డిమాండు కొంచెం ఎక్కువ


Thu,May 16, 2019 01:27 AM

cars
ఖరీదైన కారు.. ఖతర్నాక్ రంగు.. అదిరే లుక్కు.. తళుక్కుమనే ఫినిషింగ్..ఇలా అన్ని విధాలుగా కారు కాస్లీగా ఉన్నప్పుడు రిజిష్ర్టేషన్ నంబర్ దగ్గర ఎవరు కాంప్రమైజ్ అవుతారు. అది కూడా అంతే కాస్లీగా ఉండాలి. అందుకే ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకుంటారు కొందరు. వారి కారుకు మాత్రమే ప్రత్యేకంగా ఆ నంబర్ ఉండాలనుకుంటారు. అలా డిమాండ్ పొందిన నంబర్లు ఇవే..

నేషనల్ హైవే నంబర్ 44లో ఎక్కడో ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగింది కారు. నలుపు రంగు, మెరుస్తున్న ఫినిషింగ్ అందరి కండ్లూ ఒక్కదగ్గరికే లాక్కుపోయాయి. కారు మీదకు కాదు.. కారు నంబర్ ప్లేట్ మీదకు.. ఆ నంబర్ Ts 02 EE 9999
cars1
రోడ్‌నంబర్ 05 శ్రీనగర్ కాలనీ జంక్షన్.. రెడ్ సిగ్నల్ పడింది. ఎన్నో కార్లు, బైక్‌లు వచ్చి ఆగాయి. ఓ కారు వెనకాలే ఆగిన మరో వాహనదారుడు ఆ కారు నంబర్‌నే చూస్తూ ముందుకు వెళ్లాడు. ఆ నంబర్ Ts 02 EE 1111

అవును! ఇప్పుడు కారు ఎంత ఖరీదైంది అయినా సరే.. దానికి ఫ్యాన్సీ నంబర్ లేకపోతే కిక్కు లేదనుకుంటున్నారు. అందుకే ఫ్యాన్సీ నంబర్లను లక్షలు పోసి కొనుక్కుంటున్నారు. పారిశ్రామికవేత్తలు, సెలెబ్రిటీలు, కాస్త ఖరీదైన వ్యక్తులు ఎవరైనా సరే వీటిని వేలం పాటలో కొనుగోలు చేస్తున్నారు. 1, 9, 999, 9999 నంబర్లకు ఇప్పుడు డిమాండ్ ఉంది. 786 నంబర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. అలాగే 8055 నంబర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. డిజిటల్ ప్లేట్‌పైన అది ప్రింట్ చేసినప్పుడు BOSS అక్షరాలుగా కనిపిస్తుంది. అందుకే ఈ నంబర్ చాలామందికి హాట్ ఫేవరేట్. ఫ్యాన్సీ నంబర్ల మీద ఈ విపరీతమైన క్రేజ్ కేవలం మన దగ్గరే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ఉంది. కారు ధరతో సంబంధం లేకుండా నంబర్ కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు ఈ క్రేజీ ప్రేమికులు. ప్రపంచ దేశాల్లో ఇదో ప్రెస్టేజ్ సమస్య. కారుకు, స్టేటస్‌కు తగ్గట్టుగా ఫ్యాన్సీ నంబర్ ఉండాలి. అలా కొన్ని కొన్ని దేశాల్లో ఆయా దేశాల ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ ఉంటుంది.

అక్షరాలా 67 కోట్లు కారు ధర రూ. 84 కోట్లు.. దాని రిజిష్ర్టేషన్ నంబర్ కోసం వెచ్చించిన ధర రూ. 67 కోట్లు.. అవును దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయ వ్యాపారవేత్త తన కారు నంబర్ కోసం ఖరీదు చేసిన మొత్తం ఇది. దుబాయ్ హాట్ ఫేవరేట్ కార్ నంబర్ D5. దీని ధర కనిష్ఠంగా 20 కోట్లు. అయితే దీన్ని వేలం పాటలో 67కోట్లకు దక్కించుకున్నాడు బల్విందర్ సాహు అనే భారతీయ వ్యాపారవేత్త. రూ. 84 కోట్ల విలువైన తన రోల్స్ రాయిస్ కోసం ఈ నంబర్‌కు ఇంత భారీ మొత్తంలో చెల్లించాడు.
cars2

F1 నంబర్ ధర 132 కోట్లు

యునైటెడ్ కింగ్‌డమ్‌లో F1 కారు నంబర్ ధర రూ. 132 కోట్లు. కేవలం నంబర్ ప్లేట్ కోసమే ఇన్ని కోట్లు చెల్లించడం ఏంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ రాజకీయవేత్తలు, సెలెబ్రిటీలు, బిజినెస్‌మాన్‌ల స్టేటస్ సింబల్‌గా ఈ నంబర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అందుకే ప్రపంచంలోనే F1 నంబర్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. యూకే ప్రభుత్వం ఇటీవల దీని ధరను అధికారికంగా కూడా ప్రకటించింది. అక్కడి దేశంలో ఎక్కువ కనిపించే బుగట్టి, రేంజ్‌రోవర్, మెర్సిడెస్ కార్లపై F1 నంబర్ ఎక్కువ కనిపిస్తుంది.

మన దగ్గర 9999

ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో డిమాండ్ ఉన్న రిజిష్ర్టేషన్ నంబర్లు ఉన్నట్టే మన తెలంగాణలో కూడా హాట్‌ఫేవరెట్ నంబర్లు ఉన్నాయి. అందులో 9999 నంబర్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తన బీఎండబ్ల్యూ కార్ కోసం రాష్ట్రంలో మొదటిసారి అధికంగా డబ్బులు చెల్లించి ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. రూ. 22.5 లక్షల తన కార్ కోసం పది లక్షలు ఖర్చు చేసి ఫ్యాన్సీ నంబర్ టీఎస్ 09 ఈఏం 9999ను కొన్నాడు. హీరో అఖిల్ కూడా తన కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9669 నంబర్ కోసం రూ. 46వేలు ఖర్చు చేశాడు. అట్లాగే ఇటీవల కూడా ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో 9999 నంబర్‌కు భలే గిరాకీ లభించింది. ఈఎఫ్ 9999 సిరీస్ ఉన్న నంబర్ పది లక్షలు పలికింది.

స్టేటస్ సింబల్‌గా, సెంటిమెంట్‌గా..

ఇట్లా కార్ల రిజిష్ర్టేషన్ నంబర్‌పై మోజు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. స్టేటస్ సింబల్ కోసం కొన్న ఖరీదైన కార్లకు అదే స్టేటస్ సింబల్‌గా నంబర్లను కొంటున్నారు. ఇలా డిమాండ్ ఉన్న నంబర్లే కాకుండా వ్యక్తిగతంగా సెంటిమెంట్‌గా కూడా కొందరు భావిస్తారు. వారు లక్కీ నంబర్లను, స్పెషల్ డే నంబర్లను అధిక డబ్బులు చెల్లించి కొంటారు. అయితే ఈ క్రేజ్ ఈ మధ్య పుట్టుకొచ్చింది కాదు. 1980 నుంచే ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ ఉన్నది. మన దగ్గర 9999 వంటి ప్యాన్సీ నంబర్లు అప్పట్లో ఐదు వందలకే లభించేవి. రానురాను లైఫ్ స్టయిల్ మారుతున్న కొద్ది, కార్లతో పాటు నంబర్లకూ డిమాండ్ పెరిగింది.
cars3

ఇటీవల వేలం పాటలో కొనుగోలైన కొన్ని ఖరీదైన నంబర్లు

ఈడబ్ల్యూ 0999 నంబర్ ధర : రూ 9.3 లక్షలు
ఈడబ్ల్యూ 0001 నంబర్ ధర : 7.5 లక్షలు
ఎఫ్‌ఎఫ్ 0001 నంబర్ ధర : రూ 6.95 లక్షలు,
ఈడబ్ల్యూ 0009 నంబర్ ధర : 4.7 లక్షలు
ఎఫ్‌ఎఫ్ 0099 నంబర్ ధర : రూ. 2.78 లక్షలు
ఈడబ్ల్యూ 1111 నంబర్ ధర : రూ. 1.9 లక్షలు
ఈడబ్ల్యూ 0006 నంబర్ ధర : 1.61 లక్షలు
ఈడబ్ల్యూ 1188 నంబర్ ధర : 93 వేలు

751
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles