నర్మద వరిక్రమ


Fri,May 10, 2019 01:06 AM

Narmada

రాళ్ల లోపల నీళ్లు!

(గత సంచిక తరువాయి)
చిన్నచిన్న పెట్టెల్లో వున్న ఆ రాళ్లు బయటనుంచి చూడటానికి పిచ్చిరాళ్లలా ఉన్నాయి. కానీ, మధ్యకు కోయించి, విడదీసిన వాటి లోపల శివపార్వతులు, లింగాకారాలు ఉన్నాయి. ఓ రాయి బంగారు రంగులో మెరుస్తున్నది. నల్లగా కొబ్బరికాయ పరిమా ణంలో ఉన్న మరొక రాతిని ఊపితే లోపల నీళ్లు కదులుతున్న శబ్దం వినిపించింది.

చెక్క బీడింగ్‌తో చేసి, గాజు పలకలు అమర్చిన ఓ పెట్టెలో షిరిడీ సాయిబాబా విగ్రహం ఉన్నది. దాన్ని చూపించి, తన తండ్రికి వడ్రంగి పనితనం రాదని, ఐనా ఆయనే దాన్ని చేశారని ప్రభు చెప్తే అంత చక్కగా దాన్ని ఎలా చేయగలిగారా అనుకొన్నాను. సాయిబాబా ప్రేరణతో ఆయన దాన్ని చేశారట. ఓ భరిణెలో ఉంచిన, సాయిబాబా ఉపయోగించిన దుప్పటిలోని చదరపు అంగుళం ముక్కను కూడా ప్రభు చూపించారు. పాడవకుండా దాన్ని ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ కాగితంలో భద్రపరిచారు. అలాగే, మరో పెట్టెలో భద్రపరిచిన దత్త సంప్రదాయానికి చెందిన పునెలోని శంకర్ మహారాజ్ ఉపయోగించిన ఆవు తల ఆకారంలోని చేతికర్ర పిడిని చూపించారు.

ఆ కర్ర ఆయనకు చేరిన విధం కూడా దైవికమే అవడం విశేషం. శంకర్ మహారాజ్ సమాధి అయిన కొద్ది కాలానికి ఓ రోజు ఆయన భక్తుల్లో ఒకరు సమాధి మందిరానికి వచ్చి, దేశాయ్ ఎవరు? అని విచారించి, ఆ చేతి కర్రను ఇచ్చి, గత రాత్రి శంకర్ బాబా తన కలలో కనపడి తన దగ్గరున్న ఆ చేతికర్రలోని పిడిభాగాన్ని మర్నాడు ఉదయం సమాధి మందిరానికి వచ్చే దేశాయ్ అనే భక్తుడికి ఇవ్వమన్నారని చెప్పారట. ఆ భక్తుడు బహుపిసినారట. అయినా దాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం దేశాయ్‌ను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి దాన్ని వారు తమ పూజా మందిరంలో ఉంచుకొని ఆరాధిస్తున్నారు.

NARMADA2
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

శ్రీ దేశాయ్, అతని కుటుంబ సభ్యులు శంకర్ మహారాజ్ భక్తులు. శ్రీ శంకర్ మహారాజ్ ఓసారి షిరిడీ సాయిబాబాను కలిసి ఆయన ముందు మౌనంగా ఇరవై నిమిషాలు కూర్చుని వచ్చేశారట. వారి మధ్య మాటలు లేవు. శంకర్ మహారాజ్ సమాధి, ఆశ్రమం పునెలో ఉన్నాయి.

ముంబైలాంటి ధనిక నగరంలో ఇంతటి పవ్రిత, ఆధ్యాత్మిక వాతావరణం గల ఇల్లు ఉంటుందని ఊహించని నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. వారి ఇంటినుంచి బస్సు దగ్గరకు కొందరు పనివాళ్లు సామానుని మోసుకు వెళుతున్నారు. నేను, వెంకటేశ్వరరావు సామాను తీసుకెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే శ్రీమతి వృషాలి దేశాయ్ మమ్మల్ని వారించింది. మళ్లీ బస్సు దగ్గరకు వచ్చాం. డిక్కీలో గ్యాస్ సిలిండర్‌ను, పెద్ద వంటపాత్రలను, ఆహార పదార్థాలు గల మూటను ఎక్కిస్తున్నారు. అప్పటికి కొందరు ప్రయాణికులు వచ్చారు. దేశాయ్ ఓ కాగితం చూసి మాతో చెప్పారు.

వెనుక నుంచి ఆరో వరుసలో కుడివైపు రెండు సీట్లలో మీ ఇద్దరూ కూర్చోండి. ఈ రోజుకు అవి మీకు అలాట్ చేసిన సీట్లు. ప్రతీ రోజు ఓ వరుస ముందుకు జరిగి కూర్చోండి. అలా అంతా రొటేట్ అవుదాం. ఈ పద్ధతి నాకు నచ్చింది. ఇందువల్ల ప్రయాణికుల మధ్య మంచిసీట్ల కోసం పోట్లాటలు జరగవు. అందరూ అన్ని రకాల సీట్లలో కూర్చోవచ్చు. బస్సు వెనుక డిక్కీని తెరిచారు. మా లగేజీని అందులో పెట్టించి, ముఖ్యమైన సామాను గల చేతిసంచీలతో వచ్చి మా సీట్లలో కూర్చున్నాం.

NARMADA3
-తీర్థయాత్ర

అప్పుడే వెలుతురు కొద్దికొద్దిగా వస్తున్నది. కిటికీలోంచి చూస్తే షార్ట్స్, టీషర్ట్‌లలో వాకింగ్ చేసే వాళ్లు, పాలు, కూరలు తీసుకొని వెళ్లే వాళ్లు కనిపించారు. మా తోటి ప్రయాణికుల్లో కొందరు ట్యాక్సీల్లో వస్తే, మరికొందరు కార్లలో వచ్చారు. ఓ ముసలావిడ దాదర్‌లో లోకల్ ట్రెయిన్ దిగి నడిచి వచ్చేశానని చెప్పింది. దాదర్ లోకల్ రైల్వేస్టేషన్ నుంచి వీరింటికి నాలుగైదు నిమిషాల నడక దూరం మాత్రమే.

ఉదయం ఆరుకు అప్పటికి వచ్చిన ప్రయాణికులు ఎక్కాక బస్సు బయలుదేరింది. ఎక్కువమంది దత్తమార్గంలోని వారు కాబట్టి, శంకర్ మహారాజ్‌కి జై, దత్త మహారాజ్‌కి జై అని నిదాలు చేశారు. దాదర్‌లోనే పక్కనే ఉన్న దత్త మందిరం దగ్గర బస్సు ఆగింది. దిగి అంతా లోపలకు నడిచాం. కొందరు పూలదండలు, కొబ్బరికాయలు కొని మందిరంలో సమర్పించారు.

బాలకృష్ణ మహారాజ్ అనే ఓ మహాత్ముడి మందిరం అది. ఆయనది కూడా దత్త సాంప్రదాయమే. ఆయన జీవిత చరిత్ర ఇంగ్లీష్‌లో దొరుకుతుందా అని అడిగితే ఒకాయన వెదికి ఒక్క కాపీనే ఉందని ఇచ్చారు. దాన్ని కొన్నాను. ఆయన శిష్యుల జీవితకథలు మరాఠీ భాషలో ఉన్నాయి. అయినా, వాటిని కొన్నాను.

శ్రీ శంకర్ మహారాజ్

శ్రీ శంకర్ మహారాజ్ ఓసారి షిరిడీ సాయిబాబాను కలిసి ఆయన ముందు మౌనంగా ఇరవై నిమిషాలు కూర్చుని వచ్చేశారట. వారి మధ్య మాటలు లేవు. శంకర్ మహారాజ్ సమాధి, ఆశ్రమం పునెలో ఉన్నాయి.

-సశేషం

177
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles