దివ్య ఖురాన్ సందేశం అద్భుత వెలుగుబాట!


Fri,May 31, 2019 01:18 AM

వేళా విశేషం
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిమ్‌లు ఉపవాసాలు పాటిస్తున్నారు. ఈ నెలలోనే పవిత్రగ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది. మానవాళికి మార్గదర్శకమైన ఈ గ్రంథాన్ని అల్లాహ్‌నే స్వయంగా అందించాడు. ఈ సందర్భంగా ఈ పవిత్ర గ్రంథం విశేషాలు చదువండి.
quran
-ఇటీవల అమెరికా ఎన్నికల్లో, మిచిగన్ నుంచి గెలుపొందిన డెమొక్రాట్ రాషిదా లాయిబ్ దివ్యఖురాన్‌పై ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆమె అమెరికా అధ్యక్షుల్లో ఒకరైన జఫర్సన్ వ్యక్తిగత దివ్యఖురాన్ కాపీ (క్రీ.శ.1734 కాలం నాటిది)పైనే ప్రమాణం చేస్తానన్నారు. ఆ ప్రతి కాంగ్రెస్ లైబ్రరీలో పదిలంగా ఉంది. ఆమె కోసం దానిని తెచ్చారు. ఈ అతిపాత ఖురాన్ ప్రతిపై ఆమె ప్రమాణం చేయడానికి కారణం, అమెరికా ఏర్పడినప్పటి నుంచీ ముస్లిములు ఆ దేశంలో భాగంగా ఉన్నారని చెప్పాలన్నదే ఆమె ఉద్దేశ్యం.

-బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ షార్జాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు ఆమెను భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మీ సందేశమేమిటని అడిగారు. అప్పుడామె దివ్యఖురాన్‌లోని సూరా అస్ అధ్యయాన్ని, దాని అనువాదాన్ని వినిపించారు. అంతకు ముందు కూడా రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పుడు కూడా దివ్యఖురాన్‌లోని అదే అంశాన్ని ఆమె వినిపించారు. ఈ అధ్యాయంలో ఏముందంటే, కాలం సాక్షిగా, నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహనబోధ చేసుకునే వారు తప్ప!. ఇందులో ప్రధానమైన ఉపదేశం సహనం, సత్యనిష్ఠ. ఇదొక ఉత్తమమైన, ఉదాత్తమైన సమాజాన్ని నిర్మించే గొప్ప ఆచరణల్లో ఒకటి.

దివ్యఖురాన్ ముస్లిమ్‌ల పరమ పవ్రితగ్రంథం. ఇది తమకే పరిమితమని ఏ ముస్లిమూ చెప్పడు. ఇది సమస్త మానవాళికి చెందిన గ్రంథం. చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ (స) ద్వారా అల్లాహ్ (దేవుడు) దీనిని మానవాళికి అందించాడు. ఇది ప్రవక్త మహమ్మద్ (స) రచన కానే కాదు. అల్లాహ్ అద్భుత వాక్కు. దేవుని ప్రబోధాన్నే ప్రవక్త ప్రజలకు వినిపించారు. నేటికి 1450 సంవత్సరాలకు పూర్వం చిట్టచివరి ప్రవక్తగా మహమ్మద్ (స) ను ఎన్నుకొన్న అల్లాహ్ ఆయన ద్వారా ఈ దివ్యగ్రంథాన్ని మానవాళికి అందించాడు. ఈ సుదీర్ఘ కాలంలో ఇందులోని ఒక్క అక్షరమైనా మార్పు చెందలేదు. కారణం, దివ్యఖురాన్ రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్‌నే తీసుకొన్నాడు కనుక. ఇక, ఈ జ్ఞాపిక (ఖురాన్), దానిని అవతరింప జేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము (దివ్యఖురాన్ 15:9) అని స్వయంగా అల్లాహ్‌నే సెలవిచ్చారు.

యావత్ మానవాళికీ మార్గదర్శకం

దివ్యఖురాన్ మనిషికి రుజుమార్గం ఏమిటో చూపిస్తుంది. జీవితం ఎలా గడపాలో తెలియజేస్తుంది. మార్గదర్శనం చేస్తుంది. ఇది కేవలం ముస్లిముల గ్రంథం కాదు. యావత్తు మానవాళినీ ఉద్దేశించి మాట్లాడుతుంది. దివ్యఖురాన్‌లో ఈ విషయాన్ని అల్లాహ్ స్వయంగా ఇలా తెలియజేశాడు. ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అల్లాహ్‌పట్ల భీతి కలవారికి ఇది మార్గదర్శకం (ద్యిఖురాన్ 2:2).

ఖురాన్ నేరుగా పాఠకుడితో మాట్లాడుతుంది. మధ్యవర్తులు, మరొకరు ఎవ్వరూ ఉండరు. ఈ గ్రంథం మనిషికి దేవునికి మధ్య సంబంధం వంటిది. మనషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అతని జీవిత లక్ష్యం ఏమిటి? పుట్టడం, సంపాదించడం, కాలాన్ని గడిపి చనిపోవడం. ఇంతేనా? ఈ జీవితానికి ఇంకే గమ్యమూ లేదా? ప్రజలంతా ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నట్టు? మనిషి మరణించిన తర్వాత ఏమవుతుంది?- ఇలాంటి అనేక తాత్విక సందేహాలకు దివ్యఖురాన్ జవాబిస్తుంది. అది కూడా అత్యంత స్పష్టంగా, సరళంగా, అయోమయాలు లేకుండా! మానవచరిత్ర నుంచి వాస్తవిక సంఘటనల ఆధారంగానే వీటిని ప్రబోధిస్తుంది. మనిషి జీవితం చాలా చిన్నదని, సాపేక్షికంగా అత్యంత అల్పమైందనీ అంటుంది. అసలు జీవితం పరలోకంలో ఉందని, అదే శాశ్వతమని, అందులో విజయం సాధించాలంటే దేవునిపట్ల భక్తి ప్రపత్తులతోపాటు పాపభీతితో చెడుకు దూరంగా ఉండాలని మార్గనిర్దేశనం చేసింది.

సర్వ ధర్మమే పునాదిగా..

సమస్త మానవధర్మమే పునాదిగా దివ్యఖురాన్ ప్రబోధాలు ఉంటాయి. ఇందుకు ఉదాహరణలు ఎన్నో. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధ్రువపరచటానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చెయ్యటానికి కూడా వచ్చాను (దివ్యఖురాన్ 3:50). ఇందులోని ముఖ్యమైన అంశం దేవుడు ఒక్కడే అని చెప్పడం. మరో రకంగా మనుషులంతా ఒక్కటే అనడమూను.

మానవులంతా ఒక్కటే అనే మాటను పలుమార్లు దివ్యఖురాన్ ప్రకటించింది. మనుషుల మధ్య ఎలాంటి హెచ్చుతగ్గులూ లేవని, అందరి దేవుడు ఒక్కడే అని స్పష్టం చేసింది. మానవులారా! మేము మిమ్మల్ని జాతులుగాను, తెగలుగాను చేశాం. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవారే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రులు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని (దివ్యఖురాన్ 49:13). దివ్యఖురాన్ గట్టిగా చెప్పిన మరోమాట సమాన న్యాయం. విశ్వసించిన ప్రజలారా! న్యాయధ్వజ వాహకులుగా నిలబడండి. అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు.

కనుక, మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనుక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి- మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు అని (దివ్యఖురాన్ 4:135). విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. (ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైంది (దివ్యఖురాన్ 58) అంటుంది దివ్యఖురాన్. ఈ బోధనలతో దివ్యఖురాన్ ఒక శాంతియుత, ప్రశాంత సమాజాన్ని, ఆరోగ్యకరమైన నాగరికతను సాధించవలసిందిగా ఉద్బోధిస్తుంది.

మీ వద్దకు అల్లాహ్ తరఫునుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం (దివ్యఖురాన్) కూడా. దాని ద్వారా అల్లాహ్ శాంతిపథాలను చూపుతాడు. వారిని చీకట్లనుండి వెలికి తీసి వెలుగువైపునకు పయనింపజేస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు దివ్యఖురాన్ (5:16). అలాగే, మతపరమైన ఉద్రిక్తతలు లేని ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ఈ పవిత్రగ్రంథం అభిలషిస్తుంది. మానవుల్లో సమానత్వం, న్యాయం, శాంతి వంటి సద్గుణాలతో కూడిన ఒక ఆదర్శవంతమైన, ఉత్తమ-ఉదాత్త జీవన విధానాన్నే దివ్యఖురాన్ అందించింది. ఆ బాటలో నడవడమే మనందరి తక్షణ కర్తవ్యం.

quran2

చదువుకే తొలి విలువ!

దివ్యఖురాన్‌లో ఏముంది? అంటే అందులో మనిషి జీవితం ఉంది. ఈ గ్రంథం మనిషి గురించి, మానవులు జీవించవలసిన పద్ధతి గురించి మాట్లాడుతుంది. ప్రజలకు సన్మార్గం చూపిస్తుంది. దివ్యఖురాన్ దశలవారీగా ప్రవక్త మహమ్మద్ (స) వద్దకు వచ్చింది. ఖురాన్ అంటే అర్థం చదివే పుస్తకం. ప్రవక్త మహమ్మద్ (స) వద్దకు వచ్చిన మొట్టమొదటి వాక్యం చదువు అనే పదంతోనే ప్రారంభమవుతుంది. సూరా అలఖ్ అధ్యాయంలోని ఈ వాక్యానికి అనువాదం: చదువు! సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో!!. ఈ వాక్యంతోనే దివ్యఖురాన్ మానవాళి వద్దకు రావడం ప్రారంభమైంది. మొదటి వాక్యమే మనిషికి చదువు ప్రాముఖ్యాన్ని చాటి చెప్పడం అద్భుతం. ఆ తర్వాత 23 సంవత్సరాల కాలంలో వివిధ దశలుగా ఈ గ్రంథాన్ని అల్లాహ్ మానవాళికి అందించాడు. ఇందులో మొత్తం 114 అధ్యాయాలుండగా, ఒక్కో అధ్యాయాన్ని సూరా అంటారు. కొన్ని సూరాలు చాలా పెద్దవైతే మరికొన్ని మరింత చిన్నవి.

అన్న మనసు మార్చిన చెల్లెలు!

ప్రజలపై దివ్యఖురాన్ ప్రభావం ఎలాంటిదో చెప్పడానికి ఈ కింది ఒక్క సంఘటన ఒక్కటి చాలు. ప్రవక్త మహమ్మద్ (స) మక్కా నగరంలో ఇస్లాం ప్రచారం చేస్తున్న ప్రారంభకాలంలో ఆయన్ను చాలామంది వ్యతిరేకించారు. వారంతా ఆయనపై ఆగ్రహంతో కత్తులు నూరేవారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా అలాంటి వారిలో ఒకరు. తాతముత్తాతల సంప్రదాయాలను, మతాన్ని, దేవీదేవతలను అందరినీ ప్రవక్త మహమ్మద్ (స) కాదంటున్నారని ఆయనకు కోపం. ఒకరోజు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరింపజేయాలని, ప్రవక్త మహమ్మద్ (స)పై దాడి చేయాలని హజ్రత్ ఉమర్ (రజి) చేత కరవాలం పట్టుకొని ఆగ్రహంగా ప్రవక్త నివాసం వైపు బయలుదేరారు.

దారిలో ఆయనకు ఓ మిత్రుడు కనిపించారు. హజ్రత్ ఉమర్ (రజి) వాలకం చూసి అనుమానించి ఆయన ఎక్కడికి అంత కోపంగా వెళుతున్నారని అడిగాడు. హజ్రత్ ఉమర్ (రజి) జవాబిస్తూ, ఈ రోజుతో ప్రవక్త మహమ్మద్ (స) సమస్య పూర్తిగా పరిష్కరించేస్తా అన్నారు. ఇది విన్న ఆ మిత్రుడు, ప్రవక్త మహమ్మద్ (స) సంగతి తర్వాత. ముందు మీ కుటుంబం విషయం చూడండి. మీ చెల్లెలు, బావ కూడా ఇస్లాం తీసుకొని ముస్లిములై పోయారు తెలుసా? అన్నారు. ఈ మాటలు వినగానే హజ్రత్ ఉమర్ (రజి) కోపంతో ఊగిపోతూ చెల్లెలి ఇంటికి వెళ్లారు.

అప్పుడు చెల్లెలు, బావ ఇంట్లో దివ్యఖురాన్ చదువుకుంటున్నారు. ఈయన రావడం చూసి గ్రంథపత్రాలు దాచేశారు. కాని, అప్పటికే అనుమానించిన ఉమర్ (రజి) వారిద్దరు పూర్వీకుల మతాన్ని వదిలి భ్రష్ఠులై పోయారని కోపంతో, వారిద్దరినీ నిర్దయగా కొట్టారు. ఆయనెంత కొట్టినా చెల్లెలు ఇస్లాం నుంచి వైదొలిగేది లేదన్నారు. రక్తం కారుతున్న చెల్లెలిని చూసి ఉమర్ (రజి) కాస్త శాంతించారు. సరే, మీరు చదువుతున్నదేమిటో నాకు చూపించండి అన్నారు. కాళ్లు చేతులు కడుక్కుని పరిశుభ్రంగా వస్తే ఇస్తానని చెల్లెలు చెప్పడంతో ఉమర్ (రజి) అలాగే వచ్చారు. సూరే తాహా అధ్యాయంలోని వాక్యాలు మేము ఈ ఖురాన్‌ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురిచేయడానికి మాత్రం కాదు. ఇది (దేవునికి) భయపడే ప్రతి వ్యక్తికీ ఒక జ్ఞాపిక. భూమినీ, ఎత్తయిన ఆకాశాలనూ సృష్టించిన వాని తరపునుండి ఇది అవతరించింది. ఈ వాక్యాలు చదివిన తర్వాత ఉమర్ (రజి) ఆలోచనలో పడ్డారు. వెంటనే ప్రవక్త మహమ్మద్ (స) వద్దకు వెళ్లి ఇస్లాం స్వీకరించారు.
-అబ్దుల్ వాహెద్

1201
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles