ఇబస్ పరీక్ష ఎందుకు?


Mon,April 22, 2019 12:40 AM

మా నాన్న డ్రైవర్. వయసు 51 సంవత్సరాలు. చాలాకాలంగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు కఫంతోపాటు రక్తం రంగులో ఫ్లూయిడ్ వస్తుంది. ఛాతీ దవాఖానలో చూపించాం. ఇబస్ టెస్ట్ చేసి.. తర్వాత చికిత్స మొదలుపెడదాం అని డాక్టర్లు అన్నారు. ఈ పరీక్ష గురించి మేం ఇప్పుడే వింటున్నాం. ఏంటీ పరీక్ష? మాకు భయంగా ఉంది దయచేసి వివరించండి.
-జి. సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్

Councelling
శ్వాసకోశ వ్యాధులు.. లంగ్ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి తప్పనిసరిగా చేయాల్సిన పరీక్ష ఎండో బ్రాంఖియల్ అల్ట్రాసౌండ్ (ఇబస్). దీని గురించి మీరు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులువైన పరీక్ష ఇది. ప్రతీ లక్షమందిలో సుమారు 28మంది శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారినపడుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎక్స్ రే, ఇతర రోగనిర్ధారణ పరీక్షల ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థతిని, క్యాన్సరు ఉనికిని దీని ద్వారా గుర్తిస్తారు. ఎలాంటి కోతలు లేకుండా శ్వాసమార్గం చేసే పరీక్ష ఇది. శ్వాసకోశాల కాన్సర్లతోపాటు వాటికి సోకే ఇన్ఫెక్షన్లను, లింఫ్‌నోడ్స్ వాపు, ఛాతీలో గడ్డలను ఈ అత్యాధునిక రోగనిర్ధారణ పరీక్షతో కచ్చితంగా గుర్తించేందుకు వీలవుతుంది. ఈ నూతన టెక్నాలజీ ఊపిరితిత్తులు, లిఫ్ నోడ్స్ లోని గడ్డలలోనుంచి అల్ట్రాసౌండ్ మార్గదర్శకత్వంలో పరీక్షల కోసం కణజాలాన్ని వెలికి తీయటాన్ని ఎంతో సులభతరం చేసింది. సంప్రదాయ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరంలేకుండా ట్రాన్స్ బ్రాంఖియల్ నీడిల్ అస్పిరేషన్ (టి.ఎన్.బి.ఎ.) పరీక్షచేయటానికి వైద్యులు ఇబస్‌ను వాడుతున్నారు. దీనిద్వారా సేకరించిన కణజాలపు సాంపిల్ ఆధారంగా శ్వాసకోశాల క్యాన్సర్‌ను ఏ దశలో ఉందో గుర్తించగలుగుతారు. అవుట్ పేషెంట్‌గానే ఒక్కరోజులో చేయించుకోవచ్చు. ఇబస్ విధానంలో రోగి శరీరంపైన ఎటువంటి గాటుపెట్టవలసిన అవసరం ఉండదు. దీనిలో డాక్టర్ బ్రాంఖోస్కోప్‌ను నోటిగుండా పంపించడం ద్వారా లింఫ్‌నోడ్స్‌కూ సంబంధించిన నీడిల్ బయాప్సీ చేయగలుగుతారు. ఇబస్ పరీక్షను స్థానికమత్తుమందు (లోకల్ అనెస్థీషియా) ప్రయోగంతోనే నిర్వహిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితి, నొప్పిని తట్టుకునే శక్తిని బట్టి అవసరమైతే పూర్తిస్థాయి మత్తుమందు ఇచ్చి ఇబస్ పరీక్షచేస్తారు. ఆందోళన చెందకుండా మీ నాన్నకు ఈ పరీక్ష చేయించండి.
-డాక్టర్. నాగార్జున మాటూరు
సీనియర్ పల్మనాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ

446
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles