భరతనాట్య కళా ప్రమోదుడు!


Wed,May 8, 2019 12:27 AM

తకిట తదిమి తకిట తదిమి తందాన.. హృదయ లయల జతుల గతుల థిల్లాన.. అంటూ పలికే స్వరాలకు.. కాళ్లు.. చేతులు లయబద్ధంగా కదులుతూ నర్తిస్తాయి! అంతటి మహత్తర శక్తి.. మహిమ భరతనాట్యానికి ఉన్నది. ప్రాచీన నాట్యకళ అయిన భరతనాట్య భంగిమల్లో ఒదిగి.. ఎదిగి.. రేపటి తరానికి నాట్యవారధిగా నిలుస్తున్న యువ నృత్యకారుడు పుండ్ర ప్రమోద్‌కుమార్‌రెడ్డి పరిచయం.
pk-reddy
భావం.. రాగం.. తాళం ఏకమైన సమయం.. ముఖ హస్త, పాద కదలికల సమాహారం.. భంగిమలు అనేకానేకం.. సంగీతంతో జతకట్టిన ప్రాణం.. కాలి అందియలు ప్రతిధ్వనించెను ఎద లయల శబ్దం.. నాట్యముద్రలు ప్రతిబింబించెను ఆహార్యం.. ప్రాచీన కళలో ప్రత్యేకం ఆ నాట్యం.. నియమాలు ఆద్యంతం కఠినం.. నవరసాలు పలికించేను భరతనాట్యం.. అతను స్టేజీ ఎక్కితే తలపించెను నటరాజు మాదిరి నృత్యం.. మన ప్రమేయం అనవసరం.. కరతాళ ధ్వనులు ఖాయం.. భరతనాట్యంతో అద్భుత భావాలు చిలికిస్తున్నాడు ప్రమోద్.

మహిళలే చేస్తారా?

నృత్యం భావాల్ని వ్యక్తీకరించుకునేందుకు ఒక మాధ్యమం. శరీరానికి ఒక మంచి వ్యాయామం. నృత్యం ఆనంద సమాహారం. వెలకట్టలేని భావాల్ని పలికించే సాధనం. పూర్వీకుల నుంచి అందుకున్న వారసత్వం. వెలకట్టలేని భావాల్ని పలికిస్తూ.. వేలాది హృదయాల్ని రంజింపజేస్తున్న యువ కళా కిరణం పుండ్ర ప్రమోద్‌కుమార్‌రెడ్డి. హైదరాబాద్‌లోని గురుకుల పాఠశాల కళలకు పునాది వేసింది. అక్కడ కలిగిన ఆసక్తి ఇప్పుడతడిని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. స్త్రీలే ఎక్కువగా భరతనాట్యం చేస్తారనే అపోహ సమాజంలో పాతుకుపోయి ఉన్నది. కానీ నృత్య గురువు నటరాజు, ఆ తర్వాత అనేకానేక మంది పురుషులు భరతనాట్యం చేశారు. కాలక్రమంలో పురుషులు భరతనాట్యాన్ని ప్రదర్శించేందుకు వేదికలు కరువయ్యాయి. ప్రస్తుతం కళకు జీవం పోస్తూ తన నృత్యంతో తన్మయపరుస్తూ ఎంతోమందికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు.

కళా ప్రవేశం

2006లో హైదరాబాద్‌లోని గురుకుల పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడి గురువులు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్యం తదితర కళలపై బేసిక్స్ నేర్పించారు. ఆ ఆసక్తితో ప్రమోద్‌కుమార్ సికింద్రాబాద్‌లోని భక్తరామదాసు సంగీత కళాశాలలో ప్రవేశం పొందారు. ఆ సమయంలో కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రమోద్ స్టేజీపై నృత్యాన్ని ప్రదర్శించారు. గురువులు, విద్యార్థులు ప్రమోద్ రెడ్డి నృత్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఆ తరువాత గురువులు మంజుల శ్రీనివాస్, చిత్రా నారయణన్ ప్రోత్సాహంతో భరతనాట్యంలో మరింత ముందుకెళ్లారు.

అభినేత్రి స్థాపన

విద్యాభ్యాసం అనంతరం ప్రమోద్ థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానీ తనకు భరతనాట్యంపై ఉన్న ఆసక్తితో 2003లో సికింద్రాబాద్‌లో అభినేత్రి డ్యాన్స్ అకాడమీ ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులకు ప్రాచీన కళలను వారసత్వంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పేద ఆణిముత్యాలను గుర్తించి ఉచితంగా భరతనాట్య మెళకువలు నేర్పిస్తున్నారు.

కళాకారుల వద్దకే

గ్రామీణ నేపథ్యమున్న పిల్లల్లో చాలామంది అద్భుతంగా భరతనాట్యం చేయగలరు. కానీ వారికి ఎక్కడ కళను ప్రదర్శించాలో తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు. మొత్తంగా చెప్పాలంటే వారికి సరైన వేదిక దొరక్క వారి ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నారు. అలాంటి వారిని వెలికి తీసేందుకు ప్రమోద్‌కుమార్‌రెడ్డి నేరుగా వారినే వెతుక్కుంటూ వెళ్తున్నారు. గ్రామీణ కళాకారులను సమాజానికి పరిచయం చేస్తున్నారు. వారికి మరిన్ని మెళకువలు నేర్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళా ప్రదర్శనలు ఇచ్చేలా ప్రమోద్ కృషి చేస్తున్నారు. తాను అద్భుత ప్రదర్శనలివ్వడమే కాకుండా, ఇతరుల కళలను ప్రదర్శించేందుకు తానే ఒక వేదిక చూపుతూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను కలిపి ఒక నృత్య రూపకంలో గంటన్నరసేపు ప్రదర్శన ఇచ్చారు.

pk-reddy2

దేశదేశాన కళా ప్రదర్శన

ప్రమోద్‌రెడ్డి ఇప్పటివరకు చాలా దేశాల్లో భరతనాట్య ప్రదర్శనలిచ్చారు. హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్‌లో వర్క్‌షాపు నిర్వహించారు. 2015లో యూఎస్‌లో (TANA) వాళ్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అక్కడ ఒకే వేదికపై భరతనాట్యం, పేరిణి నృత్య ప్రదర్శన ఇచ్చారు. నృత్యంతో అక్కడి తెలుగు ప్రజల మనసులను రంజింపజేశారు. నృత్యప్రియుల అభిమానాన్ని చూరగొంటున్నారు.

కళా నిపుణుడు

కాలేజీ వార్షికోత్సవం రోజున ఇచ్చిన ప్రదర్శన ప్రమోద్‌కు మొదటిది. ఇప్పటి వరకు 500కు పైగా స్టేజీలపై ఆయన ప్రదర్శనలిచ్చారు. భారతీయం పేరిట మనకు స్వాతంత్య్రం ఎలా వచ్చింది. పేదరికాన్ని, అసమానతల్ని ఎలా ఎదుర్కోవడం వంటి అంశాలతో కూడిన నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఇలా సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని వందలాది అంశాలతో ప్రమోద్ నృత్య ప్రదర్శనలిస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించి ముంబాయికి చెందిన నృత్య రంజని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2016లో కళా నిపుణ అవార్డు అందించారు. చత్తీస్‌గఢ్‌లోని బిైల్లెకి చెందిన నృత్యాతి కళాక్షేత్రం వారి నుంచి నాట్య మయూరం అవార్డు అందుకున్నారు. ఇలా లెక్కలేనన్ని సన్మానాలు సత్కారాలు ప్రమోద్ ఖాతాలో పడ్డాయి.

pk-reddy3

ప్రాచీన కళలకు ప్రాణం

పురుషులు భరతనాట్యం చేయలేరు అంటుంటారు. పురాణాల్లో భరతనాట్యం నేర్పించిన గురువులంతా పురుషులే. భావాల్ని వ్యక్తపర్చడానికి భరతనాట్యం చాలా ఉపయోగపడుతుంది. భావం, రాగం, తాళం డ్యాన్స్‌తో పాటు సంగీత పరిజ్ఞానం ఉంటేనే భరతనాట్యం బాగా చేయగలుగుతారు. మేం కొత్త కొత్త కాన్సెప్టుల ద్వారా గ్రామాల్లోకి వెళ్తున్నాం. గ్రామీణ ఆణిముత్యాలకు మరింత పదును పెట్టే పనిలో ఉన్నాం. ప్రాచీన కళలకు మేమంతా ప్రాణం పోయాలని సంకల్పించుకున్నాం.
-పుండ్ర ప్రమోద్ కుమార్ రెడ్డి

గంధర్వ వేదిక

ప్రతి ఏటా దేశంలోని పురుష నృత్యకారులందరినీ ఒక్కచోటకు చేర్చి గంధర్వ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని కళాకారులందరినీ ఒకే వేదిక మీద చూసేందుకు ప్రమోద్ సొంత ఖర్చుతో ఆ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఏటా పురుషుల కోసం శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. 2013 నుంచి నాట్య ప్రవాహ కార్యక్రమంతో ప్రతి ఏటా 25ఏళ్లలోపు నృత్యకారులతో నృత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన సొంత ఖర్చుతో యువత కళల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. గతేడాది నుంచి (సీక్ ఎ థాన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వివిధ రంగాల్లో ప్రముఖులైన వారితో యువకులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం 2018 జూలైలో ప్రారంభమైంది. భవిష్యత్‌లోనూ ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రమోద్ చెప్పారు.

నాట్య గురువు

తనకు ఇష్టమైన కళ కోసం ప్రతీరోజు గంట కేటాయిస్తున్నారు ప్రమోద్. ఎన్ని పనులున్నా సాధన చేయనిదే ఆయన రోజును ప్రారంభించరు. ప్రమోద్ వద్ద ఇప్పటి వరకు 100 మందికి పైగా భరతనాట్యం నేర్చుకున్నారు. అలా నేర్చుకున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే మరికొంతమందికి నేర్పిస్తున్నారు. ఇలా ప్రమోద్ మూడు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

-పీఆర్‌కే
-గడసంతల శ్రీనివాస్

126
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles