అందుకే చేనేత


Sun,May 19, 2019 01:44 AM

నాగచైతన్యతో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా.. వ్యక్తిగతంగా కలిసొచ్చింది.. చైతూయే నా అదృష్టం.. అక్కినేని కుటుంబం నుంచి ధైర్యం, ఆత్మవిశ్వాసం, భద్రతా లభించాయి. ఈ సంతోషం, నమ్మకమే వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకోవడానికి సవాళ్లను స్వీకరించడానికి, రిస్క్‌లను తీసుకునే శక్తిని ఇచ్చింది అని ఫుల్ ఎనర్జీతో చెబుతున్నది అందాలభామ సమంత.. నాగచైతన్యతో పెండ్లి తర్వాత విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సమంత వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో విజయపథంలో
దూసుకెళుతున్నది.. ఈ సందర్భంగా అక్కినేని సమంతతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.

Samantha

సమంత విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది? ఈ సక్సెస్‌లను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

-అవునా.. (నవ్వుతూ). నా పని నేను నిజాయితీగా చేస్తున్నాను.. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలతో వెళ్తున్నాను. అందుకే ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. నా విజయాల వెనుక సదరు చిత్రాల యూనిట్ కృషి ఎంతో వుంది. ముఖ్యంగా ఈ విషయంలో నా దర్శకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి..

ఇటీవల మీ భర్తతో నటించినమజిలీ సక్సెస్ ఎలాంటి కిక్ నిచ్చింది..?

-మజిలీ చిత్ర విజయం నా కెరీర్‌లో స్పెషల్. ఆ చిత్రం విడుదల రోజు ఉదయం రెండున్నరకే నిద్రలేచాను. ఇంట్లోనే గంటన్నర పాటు తిరుగుతూ సినిమా విజయవంతం కావాలని ప్రార్థిస్తూనే ఉన్నాను. సినిమా తొలి రిపోర్ట్ రాగానే అరగంట పాటు ఏడ్చాను.

అంతా భావోద్వేగానికి లోనుకావడానికి కారణం ఏమిటి?

-నాగచైతన్య కెరీర్‌కు ఇది కీలకమైన సినిమా. సినిమా ఫలితంపైనే నటుడి జీవితం ఆధారపడి ఉంటుంది. మజిలీ ఫలితం మాకో లైఫ్ అండ్ డెత్ సిట్చువేషన్‌లా అనిపించింది. సినిమా ఆడకపోతే చైతూకు ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మనసుపెట్టి ఈ సినిమా కోసం పనిచేశాను. సినిమాకు వస్తున్న స్పందనతో ఆ ఒత్తిడి మొత్తం దూరమైంది. ఆనందంతో మాటలు రావడం లేదు. నాగచైతన్యను చూస్తుంటే గర్వంగా ఉంది. ఏ మాయచేసావే తర్వాత మా ఇద్దరి కెరీర్‌లో గొప్ప సినిమా ఇది.

చైతూతో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా చాలా కలిసి వచ్చినట్లున్నది. మంచి పాత్రలు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు?

-చైతూ నా లక్‌ఫ్యాక్టర్ అనుకుంటున్నాను (నవ్వుతూ). పెళ్లి తర్వాత నేను చేసిన సినిమాలన్నీ ప్రశంసలు దక్కించుకున్నాయి. సినిమాల పరంగా తీసుకున్న రిస్క్‌లన్నీ వర్కవుట్ కావడం సంతోషంగా ఉంది.

సినిమాల ఎంపికలో చైతన్య ఏమైనా సలహాలు ఇస్తుంటారా?

-సినిమాలకు సంబంధించిన ప్రస్తావన మా మధ్య వస్తుంటుంది. నేను చేసే సినిమాల గురించి చైతూతో చర్చిస్తుంటాను. అంతేగానీ చైతూ సలహాలు ఇవ్వడు.

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చైతన్యతో సినిమా చేయడం ఎలా అనిపించింది. ఏమాయ చేసావే సమయంతో పోలిస్తే మజిలీలోని చైతన్యలో మీరు గమనించిన మార్పులేమిటి?

-నటుడిగా ఏ మాయ చేసావే తో పోలిస్తే పది, ఇరవై రెట్లు పరిణతి వచ్చింది. చైతూ కెరీర్‌లోనే మజిలీ మంచి సినిమాగా నిలుస్తుంది. కెరీర్‌లో ఉత్తమ నటనను కనబరిచారు. విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.
Samantha2

పెండ్లి తర్వాత సినిమాలు ఆపేస్తే కెరీర్ ముగిసిపోతుందనే భయంతోనే నటిస్తున్నారా? నటన పట్ల ఆసక్తితో సినిమాల్ని కొనసాగిస్తున్నారా?

-సినిమానే నా జీవితం. నాకు లైఫ్ ఇచ్చింది ఇదే. సినిమాల పరంగా నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో గౌరవంతో తీసుకుంటాను. పేరు, డబ్బు ఏమీ లేని నాకు సినిమానే అన్ని ప్రసాదించింది. ఆ ఆసక్తితోనే సినిమాలు చేస్తున్నాను. సినిమాలకు దూరం కాను. మంచి పాత్రలు, కథల్లో భాగమవుతూనే ఉంటాను.

వెండితెరపై కాకుండా నిజజీవితంలో మీ అనుబంధం ఎలా ఉంటుంది. షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పిన తర్వాత కూడా సినిమాల గురించి మాట్లాడుకుంటారా?

-అందరూ భార్యాభర్తల్లానే సాధారణంగానే ఉంటాం. ప్రత్యేకత అంటూ ఉండదు. సింపుల్‌గా ఉండడమే ఇష్టం. చిన్న చిన్న విషయాల్లోనే నేను ఆనందాన్ని ఎక్కువగా వెతుక్కుంటాను.

పెళ్లి తర్వాత మీలో ఏమైనా మార్పులు వచ్చాయని అనుకుంటున్నారా? చైతూ కోసం మీరు మార్చుకున్న అంశం ఏదైనా ఉందా? అతడి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి?

-పెళ్లి తర్వాతే జీవితంలో స్థిరత్వం వచ్చిన భావన కలుగుతున్నది. నిలకడతత్వాన్ని చైతన్య నుంచే నేర్చుకున్నాను. చైతూ ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. అతి కోపం, అతి సంతోషం అతడిలో ఎప్పుడూ చూడలేదు. దేన్నయిన్నా ఒకేలా స్వీకరిస్తారు.

చైతూ మీ నుండి ఏం నేర్చుకున్నారు?

-నాలాగే చైతూలో నిరాడంబరత్వం ఎక్కువ. అది నా నుంచే నేర్చుకున్నారు.

సినిమా కాకుండా మీరు ఎక్కువ ఎంజాయ్ చేసే అంశమేది?

-ఫ్యామిలీ టైమ్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. ఇంట్లోనే డిన్నర్ చేస్తాం. పెంపుడుకుక్కతో ఆడుకుంటాం. ఒత్తిడి నుంచి దూరం కావడానికి కుటుంబంతో గడిపే సమయం థెరపీగా ఉపయోగపడుతుంది.

ప్రేమలో ఉన్నప్పటితో పోలిస్తే పెండ్లి తర్వాత ఉన్న అనుబంధంలో మార్పులు కనిపిస్తుంటాయి. కానీ పెండ్లి తర్వాత మీ మధ్య ఉన్న ప్రేమ రోజురోజుకు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సీక్రెట్ ఏమిటి?

-ఒకరిపట్ల మరొకరికి గౌరవభావం ఉంటుంది. చైతూ ఆలోచనలకు, అభిప్రాయాలకు నేను విలువనిస్తాను. అలా ఆలోచించినప్పుడే ఏ బంధమైనా చిరకాలం నిలిచిపోతుంది.

వారసుడి గురించి ఆలోచిస్తున్నారా?

-ఇంకా లేదు (నవ్వుతూ)
Samantha1

మీ వస్త్రధారణ కొత్తగా ఉంటుంది. మీరు ఎక్కువగా చేనేత వస్ర్తాలకు ప్రాధాన్యమిస్తుంటారెందుకని? తెలంగాణ చేనేత వస్ర్తాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి కారణం ఏమిటి?

-అద్ధకంతో ముడిపడిన అందమైన కళ చేనేత పరిశ్రమ. యంత్రాలతో కాకుండా మనుషుల శ్రమ నుంచి చేనేత వస్ర్తాలు తయారవుతుంటాయి. ఈ రంగంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడిజీవిస్తున్నాయి. తమ కష్టాన్నంతా ధారపోసి వస్ర్తాలను చేస్తుంటారు. సినిమాల కోసం ప్రతి రోజు అనేక దుస్తులను ఉపయోగిస్తుంటాను. అలాంటప్పుడు చేనేతను ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకే చేనేత ఎక్కువగా ధరిస్తుంటాను.

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారా?

-ప్రత్యూష ఆర్గనైజేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్ని చేపడుతున్నాను.

సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల తొందరగా స్పందిస్తుంటారు?ఎందుకలా?

- మహిళల పట్ల జరిగే అన్యాయాలపై నా అభిప్రాయాల్ని వెల్లడించడానికి ముందుంటాను. మహిళలంతా ఐకమత్యంగా ఉంటూ ధైర్యంగా సమస్యలపై పోరాడాల్సిన తరుణమిది. ముఖ్యంగా సమానత్వంపై అందరూ పోరాడాలన్నదే నా అభిమతం.

ప్రస్తుతం కథానాయికల ప్రాధాన్యం పెరిగింది. సమాజంలో మహిళల పట్ల నెలకొన్న వివక్ష మారుతున్నా ఇంకా ఆడపిల్ల పుట్టిందంటే భయపడుతున్నారు. ఆ ధోరణి మారుతుందనుకుంటున్నారా?

-తప్పకుండా మార్పు వస్తుంది. మా కుటుంబంలో అమ్మాయినైనా నేను తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తూ వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నాను. ఆడపిల్లనని నన్ను మా అమ్మానాన్నలు వద్దనుకోలేదు. ఈ మధ్యకాలంలో మహిళలంతా అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారు. ఆధునిక యుగంలో అమ్మాయిలు వద్దు అంటూ అనడం సరికాదు. పాతకాల ఆలోచనల్ని విడనాడితే బాగుంటుంది.

మహిళా సాధికారత అంశంతో సినిమాలు చేసే ఆలోచన ఉందా?

-అలాంటి కథలతో నా దగ్గరకు ఎవరూ రాలేదు. సినిమా అనేది వినోదసాధనంగా ఆలోచనను రేకెత్తించేదిగా ఉండాలి. హీరోలతో సమానమైన ప్రాధాన్యం కథానాయికలకు ఉండాలనే కోరుకుంటాను.

రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారా?

-రాజకీయాల పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు.

పెళ్లితో సినిమా ఎంపికలో మీ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?ఆచితూచి సినిమాల్ని ఎంచుకోవడానికి కారణమేమిటి?

పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కంఫర్ట్‌వచ్చింది. అక్కినేని కుటుంబం నుంచి ధైర్యం, ఆత్మవిశ్వాసం, భద్రతా లభించాయి. ఈ సంతోషం, నమ్మకమే వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకోవడానికి సవాళ్లను స్వీకరించడానికి, రిస్క్‌లను తీసుకునే శక్తిని ఇచ్చింది.

చైతూ పరిచయం కాకముందు మీ జీవితం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది?

చైతూ నా జీవితంలోకి వచ్చాకా భద్రతాభావం, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత అన్ని వచ్చాయి.

- సినిమా డెస్క్
- సిఎం. ప్రవీణ్

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles