కొత్త నవ్వుల లోకం!


Sun,May 5, 2019 01:15 AM

నవ్వించడంలో ఎన్ని రకాలున్నా.. కొత్తగా ప్రయత్నిస్తూనే ఉండాలి. అందుకే జనరంజక వినోదాన్ని పంచడానికి.. స్వచ్ఛమైన హాస్యాన్ని అందించడానికి ఈ నవ్వుల రారాజులు కంకణం కట్టుకున్నారు. ఎలాంటి బాధనైనా మరిపించి.. మనిషి ఆరోగ్యాన్ని పెంచే హాస్యమే వీరి లక్ష్యం. నాటికలు, చలోక్తులు, లాఫింగ్ క్లబ్బులు, మిమిక్రీ వంటి హాస్య సాధనాలకు తోడుగా.. స్టాండప్ కామెడీ అనే ఆయుధాన్ని చేపట్టి.. ఎంతోమంది జీవితాల్లో నవ్వులు పూయిస్తున్నారు. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆ నవ్వుల రారాజుల పరిచయం మీకోసం..
Comedy
స్టాండప్ కామెడీ.. ఈ మధ్య చాలా ప్రముఖ నగరాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే.. అక్కడ స్వచ్ఛమైన నవ్వు దొరకడమే. ఈ స్టాండప్ కామెడీ.. హాస్య ప్రక్రియలలో జతకలిసి ప్రేక్షకులకు విభిన్న, వినూత్న పద్ధతిలో నవ్వుల అనుభూతులను పంచుతున్నది. ఎప్పటి నుంచో పాశ్చాత్యుల పెదవులపై నవ్వుల జల్లు కురిపిస్తున్న ఈ కళ.. ఐదేళ్ల నుంచి మన దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరించింది. 2014లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రాజశేఖర్ మామిడిన్న ద్వారా మన భాగ్యనగరానికి పరిచయమైంది. నాటి నుంచి హైదరాబాదీల హృదయాల్లో నవ్వులు పూయిస్తూ.. కొత్త నవ్వుల లోకాన్ని పరిచయం చేసింది స్టాండప్ కామెడీ. ఈ నవ్వుల యజ్ఞంలో తమదైన పాత్ర పోషిస్తూ.. నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు రాజశేఖర్ మామిడన్న, సాయికిరణ్, రోహిత, ఉమేష్ సొమాని, అవినాష్ అగర్వాల్, మహేష్, అరుణ్ గోవాడ, భవనీత సింగ్, అవినాష్ ఘోష్, షాదాబ్ ఆజీజ్ వంటి స్టాండప్ కమెడియన్స్.

Comedy1

గ్రూపులుగా నవ్విస్తున్నారు

రాజశేఖర్ మామిడన్న బెంగళూరులో చదువుకుంటున్న రోజుల్లో ఈ వినూత్న పద్ధతి గురించి తెలుసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాండప్ కమెడియన్ రసెల్ పీటర్ షోలు చూసి, తనూ అలా నలుగురిని నవ్వించాలనుకున్నారు రాజశేఖర్. అలా స్టాండప్ కామెడీని కెరీర్‌గా ఎంచుకున్నారు. 2014లో తొలిసారిగా మాదాపూర్‌లో స్టాండప్ కామెడీపై ఆసక్తి ఉన్నవారందరినీ ఒక వేదికపై తీసుకొచ్చేందుకు ఓపెన్ మైక్ పేరుతో ఒక ప్రోగ్రాం ప్రారంభించారు. అందులో పాల్గొన్న సాయికిరణ్, రోహిత, ఉమేష్ సొమాని, అవినాష్ అగర్వాల్ తదితరులు ఈ అధునాతన హాస్య ప్రక్రియను నలుగురిలోకి తీసుకెళ్లాలనుకున్నారు. వాళ్లంతా కలిసి ఫన్నీ సైడ్ అప్ పేరుతో గ్రూప్‌ను ప్రారంభించారు. ఔత్సాహికులను ప్రోత్సహించడంతోపాటు వివిధ వేదికలపై స్టాండప్ కామెడీని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. స్టాండప్ కామెడీకి ఫిదా అయిన అవినాష్ ఘోష్, మహేష్, అరుణ్ గోవాడ, భవనీత సింగ్, షాదాబ్ తదితర ఔత్సాహికులు కలిసి హైదరాబాడ్యాస్ అనే గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్టాండప్ కామెడీ ఇంగ్లిషు, హిందీ, ఉర్దూ భాషలకు మాత్రమే పరిమితమైంది. చాలా తక్కువ సందర్భాల్లో తెలుగులోనూ నవ్విస్తున్నారు. ఈ స్టాండప్ కామెడీలో గ్రూపులు ఎన్ని ఉన్నా.. వారందరి లక్ష్యం నవ్వించడమే.

Rajashekar1

ఇప్పుడు ట్రెండ్ ఇదే

నగరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టాండప్ కామెడీకి చోటు దొరుకుతున్నది. వినోద కార్యక్రమాల్లో తప్పనిసరిగా స్టాండప్ కామెడీ షోలనూ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. వివాహ వేడుకలు, పుట్టినరోజు ఫంక్షన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. కార్పొరేట్ కంపెనీలు నిర్వహించే వేడుకలు, రకరకాల ఈవెంట్స్‌లోనూ ఇప్పుడు స్టాండప్ కామెడీ భాగమైంది. స్టార్ హోటల్స్, కాఫీ షాపులు, పబ్‌ల వంటి ప్రదేశాల్లోనూ సందర్శకులను ఆకట్టుకునేందుకు ఆయా యాజమాన్యాలు వారానికొకసారైనా కామెడీ షోలను నిర్వహిస్తున్నాయి. నగరంలోని ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్స్ అందరూ వృత్తిపరంగా చాలా బిజీ అయ్యారు. వీరికి నెలకు సరిపడా కాల్షీట్లు ఉన్నాయి. ఇక షోకు తగ్గట్లుగా వారి రెమ్యూనరేషన్ ఉంటున్నది. సైనిక్‌పురిలోని కాఫీ కప్, జూబ్లీహిల్స్‌లోని హార్ట్ కప్ కెఫె పబ్, బంజారాహిల్స్‌లోని లమాఖాన్ తదితర చోట్ల స్టాండప్ కామెడీ షోలు రెగ్యులర్‌గా జరుగుతుంటాయని చెబుతున్నారు కమెడియన్లు.
..?డప్పు రవి

ఇంకా అద్దం ముందేనా?


Rajashekar
మాది కొత్తగూడెం. నేను ఎంబీఎ చదివాక మూడేళ్లపాటు బెంగళూరులో ఉద్యోగం చేశా. ఆ సమయంలో పబ్లిక్ స్పీకింగ్ ఫోరమ్‌లో హాస్య ప్రసంగాలిచ్చేవాణ్ని. అప్పుడే స్టాండప్ కామెడీ గురించి తెల్సింది. నచ్చింది. సవాల్‌గా తీసుకున్నా. 2012లో హైదరాబాద్‌లో ఇంగ్లిషులోనే స్టాండప్ కామెడీ ప్రారంభించా. నేనే హోస్ట్ చేసేవాణ్ణి. కమెడియన్లను పిలిచి కార్యక్రమం నిర్వహించడం ఓ సవాల్‌గా ఉండేది. అయినా ఇష్టంగా చేశా. సోషల్ మీడియా వల్ల ఈ స్టాండప్‌కి బాగా క్రేజ్ వచ్చింది. ఇటీవలే మన దేశంలోని 21 నగరాల్లో సందేశ్ జానీ, భవనీత్‌తో కలిసి స్టాండప్ కామెడీ టూర్ చేశా. అదో మంచి అనుభూతి. భారత దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కళకి ఆదరణ పెరుగుతున్నది. ఈ రంగంలోకి రావాలనుకునేవారికి నవ్వించే సత్తా ఉండాలి. బాగా రాయాలి. అద్దం ముందు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఓపెన్ మైక్స్‌కి వచ్చి లైవ్‌లో జనాలను నవ్విస్తేనే కిక్ తెలుస్తుంది.
- రాజశేఖర్ మామిడన్న, స్టాండప్ కమెడియన్

నవ్వించడం ఈజీ కాదు!


Saikiran
స్టాండప్ కామెడీలో నలుగురైదుగురు కళాకారులు కలిసి సన్నివేశం ద్వారా హాస్యాన్ని పండించడం కుదరదు. మిమిక్రీ అసలే చేయకూడదు. చలోక్తులు చెప్పాలి. సొంతంగా సంభాషణలు, సన్నివేశాలు రాసుకొని వేదికపై ఏకపాత్రాభినయంతో పలికించాలి. నిమిషానికి కనీసంగా 3 సాైర్లెనా ప్రేక్షకులను నవ్వించాలి. అదేం అనుకున్నంత ఈజీ కూడా కాదు! సమయస్ఫూర్తి చాలా అవసరం. కానీ అప్పటికప్పుడు కథ అల్లేసి చెప్పడం కూడా కష్టమే. స్టాండప్ కమెడియన్ కావాలంటే రచయిత కూడా అయిండాలి. తడబాటులకు తావులేదు. పంచ్ డైలాగులో, ప్రాసతో కూడిన మాటలతో ప్రేక్షకుడిని కుదురుగా కూర్చోనివ్వకూడదు. ఏ మాత్రం తేడా వచ్చిందా నవ్వుమాట దేవుడెరుగు నవ్వులపాలవడం ఖాయం.
- సాయికిరణ్, స్టాండప్ కమెడియన్

మనోభావాలే మాకు ముఖ్యం


Shadab-Aziz
నా స్వస్థలం వరంగల్. నాకు తెలుగు సరిగ్గా రాదు. దాంతో నా తెలుగు పలికే తీరుతోనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తుంటా. స్టాండప్ కమెడియన్‌గా స్థిరపడాలనేది నా కోరిక. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ దీన్నొక ప్రవృత్తిగా కొనసాగిస్తున్నా. నాలాంటి చాలామంది స్టాండప్ కమెడియన్ల అభిప్రాయం కూడా అదే. మేమంతా ప్రేక్షకులను లైవ్‌గా, మాటలతో నవ్వించడాన్ని ఆస్వాదిస్తాం. ప్రకృతి ప్రసాదించిన తొమ్మిది రసాల్లో.. హాస్యాన్ని వదిలేసి అన్నింటినీ విచ్చలవిడిగా వాడేస్తున్నారు మనోళ్లు. అందుకే మేం తీసుకునే అంశాలు కూడా విభిన్నంగానే ఉండేలా జాగ్రత్త పడతాం.
- షాబాద్ ఆజీజ్, స్టాండప్ కమెడియన్

194
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles