అమ్మకోసం హీరోగా..


Sun,June 2, 2019 01:40 AM

హీరో అవ్వాలని సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ స్థాయి వరకూ వచ్చేవాళ్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇతనూ అంతే.. హీరో అవ్వాలని చిన్నప్పుడే ట్రైన్ ఎక్కేశాడు. అప్పుడు ఆ ట్రైన్ రాంగ్‌రూట్‌లో వెళ్లినా.. ఇప్పుడు గాడిలోనే పడ్డాడు. ఫ్రెండ్ కోసం జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి.. తనకోసం వీడియో జాకీగా మారి.. అమ్మకోసం సీరియల్ యాక్టర్ అయ్యాడు. ప్రతిరోజూ అద్దంలో తనలోని నటుడ్ని వెతికి పట్టుకొని కల్యాణ వైభోగం సీరియల్‌లో పరిచయం చేశాడు సన్నీ. కష్టపడితే ప్రతిఫలం ఉంటుందంటున్న బుల్లితెర నటుడు సన్నీ జీవిత విశేషాలు అతని మాటల్లోనే..
actor-sunny
నేను పుట్టి పెరిగిందంతా ఖమ్మంలోనే. నా అసలు పేరు అరుణ్. అంతా నన్ను ముద్దుగా సన్నీ అని పిలుస్తుంటారు. సన్నీ అనేది నా మొదటి బైక్. దాని నుంచే నా స్నేహితులు సన్నీ అని పిలువడం మొదలెట్టారు. ఆ పేరులో ఏదో వైబ్రేషన్ ఉంది. అమ్మ డాక్టర్. ఎక్కువగా గ్రామాల్లోనే సేవ చేస్తుంటారు. అమ్మలో నాకు నచ్చేది అదే. మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కడికి వళ్లైనా సేవ చేస్తుంటుంది. నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. నేనే ఇంట్లో చిన్నవాడిని. అల్లరైనా, అలుగుడైనా, ఆటలైనా అన్నీ నేనే. నన్ను చాలా గారాబంగా చూసుకునేవారు. దీంతో ఇంటర్ మూడేండ్లు, డిగ్రీ నాలుగేండ్లు చదవాల్సి వచ్చింది. ఇంటర్ సీఈసీలో మిగిలిన ఒక్క సబ్జెక్ట్ కోసం మామయ్య వాళ్ల ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి మరీ చదివిపించారు. పేరుకు హౌస్ అరెస్టే కానీ.. పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఇంటర్ పూర్తవ్వగానే ఖమ్మంలో ఉండనని హైదరాబాద్ వచ్చేశా. ఇక్కడే మంచి కాలేజ్‌లో బీకాంలో ఫారెన్ ట్రేడింగ్ పూర్తి చేశా. నా బెస్ట్ ఫ్రెండ్ సందీప్ ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. చిన్నప్పుడు తన పాకెట్ మనీ కూడా నాకే ఇచ్చాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ బెస్ట్ నాకు వాడు. తను మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. డిగ్రీ అయ్యాక సందీప్ నాకొక విషయం చెప్పాడు. ఆ మాటే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అరే సన్నీ.. నా కోసం ఐదు నెలలు ఏదైనా ఉద్యోగం చెయ్యి.

నీకు కావాల్సిన డబ్బులు నేనిస్తా. నీ శాలరీ నువ్వే ఉంచుకో. బట్ నాకు నువ్ రోజూ ఏం చేసేది రిపోర్ట్ చెయ్యాలి. ఇదే నా కోరిక. నా మాట. అన్నాడు. ఇదేదో బాగుంది కదా అని నేనూ ఓకే అన్న. ఎంబీఏ చేస్తూనే వాడి కోరిక మేరకు చానెల్ 4లో ప్రోగ్రామింగ్‌లో చేరాను. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడే నాకు జర్నలిజంపై ఆసక్తి పెరిగింది. ప్రతి రోజూ సందీప్‌కు నా రిపోర్ట్ అందించేవాడ్ని. ఉద్యోగ జీవితంలో ఆ ఐదునెలలు ఎలా గడిచాయో తెలియదు. అప్పటి వరకూ సందీప్ నా ఖర్చులన్నీ చూసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం మానెయ్యాలంటే నాకు భయమేసింది. తర్వాత ఓ ప్రముఖ ఛానెల్‌లో లైఫ్‌ైస్టెల్ రిపోర్టర్‌గా పనిచేశా. ఈ క్రమంలో తెలిసినవారి ద్వారా మా టీవీలో వీడియో జాకీ(వీజే) ఆడిషన్స్‌కు వెళ్లి కరెంట్ అఫైర్స్‌పై గలగల మాట్లాడేశా. వారికి నచ్చి నన్ను వీజేగా ఎంపిక చేసుకున్నారు. ఆ వారానికే ఇద్దరు సీనియర్లు వెళ్లిపోవడంతో ఎలాంటి శిక్షణ లేకుండానే, వీజేగా సంథింగ్ స్పెషల్ మొదటి ప్రోగ్రాం చేయించారు. మొదటి ప్రోగ్రాం సక్సెస్ అవ్వడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి రోజూ ప్రతి ప్రోగ్రాం కొత్తగా చెయ్యడానికి ప్రయత్నించేవాడిని.

డ్రామా ఆర్టిస్టుగా చేశా..

వీజేగా చేస్తూనే స్టేజీ డ్రామాస్ ఎక్కువగా చేశా. ప్రస్తుతం హాలీవుడ్ మూవీగా వచ్చిన అలాద్దీన్‌ను మేము ఆరేండ్ల క్రితమే డ్రామాగా చేశాం. అందులో నేను అలాద్దీన్ క్యారెక్ట్ చేశా. ఇందుకు అరబిందో ఫార్మసీ కీర్తిరెడ్డి గారు హెల్ప్ చేశారు. ఇప్పుడు జీ తెలుగులో విజయవంతంగా కొనసాగుతున్న కల్యాణ వైభోగమే సీరియల్‌లో హీరో క్యారెక్టర్ కోసం ఎంపికలు జరుగుతుంటే వెళ్లాను. అక్కడ చాలామంది సీనియర్స్ వచ్చారు. మొదటి ప్రయత్నంలోనే ఆ అదృష్టం నన్ను వరించింది. వీజేగా అనుభవం ఉన్నా.. యాక్టింగ్ వేరు. అన్ని హావభావాలూ పండించాలి. సీరియల్ ప్రసారం అవుతున్న మొదట్లో నా యాక్టింగ్‌పై విమర్శలు వచ్చాయి.

ప్రతిరోజూ అద్దంలో ప్రాక్టీస్..!

మొదట్లో నాకు ఈ రంగం కరెక్ట్ కాదేమో అనుకొని ఇంటికి వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. అప్పుడు ఓ డైరెక్టర్ నాపై నమ్మకం ఉంచాడు. ఓడిపోయిన చోటనే గెలిచి నిరూపించాలని ధైర్యం చెప్పాడు. అప్పటి నుంచి షూటింగులకు వెళుతూనే అద్దం ముందు కుస్తీ పట్టేవాడ్ని. ప్రతి ఎక్స్‌ప్రెషన్ పలు రకాలుగా ఇస్తూ నాలో ఉన్న నటుడ్ని అద్దం ముందు వెతుకున్నా. నా సీనియర్స్ కూడా ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పేవారు. మొత్తానికి నన్ను విమర్శించిన వారే నన్ను అభినందించారు. అభిమానిస్తున్నారు. నా ఫాలోవర్స్‌గా మారారు.

అదే ఏడాది (2017)లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దుబాయ్‌లో అందుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం. తర్వాత బెస్ట్ డెబ్యూ హీరో అవార్డు (2018), బెస్ట్ సీరియల్, బెస్ట్ జోడీ కేటగిరిలో రెండు అవార్డులు (కల్యాణ వైభోగమే) అందుకున్న. టీవీ9 నుంచి బెస్ట్ సీరియల్ అవార్డు అందుకున్నా. మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017, 2018కు అందుకున్నా. ప్రతిరోజూ నాకు మొదటి రోజే అన్నట్లు నటిస్తున్నా. సెట్‌లోకి వెళ్తే.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేస్తా. షూట్ అయిపోగానే నేను నేనుగా ఉంటా.

హీరో అవ్వాలని పారిపోయా!

నా టార్గెట్ బిగ్‌స్క్రీన్. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో అవ్వాలని కోరిక. ఈ క్రమంలో కొంతమంది సంప్రదిస్తున్నా.. మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నా. హీరో అనగానే నా చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలని కలలుకనే వాడిని. 9వ తరగతికి వచ్చేసరికి ఆ పిచ్చి బాగా ముదిరింది. అన్నయ్యవాళ్లు దాచుకున్న డబ్బులు రూ.2వేలు దొంగిలించా. ఆ తొందరలో హైదరాబాద్ ట్రైన్ ఎక్కబోయి, విజయవాడ ట్రైన్ ఎక్కేశాను. అక్కడ నన్ను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వివరాలు తెలుసుకొని మా అమ్మను పిలిపించి నన్ను అప్పగించారు. అదే కసి నన్ను ఇంతవరకూ నడిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి వరకూ వచ్చాను.

భవిష్యత్ కోసం బాగా కష్టపడాలి. బిజినెస్ కూడా చాలా ఇష్టం. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ రావాలి. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అంతా స్నేహపూరిత వాతావరణమే ఉంది. ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటూనే ఉంటాయి. నాకు బైక్ రైడింగ్ అంటే గతంలో ఇష్టం ఉండేది. ఓ ప్రమాదం వల్ల బైక్ జర్నీ వద్దనుకున్నా. ప్రస్తుతం కార్లు, జీపులపై ఇష్టం ఏర్పడింది. సంగీతం బాగా వింటాను. డాన్స్ కూడా బాగానే చేస్తాను. డాన్స్ జోడీ డాన్స్‌లో నా తోటి వారికి గట్టిపోటీ ఇస్తున్నా.
-డప్పు రవి

Mother-And-Friend

సన్నీ నా కల నెరవేర్చాడు

నాకు నటి అవ్వాలనే కోరిక ఉండేది. చిన్నప్పటి నుంచి బాబుమోహన్ గారితో కలిసి పలు నాటికలు వేసే దాన్ని. చెల్లెమ్మా నువ్ సినిమా వైపు రావాలి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. పెళ్లయ్యాక వృత్తిరీత్యా, కుటుంబానికే ప్రాధాన్యమిచ్చా. అయితే హీరో అవ్వాలని ఇంటి నుంచి పారిపోయిన నా సన్నీ.. ఇప్పుడు ఈ స్థాయి వరకూ వచ్చాడు. ఇది మాకు చాలా గొప్ప విషయం. నా అల్లరి కన్నా.. ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి. చేరుకుంటాడు కూడా. మాకు ఆ నమ్మకం ఉంది. ఓ కొడుకుగా నా కోరిక నెరవేర్చాడు. నాకదే సంతోషం. వాడిలో నన్ను నేను వెతుక్కుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ రా కన్నా.
- కళావతి, సన్నీ తల్లి

1746
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles