింటికీ భిన్నమైన సాధన అవసరం. రకరకాల పడవలు ఉంటాయి. ఈ పడవలు కూడా ఖరీదైనవి. వాతావరణంలో మార్పులు జరిగి గాలి విపరీతంగా వీస్తే పడవ తిరగబడుతుంది. అలాంటప్పుడు సెయిలర్లు వారిని వారు రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇవ్వన్నీ సజావుగా ఉండాలంటే ఫిట్‌నెస్ ఉండాలి. రోజూ జిమ్ చేయాలి. సరైన ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పైగా ఖర్చులు అన్నీ సొంతంగా భరించాలటున్నది అలేఖ్య.

ఆగిపోవాలనుకోలేదు...

2011 తర్వాత అలేఖ్య తన చదువుల మీద దృష్టి సారించింది. ఇంజినీరింగ్ చది వాక ఆమెకు పెండ్లయింది. ఇప్పుడు మూడేండ్ల పాప ఉంది. బాధ్యతలు పెరిగాయి. అయినా తన లక్ష్యం మరిచిపోలేదు. సుదీర్ఘ కాలం తర్వాత సెయిలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఆమె సెయిలింగ్ సాధన చేస్తున్నది. ఏండ్ల విరామం ఉన్నప్పటికీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం కలిపి ప్రాక్టీస్ చేస్తున్నది. అట్లాగే ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని అంటున్నది. గతంలో ఆమెతోపాటు సెయిలింగ్ చేసిన ఓ అథ్లెట్ చెప్పిన పోటీలో ఇటీవల పాల్గొన్నది. అందులో ప్రతిభ కనబర్చడంతో జరగబోయే ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైంది. ఈ పోటీ గ్రూప్ సెయిలింగ్. ఆరుగురి బృందం ఈ పోటీలో పాల్గొనున్నది. ఈ బృందంలో రోహిణి రాయ్, ఐశ్వర్య, తులసి, తేజశ్రీ, యాష్న ఉన్నారు. అందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సెయిలర్లు.
ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి టీమ్ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో ఆరుగురి సెయిలర్లలోంచి కొందరు పాల్గొన్నబోతున్నారు. రోహిణి ఈ బృందానికి కెప్టెన్. ఆమెకు దాదాపు పదిహేనేండ్లు సెయిలింగ్‌లో అనుభవం ఉంది. వృత్తిరీత్యా ఈమె డాక్టర్ అయినా సెయిలర్‌గా ఆమె విజయం సాధిస్తున్నది. ఆమె సారథ్యంలో ఈ బృందం ఇప్పుడు జె/80 బోట్‌తో పోటీలో పాల్గొననున్నారు. జూలై 13 నుంచి 20 వరకూ ఈ పోటీలు స్పెయిన్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తూనే స్పాన్సర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. స్పాన్సర్లు ఎవరైనా స్పందిస్తే మాకు సపోర్ట్ గా ఉంటుంది అని అలేఖ్య కోరుతున్నది.

రోల్ మోడల్ అవ్వాలి

Alhekya2
సెయిలింగ్‌లో నేను ఇచ్చింది విరామమే. నా పాపకు నేనే ఆదర్శం కావాలి. చాలామంది ఒక వయసుకు వచ్చాక అంతా అయిపోయిందనుకుంటారు. బరువు పెరిగాననో, బాధ్యతలు ఉన్నాయనో, పెండ్లి అయిందనో ఇలాంటి కారణలతో అక్కడే ఆగిపోతారు. కానీ, వారు ఏదైనా సాధించగలరు. అందుకు నేను ఉదాహరణ కావాలనుకున్నాను. అంటే నేను విజయం సాధించి తీరాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టాక జీవితం అయిపోయిందని చాలామంది అనుకుంటారు. నేను దాన్నే చాలెంజ్‌గా తీసుకున్నాను. ఆత్మస్థయిర్యం ఉంటే చాలు ఏ పోటీనైనా ఎదుర్కోగలం. అందుకే మళ్లీ సెయిలింగ్ పోటీల్లోకి అడుగుపెట్టాను.

-వినోద్ మామిడాల

540
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles