మూలాల అన్వేషకుడు


Wed,May 15, 2019 01:07 AM

మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? మన సంస్కృతి ఏంటి? మన కట్టు ఏంది? బొట్టు ఏంది? బోనం ఏంది? ఇవన్నీ తెలుసుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. చరిత్ర తెలుస్తుంది. ఆ చరిత్ర పునాదుల మీది నుంచే భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది! యువ చరిత్రకారుడు పోతరవేని తిరుపతి చేస్తున్న ఆ మూలాల అన్వేషణకు డాక్టరేట్ లభించింది. మారిన ఇప్పటి పరిస్థితుల్లో మూలాలు.. చరిత్ర.. అన్వేషణ అవసరమా? కాదా? ఉద్యోగం చేసుకోక చరిత్ర వెంట ఎందుకు పరుగులు తీస్తున్నాడు? తెలుసుకుందాం.
p-tirupathi
మానవ సమాజం జాతులు.. వర్గాలు.. సమూహాలుగా విభజితమై ఉంటుంది. రాజులు.. రాజ్యాల చరిత్ర ఉన్నట్లే కులాలు.. మతాలు.. తెగలకు కూడా గొప్ప చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రతో సంస్కృతి.. సంప్రదాయాలు.. పెనవేసుకొని ఉంటాయి. వాటిని వెలికి తీస్తే మహాద్భుతం అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామ యువకుడు పోతరవేని తిరుపతి చరిత్ర పరిశోధన ద్వారా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

పరిశోధనకు గుర్తింపు

తిరుపతి ఒకవైపు తెలంగాణ చరిత్రపై అధ్యయనం చేస్తూనే మరోవైపు భావితరానికి చరిత్ర పాఠాలు బోధిస్తున్నాడు. కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ ఆధ్వర్యంలో తెలంగాణలో గొల్లల ఆచారాలు-పండుగలు అనే అంశంపై పరిశోధన చేశాడు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన పరిశోధనకుగాను కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఏ నేపథ్యం నుంచి వచ్చిండో అదే నేపథ్యానికి సంబంధించిన పరిశోధన జరపడం.. దానికి డాక్టరేట్ రావడం పట్ల తోటి విద్యార్థులు.. అధ్యాపకులు.. గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దగట్టు జాతరపై అధ్యయనం

తెలంగాణలోని అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అంతటి వైభవం కలిగిన జాతర పెద్దగట్టు జాతర. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో కొలువుదీరిన లింగమంతుల స్వామికి కల్యాణ వైభోగమే ఈ జాతర. కానీ సమ్మక్క జాతరంత గుర్తింపు.. ప్రచారం దీనికి రాలేదు. దీనిపై తిరుపతి అధ్యయనం చేశాడు. లింగమంతుల జాతర పుట్టుక నుంచి నేటి వరకు నాలుగేండ్లు కష్టపడి దాని గురించి పెద్దగట్టు జాతర చరిత్ర పుస్తకం రాశాడు. వార్తా పత్రికలో కథనాలు మాత్రమే తప్పితే పెద్దగా ప్రచారం లేని పెద్దగట్టు జాతరను విశ్వఖ్యాతి గడించేలా చేయాలన్న లక్ష్యంతో పుస్తకం రాశాడు.

తెలంగాణ సంస్కృతి గొప్పది

తెలంగాణది జానపద సంస్కృతి. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కులాల వారీగా ఒక్కొక్కరికి ఒక్కో వేష భాషలుంటాయి. వాటినే పరిశోధన వస్తువుగా ఎంచుకున్నాడు తిరుపతి. తెలంగాణ గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిపే మల్లన్న పట్నాలు.. బీరప్ప కథ గురించి అధ్యయనం చేస్తున్నాడు. తాను రాసిన తెలంగాణలో గొల్లల ఆచారాలు-పండుగలు పుస్తకంలో వీటి ప్రస్తావన ఉంటుంది. తెలంగాణ సాంప్రదాయాన్ని ఆయన మల్లన్న సాంప్రదాయంగా అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి ప్రతీ గ్రామంలో మల్లన్న పట్నాలు.. బీరప్ప పండుగ.. గంగమ్మ.. చౌడమ్మ పండుగ జరుగుతాయి. పండుగలతో పాటు బోనాలు కూడా ఉంటాయి. పోచమ్మ.. ఎల్లమ్మ.. మైసమ్మ.. దుర్గమ్మలకు బోనం పెడుతారు. ఇవన్నీ మల్లన్న సంప్రదాయం నుంచే పుట్టుకొచ్చాయంటాడు తిరుపతి.

చరిత్ర అధ్యయనమే ఎందుకు?

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అంతకంతకూ పెరుగుతున్న ఈ రోజుల్లో చరిత్ర అధ్యయనం అవసరమా? అనే సందేహం ఉంది. సాంకేతికపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా చరిత్ర అధ్యయనం జరగాలి. ఈతరం వారికి తమ మూలాల గురించి పరిచయం లేదు. కాబట్టి తమ తాత ఎలా ఉండేవాడు? ఏం చేసేవాడు? తన తండ్రి నేపథ్యం ఏంటి? ఉంటున్న ఊరు నేపథ్యం ఏంటి? వంటివి తెలుసుకోవడానికి చరిత్ర అవసరం అంటున్నాడు తిరుపతి. భవిష్యత్ తరాలకు ఇది రిఫరెన్స్‌గా కూడా ఉపయోగపడుతుంది.

మూలాల కోసం అన్వేషణ

మూలాల గురించి వెతకడం అంటే గతం గురించి తెలుసుకోవడం. అది తెలిస్తే అప్పటి లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. కులాల గురించి చెప్పుకోవడం వెనుకబాటుతనం కాదు. కులాల చరిత్ర ఒక సాంప్రదాయం. తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలంటే కులాల చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణ చరిత్ర మాల లాంటిది అయితే.. కులాల చరిత్ర పూసలాంటిది. ఆ పూసలన్నీ అల్లితేనే ఈ ప్రాంత చరిత్ర గొప్పదనమేంటో తెలుస్తుంది. కొమురవెల్లి.. ఐనవోలు వంటి జాతరల నేపథ్యం.. వాటితో తెలంగాణ చరిత్రకున్న అనుబంధం తెలుస్తుందంటున్నాడు తిరుపతి.

సాంప్రదాయం వెనుక చరిత్ర

పుట్టిన ఏడాదిలోపు బిడ్డకు పుట్టెంటికలు తీస్తాం. కానీ ఎందుకు? అనేది చాలామందికి ఉన్న సందేహం. కానీ ఇవన్నీ అవసరం అంటున్నాడు తిరుపతి. మెదడు చురుకుదనం కోసం పుట్టెంటికలు తీసే సాంప్రదాయం ప్రారంభమైంది. అలాగే పుష్పవతి వేడుక. అమ్మాయిల శారీరక.. మానసిక ఎదుగుదల కారణంగా ఇవి చేస్తారు. ఆ సమయంలో పౌష్టికాహారం ఇస్తారు. ప్రసవం కోసం మహిళలు పుట్టింటికి ఎందుకు వెళ్తారో తెలుసా? ఆమె పుట్టి పెరిగిన వాతావరణంలో ఉంటే.. అక్కడి గాలినీ.. నీటినీ ఆస్వాదిస్తూ తన సొంతింట్లో ఉన్న అనుభూతి కలిగి సహజ కాన్పులు జరుగుతాయి. ఈ సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు లాంటిది. వీటన్నింటికీ తెలంగాణలో మంచి స్థానం ఉంది కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం అవసరం.

బంగారు తెలంగాణ కోసం

p-tirupathi2
కులాల చరిత్ర అధ్యయనం బంగారు తెలంగాణ కోసం.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజల మానవ వనరులు కులాలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చరిత్ర రాస్తే దాంట్లో మల్లన్న పట్నాలు.. బోనాలు కచ్చితంగా ఉంటాయి. తెలంగాణ సాంఘిక జీవనం.. ఆర్థిక జీవనం.. మత జీవనం తెలుసుకోవాలంటే కులాల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే ఈ ప్రాంతం గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడి పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.
-పోతరవేన తిరుపతి

చరిత్రతో ప్రయాణం

తిరుపతి తల్లి ఓదెమ్మ. తండ్రి పోశాలు.. ఆయన గొర్రెలకాపరి. తిరుపతి పదో తరగతి తర్వాత జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హెచ్‌ఈసీ తీసుకున్నాడు. అందరూ ఎంపీసీ.. బైపీసీ తీసుకుంటే తిరుపతి మాత్రం హెచ్‌ఈసీనే ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చూసిన గంగమ్మ.. చౌడమ్మ వంటి కులదేవతల ఆరాధన.. మైసమ్మ.. పోచమ్మ వంటి మాతృదేవతల ఆరాధన అతన్ని ఆలోచింపజేశాయి. ఒక్కొక్కరు ఒక్కో పని ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవాలని హెచ్‌ఈసీలో చేరాడు. చరిత్ర పరిశోధన విద్యార్థిగా అలహాబాద్ యూనివర్సిటీలో గొల్ల ఉపకులాలపై పేపర్ ప్రజెంటేషన్.. కోల్‌కతాలో మల్లన్న పట్నాలు గురించి పేపర్ ప్రజెంటేషన్.. తిరుపతిలో బీరప్ప పండుగ గురించి ప్రజెంటేషన్.. కేయూలో గొల్లాస్.. పశుపోషణ కులంపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అన్వేషణను కొనసాగిస్తున్నాడు.

-దాయి శ్రీశైలం

100
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles