వీకెండ్ వ్యవసాయం


Sun,May 19, 2019 01:12 AM

మహర్షి సినిమా వచ్చాక.. చాలామంది వీకెండ్ అగ్రికల్చర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీకెండ్ అగ్రికల్చర్ టాపిక్ ట్రెండీగా ఉంది. వీకెండ్ వచ్చిందంటే పార్టీలకో, సినిమాలకో, విహారయాత్రలకో బయలుదేరే యువకులు, ఉద్యోగులు.. తాజాగా పొలాల బాట పడుతున్నారు. రూపాయి ఆశించకుండా రైతన్నకు చేతనైన పని చేసిపెడుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో ట్రెండ్‌లు, చాలెంజ్‌లు వచ్చినా.. రైతన్నలకు ఉపయోగపడే ఈ కొత్త ట్రెండ్ గురించి ఈ వారం సింగిడి కథనం.
agriculture-harish
సంతోష్ కుమార్, సందీప్ కుమార్ ఓ కార్పొరేట్ కంపెనీలో ఉన్నత ఉద్యోగులు. వీకెండ్ రాగానే మహానగరం నుంచి పల్లెబాట పట్టారు. కారులో ప్రయాణిస్తూ.. నగర శివారులోని ఓ గ్రామంలో ఆగారు. రోడ్డుపక్కనే పొలానికి నీళ్లు పెడుతున్న రైతన్నతో మాటామాట కలిపారు. ఆ రైతుతో మాట్లాడి ఇద్దరూ ఏవేం పనులు చెయ్యాలో నిర్ణయించుకున్నారు. తమకు అప్పజెప్పిన పనిని చాలా సంతోషంగా చేశారు. ఎండను సైతం లెక్కచెయ్యకుండా పలుగూ, పార పట్టి చెమట చిందించారు. వెంట తెచ్చుకున్న ఆహారాన్ని ఆ రైతన్నకు పెట్టి.. అతను తెచ్చుకున్న ఆహారాన్ని ఇద్దరూ కలిసి తిన్నారు. పని మొత్తం పూర్తయ్యాక దగ్గర్లోని మోటారు వద్ద స్నానం చేశారు. చివరిగా రైతన్నతో ఓ సెల్ఫీ తీసుకొని వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. తమ శాలరీలోంచి కొంత డబ్బును బలవంతంగానే రైతన్న చేతుల్లో పెట్టి కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

AGRi2
ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. వీకెండ్ వస్తుందంటే ఎవరి ప్లాన్లలో వాళ్లు రెడీగా ఉండే రోజులు పోయాయ్. వచ్చే వీకెండ్‌కు ఏ రైతు దగ్గరకు వెళ్లాలో, ఎక్కడ వ్యవసాయం చెయ్యాలో మూడ్రోజులు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు కార్పొరేట్ ఉద్యోగులు. కొందరు మహర్షి సినిమా చూసి పొలాల బాట పడుతుంటే, ఎప్పటి నుంచో పలువురు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మొత్తానికి వీకెండ్ వచ్చిందంటే పొలానికి పోదాం. రైతుకి సాయం చేసొద్దాం అనే మాటలు సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. శని, ఆదివారాలు పొలాల్లో రైతులతో కనిపించి వీకెండ్ అగ్రికల్చర్‌కు ప్రాణం పోస్తున్నారు.

AGRI

వీకెండ్ అగ్రికల్చర్‌లో ఏం చేస్తారంటే?

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచానికి వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తున్నారు. ఈ రెండు రోజులు చాలామంది రెస్ట్ తీసుకోవడానికో, ఎంజాయ్ చెయ్యడానికో కేటాయిస్తారు. అయితే ఈ వీకెండ్ అగ్రికల్చర్ అనే విధానం ఆ రెండు రోజులు ఊళ్లకు పోదామని చెప్తున్నది. ఊరికే పోవడం కాదు రైతులకు సాయం చెయ్యాలి. ఏదో.. పొలాలకు పోయి సెల్ఫీ తీసుకొని, వీకెండ్ అగ్రికల్చర్ అని ఫొటో పెట్టడం కూడా కాదు. రైతులతో మాట్లాడి, వారికి ఉపయోగపడే పనిని పూర్తి చెయ్యడం. అది ఏ పనైనా కావొచ్చు. సిగ్గుపడకుండా సంతోషంగా చేయ్యడం ఈ వీకెండ్ అగ్రికల్చర్ లక్ష్యం. ఇలా తాము చేస్తున్న పనిని సోషల్ మీడియాలో #Weekend Agriculture, #WeekendFarming పేరుతో పోస్టు చేస్తున్నారు ఉద్యోగులు. వీరు చేస్తున్న పనిని చూసి.. ఇంకొందరు స్ఫూర్తి పొందుతున్నారు. వారు కూడా వీకెండ్స్‌లో పొలాల బాట పడుతున్నారు.

paddy

నవల ఆధారంగా..

వీకెండ్ వ్యవసాయం అనే ఆలోచన ఓ నవల ఆధారంగా హరీష్ శ్రీనివాసన్‌కు వచ్చింది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన మూండ్రామ్ ఉలగపోర్ (మూడో ప్రపంచ యుద్ధం) అనే నవల చదివాడు హరీష్. రైతుల కష్టాల గురించి చెప్తూ ఆ నవల నడుస్తుంది. అది చదివిన తర్వాత మన రైతులు అన్ని కష్టాలు పడుతున్నారా? అని ఆలోచనలో పడ్డాడు హరీష్. అప్పుడే వీకెండ్ అగ్రికల్చర్‌ను మొదలుపెట్టాడు. ఇప్పుడు మనదగ్గర మహర్షి సినిమాలో రైతుల కష్టాలు చూసి, అందులోనే చూపించిన వీకెండ్ అగ్రికల్చర్ అనే ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నారు మనవాళ్లు. పుస్తకం, సినిమా సమాజాన్ని ఏదో ఒక సందర్భంలో ఆలోచింపజేస్తాయనడానికి ఇవే నిదర్శనం.

Amith-Sajane

ఇదొక మంచి ప్రయత్నం

వీకెండ్‌లో అగ్రికల్చర్ గురించి స్కూల్ పిల్లలకు కూడా తెలియజెప్పాలనే సందేశం మహర్షి సినిమాలో ఉన్నది. విద్యార్థులు పొలాలకు వెళ్లి ఎలా వ్యవసాయం చేస్తారో చేసి చూపించే పద్ధతులను పరిచయం చేశారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లు ఈ పని చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయం అనేది ఒక పాఠ్యాంశంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నిపుణుల ఆలోచన. తాజాగా వికారాబాద్ సమీపంలోని ఓ యాక్టివ్ ఫామ్ స్కూల్‌లో పిల్లలు సంతోషంగా సెలవులను గడుపుతున్నారు. ఇందులో పెంపుడు జంతువులతో, పక్షులతో గడపడం, పంట పండించే విధానాన్ని తెలుసుకోవడం, పంటభూముల్లోని తడిమట్టితో ఆటలాడుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. వీటిల్లో పిల్లలే కాకుండా పెద్దలు కూడా పాల్గొంటున్నారు.

agri-tractor
ఇక్కడకు వచ్చిన సందర్శకులు రైతన్నలు పడే కష్టాన్ని గుర్తించి, సాయం చేసేందుకు ముందుకు రావటం శుభపరిణామం అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు యాక్టివ్ ఫామ్ స్కూల్ నిర్వాహకుడు వంశీ. మహర్షి సినిమా అయినా, వీకెండ్ అగ్రికల్చర్ అయినా రైతులను, వ్యవసాయాన్ని గౌరవించడమే. కష్టమొస్తే ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్న రైతుకి దగ్గరయ్యే ప్రయత్నమే. ఇలాంటి ఉపయోగకర ట్రెండ్‌లు ఎన్నివస్తే అంత మంచిదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి #WeekendAgriculture ట్రెండ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నది.

Harish

ఆద్యుడు ఎవరంటే?

వీకెండ్ అగ్రికల్చర్ అనేది మహర్షి సినిమా వచ్చాక బాగా పాపులర్ అయింది. అయితే ఐదేండ్ల క్రితమే చెన్నైకి చెందిన హరీష్ శ్రీనివాసన్ ది వీకెండ్ అగ్రికల్చరిస్ట్ పేరుతో ఒక గ్రూపును తయారు చేసుకున్నాడు. ఈ గ్రూపంతా శని, ఆదివారాల్లో చెన్నైకి దగ్గర్లో ఉన్న పొలాలకు వెళ్తారు. రైతులకు కావాల్సిన పనిచేస్తారు. వ్యవసాయ సీజన్‌ను ఆధారంగా ఆయా పనుల్లో రైతులకు చేదోడువాదోడుగా ఉంటారు. ఈ క్రమంలో పత్తి ఏరడం, వడ్లు బస్తాల్లో నింపడం, వాటిని వాహనాల్లోకి ఎక్కించడం, ట్రాక్టర్లతో పొలం దున్నడం, నాట్లు వెయ్యడం, కలుపు తీయ్యడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా కొంత ఖర్చును రైతన్నకు తగ్గిస్తున్నారు వీకెండ్ అగ్రికల్చరిస్టులు. మొదట్లో వీరు సాయం చేస్తామని అడిగినప్పుడు రైతులు నవ్వారట. తర్వాత వ్యవసాయం నేర్పమని అడిగి, చిన్న చిన్న పనులు చేయడంతో రైతులు వీరిని నమ్మారు.

#TheWeekendAgriculturist (TWA) గ్రూపులో హరీష్ స్నేహితులే ఉండేవారు. సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఆ కాలంలో వీరు చేస్తున్న పనిని మెచ్చి ఎంతోమంది కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, సామాజిక కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేజీకి పదిహేను వేల మందికి మించి ఫాలోయింగ్ ఉంది. ప్రతి వీకెండ్ పొలాల్లోకి వెళ్లిపోయి పనులు చేస్తుంటారు వీళ్లంతా.
-డప్పు రవి

1056
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles