అన్నింటికన్నా.. హ్యుమానిటీ ఫస్ట్!


Wed,June 5, 2019 01:08 AM

యువత.. టిక్‌టాక్ వీడియోలు చేయడంలో బిజీగా ఉన్నవాళ్లను ఎంతంమందిని చూస్తలేం? ఐపీఎల్.. వరల్డ్ కప్ అంటూ క్రికెట్ జపం చేసేవాళ్లెంతమంది మన ఇండ్లలో లేరు? చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఈ ప్రపంచంతో పని లేనట్టుగా వ్యవహరించేవాళ్లు చాలామందిని చూసే ఉంటాం. కానీ.. మహ్మద్ సుజాతుల్లాలాంటి యువకుడిని మాత్రం తక్కువ చూసి ఉంటారు. ఎగిరి గంతులేసి ఎంజాయ్ చేస్తేనే జీవితం కాదు.. పదిమంది ఆకలి తీర్చడంలోనే అసలైన జీవితం ఉందని చెప్తున్న ఆ యువకుడే మహ్మద్ సుజాతుల్లా.
Muhammad
హాస్పిటల్స్‌లో కొంతమంది నెలల తరబడి పడిగాపులు ఉంటారు. రోగికి ఫ్లూయిడ్సో.. అల్పాహారమో ఇస్తుంటారు. కానీ రోగిని చూసుకోవడానికి వచ్చినవాళ్ల పరిస్థితి ఏంటి? రోజూ వందల రూపాయలు పెట్టి తిండి తినలేని పేదల పరిస్థితి ఏంటి? వారి కడుపు నిండేదెలా? ఆకలి తీరేదెలా? అని ఆలోచించాడు సుజాతుల్లా. మానవత్వం నీడన అన్నార్తులను ఆదుకునేందుకు ఒంటరిగానే బయలుదేరాడు. హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నాడు.

హ్యుమానిటీ ఎందుకు?

సుల్తాన్ ఉల్‌ఉలూమ్ ఫార్మసీ కాలేజ్‌లో ఫార్మా-డీ చదువుతున్న మహ్మద్ సుజాతుల్లా చిన్నప్పటి నుంచే మానవతా దృక్పథం కలిగి ఉన్నాడు. వాళ్ల నాన్న మహ్మద్ సిగ్బతుల్లా రిటైర్డ్ స్కూల్ టీచర్. పేరెంట్స్ నేర్పిన విలువల్నే అతడు సమాజ సంక్షేమం కోసం వినియోగించుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆకలితో అలమటిస్తూ ఎర్రటి ఎండలో మాడిపోతున్న పేదవారిని చూసి చలించిపోయాడు. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు వెళ్లిపోతున్నారు. వాళ్లూ మనుషులే కదా అని దగ్గరకు వెళ్లాడు. ఏం కావాలి అంటే.. ఆకలిగా ఉంది అన్నట్లు సైగ చేశారు వాళ్లు. వెంటనే అన్నం తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు వారి కళ్లలో ఆనందం చూశాడు. ఆకలి తీరిస్తే కలిగే సంతృప్తి ఏంటో తెలుసుకున్నాడు.

ఫెయిల్‌తో మొదలైన సేవ

ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ సుజాతుల్లా అందరిలాగే ఉన్నత చదువులు చదివి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నాడు. బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. పాస్ అయితే పది మందికి అన్నం పెడతా అని అల్లాకు మొక్కుకున్నాడు. అదే అతని జీవితంలో కీలకమలుపు తిరిగింది. అనుకున్నట్లుగానే పాసయ్యాడు. పది మందికి కడుపారా అన్నం పెట్టాడు. రోజూ ఇలా అన్నం కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతోమంది ఉన్నారని తెలుసుకున్నాడు. ఎక్కడెక్కడ ఉంటారు వాళ్లు? ఎంతమంది ఉంటారు? ఏ రకంగా వారి ఆకలి తీర్చాలి? ఈ రోజు నేను పెట్టొచ్చు.. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? చేస్తే జీవితాంతం వారికి తోడుగా ఉండాలి అనుకొని అన్నార్తుల ఆకలి తీర్చే స్వచ్ఛంద సంస్థ పెట్టాడు. ఫ్యామిలీ, ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ సహకారంతో 2016లో హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశాడు.

రంజాన్ సహార్ దాత

నేడు రంజాన్. ఈ నెల రోజులు పవిత్ర ఉపవాసాలతో ముస్లీం ప్రజానీకం ఉదయం.. సాయంత్రం వేళల్లో విందు ఆరగించింది. పొద్దటి ఉపవాసం సహార్.. సాయంత్రం ఉపవాసం ఇఫ్తార్. ఎంతటి పేద ముస్లీంలైనా రంజాన్ పవిత్ర మాసాన్ని జరుపుకోవాల్సిందే. కానీ అందరికీ స్థోమత ఉండాలి కదా? తెలంగాణ ప్రభుత్వం అలాంటి నిరుపేదలకు రంజాన్ గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేసి అండగా నిలిచింది. మహ్మద్ సుజాతుల్లా కూడా అదేబాటలో నడుస్తున్నాడు. గత మూడేండ్లుగా సహార్ ఉపవాస దీక్ష విరమణకు కావాల్సిన సామగ్రిని అందజేస్తూ పేద ముస్లీంల జీవితాల్లో రంజాన్ పండుగ వెలుగులు నింపాడు.

రోజూ వెయ్యిమంది

రంజాన్ స్పెషల్ కాకుండా రోజూ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సుజాత్. హైదరాబాద్‌లో రద్దీగా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్ద రోగులకు.. వారి బంధువులకు అన్నం పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నాడు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్స్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన వాళ్లు ఆకలి గురించి ప్రత్యేకించి ఆలోచించాల్సిన సమయం.. ఓపిక ఉండదు. కొందరికైతే తిందామన్నా డబ్బులుండవు. చాలామంది పస్తులుంటారు కూడా. అలాంటివారిని చూసిన సుజాత్ ఈ మూడు హాస్పిటల్స్ వద్ద రోజూ వెయ్యి మందికి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నాడు. దీనికోసం రోజూ రూ. 5000 ఖర్చు అవుతుంది. ఉదయం 8 గంటలకు కోఠి, 8.30 గంటలకు నీలోఫర్, 9 గంటలకు నిమ్స్ వద్ద ఈ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఉంటుంది.

హ్యుమానిటీ సేవలేంటి?

సంతృప్తిని మించిన ఆనందం వేరేది లేదని భావించిన సుజాత్ తన సేవల్ని విస్త్రృతం చేస్తున్నాడు. మూడు హాస్పిటల్స్‌లోనే సేవలందించిన అతను ఇప్పుడు గాంధీ హాస్పిటల్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, దుర్గాభాయ్ హాస్పిటల్‌లో కూడా భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నాడు. స్నేహితులు, సోషల్‌మీడియా ఫ్రెండ్స్ వలంటీర్లుగా సహకరిస్తుండగా ప్రతిరోజూ మెనూలో కిచిడీ రైస్.. పప్పు.. పెరుగు.. రోటీ.. షమీ అందిస్తున్నాడు. 2016 ఫిబ్రవరిలో హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి.. ప్రెసిడెంట్‌గా ఉచిత బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సుజాత్.. దానిని 2017 జనవరిలో రాత్రిపూట భోజనం కార్యక్రమం దాకా విస్తరించాడు. తర్వాత 2017 మేలో అనాథలకు సేవలందించే కార్యక్రమం ప్రారంభించాడు. 2018 మార్చిలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం మొదలుపెట్టాడు. 2018 ఏప్రిల్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి అన్నింటికన్నా హ్యుమానిటీయే ఫస్ట్ అని నిరూపిస్తున్నాడు. సుజాత్ సేవలకు మీవంతు సహకారం అందించాలనుకుంటే.. వారి కార్య క్రమాలు తెలుసుకోవాలనుకుంటే www.hffhyd. com వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.

మానవత్వమే నినాదం


Muhammad2
భోజనమైతే పెడుతున్నా.. కానీ చలికి.. వానకి.. ఎండకి వారి పేదల పరిస్థితి ఏంటి? అనుకున్నాడు. హైదరాబాద్ సిటీలో ఎంతమంది నిరాశ్రయులు ఉన్నారు? ఎక్కడెక్కడ వారు పడుకుంటున్నారు? ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనాథాశ్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? హ్యుమానిటీ ఫస్ట్ ద్వారా చేయాల్సిన సేవ ఏంటి? అని ప్లాన్ వేసుకున్నాడు సుజాత్. ఇవన్నీ తనవల్ల అవుతాయా అనుమానాలు కలిగినా.. మానవత్వమే నినాదంగా మల్చుకొని సిటీలోని నిరాశ్రయులకు రాత్రిపూట భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. దుప్పట్ల పంపిణీ చేస్తున్నాడు. ఓల్డేజ్ హోమ్స్‌లో ఉండే వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. గృహిణులకు ఉచితంగా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. వాడల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేస్తూ అనాథాశ్రమాల్లో పిల్లలకు అన్నీ తానై ఆదుకుంటున్నాడు.

టార్గెట్ థర్టీ డేస్


Muhammad1
రంజాన్ మాసం ప్రారంభమైన రోజు నుంచి ముప్పై రోజులు లక్ష్యంగా పెట్టుకున్నాడు సుజాత్. ఈ 30 రోజుల్లో 10,000 మందికి సహార్ అందివ్వాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఆఖరిసారిగా సహార్ అందజేసి పదివేల లక్ష్యాన్ని దాటేశాడు. మానవత్వం ఉంటే మన పండుగలు.. సంప్రదాయాలకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని చాటిచెప్పాడు. మానవత్వం అనేది ఏ కులానికో.. మతానికో సంబంధించింది కాదనీ.. ఇది మనిషికి సంబంధించిన విషయం అని ప్రచారం చేస్తున్నాడు. రంజాన్‌ను వైభవంగా జరుపుకోవడం పేద ముస్లీంలతో అవుతుందా అని భావించి ఈ టార్గెట్ థర్టీడేస్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
-దాయి శ్రీశైలం

714
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles