అమ్మకు ప్రేమతో!


Sun,May 12, 2019 01:15 AM

mother
పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై.. మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. అమ్మ ప్రేమను కొనియాడడం తప్ప. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా.. కొందరు బుల్లితెర నటీనటులు తమ మాతృమూర్తులతో అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ మధుర స్మృతుల సమాహారమే ఈ వారం సింగిడి.

ఈ విజయం అమ్మకు అంకితం

ఒకరి విజయం వెనుక శ్రమ, పట్టుదల ఉన్నట్టే.. వాళ్ల కష్టకాలంలో కూడా వెన్నంటి ఉండే వ్యక్తులుంటారు. అట్లాగే దేశంలో ప్రముఖ క్రికెట్ స్టార్లు తమ విజయం వెనుక మాతృమూర్తుల త్యాగం ఉందని చెప్తున్నారు. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నారు.

లీలా రాజ్

mithali-leela
మహిళా క్రికెట్‌లో తిరుగులేని విజయాలు సాధించిన మిథాలీ రాజ్ విజయం వెనుక ఆమె అమ్మ త్యాగం ఉందని చెప్తున్నది. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఇష్టం. అప్పుడే క్రికెట్ వైపు నా పేరెంట్స్ ప్రోత్సహించారు. అందులో మా అమ్మ లీలా రాజ్ ప్రోత్సాహం, త్యాగం అంతా ఇంతా కాదు. నేను వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైనప్పుడు మా అమ్మ ఉద్యోగ్యాన్ని వదిలేసి నాతో ఇతర ప్రాంతాలకు వచ్చారు. నాతో పాటు వచ్చి నా బాగోగులు చూసుకున్నారు. క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి నా భవిష్యత్ మీద వచ్చే నెగెటివ్ కామెంట్లను లెక్క చేయకుండా నన్ను క్రికెట్ ఆడించారు అని మిథాలీ రాజ్ ఆమె తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

సరోజ్ కోహ్లీ

virat-saroj
ఇండియా టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తి వెనక ఆయన తల్లిదండ్రుల లక్ష్యం ఉందని చాలామందికి తెలిసి ఉండదు. కోహ్లీకి క్రికెట్ తండ్రి నుంచి వచ్చినస్ఫూర్తి. అని కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ చెప్తున్నది. కోహ్లీ చిన్న వయస్సులోనే తండ్రి ప్రేమ్ కోహ్లీ చనిపోయారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎనిమిదేండ్ల వయస్సులోనే క్రికెట్ టీంలో చేర్పించాం. ఆ వయస్సులో కోహ్లీ కుంగిపోయాడు. ఆ బాధతోనే తర్వాత రోజు మ్యాచ్‌లో పాల్గొన్నాడు. 90 పరుగులు తీసి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. అని అంటున్నది. ఆ సమయంలో కోహ్లీకి తల్లి సరోజ్ అండగా నిలిచింది. తర్వాతి మ్యాచ్‌ల కోసం అన్ని సౌకర్యాలు వదిలేయాల్సి వచ్చింది. అమ్మ ప్రోత్సాహంతోనే నాన్న కోరికను నెరవేరుస్తున్నాడు కోహ్లీ. మా అమ్మ చాలా ధైర్యం గల మహిళ.. ఆమె ప్రోత్సాహం, ధైర్యమే నన్ను క్రికిట్ గ్రౌండ్‌లో నిలబెడుతున్నాయి అని చెప్తున్నాడు కోహ్లీ..

దేవకీ ధోని

dhoni-devaki
2016లో విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో ఓడీఐ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా టీం జెర్సీలపై ప్లేయర్ల పేరు కాకుండా అమ్మ పేరు కనిపించింది. దాని గురించి ధోని తల్లి దేవకీ ధోని గర్వంగా చెప్పుకుంటారు. అమ్మ గురించి చెప్పడానికి ఈ చొరవ అద్భుతమైంది అని దేవకీ ధోని చెప్తుంది. ఎందుకు మీరు ఎప్పుడూ అమ్మకే ఎక్కువగా దగ్గరైనట్టు అనిపిస్తారు అని ధోనిని అడిగితే? తండ్రిపై ప్రేమ లేనట్టు కాదు. ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుంది. ఆగస్ట్ 15, జనవరి 26 రోజులలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన అమర వీరుల గురించి చెప్పుకుంటాం. అట్లాగే జన్మనిచ్చిన తల్లి గురించి ఇంకెంతగా చెప్పాలి. ప్రతిరోజూ చెప్పినా సరిపోదు అని ధోని తన అభిప్రాయాన్ని పంచుకుంటాడు.

రజినీ టెండుల్కర్

sachin-rajni
ప్రపంచానికి సచిన్ టెండుల్కర్ ఒక మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ ప్లేయర్. అయినా కానీ తల్లి రజినీ టెండుల్కర్‌కు మాత్రం తోటలో మామిడి పండ్లు దొంగిలించే చిలిపి చేష్ట్టలు చేసిన గారాల కొడుకు. ముంబైలోని బాంద్రాలో ఉన్న కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రోజూ మామిడి పండ్లు దొంగిలించి రోజంతా క్రికెట్ గ్రౌండ్‌లో ఉండేవాడు అన్న సరదా సంగతిని చెబుతూ సచిన్ టెండుల్కర్ తల్లి రజినీ టెండుల్కర్ తన ఆనందాన్ని పంచుకుంది. సచిన్ క్రికెట్ ఆడటాన్ని నేనెప్పుడూ లైవ్‌లో చూడలేదు. నాకు చాలా టెన్షన్‌గా ఉంటుంది అందుకే ఎప్పుడూ టీవీల్లోనే చూసేదాన్ని. కానీ ఓ రోజు సచిన్ నన్ను లైవ్‌లో చూడాలని అడిగాడు. 200వ టెస్ట్ మ్యాచ్‌కు స్టేడియంలోకి వెళ్లాను. అని అంటున్నది. ఏటా మాతృదినోత్సవాన్ని సచిన్ సెలెబ్రేట్ చేస్తాడు. ప్రపంచంలో ఎవరి స్థానాన్ని అయినా తీసుకోవచ్చు కానీ అమ్మ స్థానాన్ని మాత్రం ఎవరూ అధిగమించలేరు అంటాడు సచిన్.

సాతింధర్ కౌర్

harmanpreet-satinder
2007 ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీల్లో అస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన ప్లేయర్ హర్మాన్‌ప్రీత్ సింగ్. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఈమె క్రికెట్‌లో రాణించడానికి తల్లిదండ్రులే తొలి గురువులు. హార్మాన్ కోసం తల్లిదండ్రులు కొన్న మొదటి డ్రెస్‌పై క్రికెట్ కిట్ గుర్తులు ఉన్నాయి. ఎదిగే కొద్ది అమ్మాయిలో క్రికెట్ ఆడేది. అప్పుడే తల్లిదండ్రులకు అర్థం అయింది. హర్మాన్‌ను పూర్తిగా క్రికెట్‌వైపు ప్రోత్సహించారు. కిందటి మదర్స్ డే సందర్భంగా హర్మాన్ తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేసింది. అమ్మ నాకు ధైర్యాన్ని కలిగించింది. ఎదుటి వాళ్లను ఎలా ప్రేమించాలి, ఏం నేర్చుకోవాలి అన్నీ నేర్పింది. నా ప్రతీ విజయం వెనుక మా అమ్మ ఉంటుంది అని హర్మాన్ ప్రీత్ తన అనుబంధాన్ని పంచుకున్నది.

ఎన్నిజన్మలైనా నువ్వే నా అమ్మ!

- తనూజ, ముద్ద మందారం ఫేం
Tanuja
నా బలం, బలహీనత అంతా అమ్మే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అమ్మ. అందుకే ఎన్ని జన్మలెత్తినా అమ్మే నాకు అమ్మగా రావాలని కోరుకుంటా. నేను పుట్టి పెరిగిందంతా బెంగళూర్‌లో. మేము ముగ్గురం తోబుట్టువులం. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక మామయ్య వాళ్ల ఇంట్లో ఉంచి చదివించారు. నా పేరెంట్స్‌కు, నాకు ఇష్టం లేకపోయినా నా కెరీర్ బాగుండాలని అలా చేశారు. దూరమైతేనే కదా బంధం విలువ తెలుస్తుందంటారు. ఆ దూరమే మా బంధాన్ని మరింత బలపర్చింది. నన్ను చూడ్డానికి అమ్మానాన్న వస్తే.. నాకు పండగే. అది మాటల్లో చెప్పలేని ఆనందం. చదువులైన 12 యేండ్లకు మళ్లీ అమ్మతో కలిసుండే అవకాశం వచ్చింది. నేను ఎంత అల్లరి చేసినా భరించింది అమ్మ. మామయ్య వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు.. అమ్మను తలుచుకోని రోజు లేదు. ఒకసారి పడుకునే ముందు దొంగతనంగా మామయ్య ఫోన్ నుంచి.. కాల్ చేసి.. అమ్మా.. అమ్మా అని పిలిచా. అటువైపు నుంచి అమ్మ మాట్లాడలేదు. అమ్మ ఫోన్ చేసేలా చూడు ఆంజినేయా అంటూ మొక్కుకున్న. అర్ధరాత్రికల్లా అమ్మ నా దగ్గరకొచ్చింది. ఆ క్షణం నేను జీవితంలో మర్చిపోలేనిది. నాన్నను బతిమాలి, బలవంతపెట్టి మరీ రాత్రికి రాత్రే మావయ్య వాళ్ల ఇంటికి వచ్చింది. నా ముఖంలో సప్తవర్ణాలు వెలిగాయి. అప్పుడే అర్థమైంది అమ్మ నన్ను ఎంత మిస్ అవుతున్నదో అని. డిప్లొమో చదువుకునే రోజుల్లో అమ్మతో బాగా చనువు పెరిగింది. నేను ఎప్పుడైనా ఆలస్యంగా వస్తే.. నాకు తిట్ల దండకమే. ప్రేమగా మందలించేది అమ్మ.

నేను అలిగి నా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటే.. మొదట మెసేజ్ చేసేది. అలా తొమ్మిది మెసేజ్‌లు చేసి.. రెండుసార్లు కాల్ చేస్తుంది. తర్వాత.. తలుపు దగ్గరకొచ్చి తనూ అంటూ పిలిచి.. నన్ను గారాబం చేస్తూ.. గోరుముద్దలు తినిపించేది అమ్మ. చదువుకునే రోజుల్లోనే సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టం ఏర్పడింది. నాన్నకు తెలియకుండా ఓ షార్ట్‌ఫిలింలో నటించా. కానీ ఆ విషయం అమ్మకు తెలుసు. 22 రోజుల షూటింగ్‌లో అమ్మతో నా బాధలు పంచుకునేదాన్ని. ఆ తర్వాత సీరియల్ అవకాశాలు వచ్చాయి. బెంగళూర్‌లో ఆడిషన్స్ అయిన తర్వాత.. హైదరాబాద్‌కు పంపడానికి నాన్న ససేమిరా అన్నారు. నా ఇష్టాలను అమ్మతో చెప్పుకున్న. కేవలం నా కోసం నాన్నతో గొడవ పెట్టుకొని.. నాతోపాటు హైదరాబాద్‌కు వచ్చింది అమ్మ. అప్పటి నుంచి ఎన్ని షూటింగ్‌లు ఉన్నా నాతోపాటే ఉండేది. నాన్నకు కూడా ఇష్టం ఉన్నా.. బయటికి మాత్రం ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే.. ఆడపిల్ల, ఊరు కాని ఊరు అనే భయం. అలా మాతో దాదాపు నెల రోజులు మాట్లాడలేదు నాన్న. కానీ.. ఆయన స్నేహితుల ఇంటికెళ్లి మాత్రం.. రోజూ నా సీరియల్స్ చూసేవారు. అదే నా ఎచివ్‌మెంట్. ఒకప్పుడు అమ్మానాన్న వస్తే.. నేనెంత సంబరపడేదాన్నో.. ఇప్పుడు నేను ఇంటికెళ్తే వాళ్లంత సంతోషపడుతున్నారు. నాకు తోడు నీడలా నిలిచిన అమ్మే.. మరో జన్మలో కూడా నాకు అమ్మగా రావాలని నా ఇష్టదైవం ఆంజనేయుడ్ని కోరుకుంటున్నా.

అమ్మ నాకు రెండు జన్మలిచ్చింది!

- ఆకర్ష్, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు ఫేం
akarsh
చిన్నప్పటి నుంచి నేను హాస్టల్‌లోనే పెరిగాను. బెంగళూర్‌లో అమ్మానాన్నలు వ్యాపారం చూసుకునే వారు. చదువుకునే రోజుల్లో అమ్మప్రేమకు దూరమైనా.. ఇప్పుడు మాత్రం కుటుంబంతోనే కలిసుంటున్నా. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ అమ్మతో వీడియోకాల్ మాట్లాడుతూనే ఉంటా. చిన్నప్పుడు ఊటీలో నేను తప్పిపోయా. లక్కీగా ఆ రోజు అమ్మ కొనిచ్చిన స్వెటర్ వేసుకున్న. అప్పటికే నా గురించి ఆందోళన చెందుతున్న అమ్మానాన్నలు నా కోసం వెతుకున్నారు. అక్కడంతా స్వెటర్స్‌లోనే ఉన్నారు. అమ్మానాన్నలు కనిపించడం లేదని నేనూ బెంగపెట్టుకొని ఏడుస్తున్న. కొన్ని గంటల తర్వాత నేను వేసుకున్న స్వెటర్ గుర్తుపట్టి అమ్మ నన్ను కనిపెట్టింది. అప్పుడు అమ్మ నన్ను గుర్తించకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. ఇలా నాకు మరో జన్మనిచ్చింది అమ్మ.

నేను ఎంత అల్లరి చేసినా, కోప్పడినా.. ప్రతి విషయం వివరంగా చెప్పేది. నేను సీరియల్స్ చెయ్యాలనుకుంటున్న అని అమ్మతో చెప్పినప్పడు నాన్నను కన్విన్స్ చేసింది. నేను ఈ స్థితిలో ఉండడానికి ఇద్దరి దీవెనలు ఉన్నాయి. ఇంకా బాగా నటించు.. కొత్త కొత్త బట్టలు వేసుకో.. అలా చెయ్.. ఇలా చెయ్ అంటూ ఇప్పటికీ నన్ను గైడ్ చేస్తూనే ఉంటుంది అమ్మ. ఆమెకు తెలుగు పూర్తిగా రాకపోయినా.. నా కోసం సీరియల్స్ చూస్తుంది అమ్మ. ఏది కావాలన్నా తీసుకో అన్నారే కానీ.. వద్దని ఎప్పుడూ వారించలేదు. నన్ను ముద్దుగా బెల్లీ అని పిలుస్తుంది అమ్మ. నన్ను ఇంతవరకూ ఒక్కమాట కూడా అనకుండా పెంచింది. ఇప్పటికీ అమ్మ లేకపోతే ఇళ్లంతా ఏదో వెలితిగానే ఉంటుంది. వ్యాపారం, కాఫీ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. మాకు కావాల్సినంత ప్రేమను పంచింది అమ్మ. ఎంతైనా అమ్మ కదా!

హ్యాపీ బర్త్ డే అమ్మా!

- యామిని, ముత్యాల ముగ్గు ఫేం
yamini
ఇవాళ అమ్మ పుట్టిన రోజు. అదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి అమ్మ కృషి మాటల్లో చెప్పలేనిది. నాకు ఇష్టమైన సంగీతం, డ్యాన్స్‌ను చిన్నప్పుడే నాకు నేర్చింది అమ్మ. మా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారెవరూ లేరు. నాతోనే మొదలు. ఒకవైపు ఉద్యోగం చూసుకుంటూనే.. నాతో పాటు నాకు తోడు నీడగా ఉంటుంది అమ్మ. ఇప్పటికీ షూటింగ్‌లో నాకు చాలా హెల్ప్ చేస్తుంటుంది అమ్మ. తన కూతురు స్క్రీన్ మీద అందంగా కనిపించాలని. చాలా అంటే చాలా కేరింగ్. నాకు అన్నీ అమ్మనే. బాధైనా, సుఖమైనా, కష్టమైనా, కన్నీరైనా అమ్మతోనే పంచుకుంటా. నాకు మంచి సలహాలు ఇచ్చి.. మనోధైర్యాన్ని నింపుతుంది అమ్మ. చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో నేను నా సోదరి కలిసి.. మేము సొంతంగా దాచుకున్న డబ్బులతో అమ్మకు టీవీ కొనిచ్చాం.

అది ఎప్పటికీ మర్చిపోలేని ఓ అందమైన జ్ఞాపకం. నాకు చాలా కోపం ఎక్కువ. అయితే.. ఆ కోపాన్ని తగ్గించడానికి అమ్మ రివర్స్‌లో నాపై కోప్పడేది. సో.. నేను సైలెంట్. తర్వాత.. ఒళ్లో కూర్చొబెట్టుకొని మంచి చెడులు వివరంగా చెప్పేది. నేను అమ్మ కూచి. నేనూ నా సిస్టరే అమ్మకు ప్రపంచం. నేను ఏడిస్తే అస్సలు తట్టుకోలేదు. సీరియల్ షూటింగ్‌లో ఏడ్చినా.. అమ్మ పక్కకు వెళ్లి ఏడుస్తుంది. అంతటి సున్నిత మనస్తత్వం అమ్మది. ఒక్కోసారి ఏడ్పు వచ్చే సీన్‌లు చూసేది కాదు. ఒకానొక సందర్భంలో.. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లే నన్ను కొడుకుల్లా చూసుకుంటారు అని అమ్మ చెప్పడం విన్నా. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మా నువ్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి. మళ్లీ వచ్చే జన్మలోనూ నువ్వే అమ్మగా కావాలి.. హ్యాపీ బడ్డే మా. లవ్‌యూ

తెర వెనుక అమ్మ

- ప్రజ్వల్, ముత్యాల ముగ్గు ఫేం
madhusudan
నేను పుట్టింది బెంగళూర్ అయినప్పటికీ నటన, నృత్యం, ఇక్కడి వారి ప్రోత్సాహం నన్ను పూర్తిగా హైదరాబాద్ వాణ్ని చేశాయి. ఇప్పుడు టీవీ రంగంలో ప్రేక్షకుల అభిమానాలు పొందుతున్నా అంటే మా అమ్మే కారణం. చిన్నప్పుడు కమల్‌హాసన్ సాగర సంగమంలో నృత్యం చూసి స్ఫూర్తి పొందా. అప్పుడే అమ్మ నన్ను క్లాసికల్ డ్యాన్స్ క్లాస్‌లో చేర్పించారు. అప్పుడు నాకు తొమ్మిదేండ్లు. రూప్‌శ్రీ మధుసూదన్ గురు దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. డ్యాన్స్ అంటే ఏంటో అప్పుడే రియలైజ్ అయ్యాను. తాండవ నృత్యం నేర్చుకున్నాను. ఇంటర్‌కు వచ్చేసరికి నా డ్రీమ్.. డ్యాన్స్ అని ఫిక్స్ అయ్యా. అమ్మ సహకారంతోనే డ్యాన్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టాను. ఈ క్రమంలోనే వివిధ వేషధారణలో కనిపించాల్సి వచ్చేది. ఇది కాస్త నన్ను టీవీ వైపు మళ్లించింది. డ్యాన్స్‌లో కొనసాగుతూనే యాక్టింగ్ కూడా మొదలు పెట్టా. ఇప్పుడు ముత్యాల ముగ్గు సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్నా. ఇది గొప్ప అనుభూతిని ఇచ్చింది. దీంతో పాటు డ్యాన్స్ జోడీ డ్యాన్స్‌లో కూడా కొనసాగుతున్నా.

ఒకేసారి డ్యాన్సింగ్, యాక్టింగ్ రంగాల్లో కొనసాగడం గర్వంగా ఉంది. చిన్నప్పుడే అమ్మ ప్రోత్సాహంతో కళారంగంవైపు మళ్లాను కాబట్టి ఇప్పుడు కష్టం అనిపించడం లేదు. నేను తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక అమ్మ అభిప్రాయం కచ్చితంగా ఉంటుంది. బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పటికీ నేను ఇక్కడి వాళ్లతో కలిసిపోయా. నేను ఇప్పుడు హైదరాబాద్ అబ్బాయిగానే చాలా మందికి తెలుసు. ఇదంతా అమ్మతో చెప్తున్నప్పుడు ఆనందిస్తుంటుంది. నిజానికి టీవీల్లో నేను కనబడతాను కానీ.. వెనకాల మొత్తం అమ్మ ప్రోత్సాహమే నన్ను నడిపిస్తున్నది. నేను ఇలా ఎదగడానికి మా అమ్మ కృషి మాటల్లో చెప్పలేను. కళారంగంలో నేను కొనసాగడానికి చాలా మంది ప్రోత్సహించారు. అందరికీ నానా కృతజ్ఞతలు.

-డప్పు రవి

904
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles