మోక్షానికి దగ్గరి దారి!


Fri,May 3, 2019 01:27 AM

త్రిమూర్తుల వంటి త్రిమతాచార్యులు ఏం చెప్పారు? మనమేం చేస్తున్నాం? అందని ద్రాక్ష వంటి పరమాత్మ తత్వాన్ని మనుషులకు ఎరుక పరచడంలో వారు పూర్తిగా కృతకృత్యులయ్యారు. కానీ, మేధావులుగా చలామణి అవుతున్న చాలామంది మానవులు ఇంకా దైవానికి దగ్గర కాలేకపోతున్నారు. ఎందుకు? ఏం జరిగింది? ఎక్కడుంది అసలు లోపం??
moksh
ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు.. ఈ ముగ్గురు త్రిమతాచార్యులు కారణజన్ములే. వారే కనుక, ఈ భూమ్మీద పుట్టి ఉండకపోయుంటే భారతీయతకు ఆత్మవంటిదైన వైదికధర్మం పరిస్థితి ఏమిటి? అనితర సాధ్యమైన వేద వాజ్మయాన్ని, సృష్టికర్త తత్వసారాన్ని అరటిపండు ఒలిచి పెట్టినంత హృద్యంగా వారు ముగ్గురూ తమ సిద్ధాంతాల (అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత)లో అందించినప్పటికీ ఈ ఆధునిక సమాజంలోని చాలామంది ఇప్పటికింకా ఎందుకు అందిపుచ్చుకోకుండా గందరగోళంలో మునిగి తేలుతున్నట్టు? అసలు భూమిమీదే అత్యంత బుద్ధిజీవులైన (ఇలాంటి) మనుషులకు నిజానికి ఏం కావాలి? మొత్తం మీద సామాన్యుల ఆకలి దప్పులే ఈ కలియుగం పాలిట ఆఖరకు ప్రాథమిక శాపాలు కాబోతున్నాయా? ధర్మానికి స్వర్ణకాలమైన సత్యయగం కోసం కలలు కనడం తప్ప మనమేమీ చేయలేమా?

భూమ్మీద మనుషుల పుట్టుకకు మూలం ఏమిటి? జీవితం అశాశ్వతమని తెలిసీ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గం గురించి పలువురు ఎందుకు ఆలోచించడం లేదు? ఇంకా చాలామంది భక్తిమార్గంలో ఉన్నప్పటికీ పేరుకే పూజలు, వ్రతాలు చేస్తూ వ్యవహారంలో ధర్మజీవితానికి ఆమడదూరంలోనే ఉంటారు. చిత్తం శివుని మీద ఉంచుతూ, భక్తిని మాత్రం మరెక్కడో లగ్నం చేస్తారు. ఒకవైపు పాపాలు చేస్తూనే మరోవైపు వరాల కోసం పాకులాడతారు. మన కడుపు నిండినా పక్కవాడి ఆకలి గురించి పట్టించుకోరు. ఎవరేమైనా, ఏదేమైనా కానీ, మనసా వాచా కర్మనా ధర్మం వైపు అస్సలు నిలబడరు. పంచాంగకర్తల లెక్కల ప్రకారం కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5,120 సంవత్సరాలవుతున్నది.

భూమ్యాది సృష్టి అంతా ఆవిర్భవించి 195,58,85,115 ఏండ్లవుతున్నది. మహాభారత యుద్ధం క్రీ.పూ.3,000-1,000 సంవత్సరాల మధ్య జరిగినట్టు అంచనా. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఉద్భవించినప్పట్నుంచీ తొట్టతొలుత ఆదిశంకరులే వాటికి భాష్యం చెప్పే వరకూ కలికాలమంతా అజ్ఞానమే అనాలి. పరమోన్నత వేద జీవన విధానానికి ముప్పు వాటిల్లే విపత్కర పరిస్థితుల్లోనే ఈశ్వరావతారంగా ఆ మహానుభావుడు భారతావనిలోని కేరళకు చెందిన నాటి పూర్ణానది తీరానగల కాలడిలో క్రీ.శ. 788లో (శృంగేరి శంకరమఠం ప్రకారం) లేదా క్రీ.పూ. 509లో (కంచిమఠం ప్రకారం) జన్మించారు. ఆయన పుట్టుక నుంచి నిర్యాణం వరకు అప్పట్లో వారు చేసిన అద్భుతాలు ఎన్నో. ఒక సాధారణ మానవుడికి ఇలాంటివి అసాధ్యం.

శంకరులు జీవించింది కేవలం 32 సంవత్సరాలే అయినా వేల ఏండ్ల తరబడి నిలిచిపోగల వేదవాజ్మయాన్ని అందించారు. వైదికధర్మం పూర్తిగా మంట కలిసిపోకుండా మానవులకు కావలసిన రీతిలో అందించడం ద్వారా సమస్త మానవజాతికి ఆయన చేసిన మహోపకారం వెలకట్టలేనిది. వారు అందించిన అద్వైత సిద్ధాంతాన్ని ఇవాళ ప్రపంచమంతా కండ్లకు అద్దుకుంటున్నది. ఇది ఎంత శాస్త్రీయమో, అంత మానవీయం. ఎంత భౌతికమో, అంత పారమార్థికం. ఆయన దేన్నయితే మాయ అన్నారో, ఏదైతే శాశ్వతసత్యమని నిర్వచించారో, మనిషికి ఏది ఆచరణీయమన్నారో అవన్నీ నేటికీ శిరోధార్యాలే. మనిషి నిరంత పిపాసి. ఎంత గొప్పదాన్నయినా కాలం గడుస్తున్న కొద్దీ మొహమొత్తిపోయేలా చేసుకోవడంలో దిట్ట. మళ్లీ మరో కొత్తదనం కోసం అర్రులు చాస్తుంటాడు. ఈ జిజ్ఞాసను తన స్వార్థసంకుచితాలకు వాడుకోకుండా లోకకల్యాణానికి, జగద్రక్షణకూ ఉపయోగిస్తుంటే, సృష్టిలోని జీవజాతులకే మనిషి మాకుటాయమానం అయ్యేవాడు. కానీ, ఇవాళ పశు, వృక్ష, జంతు, పక్షి జాలాలన్నింటికన్నా హీనమైన స్థితికి చేరుకొన్నాడు. మేధోపరంగా, సాంకేతిక పరంగా ఎంత సాధిస్తే ఏం లాభం.. అశాశ్వతమైన, అప్రధానమైన, అల్పమైన కీర్తిని మూట గట్టుకొన్నాక!

జీవుల్లోని జీవాత్మకు, సర్వశక్తిమంతమైన పరమాత్మకు మధ్య భేదం లేదని, అణువణువునా అందరిలోనూ దేవుడున్నాడని, జ్ఞానంతో కూడిన భక్తి సమర్పణే అసలు ఫలితాన్నిస్తుందని శంకరుల వారు అతిగొప్ప, అత్యద్భుత వేదాంతసత్యాన్ని తనదైన అద్వైత సిద్ధాంతంలో ఆవిష్కరించారు. ఎవరికి వారు (చాలామంది) అహం బ్రహ్మస్మిలో పడి ఈ భక్తిపూర్వకమైన ఆత్మజ్ఞానసాధనను మరిచారు. ఫలితంగా వెయ్యేండ్లలో అద్వైతం పలు అపోహలకు వేదికైంది. మళ్లీ వైదికధర్మానికి ముప్పు వాటిల్లే సమయం ఉత్పన్నమవడంతో క్రీ.శ. 1017లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో సాక్షాత్ ఆదిశేషువు అవతారంగా రామానుజులు జన్మించారు. ఆయన ప్రబోధించిన విశిష్టాద్వైతం నేనే దేవుణ్ణని, ఇంక భక్తి, ఆరాధనలతో నాకేం పని? అన్న మనిషి దురహంకారానికి అడ్డుకట్ట వేసింది. ఈ సిద్ధాంతం జీవ-పరమాత్మలు రెండింటినీ చాలా స్పష్టంగా వేరు పరచడం విశేషం. శంకరులు ఏ ప్రామాణిక వేదవాజ్మయాన్నైతే ఆధారంగా చేసుకొన్నారో, దానినే రామానుజుల వారు కూడా తమ భాష్యానికి స్వీకరించారు. సామాజిక ప్రగతిని అడ్డుకొనే ఛాందసానికి స్వస్తి చెప్పాలని, దేవుని దృష్టిలో మానవులంతా సమానమేనని, కులమతాల భేదాలు అనవసరమని ఆయన చాటిచెప్పారు.

మరో 221 సంవత్సరాల తర్వాత క్రీ.శ. 1238లో వాయుదేవుని అవతారంగా మధ్వాచార్యులు కర్నాటకలోని ఉడిపి వద్దగల పాజక గ్రామంలో జన్మించారు. అద్వైతంలోని అపోహలను మరింత లోతుగా తొలగింపజేస్తూ ద్వైత సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. వీరు కూడా అదే వేద సాహిత్యానికి అద్భుతరీతిలో భాష్యం చెప్పారు. ఈశ్వరుడు ఎంత సత్యమో, జీవుడూ, జీవజగత్తులూ అంతే సత్యమని మధ్వాచార్యులు ప్రబోధించారు. త్రిమతాలన్నింటి సారమైన భక్తియోగాన్ని ఈ మూడు సిద్ధాంతాలూ మానవుల ముక్తిసాధన కోసం ప్రస్ఫుటంగా ప్రతిపాదించాయి. భక్తికి జ్ఞానయోగం తప్పనిసరి. మరి, ఎంతమంది తమ హృదయాంతరంగంలో వాటిని ఆచరణాత్మకం చేయగలుగుతున్నారన్నది ఇప్పటికీ ప్రశ్నే. వీటి ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలకు ఆధ్యాత్మిక వేత్తలు తక్షణం పూనుకోవలసి ఉంది.
భగవద్గీతలోని 18 యోగాలు, వాటిలోని సుమారు 700 శ్లోకాలూ ఉపనిషత్తుల సారమని, ఆత్మ పరమాత్మల తత్వచింతనకు దానిని మించిన దర్పణం మరొకటి లేదని అందరం అర్థం చేసుకొని, ఆ మేరకు ధార్మిక జీవనానికి అలవాటు పడితే ఈ సమాజానికి ఇంతకన్నా కావలసిందేముంటుంది!

moksh2

అద్వైతమే విశ్వతత్వం

అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక విశ్వతత్వం వేదోక్తమైన అద్వైత సిద్ధాంతమేనని న్యూఢిల్లీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఏవీ మొహరిర్ అన్నారు. భూమిపై ఇదే సర్వోత్కృష్టమైన (perfect) మానవ జీవన విధానమని, ఇది పూర్తి శాస్త్రీయమే గాక, ప్రాకృతిక సూత్రాలకూ అనుగుణమైందనీ ఆయన చెప్పారు. సృష్టి ప్రాథమిక సిద్ధాంతాల ఆధారంగానే పరమోన్నత సత్యాన్వేషణకు పనికివచ్చే తిరుగులేని వాస్తవిక మార్గంగానూ దీనిని అభివర్ణించిన మొహరిర్, మోక్షసాధనకు మనకు అద్వైతాన్ని మించిన దగ్గరి దారి మరొకటి లేదని కూడా తెలిపారు.

-దోర్బల బాలశేఖరశర్మ

243
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles