గమ్యం కంటే ప్రయాణమే గొప్పది


Sun,April 21, 2019 12:48 AM

సినిమాలోని భావోద్వేగాల సాంద్రత దర్శకుడి హృదయంలోని ఆర్థ్రతకు అద్దం పడుతుందంటారు. జెర్సీ సినిమా చూసిన వారు అదే భావనకు లోనవుతారు. క్రీడా నేపథ్య కథాంశానికి హృద్యమైన భావోద్వేగాలు కలబోసి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ద్వితీయ ప్రయత్నంలోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా ప్రశంసలందుకున్నారు. విజేతలకంటే పరాజితులగాథల్లోనే అసలు జీవితం దొరుకుతుంది. అదే స్ఫూర్తితో జెర్సీ చిత్ర కథ రాసుకున్నాను అని అన్నారాయన. నాని కథానాయకుడిగా నటించిన జెర్సీ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జిందగీతో సంభాషించారు. ఆయన చెప్పిన ముచ్చట్లివి..
GowtamTinnanuri

జెర్సీ కథకు అంకురార్పణ ఎలా జరిగింది ? నిజ జీవితంలో మీరు చూసిన సంఘటనల స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ రాసుకున్నారా?

తొలుత క్రీడా నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన ఏమీ లేదు. క్రికెట్ వ్యాఖ్యాత హర్షాబోగ్లే అహ్మదాబాద్ మీడియా సమావేశంలో చేసిన ప్రసంగంలోని ఓ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. దేశంలో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండగా సచిన్ గొప్పవాడుగా ఎదగడానికి కారణం ఆయన జీవిత దృక్కోణమే అని బోగ్లే విశ్లేషించారు. ఆ మాటల్లో నేను సచిన్ గొప్పతనం కంటే ఆయనలా ప్రతిభ ఉండి రాణించలేకపోయిన పరాజితుల కోణం నుంచి కథను ఆలోచించాను. మనం విజయం సాధించిన ఏ కొందరినో గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే కౌశలాలు కలిగి అపజయం చెందిన వారి గురించి అసలు ఆలోచించం. అలాంటి వారి జీవితాన్ని చెప్పాలనే ఆలోచన నుంచే జెర్సీ కథకు అంకురార్పణ జరిగింది.

ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిశోధించారా?

క్రికెట్ అందరికి తెలిసిన ఆట కాబట్టి పెద్దగా పరిశోధన చేయలేదు. కథా రచనకు మాత్రం చాలా సమయం తీసుకున్నాను. నా తొలిచిత్రం మళ్లీరావాకు ముందే జెర్సీ కథ రాయడం ప్రారంభించాను. మొత్తం స్క్రిప్ట్ తయారుచేయడానికి నాలుగేళ్ల సమయం పట్టింది.

నానిని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారా?

అలాంటిదేమి లేదు. ఈ కథ నాలుగేళ్ల నుంచి నా దగ్గరే ఉంది. మళ్లీరావేకు ముందే ఈ సినిమా చేద్దామనుకున్నాను. అయితే కొత్తవాణ్ణి కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం వస్తుందనే నమ్మకం ఉండేది కాదు.

సినిమా విజయం గురించి మీ అంచనాలు ఎలా ఉండేవి?

ఈ స్థాయిలో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు. సినిమా అనేది పెద్ద బాధ్యత. దర్శకుడు, నిర్మాత, నటీనటులు...ఇలా ఎంతోమంది నమ్మకానికి పరీక్ష. కాబట్టి వారందరి నమ్మకం ఏమవుతుందో అని విడుదలకు ముందు భయపడ్డాను. ఇప్పుడు ఆదరణ చూసి అందరి విశ్వాసాన్ని నిలబెట్టానని ఆనందంగా ఉంది.

కథా రచన సమయంలో ప్రేక్షకులకు ఏం చెప్పాలనే తపన ఉండేది?

లోకమంతా అసమర్థుడుగా భావించే ఓ వ్యక్తి తన శక్తియుక్తులకు పదునుపెట్టి ఓ కలను ఎలా నిజం చేశాడనే అంశమే ఈ కథకు ఆత్మలాంటిది. దానిచుట్టే బలమైన భావోద్వేగాలు అల్లుకొని సినిమా తీశాను.

ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని ఏళ్ల తర్వాత చూసినా గర్వపడే సినిమా ఇదని నాని అన్నారు?

షూటింగ్ సమయంలో గొప్ప సినిమా చేస్తున్నామనే భావన కంటే కథ విషయంలో అందరిలో సంతృప్తి కనిపించేది. పోస్ట్‌ప్రొడక్షన్ టైంలో సినిమా చూస్తున్నప్పుడు ఇదంతా చేసింది మేమేనా అని ఆశ్చర్యపోయేవాళ్లం. నాని ఈ సినిమా విషయంలో మొదటి నుంచి నమ్మకంతో ఉన్నారు.

సినిమాలో క్రికెట్‌ను చాలా సహజంగా చూపించారని అంటున్నారు?

కథ రాసుకున్నప్పుడే క్రికెట్‌ను అథెంటిక్‌గా చూపించాలనుకున్నాం. క్రికెట్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలకు చాలా సమయం తీసుకుంది. నిమిషం నిడివి సీన్‌ను చిత్రీకరించడానికి రెండు రోజులు పట్టిన సందర్భాలున్నాయి. సాంకేతికంగా కూడా సవాలుతో కూడిన పని అది. అయితే ప్రతి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల షూటింగ్ అంతా సవ్యంగా జరిగింది.

జెర్సీ మజిలీ.. రెండు క్రికెట్ నేపథ్య చిత్రాలే కదా.. పోలికలు తీసుకొస్తారని ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ సినిమా ప్రకటించినప్పుడు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ నాకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మా సినిమాల కథల గురించి మాట్లాడుకున్నాం. రెండు కథలకు ఏమాత్రం సంబంధం లేదని నిర్ధారించుకున్నాం.

మీరు చేసిన రెండు సినిమాలు నాస్టాల్జిక్ ఫీల్‌తో సాగాయి. భిన్న కాలాల్ని చూపిస్తూ సినిమా తీయడం దర్శకుడిగా మీరు ఎంచుకున్న శైలి అనుకోవచ్చా?

కేవలం రెండు సినిమాలు చేశాను కాబట్టి అది నా శైలి అనుకోవడానికి వీలులేదు. అయితే మళ్లీరావా సినిమా విషయంలో మాత్రం హీరో జీవితంలోని భిన్న దశల్ని చూపించాలనుకున్నాను. ప్రేమకథ కాబట్టి ఆ జ్ఞాపకాలు హృద్యంగా ఉంటాయనిపించింది. జెర్సీ కథ విషయంలో అలా ఏమి అనుకోలేదు. ఓ తండ్రి జీవితంతో పాటు కొడుకు దృష్టికోణం నుంచి తండ్రి జీవితాన్ని ఆవిష్కరించాలనే పాయింట్‌తో కథ రాసుకున్నాను.
GowtamTinnanuri1

నానిలాంటి ఇమేజ్ ఉన్న కథానాయకుణ్ణి తీసుకొని ఎలాంటి కమర్షియల్ అంశాలకు తావులేకుండా సినిమా తీయడం రిస్క్ అనిపించలేదా?

వాణిజ్య అంశాల గురించి ఆలోచించకుండా కథను నిజాయితీగా చెప్పాలన్నదే నేను నమ్మిన సిద్ధాంతం. అదే నా శైలి అనుకుంటాను.

ఖైరతాబాద్ రైల్వేస్టేషన్‌లో నానిపై తీసిన సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉందంటున్నారు? ఆ సీన్ అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనుకున్నారా?

సాధారణంగా మనం కోపం వచ్చినప్పుడు బాగా అరుస్తాం. కానీ ఆ సీన్‌లో సంతోషంతో అరిస్తే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. అప్పటివరకున్న కష్టాలు తొలగిపోయి ఉప్పెనలా వచ్చిన ఆనందాన్ని ఎలా వ్యక్తీకరించాలని ఆలోచిస్తున్నప్పుడు రైల్వేస్టేషన్‌లో సీన్ తీస్తే బాగుంటుందనిపించింది. కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో కాకుండా ఒరిజినల్ రైల్వే స్టేషన్‌లో ఆ సన్నివేశాన్ని తీయాలనుకున్నాం.

సాఫ్ట్‌వేర్‌రంగం నుంచి దర్శకుడిగా మారారు? ఈ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?

మా స్వస్థలం రాజమండ్రి. నాకు చిన్నతనం నుంచి కథలు రాసే అలవాటు ఉంది. వాటిని ఎవరికైనా చూపించాలనే కోరిక కన్నా నా భావాల్ని అక్షరీకరించాలనే తపన ఎక్కువగా ఉండేది. అలా కథలు రాసే అలవాటు క్రమంగా సినిమాల వైపు నడిపించింది.

భారతీయ టీమ్‌కు ఆడకుండానే అర్జున్ పాత్రను ముగించడం లోటుగా అనిపించలేదా?

గమ్యం కంటే దానిని చేరడానికి చేసే ప్రయాణమే గొప్పదని నా ఉద్ధేశ్యం. ఆ ఫిలాసఫీని అర్జున్ పాత్ర ద్వారా ఆవిష్కరించాను. గమ్యం కంటే గమనమే మన హృదయంలో మధురస్మృతిగా మిగిలిపోతుంది. అందుకే ఈ సినిమా ైక్లెమాక్స్‌లో హీరో లక్ష్యాన్ని ఉన్నతీకరించకుండా అతని కష్టాన్ని చూపించే ప్రయత్నం చేశాను.

కుటుంబ భావేద్వేగాలు కలబోసిన కథను క్రీడా నేపథ్యంలోనే ఎందుకు ఆవిష్కరించాలనుకున్నారు?

లక్ష్యాన్ని సాధించే వయసు అయిపోయినా సంకల్పబలంతో గమ్యాన్ని చేరుకునే వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించాలనే తపనతో ఈ కథ రాసుకున్నాను. ఈ ఇతివృత్తాన్ని ఇతర నేపథ్యాల్లో కూడా చూపించవొచ్చు. కథానాయకుణ్ణి ఓ వ్యాపారవేత్తగానో, ఒక ఉద్యోగిగానో కూడా చూపించడానికి వీలు ఉంటుంది. అయితే క్రీడలకు, శారీరక ధృడత్వానికి సంబంధం ఉంటుంది. శారీరక పరిమితుల్ని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమనే పాయింట్‌లోనే ఓ సంఘర్షణ కనిపించింది. అందుకే ఈ కథకు క్రికెట్‌ను నేపథ్యంగా తీసుకున్నాను.

నేను ఎప్పుడైనా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే నిర్మాతలను సంప్రదిస్తాను. అలా అయితే కథాపరంగా ఎలాంటి చర్చలకైనా ఆస్కారం ఉంటుంది. సగం కథతో కానీ లేదా ఏదైనా సింగిల్ లైన్‌తో వెళితే దానిని అనుకున్నట్లుగా వివరించలేం. తొలుత కథ రాసుకున్న తర్వాతే హీరో గురించి ఆలోచిస్తాను.

నా కథలన్ని కాల్పనికాలే. అయితే వాటికి నిజ జీవితంలో నేను చూసిన సంఘటనలు, వ్యక్తుల స్ట్రగుల్‌ను మిళితం చేసి కథ రాసుకుంటాను. అందుకే నేను చేసిన రెండు సినిమాల్లో హీరోలు కష్టాలు పడుతూ కనిపిస్తారు.


జెర్సీ చిత్రంలో నాని కెరీర్‌లోనే అత్యుత్తమ అభినయాన్ని ప్రదర్శించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆయన చెప్పిన సంగతులివి..

GowtamTinnanuri-nani
జెర్సీకి ముందు నాని క్రికెటర్ అనే పదానికి అర్హుడు కాదు. జెర్సీ షూటింగ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అందుకే ఇప్పుడు క్రికెటర్ అనే అర్హత వచ్చింది. అలా అని పూర్తి ప్రొఫెషనల్ క్రికెటర్‌ని కాదు.

జెర్సీ షూటింగ్ సమయంలో క్రికెట్ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు చాలా మ్యాచ్‌ల్లో ఏమీ కొట్టకుండా డకౌట్ అయిపోయేవాడిని. ఇప్పుడు అవకాశం వస్తే పరుగుల వరద సృష్టిస్తా (నవ్వుతూ)

గతంలో ఫలానా నేపథ్యంలో సినిమా చేద్దామని అనుకోలేదు. చేసిన జోనర్‌లో మళ్లీ చేయకూడదు అనుకున్నాను. మనకు రాసి పెట్టి ఉంటే ఎలాగైనా మనకే వస్తుంది. మనం ప్లాన్ చేసుకుని చేసినా జెర్సీ లాంటి అవకాశం రాదు. క్రికెట్ నేపథ్యంలో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

జెర్సీ విషయంలో ఇంతకు ముందు ఏ సినిమాకు కలగని అనుభూతి కలిగింది. అది మాటల్లో చెప్పలేని ఎమోషన్. ఓ గొప్ప సినిమా చేశాననే భావన కలిగింది. 20 ఏళ్ల తర్వాత కూడా జెర్సీ సినిమా చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. జెర్సీ ఇదొక మ్యాజిక్ అంతే.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి కొడుకు తన తండ్రిని, ప్రతి తండ్రితన కొడుకుని గట్టిగా కౌగిలించుకుంటున్నారనే గొప్ప మాటలు వినిపిస్తున్నాయి.

జున్నుకు (నాని కొడుకు ముద్దు పేరు) ఇప్పుడు రెండేళ్లు. వాడికి సినిమా అర్థం చేసుకునే వయసు ఎప్పుడొస్తుందా? జెర్సీ సినిమా ఎప్పుడూ చూపించాలి? అని ఎదురుచూస్తున్నాను. వాడికి సినిమా అర్థమయ్యే వయసొచ్చినప్పుడు నాన్నను చూసి గర్వపడతాడు.

జెర్సీని కమర్షియల్‌గా ఆలోచించి.. ఇంత వసూళ్లు చేస్తుంది అని ఓ నెంబర్ చెబితే సినిమా ఔన్నత్యాన్ని తక్కువ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సినిమాకు పద్మశ్రీ అవార్డులు ప్రవేశపెడితే జెర్సీకి ఇవ్వొచ్చు అనేంత గొప్ప సినిమా. ఇది కొంచెం అతిగా అనిపించినా నిజాయితీగా చెబుతున్న మాట. ఇలా జెన్యూన్‌గా చెప్పే అవకాశం కూడా చాలా తక్కువసార్లు కలుగుతుంది.


కళాధర్‌రావు
సిఎం. ప్రవీణ్

510
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles