దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటున్న ఊర్వశీయాదవ్


Mon,May 20, 2019 02:11 AM

మంచి ఉద్యోగం, బాగా సంపాదించిన భర్త, ఉండడానికి ఖరీదైన ఇల్లు, రెండు పెద్ద కార్లు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి, ఇవన్నీ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు..? చేసేదేముందీ, హాయిగా కూర్చుని తినడం తప్ప? చాలామంది దాదాపు అలానే చేస్తారు. మరీ ఏదైనా అనుకోని సమస్య వచ్చి ఉన్న ఆస్తి తరిగిపోతే? ఓడలు బళ్లు కావొచ్చు, బళ్లు ఓడలు కావొచ్చు. జీవితమంటేనే చిత్తుబొత్తులాంటిది ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. గొప్పింటి ఇల్లాలుకు ఇదే అనుమానం వచ్చింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నట్లు కూర్చుండి తిన్నా తరగని ఆస్తులున్నా రోడ్డు పక్కన టిఫిన్ బండిని నడిపింది. ఇప్పుడు ఏకంగా రెస్టారెంట్‌ను తెరిచి భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నది. తను చేస్తున్న పని ఎంతో సంతృప్తినిస్తుందంటున్న గుర్గావ్‌కు చెందిన ఊర్వశీయాదవ్ సక్సెస్‌మంత్ర.
Urvashi
ఊర్వశీయాదవ్‌ది హర్యానాలోని గుర్గావ్. ఆమె స్కూల్ టీచర్‌గా పనిచేసేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త అమిత్‌యాదవ్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఊర్వశి మామ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఊర్వశికి గుర్గావ్ లో రూ.3 కోట్ల విలువ చేసే పెద్ద బంగళా ఉంది.

కట్ చేస్తే..

గుర్గావ్‌లోని సెక్డార్ 14 రోడ్డుమీద టిఫిన్ బండి నడుపుతున్నారు ఊర్వశి. అక్కడి ఫేమస్ ఫుడ్ ఛోలే కుల్చే. ఆమె బండిలో దొరుకుతుంది. ఆమె ఈ వ్యాపారం మొదలుపెట్టిన తక్కువ రోజుల్లోనే ఆ ప్రాంతంలో చాలా పేరు సంపాదించారు. అందుకు కారణం ఆమె అమ్ముతున్న ఫుడ్ రుచి మాత్రమే కాదు, ఆమె నేపథ్యం కూడా. ఊర్వశికి మూడుకోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఉంది. రెండు కార్లున్నాయి. అయినా ఈ పని ఎందుకు చేస్తుంది?

అసలేం జరిగిందంటే?

ఊర్వశి భర్త అమిత్ యాదవ్ ఒక ప్రముఖ కన్‌స్ట్రక్చన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండేవారు. ఊర్వశి మామగారు భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ మధ్య అమిత్ తన ఇంట్లోనే పడిపోయాడు. అతనికి అంతకుముందు 2010లో క్రికెట్ ఆడుతుండగా కుడికాలు విరిగింది. అప్పుడు ఒకసారి ఆపరేషన్ అయ్యి రెండునెలల తరువాత కోలుకున్నాడు. ఇప్పటి దెబ్బతో డాక్టర్లు ఆ తర్వాత అతనికి హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అతను తిరిగి నడిచే అవకాశం తక్కువని కూడా చెప్పారు. అయినప్పటికీ వారికి ఏం పర్వాలేదు. డబ్బున్న వారే. కూర్చుని కూడా తినవచ్చు.

ఈ అనుకోని దెబ్బకు బాధ కలిగినా తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే భయం ఊర్వశిని మరింతగా బాధించింది. దాంతో తన సంపాదన పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఊర్వశి, భర్త రెండోసారి గాయపడిన తరువాత రోజు నుండి ఉద్యోగానికి వెళ్లడం మానేశారు. పదిహేను రోజుల తరువాత ఈ షాపుని తెరిచారు. ఇప్పటికిప్పుడు తమ కుటుంబానికి వచ్చిన ఆర్థిక ఇబ్బందులేమీ లేకపోయినా మరీ చితికిపోయే వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఏముంది? ముందుగానే మన ప్రయత్నాలు మనం చేయవచ్చు కదా! అంటారామె. అందుకే టీచర్ జాబ్ కంటే టిఫిన్ బండి ద్వారా ఎక్కువగా సంపాదించవచ్చనే ఆలోచనతో ఈ అడుగు వేశారు. తనకి వంట చేయడం చాలా ఇష్టమని కూడా ఊర్వశి అంటున్నారు.

ఎక్కడా లోటు రాకూడదని..

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇద్దరు పిల్లలను స్కూలు మార్చడం తనకు ఇష్టం లేదంటారు ఊర్వశి. భర్త సంపాదన ఆగిపోయిన తరువాత కూడా అదే జీవనశైలిని కొనసాగిస్తున్నారామె. గ్రాడ్యుయేషన్ చేసిన ఊర్వశి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. మొదట ఆమె తన ఆలోచనని చెప్పినపుడు ఇంట్లోవారు ఒప్పుకోలేదు. అయితే ఆమె తన పట్టుని విడువలేదు. ఊర్వశి స్టాల్ గురించి ఫేస్‌బుక్‌లో వచ్చాక ఆమె వ్యాపారం మరింతగా పెరిగింది. ఊర్వశి ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు స్టాల్‌ని నడిపేవారు. రోజుకి 2,500 నుండి మూడువేల రూపాయల వరకు సంపాదించేవారు. మొదట కొంత ఇబ్బంది అనిపించినా తనకు సంతృప్తిని కలిగిస్తున్నదని చెబుతున్నారామె. కానీ దాంతోనే స్థిరపడిపోనని, భవిష్యత్తులో పెద్ద రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తానని ఊర్వశీ యాదవ్ ధీమాగా చెప్పారా రోజు.

ఇప్పుడంతా ఒకే...

ఖరీదైన ఇల్లు, రెండు పెద్ద కార్లు, ఎంతో ఆస్తి ఉన్నా సొంత కాళ్లపై నిలబడాలని ఊర్వశి తాపత్రయ పడుతున్నది. భర్త అమిత్‌కు ఇప్పుడంతా సెట్ అయ్యింది. అతను ఇప్పుడు నిక్షేపంగా ఉన్నాడు. మళ్లీ జాబ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ఆమె మాత్రం రెస్టారెంట్ బిజినెస్‌లో ముందుకే వెళ్తానని అంటున్నది. ఏమో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు కదా, అందుకని ఆమె ఆ వ్యాపారంలో కంటిన్యూ అవుతున్నది. ప్రతి ఒక్కరు ఇలా ఊర్వశిని ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా పెద్దగా ఇబ్బంది పడాల్సి ఉండదు కదా..!
Urvashi1

ఇంతింతై...

ఊర్వశి అనుకున్నట్లే కేవలం బండి పెట్టి అంతటితో ఆగలేదు. టిఫిన్ బండిని పెట్టి ఆరంభంలో ఆమె నెలకు రూ.3 వేల దాకా సంపాదించేది. రాను రాను ఆ బండి వద్ద టిఫిన్స్ తినే వారు ఎక్కువైపోయారు. దీంతో వ్యాపారం కూడా వృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఊర్వశి ఆ డబ్బుతో ఏకంగా ఓ రెస్టారెంట్ పెట్టింది. దాని పేరు ఊర్వశి ఫుడ్ జాయింట్. ఇప్పుడు ఆ రెస్టారెంట్ కూడా అక్కడ పాపులర్ అయింది. దీంతో ఆ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు పెరిగిపోయారు. ఈ క్రమంలో త్వరలో రెస్టారెంట్‌ను మరింత విస్తరిస్తానని ఆమె చెబుతున్నది. వీలుంటే మరో రెస్టారెంటును కూడా పెడతాను అంటున్నది.

నవ్వుకున్నారు

ఊర్వశీ యాదవ్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి టిఫిన్ బండి నడిపితే ఇదంతా చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే అంతటి ఆస్తి ఉండి కూడా, పనిచేయాల్సిన అవసరం లేకున్నా ఆమె ఎందుకిలా చేస్తుందని అందరూ చెవులు కొరుక్కున్నారు. కోట్ల రూపాయల ఆస్తులుండగా, ఆమెకు ఇదేం కర్మ అని ఎగతాళి చేసినవారు ఉన్నారు. హాయిగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చొక ఇదేం పని వెక్కిరించినవారూ ఉన్నారు. కానీ ఊర్వశీ యాదవ్ ఇదేం పట్టించుకోలేదు. అంతేకాదు ఇప్పుడు మాకు తిండికి, బట్టకు ఎలాంటి లోటు లేదు, కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్న చందంగా భవిష్యత్తులో తమ ఆస్తి అంతా పోతే ఏం చేయాలని ఆలోచించానని, అప్పుడు ఎలాగూ ఈ స్థితి తప్పదు కదా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా, అని బదులిస్తున్నది.

606
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles