దేహాత్మ జ్ఞాన దర్శనం


Fri,April 26, 2019 12:58 AM

దేవుడు (విశ్వాత్మ).. నమ్మిన వాళ్లకు మాత్రమే కనిపిస్తాడు. నమ్మని వాళ్లకు నమ్మేదాకా కనిపించడు. ఈ మాటలు పూర్తి నిజమేనన్న సంగతి మానసిక శాస్త్రపరంగా నిరూపితమైంది. దీని వెనుక ఉన్న అసలు విషయమేమిటంటే, మనిషిలోని జీవకణాలే వారిలో దైవం పట్ల విశ్వాసాన్ని ప్రేరేపిస్తాయి.
dehatma-gnana
నిజంగా దేవుడనే వాడే ఉంటే అందరికీ కనిపించాలి కదా అన్న వాదన మనోవైజ్ఞానిక శాస్త్ర దృష్ట్యా చెల్లదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కారణం, అభౌతికాన్ని భౌతికంలో దర్శించలేం కాబట్టి. ఇదే విషయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక వేత్త, భౌతిక శాస్త్రవేత్త ఏవీ మొహరిర్ తనదైన శాస్త్రీయ విశ్లేషణలో అత్యంత విపులంగా నిర్ధారించారు. జగత్తంతా వ్యాపించి ఉన్న విశ్వాత్మ అంశ ప్రతీ జీవిలోనూ ఉంటుంది కనుక ఆ తత్వదృష్టితో చూసేవారికి అది తప్పక సాక్షాత్కరిస్తుందన్నది ఆయన నిర్ధారణ. మనిషి శరీర వ్యవస్థ ఇందుకు ఒక అద్భుత ఉపకరణమని చెబుతూ, అదెలాగో ఆయన వివరించారు.

పరమాత్మకు ప్రతీక అయిన దేహాత్మ దర్శనానికి రక్తమాంసాలతో కూడిన మానవ శరీరం రాచబాట వేస్తుందని ఏవీ.మొహరిర్ ఇటీవలి తన పరిశోధనాత్మక వ్యాసంలో వెల్లడించారు. తత్ ఫలితంగానే ఆయా వ్యక్తుల్లో దైవం పట్ల విశ్వాసం ఏర్పడుతుందని ఆయనంటారు. ఎవరిలో అయితే, ఆధ్యాత్మికత పట్ల విశ్వాసం కలుగలేదో వారి శరీరంలోని దేహాత్మ కణాలు ఆ మేరకు వారిని ప్రేరేపించలేదని అర్థం. దీనికి ఆయన ఇచ్చిన శాస్త్రీయ వివరణ పూర్తి అర్థవంతంగానూ ఉన్నది. ఈ రకంగా మానవ దేహమే పరమాత్మ అన్వేషణలో ప్రధాన భూమిక వహిస్తుందన్న మాట. ఇదే సమయంలో ఆధ్యాత్మికతను మతం, ఆచార సంప్రదాయాల నుండి మొహరిర్ పూర్తిగా వేరు పరచడం గమనార్హం. అయితే, ఈ విషయాన్ని ఇప్పటికే కొందరు హేతువాదులు అంగీకరిస్తున్నప్పటికీ ఆయన విశ్లేషణ అందరినీ మెప్పించేలా ఉంది.

మనిషి శరీరంలోని దేహాత్మ దర్శనానికి ఆయన అందించిన శాస్త్రీయ శరీర సంబంధ పరిజ్ఞానం అత్యంత ప్రామాణికంగానూ కనిపిస్తున్నది. రక్తమాంసాలతో కూడిన భౌతిక జీవకణాలే అభౌతికమైన మానసిక శక్తిని ప్రభావితం చేస్తున్నాయని, తత్ ఫలితంగానే మనిషి మనోజ్ఞానంతో దేహాలయంలోని పరమాత్మకు ప్రతీక అయిన దేహాత్మశక్తిని దర్శిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. అందుకు దోహదపడుతున్న విజ్ఞానాత్మక ఆధారాలను ఆయన ఎంతో లోతుగా, స్పష్టంగా, సరళంగా కూడా తెలియపరిచారు. చాలామంది ప్రజలు మతం, ఆధ్యాత్మికతా రెండూ ఒక్కటే అనుకొంటున్నారు. వివిధ మతస్థులు ఈ రెండింటినీ అంతలా కలగాపులగం చేసేశారు. కానీ, ఇది పొరపాటు. అవి రెండూ వేర్వేరు విషయాలు అని మొహరిర్ అంటారు. మనుషులందరి ఉనికికి, జీవితానికి సార్థకతను చేకూర్చే క్రమంలో అందరికీ వర్తించే సర్వసాధారణ లక్ష్యంగా ఆధ్యాత్మిక సాధన ఉండాలన్నది ఆయన ప్రతిపాదన. మతం పేరుతో మనుషులను విభజించడాన్ని మొహరిర్ అంగీకరించడం లేదు. మతాలు మనుషుల్లోని దేహాత్మను ప్రేరేపించాలి. అంతేకానీ ఆచార వ్యవహారాలు, అనవసర సంప్రదాయాల పేరుతో పొద్దు పుచ్చడం తగదనీ ఆయన అంటారు.

మనిషిలో దైవం పట్ల, ఆధ్యాత్మిక సాధన పట్ల నమ్మక-అపనమ్మకాలకు అసలు మూలం మెదడు కణాలలోనే ఉన్నదంటూ, మనలోని భావోద్వేగాలను న్యూరోపప్టైడ్స్ (neuropeptides)గా పిలిచే జీవకణాలు ఎలా ప్రేరేపితం చేస్తాయన్న దానిని మొహరిర్ తన వ్యాసంలో చక్కగా పొందుపరిచారు. ఈ సందర్భంలోనే ప్రతిష్ఠాత్మకమైన లాస్కర్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త అయిన క్యాండెస్ బి.పెర్ట్ (Candace B. Pert) ప్రఖ్యాత గ్రంథం మాలెక్యుల్స్ ఆఫ్ ఎమోషన్ (ఉద్వేగ అణువులు)లోని కీలకాంశాలను ఆయన ఉటంకించారు. ఇవి ఎంత శాస్త్రీయమో అంత ఉత్తేజితమని మొహరిర్ అంటారు. సామాన్యులకైతే మన శరీర రక్తమాంస కణాలగుణాలు ఇంత శక్తివంతమైనవా? అని ఆశ్చర్యమేస్తుంది. ఈ భావోద్వేగ అణువులు నిర్వర్తించే పాత్రను క్యాండెస్ బి.పెర్ట్ తన పుస్తకంలో ప్రయోగాత్మక ఆధారాలతో వివరించారు. మన ఆలోచనలు, చర్యలు మెదడుకు చెందిన నవామ్ల నాడీఅణువుల (న్యూరోపప్టైడ్స్)తో ఎంతో లోతైన, అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయన్న దానిని ఆమె విపులంగా వెల్లడించారని మొహరిర్ తెలిపారు.

molecules

నమ్మకానికి మూలం నాడీకణాలే!

ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా దైవం పట్ల నమ్మకం ఏర్పడడానికి మూలం నాడీకణాలేనని మొహరిర్ వివరణనుబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు క్యాండెస్ బి.పెర్ట్ తన పుస్తకంలో ఏం చెప్పారు? మనందరిలోనూ రకరకాల ఉద్వేగ కారకాలుగా ఈ అణువులే పనిచేస్తాయి. ఆయా విధులే కాదు, భోజన అభిరుచులు, ఉచ్ఛాస నిశ్వాసల నుంచి ఆఖరకు కొందరిలోని వ్యభిచార పోకడ (survival sex) ల వరకూ ప్రతీ ఒక్క మానసిక ఉద్వేగానికి వీటి ప్రేరణే కారణం. మనసుకు బాధైనా, సంతోషమైనా, మరో రకమైన సాధారణ ఉద్రేకాలన్నింటితోసహా మన ఇష్టాయిష్టాలన్నింటిపైనా న్యూరోపప్టైడ్స్ ప్రేరణే పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. తత్ ఫలితంగానే భావోద్వేగాల మార్గదర్శకత్వం పనిచేస్తుంది. పెద్ద, చిన్న పేగులలోనూ చాలా దట్టంగా వీటితోపాటు గ్రాహకాలూ ఉంటై.

మనకు అనుభవంలోకి వచ్చే ప్రతీ భావోద్వేగ సంబంధ సమాచారాన్ని ఇవి మార్పిడి చేసుకొంటాయి. ఉదా॥కు ఒక్క క్లోమగ్రంథి నుండే ఆకలి, కడుపు నిండిన తృప్తి భావనలను నియంత్రింపజేసే ఇలాంటి ఉద్వేగాత్మక పప్టైడ్స్ (అమైనో ఆమ్లాలకు పూర్వగాములేమో?) కనీసం 20 వరకైనా ఉంటాయి. శరీరంలో రక్తప్రవాహ క్రమబద్ధీకరణ కూడా ఈ ఎమోషనల్ పప్టైడ్స్ ద్వారానే జరుగుతుంది. రక్తనాళికల గోడలమీది గ్రాహకాలకూ ఇవే ఈ మేరకు సంకేతాలను అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగానే మొహరిర్ తన వ్యాసంలో దేహాత్మ దర్శనం సదరు జీవకణాల ద్వారానే సాధ్యమన్న నిర్ధారణకు వచ్చారు.

av-moharir

ఆధ్యాత్మికతపై శాస్త్రీయ రచనలు

యూనివర్సిటీ న్యూస్ ఇటీవలి (2018 అక్టోబర్ 1-7) సంచికలో ఏవీ మొహరిర్ ప్రచురించిన విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గవి. విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మికత, దేవుడు: ఒక సాధనాత్మక సమన్వయాలు (Science, Spirituality and God: An Attemped Syntheses) శీర్షికన ఆయన చేసిన కూలంకశ విశ్లేషణ చదువుతున్నకొద్దీ అసలు విజ్ఞానశాస్త్రం-ఆధ్యాత్మికత రెండూ ఒకదాని కొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయన్నది స్పష్టమవుతుంది. రెండూ వేర్వేరని, ఆధ్యాత్మికత విజ్ఞాన శాస్ర్తాంశాలకు అతీతమన్న భావన ఎక్కడా లేశమాత్రమైనా కలగదు. నమస్తే తెలంగాణ తెలుగు పాఠకుల కోసం గత డిసెంబర్ 25 నుంచీ ఆయన వ్యాసాన్ని అంచెలంచెలుగా అందిస్తున్నది. ఇప్పటికే శాస్త్రలో మూడు, చింతనలో రెండు వ్యాసాలు ప్రచురితమైనాయి. ఈ పరంపరలో ఇది ఆరో వ్యాసం. ప్రొఫెసర్ మొహరిర్ న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డివిజన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిజిక్స్ విభాగానికి అధిపతిగా సేవలు అందించి, పదవీ విరమణ చేశారు. వారి నివాస చిరునామా : ఏ-408, వసుంధర అపార్ట్‌మెంట్స్, సెక్టార్-6, ప్లాట్-16, ద్వార్కా, న్యూఢిల్లీ-110075-03.

205
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles