నర్మద పరిక్రమ


Fri,April 26, 2019 12:57 AM

(గత సంచిక తరువాయి)
Narmada3
-మల్లాది వెంకట కృష్ణమూర్తి


నిత్యానంద బాబా ఆశ్రమ సందర్శన

ముంబైకి సుమారు 100 కి.మీ. దూరంలోని గణేష్‌పురిలో సద్గురు నిత్యానంద బాబా తన శేష జీవితాన్ని గడిపారు. ఆయన సమాధి మందిరం అక్కడే ఉన్నది. గతంలో నేను ఓసారి ఆయన సమాధిని దర్శించాను. మళ్లీ ఇప్పుడు ఇది రెండోసారి. గణేష్‌పురి వస్తారా? అని మా బావగారిని అడిగాను. ఎండ బాగా ఉండటంతో డెబ్బయి పైబడ్డ ఆయన వస్తారని నేను అనుకోలేదు. కానీ, తాను చిన్నప్పుడు నిత్యానంద బాబాను చూశానని, వస్తానని అన్నారు. భోజనం చేశాక అక్టోబర్ 18న ఉదయం పదకొండుకి నేను, మా బావగారు రామసేతు అంధేరీ ఈస్ట్ లోకల్ స్టేషన్‌కు ఆటోలో చేరుకున్నాం. అక్కడి నుంచి మా ఇద్దరికీ వసై రైల్వే స్టేషన్‌కు రిటర్న్ టికెట్ కొన్నాను. ఆ సమయంలో ఆఫీసులు అధికంగా ఉన్న దాదర్ వైపు నుంచి వెళ్లే లోకల్స్ రద్దీగా ఉంటాయని, దాదర్ నుంచి వచ్చేవి ఖాళీగా ఉంటాయని మా బావగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఓ రైలు ఖాళీగా వచ్చింది. ఆ ఫాస్ట్ రైలు ఎక్కి వసై రోడ్ స్టేషన్‌లో దిగాం. పక్కనే మూడు నిమిషాల నడక దూరంలోని బస్ స్టాండ్‌కి చేరుకున్నాం. గణేష్‌పురికి వెళ్లే బస్సు గురించి విచారిస్తే ఒకటిన్నరకు ఓ బస్ ఉందని చెప్పారు.

Narmada2
-తీర్థయాత్ర

కాని ఆ టైం దాటినా అది రాలేదు. గంటన్నర పైనే ఎండలో వేచి ఉన్నాక ఆ బస్సు వచ్చింది. బాగా రద్దీగా ఉండటంతో గణేష్‌పురి దాకా గంటన్నర పైగా నించొనే ప్రయాణించాం. గణేష్‌పురిలోని బాబా సమాధి మందిరం దగ్గర బస్సు దిగి ముందుగా ఆ సమాధి మందిరంలోకి వెళ్లాం. కొద్దిసేపు బాబా సమాధి మందిరంలో కూర్చొని జపం చేసుకున్నాక, ఇద్దరం పక్కనే ఉన్న భీమేశ్వర్ శివాలయానికి వెళ్లాం. ఓ చోట నిత్యానంద బాబా జీవితకథ పుస్తకాలు ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో అమ్ముతున్నారు. నిత్యానంద బాబా సంస్థాన్ ఆఫీసులోకి వెళ్లి నేను ఆ పుస్తకాన్ని తెలుగులో రాశానని, వాళ్లకు ఉచితంగా పంపితే స్వీకరించి, వాటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును బాబాకు ఇష్టమైన బాల్ భోజన్ పథకానికి వినియోగించగలరా? అని అడిగాను. అందుకు తమ చైర్మన్ అనుమతి కావాలని, అతనికి నా అభ్యర్థనను రాసివ్వమని స్టాఫ్‌లో ఇంగ్లీష్ వచ్చిన ఒకాయన నన్ను కోరారు. ఇంగ్లీష్‌లో దానిని రాసిచ్చాను. కొన్ని నెలల తర్వాత వారి ఆఫీసు నుంచి నాకు ఫోన్ వచ్చింది. వారి చైర్మన్ అనుమతి లభించిందని, పుస్తకాలను పంపమని. అప్పటి నుంచి వాటిని పంపుతున్నాను.

Narmada
సమాధి మందిరం పక్కనే ఉన్న ఉష్ణకుండాలను మూడింటిని చూశాం. మా వెంట టవల్స్ తీసుకు రావడం మరిచాం కాబట్టి, అక్కడ స్నానం చేయలేకపోయాం. బాబా జీవించి ఉండగా, ఎవరొచ్చినా ముందు ఆ కుండంలోని గంధకపు వాసన వేసే నీటిలో స్నానం చేయమని ఆదేశించే వారు.

అక్కడి నుంచి సుమారు కిలోమీటరున్నర దూరంలోని నిత్యానంద బాబా శిష్యుడు ముక్తానంద బాబా ఆశ్రమానికి ఆటోలో వెళ్లాం. ఆయన సమాధి మందిరాన్ని దర్శించి, కొద్దిసేపు అక్కడ మౌనంగా కూర్చున్నాం. విదేశస్థులు అక్కడ అధికంగా బస చేసి, ధ్యానం చేసుకొంటారు. 2009 జూన్‌లో నేను హ్యూస్టన్‌లో ఉన్నపుడు నాకు పరిచయమైన బుద్ధిస్ట్ అమెరికన్ బృందంలోని జాన్ అనే అతను తను ముక్తానంద బాబా ఆశ్రమంలో సంవత్సర కాలం ఉన్నానని చెప్పారు. మేర్లిన్ అనే ఎనభై నాలుగేళ్ల మహిళ కూడా చిన్మయానంద, ముక్తానంద ఆశ్రమాల్లో చాలాకాలం యోగిని జీవితం గడిపానని, హిమాలయాల్లో యోగినిగా తన శేష జీవితాన్ని గడపాలని భావించానని, కానీ చిన్మయానంద వారించడంతో తను అమెరికాకు తిరిగి వచ్చేశానని చెప్పింది.

ముక్తానంద బాబా హ్యూస్టన్‌లోని మేర్లిన్ ఇంటికి వచ్చి కొంతకాలం ఉన్నారు. వారికి నా వెంట తీసుకెళ్లిన నిత్యానంద బాబా డీవీడీని ఇస్తే జాన్ చాలా సంతోషించారు. నిత్యానంద బాబా నడిచే అరుదైన దృశ్యం గల ఆ డీవీడీ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అంటూ అతను నాకు కృతజ్ఞతను తెలిపారు. ఈ డీవీడీని వెంకటేశ్వరరావు నాకు ఇచ్చారు. ముక్తానంద బాబా సమాధి మందిరం ఎదురుగా ఉన్న ఆ సంస్థ పుస్తకాల షాపుకు వెళ్లాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక మూడు కిలోమీటర్ల దూరంలోని వజ్రేశ్వరి మాత ఆలయానికి గుర్రబ్బండిలో వెళ్లాం. చిన్న కొందమీది వజ్రేశ్వరి ఆలయం పక్కన జట్కా బండి దిగి పైకెళ్లి ఆ మాతను దర్శించుకున్నాం. మేం వచ్చిన గుర్రబ్బండి మీదే తిరిగి గణేష్‌పురి చేరుకొన్నాం.
(వచ్చేవారం: తొలి రోజు యాత్ర మొదలు)

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles