ప్రపంచ మానవుడు!


Fri,May 10, 2019 01:06 AM

వేళా విశేషం
విలక్షణమైన మనోజ్ఞాన కిరణాలను ప్రపంచమంతా ప్రసరింపజేసిన విశ్వమానవుడు జిడ్డు కృష్ణమూర్తి. మానవాళిలో ఆయన కోరుకొన్న పరివర్తన అత్యంత సామాన్య జీవనం. ఇందులోనే జీవిత పరమార్థం దాగి ఉందని ఆయనంటారు.
jiddu-krishnamurthy
మనుషుల జీవితాలు మరీ ఇంత సంక్లిష్టం కావాలా? ఒకవైపు ఆస్తికత, మరొకవైపు నాస్తికత, మతాలు- సిద్ధాంతాలు, ఆచారాలు, అనాచారాలు, స్వార్థ సంకుచితాలు, నేరాలు ఘోరాలు.. అన్నీ కలిసి మనిషిని ఎటు తీసుకెళుతున్నాయి? మౌలికమైన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మూడు దశాబ్దాల కిందటే లభించింది. మానవ జీవన విధానం, సంబంధ బాంధవ్యాలలో విప్లవాత్మక మార్పుల కోసం కలలు కన్న భారతీయ తత్వవేత్త, ఉపన్యాసకుడు, రచయిత జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో మనిషి జీవన దార్శనికత అత్యంత విలక్షణమైంది. ఎంతగా అంటే, అది ఇతరేతర తాత్వికతలతో దేనితోనూ కలవలేదు. మనిషిని పూర్తి సహజంగా, అత్యంత స్వచ్ఛంగా జీవించమని ఆయన కోరారు. ఉదా॥కు ప్రకృతిలో ఒక చెట్టులా, ఆకాశంలో విహరించే ఓ పక్షిలా, అడవిలోని వన్యజీవిలా. కల్లా కపటం ఎరుగకుండా! ఇది ఆధునిక మానవులకు సాధ్యమా? ప్రత్యేకించి మనుషులు మృత్యుభయానికి అతీతంగా జీవించాలని, ఇది ప్రస్తుత జంజాటాలకు దూరమై పూర్తి స్వేచ్ఛను పొందినప్పుడే సాధ్యమవుతుందని, అప్పుడు అన్ని సమస్యలకూ పరిష్కారం దొరికినట్టేనని ఆయనంటారు.

తనదైన తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికే ఆయన వలచి వచ్చిన అసాధారణ జగద్గురువు పీఠం గౌరవాన్ని, బంగారు భవిష్యత్తును కాదనుకొన్నారు. ఇటువంటి వారు ఈ కాలంలో ఉంటారా? కృష్ణమూర్తి జీవిత విశేషాలు ఎంతటి వారినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఆయన ఉద్భోదించిన తాత్వికత ప్రపంచంలోని అన్ని మతాలు, ఆధ్యాత్మిక భావనలు, సిద్ధాంతాలకు అతీతమైంది. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు, నమ్మకం- అపనమ్మకాల మధ్య పోరాటం, భౌతిక-అభౌతిక విషయాల కోసం ఆరాటం, అనవసర వాంఛలు, అవాస్తవికమైన ఆధ్యాత్మిక భ్రాంతుల్లో మునిగి తేలడం. ఇవన్నీ ఈ ఆధునిక కాలంలోనూ ఇంకా అవసరమా అన్నది ఆయన ప్రశ్న. వీటన్నింటినుంచీ అందరూ బయటపడి పూర్తి స్వేచ్ఛ పొందాలన్నది ఆయన ఆరాటం. ఆ స్వచ్ఛమైన జీవనంతోనే అన్ని సమస్యలకూ విముక్తి లభిస్తుందని కృష్ణమూర్తి తేల్చారు. ఒక చెట్టువంటి ఆ సామాన్య జీవనమే తన దృష్టిలో పావనమైందనీ అన్నారు.

పురాణాలు, కాల్పనిక కథల్లో మాత్రమే చదివే ఒక కారణజన్ముడంతటి గొప్పగుణాలను మేళవించుకొని, అత్యంత సాధారణ జీవితాన్ని గడిపిన జిడ్డు కృష్ణమూర్తి బోధనల్లో ఈ రకమైన ఒక విలక్షణ తాత్విక వెలుగు కనిపిస్తుంది. ఒక వేమనలా, మరెందరో సామాజిక యోగుల వలె ఆయన అందించిన జ్ఞానసంపదలో సమాధానాలు లేని ప్రశ్నలు ఉండవు. ఇంత జరిగాక, ఇన్నేండ్లయినా ప్రపంచం ఆయన చూపిన మార్గాన్ని ఎందుకు అవలంభించలేక పోతున్నది? అన్న దానికి బలమైన కారణం లేకపోలేదు. ఆయన బోధించిన తత్వం ఏ నిర్ణీత తాత్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. ఏ మతానికి గాని, సంస్థకు కాని, వ్యవస్థకు, సిద్ధాంతానికి కాని ఆయన తన విధేయతను, మద్దతును ప్రకటించలేదు. తనదైన ప్రత్యేక దృష్టికోణాన్నే వెల్లడించారు. సమస్త జీవరాశుల పట్ల తిరుగులేని కారుణ్యాన్ని వ్యక్తం చేశారు. అంతిమ కాలం వరకు కూడా ఆయన తనకంటూ ఏ వస్తువునూ మిగుల్చుకోలేదు. ఆఖరకు సొంత ఇల్లు కూడా!

జిడ్డు కృష్ణమూర్తి సామాన్యుల మేధావి. చాలామందికి అర్థం కాని అసామాన్యుడు. సామాన్యుల కోసమే, సామాన్య జీవితాన్ని ఆకాంక్షించిన అతిసాధారణ వ్యక్తి. మనుషులలో ఒక సమూల మనోవిప్లవాన్ని ఆయన కోరుకొన్నారు. ఆయన అనేక అంశాలపై ఎందరికో ఇచ్చిన వివరణాత్మకమైన సమాధానాలు ఎంతో లోతైన మనోదృష్టితో ఉంటాయి. అవి సగటు పాఠకులకు ఒక పట్టాన అర్థం కాకపోవచ్చు కూడా. కాకపోతే, కొంచెం శ్రద్ధ పెడితే వాటి సారం అందకపోదు.

1895 మే 11న మదనపల్లె (చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)లో జన్మించిన కృష్ణమూర్తిని బాల్యంలో చూసిన ఒక విదేశీయుడు (లెడ్ బీటర్: దివ్యజ్ఞాన సమాజోద్యమ నేత) వెలిబుచ్చిన అభిప్రాయం గమనార్హం. బాలుడైన కృష్ణమూర్తి చుట్టూ కనిపించని అసాధారణ కాంతి వలయాన్ని తాను చూసినట్టు ఆయన చెప్పుకొన్నారు. అప్పట్లోనే వారి కుటుంబం మద్రాసులో స్థిరపడింది. దివ్యజ్ఞాన సమాజానికి అది అంతర్జాతీయ కేంద్రంగానూ ఉండేది. అనిబిసెంట్ దానికి అప్పుడు అధ్యక్షురాలు. కృష్ణమూర్తి తన తమ్ముడితోకూడి అడయారు నది సమద్రంలో కలిసే చోట రోజూ ఆడుకొనేవారు.

ఈ సోదరుల్దిరూ అనిబిసెంట్‌ను చాలా ప్రభావితం చేయడంతో వారిని ఆమె దత్తత తీసుకొన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే వారిద్దరూ విదేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్లారు. కృష్ణమూర్తిలోని చురుకుదనం, జ్ఞానకాంక్ష ఆమెను బాగా ఆకర్షించాయి. దివ్యజ్ఞాన సమాజం తరఫున కృష్ణమూర్తిని జగద్గురువును చేయాలన్నది అనిబిసెంట్ లక్ష్యం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రపంచానికి వెల్లడించారు కూడా. 1925లో సోదరులిద్దరూ అమెరికాలో ఉండగా, తన తమ్ముడు (నిత్యానంద) జబ్బు పడి మరణించిన సంఘటన ఆయన జీవితాన్ని పెద్ద మలుపే తిప్పింది.

ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ పేర్న ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించి, దానికి కృష్ణమూర్తిని ప్రధానిగా చేసింది అనిబిసెంట్. దీనికి ఆయన తొలుత అభ్యంతరం చెప్పకపోయినా, తర్వాత తనను జగద్గురువుగా ప్రకటించే సమయంలో నిర్దంద్వంగా తిరస్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక దశలో హాలెండ్‌లో ఆయనకు బ్రహ్మాండమైన భవనాన్ని, 5000 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి కూడా. ప్రపంచవ్యాప్తంగా జగద్గురువు పేరున ఆయనకు ఎక్కడ లేని గౌరవాలు లభించాయి. ఆయన నడిచే దారిలో ప్రజలు గులాబీలు చల్లేవారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇవేవీ ఆయన మనస్తత్వానికి సరిపడకపోవడంతో 1929లో వాటన్నింటి నుంచీ తప్పుకొన్నారు. తాను జగద్గురువుగా కాక జిడ్డు కృష్ణమూర్తిగానే ఉండిపోతానని ప్రకటించారు.

కృష్ణమూర్తి సుదీర్ఘ జీవితం అలా పెత్తనం చెలాయించే వ్యక్తిగా కాకుండా మానవ జీవిత ప్రాథమిక సమస్యలను అధ్యయనం చేయడం, సందేశాలు ఇవ్వడంతోనే గడిచిపోయింది. 1929 నుంచి 1986లో వారు తనువు చాలించే వరకు పలు తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేకానేక ప్రసంగాలు చేశారు. అత్యంత నిరాడంబర, నిస్వార్థ జీవితాన్ని గడిపిన ఆయన సుమారు ఆరు దశాబ్దాల కాలం పాటు ఆయా దేశాలలో (భారత్ సహా) పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారు. అమెరికాలోని కృష్ణమూర్తి ఫౌండేషన్ సమాచారం ప్రకారం ఇప్పటికి మొత్తం 75 పుస్తకాలు, 700 ఆడియో క్యాసెట్లు, 1200 వీడియో క్యాసెట్లు వెలుగుచూశాయి. మొత్తం మీద సుమారు 2 కోట్ల సందేశాలిచ్చారు. అవన్నీ ఎక్కువగా ఆంగ్లంలోనే ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రధాన భాషలలోకి తర్జుమా అయ్యాయి కూడా.

అసలు కృష్ణమూర్తి తత్వసారం ఏమిటి? కరడుగట్టిన సంప్రదాయాలు, కాల్పనిక ఆధ్యాత్మికత, అవాస్తవిక దివ్యభావనలపై కృష్ణమూర్తి తనదైన విలక్షణ తాత్వికతతో నిరంతర పోరాటమే సలిపారు. సంప్రదాయ వాదులు, మతాభిమానులంతా ఆయన తత్వాన్ని జీర్ణించుకున్నట్టు లేదు. మనిషి సకల జంజాటాలనూ ఛేదించుకొని, ఒక చెట్టులా అతిసామాన్య జీవనం గడపాలని, అటువంటి విప్లవాత్మక స్వేచ్ఛాయుత మార్పునే తాను కోరుకొంటున్నానని వారు ప్రబోధించారు. అలాగని విశృంఖలత్వానికి పోకుండా, అనవసర వ్యవహారాలకు దూరమై నిశ్చలస్థితిలో స్వీయజ్ఞానాన్ని పొందాలి. భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే. వీరు ప్రతిపాదించిన మానవతావాదాన్నే శంకర భగవత్పాదులవారు లోకానికి అందించారు. కృష్ణమూర్తి మాదిరిగానే క్రీస్తు కూడా భవిష్యత్తు గురించి కాకుండా వర్తమానంలో జీవించమని చెప్పారు.

jiddu-krishnamurthy2

స్వీయజ్ఞానంతోనే సత్యాన్వేషణ

శాశ్వతమైన సత్యం ఎక్కడో ఉండదని, దానికోసం ఆధ్యాత్మికత, ఆత్మసాక్షాత్కారం పేరుతో ఎక్కడో అన్వేషించనక్కర్లేదని, నిజానికి అది రహదారి లేని ప్రదేశమని జిడ్డు కృష్ణమూర్తి ప్రకటించారు. మనిషి స్వీయజ్ఞానాన్ని తనలోనే పొందాలి. కానీ, సంస్థలు, మతాలు, పిడివాదాలు, ప్రార్థనలు, ఆచారాలు, మరే తాత్వికజ్ఞానం, మానసిక నైపుణ్యం వంటివేవీ మనల్ని దాని దరికి చేర్చవు. సత్యాన్వేషణ, దేవుణ్ని చేరుకోవడానికి వాటన్నింటివీ వక్రమార్గాలే అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. భౌతికమైన భ్రాంతులు లేని ప్రశాంత జీవితమే అత్యంత పవిత్రమైందని ఆయనంటారు.

-దోర్బల బాలశేఖరశర్మ

269
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles