నర్మద పరిక్రమ


Fri,May 3, 2019 01:27 AM

దేశాయ్‌కు నర్మద నదిలో దొరికిన, మధ్యకి కోసిన రెండు రాళ్లను ఓ భరిణెలోంచి తీసి చూపించారు. ఒక దాంట్లో శ్రీచక్రం స్పష్టంగా కనిపించింది. రెండో దాంట్లో గణపతి ఆకృతి ఉంది. నర్మద నదిలో లింగం, గణపతి ఆకృతి గల రాళ్లు దొరుకుతాయని ప్రభు చెప్పారు.
NARMAda

నదిలో దేవతల రాళ్లు!

(గత సంచిక తరువాయి)
అతనికి బాడుగ కాక ఇరవై రూపాయలు అదనంగా ఇచ్చి, గుర్రం మేతకు దాన్ని వాడమని ఆ బండివాడిని కోరాను. నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన నాలుగో నెలలోనే (జనవరి 2000లో) సద్గురు నిత్యానంద బాబాని సద్గురువుగా స్వీకరించే సందర్భం నాకు తటస్థించింది. ఆ ప్రకారం ఆయనను ఈ జన్మకు నా గురువుగా భావిస్తున్నాను. అన్నీ చూశాక బస్‌స్టాండుకు వెళ్లాం. విరార్‌కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. దాంట్లో వెళ్లి విరార్ లోకల్ స్టేషన్‌లో దిగాం. విరార్ తర్వాత రెండో స్టేషన్ మేం వచ్చేటపుడు దిగిన వసై రోడ్ స్టేషన్. కానీ, లోకల్స్ అన్నీ విరార్ నుంచే బయలుదేరుతాయి. కాబట్టి, కూర్చునేందుకు సీట్ దొరుకుతుందని అక్కడికి వచ్చాం. విరార్ నుంచి ఇద్దరికీ వసై స్టేషన్‌కు టిక్కెట్లు కొన్నాను. వసై నుంచి ఎటూ రిటర్న్ టికెట్లు ఉన్నాయి. లోకల్‌లో అంధేరీకి చేరుకొని, ఆటోలో ఇంటికి చేరుకునే సరికి రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది.

NARMAda2
మల్లాది వెంకట కృష్ణమూర్తి

రాత్రి తొమ్మిదికి వెంకటేశ్వరరావు, మా అక్కయ్య ఇంటికి ఫోన్ చేసి అక్కడికి ఎలా రావాలో మా బావగారిని అడిగి తెలుసుకున్నారు. అతనికి వివాహమైనా కుటుంబం హైదరాబాద్‌లో, అతను ముంబైలో ఒంటరిగా ఉంటున్నారు. కాబట్టి, భోజనానికి రమ్మని మా అక్క చెప్పింది. తన సామానుతో పదిన్నరకు అంధేరీలోని మా అక్క ఇంటికి అతను వచ్చేసారు. దాదర్ నుంచి వెళ్లకుండా మా యాత్రాబస్‌ని దారిలో ఇంకెక్కడైనా ఎక్కవచ్చా? అని మా బావగారు దాన్ని నిర్వహించే దేశాయ్‌కు ఫోన్ చేసి కనుక్కున్నారు. కానీ, అది వెళ్లే దారిలో మా ఇల్లు లేదని, ఉదయం ఆరుకల్లా తమ ఇంటికే రమ్మని ఆయన చెప్పారు. ఆ రాత్రి భోజనం చేశాక ఇద్దరం అక్కడే పడుకున్నాం. మర్నాడు ఉదయమే లేచి ఆటోలో బాంద్రాకు, అక్కడి నుంచి ట్యాక్సీలో ఇరవై నిమిషాల్లో దాదర్‌కు చేరుకున్నాం.

అక్టోబర్ 19, 2009. ఆదివారం, మొదటిరోజు.

దూరం నుంచే బయట రోడ్డుమీద ఆగివున్న పెద్ద టూరిస్ట్ బస్సు కనబడింది. అదే మనం వెళ్లే బస్సు అని వెంకటేశ్వరరావు చెప్పారు. దాని నంబరు ఎంహెచ్ 04జి 6672. దాని వెనుక ట్యాక్సీని ఆపించి డ్రైవర్‌కు డబ్బు చెల్లించి, డిక్కీలోని బ్యాగులను దింపి పేవ్‌మెంట్ మీద అప్పటికే అక్కడ ఉన్న మిగిలిన బ్యాగుల పక్కన పెట్టాం. వాటి పక్కనే నిలబడ్డ, నర్మద పరిక్రమ టూర్‌ను నిర్వహించే ప్రభు ట్రావెల్స్ అధినేత శ్రీ దేశాయ్, వెంకటేశ్వరరావును చూసి చిరునవ్వుతో పలకరించారు. దేశాయ్ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపిస్తుంటుందని త్వరలోనే గ్రహించాను. వెంకటేశ్వరరావు నన్ను ఆయనకు పరిచయం చేశారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడటమే తప్ప ముఖపరిచయం లేదు. బస్సు సైడ్ డిక్కీలో సామానుని ఎక్కిస్తున్నారు. పక్క సందులో, ఖాండ్కే బిల్డింగ్‌లో రెండో అంతస్థులోని దేశాయ్ ఇంటికి వెంకటేశ్వరరావు నన్ను తీసుకెళ్లారు.

NARMAda3
తీర్థయాత్ర

దేశాయ్ భార్య వృషాలి మమ్మల్ని పలకరించి టీ తీసుకొంటారా? అని అడగింది. వద్దంటే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఏదైనా తీసుకోండి అని కొద్దిగా చక్కెర తెచ్చిచ్చింది. ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా పెట్టి కాని పంపని ఆ సంప్రదాయం నన్ను ఆకట్టుకుంది. వారి కొడుకు ముప్పయి రెండేండ్ల శ్రీ ప్రభును వెంకటేశ్వరరావు పరిచయం చేశారు. అప్పుడే స్నానం చేసి వచ్చిన అతను టవల్ కట్టుకొని వున్నారు. అతను తండ్రితో కలిసి ప్రభు ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు బస్సును అద్దెకు తీసుకొని ఆధ్యాత్మిక యాత్రలను నడిపే అతనూ తండ్రిలా భక్తిపరుడు. వెంకటేశ్వరరావు పూర్వం తమ వాళ్లింట్లో చూసిన కొన్ని పవిత్ర, దైవపరమైన వస్తువులను నాకు చూపించమని కోరారు. ప్రభు వాటిలో కొన్నింటిని నాకు చూపించారు. పూర్వం దేశాయ్‌కు నర్మద నదిలో దొరికిన, మధ్యకి కోసిన రెండు రాళ్లను ఓ భరిణెలోంచి తీసి చూపించారు. ఒక దాంట్లో శ్రీచక్రం స్పష్టంగా కనిపించింది. రెండో దాంట్లో గణపతి ఆకృతి ఉంది. నర్మద నదిలో లింగం, గణపతి ఆకృతి గల రాళ్లు దొరుకుతాయని ప్రభు చెప్పారు. వారికి దొరికిన లింగాకారంలో, గణపతి ఆకారంలో ఉన్న మరికొన్ని రాళ్లను కూడా ప్రభు చూపించారు.

-సశేషం

173
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles