అందమైన.. అరుదైన పక్షుల కోసం


Sun,April 28, 2019 12:52 AM

గెలుపే లక్ష్యంగా సాగే పనిలో.. ఆశ, నిరాశ, కష్టం, నష్టం, శ్రమ, ఆనందం ఉంటాయి. కానీ నచ్చి చేసే పనిలో కేవలం సంతృప్తి మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మ సంతృప్తి మనిషిని ఎంతదూరమైనా నడిపిస్తుంది. చెట్లు, పుట్టలు, గుట్టలు, రాళ్లు-రప్పలు, చివరికి క్రూరమృగాలు ఎదురైనా ఆ ప్రయాణం ఆగదు. ఆ సంతృప్తిని ఆస్వాదించడానికే భుజానికి కెమెరా వేసుకొని ఇల్లు విడిచాడు కార్తీక్. ఈ విశాల రంగుల ప్రపంచంలో.. అందమైన రంగు రంగుల పక్షుల కోసం వేట మొదలెట్టాడు. అరుదైన పక్షిజాతులను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ప్రయాణిస్తూనే ఉన్నాడు.
Karthik-Sai
తలకోన దట్టమైన అడవుల్లో అరుదుగా కనిపించే ఇండియన్ బర్డ్ అది. దానిని ఎలాగైనా బంధించాలనుకున్నాడు కార్తీక్. అందుకోసం కెమెరా భుజాన వేసుకొని అడవి మధ్యలోకి వెళ్లాడు. ఆ పక్షి తిరిగే ప్రాంతానికి చేరుకొని.. దాదాపు రెండు గంటల నుంచి వేచిచూస్తునే ఉన్నాడు. ఆ పక్షి వచ్చే సమయానికి కెమెరాతో సిద్ధమయ్యాడు. ఉన్నట్టుండి ఏదో అలికిడి. పక్కకు చూస్తే.. చెట్టుమీద నుంచి దూకిన చిరుతపులి.. కార్తీక్‌పై దాడి చేసేందుకు దూసుకొస్తుంది. రెప్పపాటులోనే ఆ చిరుతను తన కెమెరాలో బంధించాడు. తన డ్రైవర్‌సాయంతో కారులోకి దూకి క్షణాల్లోనే తప్పించుకున్నాడు. ఆ ఫొటో అతనికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.

Red-whiskered-bulbul
ఫొటోగ్రఫీ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ వైల్డ్ ఫొటోగ్రఫీ. నిత్యం అడవుల్లో సంచారం. విష సర్పాలు, క్రూరమృగాల మధ్య సహవాసం. ఎప్పుడు ఆపద ముంచుకొస్తుందో తెలియదు. క్షణకాలం ఆశ్రద్ధగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. అలాంటి రంగం ఇది. అందులోనే ఏదో తెలియని కిక్‌ని ఆస్వాదిస్తుంటారు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు. వారిలో ఒకడు కార్తీక్‌సాయి. తల్లిదండ్రులది హైదరాబాద్ అయినా.. స్థిరపడింది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో. ఎవ్వరినో సంతోషపెట్టడానికి బతికే బదులు.. తనకోసం బతకాలన్న సంకల్పమే పెద్ద గుర్తింపు నిచ్చింది. జాతీయ అవార్డులను అందించింది.

common-moorhen

జీవితాన్ని మార్చిన పక్షి!

తిరుపతిలో కార్తీక్ వాళ్ల ఇంటికి రోజూ ఓ చిన్న పక్షి వచ్చేది. దానిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు అతను. పిచ్చుకలాగే ఉన్నా.. అదొక రకం. మెడ, కంటిభాగం, తోక దగ్గర ఎర్రగా చూడముచ్చటగా ఉంది. దాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు కార్తీక్. రోజూ ఆ పక్షికోసం ఎదురుచూస్తుండేవాడు. దానికి కావాల్సిన ఆహారం సమకూర్చేవాడు. దాని పేరు కూడా తెలియకపోవడంతో నెట్‌లో వెతికాడు. దాని పేరు రెడ్ విష్కెరెడ్ బుల్‌బుల్ అని తెలిసింది. అప్పటి నుంచి రోజూ పక్షుల గురించి నెట్‌లో వెతికేవాడు. అంతరించిపోతున్న పక్షిజాతులను ఆరా తీశాడు. ఇప్పటికి ఎన్ని జాతులు బతికున్నాయో? ఎన్ని జాతులు అంతరించిపోయాయో? తెలుసుకోవాలనిపించింది. అందుకోసం ఫొటోగ్రాఫర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయం ఇంట్లో చెబితే.. మొదట తిరస్కరించినా కార్తీక్ పట్టుదలతో ఒప్పుకోక తప్పలేదు.

jungle-bush-quail

పక్షుల సైకాలజీ చదివాడు..

ఫొటో స్టూడియోలో, లేదంటే ఇతర ఫంక్షన్లలో ఫొటోగ్రాఫర్ చెప్పినట్టు స్టిల్స్ ఇస్తుంటారు. కానీ అడవిలో పక్షులు అలాకాదు. ఎప్పుడు ఎలాంటి హావభావాలు ఇస్తాయో చెప్పలేం. ఇంకోవిషయం ఏంటంటే కుదురుగా ఒక్కచోట ఉండవు. అలాంటి పక్షుల ఫొటోలు తియ్యడానికి బరువైన కెమెరాలతో పరుగులు పెట్టాల్సిందే. ఒక్కోసారి గంటల తరబడి వేచి ఉం డాలి. ఇలా ఉదయం 6 గంటలకు బయటకు వెళితే రాత్రి 8 గంటలకు తిరిగివచ్చేవాడు. అలా జీవితాన్ని పూర్తిగా పక్షుల కోసం కేటాయించాడు. బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఎం) చేసిన కార్తీక్.. పక్షుల సైకాలజీ తెలుసుకోవడానికి ఓర్నిథాలజీ చేశాడు. దీని వల్ల పక్షుల అరుపుల్లో అర్థాలు, హావభావాలు తెలుసుకున్నాడు. పక్షులు ఎలా ప్రేమించుకుంటాయి? ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాయో పరిశోధన చేశాడు. వాటిన్నింటినీ తన కెమెరాలో బంధించాడు.

white-cheeked-barbet

బర్డ్‌మ్యాన్ కార్తీక్ బిరుదు

ఇప్పటి వరకు దాదాపు 500 రకాల పక్షి జాతులకు సంబంధించి లక్షకు పైగా ఫొటోలు తీశాడు కార్తీక్. త్వరలోనే వీటిపై ఓ డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించబోతున్నాడు. ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ ప్రభుత్వం రికార్డుల్లో లేని దాదాపు 178 పక్షి జాతుల ఫొటోలు తీశాడు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు వరించాయి. వీటిల్లో ప్రధానమైనవి 2017 బెస్ట్ వైల్డ్ ఫొటోగ్రాఫర్ అవార్డు, 2018 బయోడైవర్సిటీ కంజర్వర్ అవార్డు. ప్రకృతి-పక్షులపై అతనికున్న ప్రేమకు గుర్తుగా బర్డ్‌మ్యాన్ కార్తీక్ అని పిలుస్తుంటారు. ఫొటోగ్రఫీతో పాటు ఆయా కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటాడు. భవిష్యత్‌లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్‌లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు బర్డ్‌మ్యాన్ కార్తీక్.

verditer-flycatcher

common-iora

chirutha

-డప్పు రవి

309
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles