రీలొకేషన్ పరిశ్రమలో దూసుకెళ్తున్న ఆకాంక్ష భార్గవ


Mon,May 27, 2019 01:46 AM

మనం ఇల్లు మారుతూ సామాన్లు తరలించేసేటప్పుడు ఇంట్లోని అందమైన గాజు సీసా పగిలి పోయినా, ఫ్రిడ్జ్‌కి గీతలు పడినా, ఇంకా ఏవైనా వస్తువులు విరిగిపోయినా బాధ పడుతుంటాం. ఎందుకంటే ఒక కుటుంబానికో, కంపెనీకో స్థలం మారడమంటే అంత సులువైన విషయం కాదు. మెట్రో నగరాల్లో ఇల్లు మారడం ఓ మహాకార్యం. సామాన్లు సర్దుకోవడమంటేనే విసుగు. అందుకే మహా నగరాల్లో సామాన్లు సర్దిపెట్టి, కొత్తింటికి తరలించే కంపెనీలు బోలెడు వచ్చేశాయి. ఇంటి సామాన్లు ఇతర వస్తువులను అవసరమైన,అనువైన ప్రదేశాలకు తరలించడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ పీ.ఎం. రీలొకేషన్స్.
Aakanksha-Bhargava
రీలొకేషన్ ఇండస్ట్రీ కోసమే తాను పుట్టానని ఈ మహిళా పారిశ్రామికవేత్త చెబుతారు. కంపెనీలో అవసరమైన మార్పులు చేయడంలోనూ, రీలొకేషన్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలోనూ ముందున్నామంటున్న పీ.ఎం. రీలొకేషన్స్ సీఈవో ఆకాంక్షభార్గవ సక్సెస్‌మంత్ర.

అసంఘటిత రంగంలోనూ ఆశ్చర్యకరమైన ప్రగతి కనపరుస్తూ వ్యాపారాన్ని రూ.2 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు చేర్చడంతో పాటు కార్పొరేట్ క్లయింట్లను సైతం మెప్పిస్తున్నది ఆకాంక్ష. చిన్న వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టి, విజయాలను అందిపుచ్చుకుంటున్నది.

మా ప్రత్యేకత..

భారత్‌లో ఎక్కడైనా.. విదేశాలకైనా సామాన్లను జాగ్రత్తగా తరలించడంలో అగ్రశ్రేణి సంస్థ పి.ఎం.రీలొకేషన్స్. ఇంటి సామాన్లు ప్యాకింగ్ చేసి తరలించడం, కార్యాలయాలను తరలించడం, కళాఖండాలను తరలించడం.. వస్తువులను జాగ్రత్తగా సర్దిపెట్టడం, ఇళ్లు, పాఠశాలలను వెదికి పెట్టడం, ఇమిగ్రేషన్ సహా అన్ని సేవలూ ఇందులో భాగమవుతున్నాయి. భారత్‌లోని ప్రధాన నగరాలన్నింటితో పాటు విదేశాల్లోనూ పీ.ఎం.ఆర్ తన సేవలను అందిస్తున్నది. తమ సంస్థను కేవలం ప్యాకర్స్ అండ్ మూవర్స్‌గా మాత్రమే చూడకూడదంటారు ఆకాంక్ష. రీలొకేషన్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలను అందిస్తామని చెబుతున్నారు. తమ సేవలను సబ్ కాంట్రాక్ట్‌కు ఇవ్వలేదని, అన్ని పనులూ తమ సిబ్బందే చేయడం వల్ల అందరి మీదా తమకు పట్టు ఉంటుందనేది ఆమె ధీమా. శిక్షణ పొందిన సిబ్బందే తమ బలమని విశ్వసిస్తారు. షెల్, అమెరికన్ ఎంబసీ, అమెరికన్ స్కూల్, యాండాక్స్, హెచ్.పి, బ్రిటానియా, సాప్, బాష్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, నోకియా, సీమన్స్, బార్ల్కేస్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్జీ వంటి అగ్రశేణి సంస్థలు వీరి సేవలను పొందిన సంస్థల్లో ఉన్నాయి.

వారసత్వాన్ని కొనసాగిస్తూ

ఆకాంక్ష ఎంబీఏ చదివారు. ఎస్పీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పట్టాపొందారు. 21 ఏండ్ల వయసులోనే ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటికే ఆమె కుటుంబం రీలొకేషన్ రంగంలో ఉంది. 2007లో కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక్కో నగరంలో ఆరు నెలలు గడిపారు. ఒక చోట వ్యాపారం వృద్ధి చెందిన తర్వాత మరో నగరానికి వెళ్లిపోయారు. ఆమె చేరినప్పుడు కంపెనీ ఉద్యోగుల సంఖ్య నలభై. ఇప్పుడు 370 పైనే. అందులో 130 మందివి వైట్‌కాలర్ జాబ్స్. వాళ్లు కొనుగోళ్లు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్స్, కస్టమర్ కేర్ చూసుకుంటారు. మిగతా 240 మంది ఇతర పనులు చూసే టాస్క్‌ఫోర్స్ సభ్యులు. ఐదేళ్ల వ్యవధిలో ఈ కంపెనీ రెండు కోట్ల నుంచి 30 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. పీఎంఆర్ సేవలు పొందాలంటే ఇతర కంపెనీలకు చెల్లించే సొమ్ము కంటే మరో యాభై శాతం అధికంగా చెల్లించాల్సిందే. ఇది అంతర్జాతీయ రేట్లతో సమానం. అయితే నాణ్యమైన సేవలు అందించడంతో వినియోగదారులు పిఎంఆర్ వైపే మొగ్గుచూపుతున్నారు. సమీప భవిష్యత్తులో మరో పది పదిహేను కోట్ల రూపాయల నిధులు సమీకరించుకునేందుకు పీఎంఆర్ ప్రయత్నిస్తున్నది.
Aakanksha

ఉపాధి అవకావాలు ఎక్కువే..

రీలొకేషన్ పరిశ్రమ ఇంకా అసంఘటితంగానే ఉందనేది ఆకాంక్ష భావన. సామాన్లను అడ్డదిడ్డంగా సర్ది.. టెంపోలో ఎక్కించి.. చెప్పిన చోట దించేస్తే సరిపోతుందనేది చాలామంది ఆలోచన. పరిశ్రమలోని సున్నితత్వం ఎవరికీ అర్థం కాలేదని.. ఇక్కడ ఉద్యోగులకు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయని గుర్తించలేకపోతున్నారని ఆకాంక్ష అంచనా వేయగలిగారు. ఒకరిద్దరు వ్యక్తులు, అసంఘటిత రంగంలోని చిన్న పరిశ్రమలు రావడం వల్లే రీలొకేషన్ పై పూర్తి అవగాహన లేకుండా పోయిందని ఆమె చెబుతున్నారు. దీన్నొక రవాణా పరిశ్రమగానూ.. చదువులేని వాళ్లు చేసే పనిగానూ చూస్తున్నారని తన ఆవేదన.

రీలొకేషన్ పరిశ్రమలో ఎన్నో అవకాశాలున్నాయి. డిమాండ్ కంటే సప్లయ్ తక్కువగా ఉంది. ఈ రంగంలోని పెద్ద సంస్థలు ఇంకా జనబాహుళ్యంలో గుర్తింపు పొందాల్సి ఉంది. వినియోగదారుడికి ఎలాంటి భయం, విసుగు లేకుండా సామాన్లను జాగ్రత్తగా గమ్యస్థానం చేరుస్తామనే ధీమా కల్పించాలి. రీలొకేషన్లో అన్ని అవసరాలనూ తీర్చే ఒక్క కంపెనీ కూడా దేశంలో లేదు. అందుకే పీఎంఆర్ ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా అవతరించింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులకు తెలిసింతగా మనదేశంలో ఉన్న వారికి దీని గురించి అర్థం కావడం లేదు అని ఆకాంక్ష భార్గవ అంటారు.
Banner-Picture

తండ్రే స్ఫూర్తి

తండ్రే తనకు స్ఫూర్తి అని ఆకాంక్ష చెబుతున్నారు. తండ్రిగానే కాకుండా, గురువుగా వ్యాపారంలో మార్గదర్శిగా నిలిచారని గుర్తు చేసుకుంటారు. పైగా తన సమర్థతపై నమ్మకమున్న వ్యక్తిగా ఆయనను గౌరవిస్తానని ఆమె అంటున్నారు. పీఎంఆర్ సేవల్లో మన తన భేదముండదు. రెండు బెడ్ రూముల ఇంటి సామాన్లు తరలించాలన్నా, ఐదు బెడ్‌రూమ్‌ల ఇంటి సామాన్లు తరలించాలన్నా సేవల నాణ్యత ఒకే రకంగా ఉంటుంది. పెద్ద బ్రాండ్ల నుంచి వచ్చిన ఉద్యోగుల వల్ల తమకు ప్రయోజనం కలగలేదని.. తమ దగ్గర శిక్షణ పొందిన వారే బాగా పనిచేశారని ఆమె తన అనుభవాలను నెమరువేసుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో కార్యాలయాలు ప్రారంభించేందుకు పీఎంఆర్ సిద్ధమవుతున్నది.

మహిళా పారిశ్రామిక వేత్తగా..

ఇరవై ఒక్క ఏండ్ల వయస్సులో పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు పురుషాధిక్య సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆకాంక్ష ఆందోళన చెందిన మాట వాస్తవమట. అకుంఠిత దీక్షతో కఠోర శ్రమతో ఆమె అన్నింటినీ అధిగమించారు. ఆడవారు పనికిరారనుకున్న చోటే ఆమె ఏకైక మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. కార్మికులతో మాట్లాడటం, ప్యాకింగ్ చేయించడం, ప్రీమియం క్లయింట్స్ దగ్గరకు వెళ్లడం వంటి వాటన్నింటినీ చేసి చూపించారు. యూనియన్లతో చర్చలు, కోర్టు కేసులు, రాజకీయ ఒత్తిడిని కూడా అధిగమించారు. ప్రతీ అంశంలోనూ ఆమె ఆదర్శంగా నిలిచారు. పారిశ్రామికవేత్తగా స్ధిరపడిపోవడం ఎంతో సంతృప్తి నిస్తున్నదని ఆకాంక్ష అంటున్నారు. క్లయింట్ సంతృప్తి చెందినప్పుడల్లా పీఎంఆర్ బృందం ఆనందంతో ఉప్పొంగిపోతుందట. నాణ్యమైన సేవలు అందించడం తనకు గర్వంగా ఉందని ఆకాంక్ష చెబుతుంటారు.

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles