నా పాట నాకు నచ్చాలి!


Sun,March 24, 2019 01:12 AM

తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో ఎం.ఎం. కీరవాణిది ఓ ప్రత్యేకశైలి. తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుతమైన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగులో కీరవాణి, తమిళంలో మరకతమణి, హిందీలో ఎం.ఎం.క్రీమ్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు తన మధురమైన స్వరాలతో.. ఆణిముత్యాల్లాంటి పాటలతో..ప్రేక్షక శ్రోతల్ని తన సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తున్నాడు. వ్యాపారాత్మక సినిమాల్లోనూ సాంప్రదాయ సంగీత విలువలతో రాగాలు కట్టి శభాష్ అనిపించుకోగల దిట్ట. ఈతరం సంగీత దర్శకుల్లో సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతాన్ని సమాకూర్చగల ఒకే ఒక్క స్వరకర్త కీరవాణి.. సంగీతంలో సర్వజ్ఞానిగా కొనియాడబడుతున్న తాను మాత్రం నిత్యవిద్యార్థినే అంటున్న ఈ సంగీత స్వరవాణి కీరవాణితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.
Rendu-RellaAaru

మీ ప్రయాణంలో అన్ని రకాల కథాంశాలకు సంగీతాన్ని సమకూర్చారు. వాటితో పోలిస్తే బయోపిక్‌కు స్వరాలను అందించడం కోసం ప్రత్యేకంగా ఏమైనా శ్రద్ధ తీసుకోవాలా?

-కథలో సత్యదూరమైన విషయాలకు తావు ఉండటం, కథలో ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చూపించాల్సివస్తే అలాంటి వాటికి సంగీతాన్ని అందించడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. జీవిత కథ అంటే జరిగింది చెప్పడమే. కల్పితాలకు తావు ఉండదు. రామారావు జీవితం తెరచిన పుస్తకం. అందులో పేజీలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే సినిమాలోకి దిగాను. పనిచేసే సమయంలో అంకితభావం, ఇన్‌వాల్వ్‌మెంట్ వాటంతట అవే వచ్చాయి. కల్పిత కథలకు గ్రామర్ ఉండదు. మనం చెప్పిందే వేదం. కానీ బయోపిక్‌లకు పనిచేయడం అందుకు భిన్నంగా ఉంటుంది. సత్యంతో కలిసి ప్రయాణిస్తున్న అనూభూతికి మనం లోనవ్వాలి. అలా ఫీల్ అయితేనే సినిమాలో ఇన్‌వాల్వ్ అవ్వాలి. లేదంటే అంగీకరించకూడదు. బయోపిక్‌కు, మిగతా సినిమాలకు ఉన్న తేడా అదే.

రాఘవేంద్రరావు, రాజమౌళిలాంటి దర్శకులకే మీరు మంచి పాటలను అందిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అలాంటి మాటలు మీ దృష్టివరకు వస్తుంటాయా?

-నా సమక్షంలోనే ఆ మాటలు చాలామంది చెబుతుంటారు. ముప్ఫై ఏళ్లలో రాఘవేంద్రరావు, రాజమౌళికే చక్కటి బాణీలను అందించానని కొందరు చెప్పారు. మరికొందరు మాత్రం హిందీలో మీ పాటలు బాగుంటాయని చెప్పారు. రాఘవేంద్రరావు, రాజమౌళి హిందీలో సినిమాలు చేయలేదు. వారి మాటల్లో ఏది నిజమో కొన్నాళ్లకు నాకే అర్థం కాలేదు. అందులో ఏదీ నిజం కాదు. కొన్ని సార్లు కాంబినేషన్‌లు అలా కుదురుతాయంతే.

సంగీత దర్శకుడిగా మిమ్మల్ని మీరు ఎలా అప్‌డేట్ చేసుకుంటారు?

-సమకాలీన సంగీత దర్శకుల స్వరాల్ని వింటుంటాను. ఓ పాట నచ్చితే మళ్లీ మళ్లీ వింటాను. మా ఇంట్లో పిల్లలతో పాటు వారి స్నేహితులందరితో కబుర్లు చెబుతూ సరదాగా ఉంటాను. వారు ఎలాంటి పాటలు వింటున్నారో, ఏది ఇష్టపడుతున్నారో, ఏది అయిష్టమో తెలుసుకుంటుంటాను. అలాగని బాణీలను అందించే విషయంలో పూర్తిగా రాజీపడను. నేను స్వరపరిచే పాట నాకు నచ్చాలి. ప్రేక్షకుల కోసం పనిచేస్తున్నాను. వారి అభిచురులకు అనుగుణంగా పాట ఉండాలని కోరుకుంటాను.

ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే సాహిత్యపు విలువలను మీ ట్యూన్స్ డామినేట్ చేయకుండా చక్కగా వినిపిస్తుంటాయి?

Rendu-RellaAaru1
-సాహిత్యపు విలువలకు ప్రమాణాలు ఉండవు. ఈ విలువలు ఉన్నాయి? లేవు అని ఎవరూ చెప్పలేరు. అవి ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. దర్శకుల అభిరుచులను బట్టి అవి ఆధారపడి ఉంటాయి.

సాధారణంగా ఓ సంగీత దర్శకుడి ప్రస్థానం ఓ టైమ్ పీరియడ్ వరకే ఉంటుంది. ఆ సమయంలోనే వారిని విజయాలు వరిస్తాయి. కానీ, మీ విషయంలో సంగీతం నిత్యనూతనంగా ఉంటుంది. ప్రస్తుత తరంతో పోటీపడి సంగీతాన్ని అందించడం ఎలా సాధ్యమైంది?

-నిత్యనూతనం అని కాదు కానీ ఒకే విషయానికి నేనెప్పుడూ కట్టుబడి ఉండను. దాన్నే పట్టుకొని గిరిగీసుకొని కూర్చొను. పోటీతత్వంపై నాకు నమ్మకం లేదు. పోటీ వద్దనుకున్నా కొన్నిసార్లు ఉంటుంది. సినిమాల్లో ఉండి కూడా పాటలు వినం, సినిమాలు చూడం అనేవారు చాలామంది కనిపిస్తారు. అలా నేను మూసధోరణితో ఆలోచిస్తే ఎప్పుడో పాతపడిపోయేవాణ్ణి. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రస్తుతం సంగీతంలో కమర్షియాలిటీ ప్రవేశించింది. ఇలాంటి తరుణంలో సంప్రదాయ సంగీతంతో కూడిన కళాత్మక విలువలున్న సంగీతం సమకూర్చడం మీకు ఎలా సాధ్యం అవుతుంది?

-నాతో పాటు ఏ.ఆర్.రెహమాన్, థమన్, గోపీసుందర్ చాలామంది దర్శకుల బాణీల్లో సంప్రదాయ స్వరాలు వినిపిస్తుంటాయి. క్లాసికల్ సంగీతాన్ని ఆధారం చేసుకోకపోతే ఇండస్ట్రీలో సంగీత దర్శకులుగా ఎక్కువ కాలం ఎవరూ నిలబడలేరు.

ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సంగీతానికి దూరం కావాలని అనిపించిన సందర్భాలు ఉన్నాయా?

-సంగీతం మీద బోర్ కొట్టినా దీనికి మించిన ప్రత్యామ్నాయం వేరే ఏదీ నాకు లేదు. నాకు తెలిసింది సంగీతం ఒక్కటే.

గతంలో పోలిస్తే చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు? కారణమేమిటి? సినిమాను ఒప్పుకొనే ముందు ఏ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు?

-మొదట ఆ సినిమా విడుదల అవుతుందా? లేదా? చూసుకుంటాను. ఆ తర్వాతే కథ, పారితోషికం గురించి పట్టించుకుంటాను. అలాగే నా ఆలోచనలకు తగినట్లుగా దర్శకుడి భావాలు ఉన్నాయో లేవో సరిచూసుకున్న తర్వాతే సినిమా అంగీకరిస్తాను. ఇదివరకు ఇవేమీ ఆలోచించేవాడిని కాదు. సినిమా చేయాలని ఎవరైనా నా దగ్గరకు వస్తే వెంటనే ఒప్పుకునేవాన్ని. ఇప్పటివరకు 231 సినిమాలకు సంగీతం అందిస్తే అందులో రెండు వందల సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ముప్ఫైఒక్క సినిమాలు ఆగిపోయాయి. విడుదల అవుతాయో లేదో తెలియకుండా ఎవరు వస్తే వారితో సినిమా చేయడం వల్లే అలా జరిగింది. అలాంటి పొరపాట్లు జరగకుండా ఆచూతూచి పరిశీలించి సినిమాల్ని ఎంచుకోవడం వల్లే ప్రస్తుతం చేస్తున్న చిత్రాల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా ఆలస్యం జరుగుతున్నది.

సంగీత దర్శకుడిగా రాజమౌళి దగ్గర దొరికే స్వేచ్ఛ మిగతా దర్శకుల దగ్గర మీకు దొరుకుతుందా?

-నా కెరీర్‌లో ఇప్పటివరకు వందమంది దర్శకులతో పనిచేశాను. వారిలో నా అభిమాన దర్శకులు ఓ పది మంది ఉంటారు. వారితో చేసిన సినిమాలకే ఎక్కువ పేరొచ్చింది. బాలచందర్, మహేష్‌భట్, రాఘవేంద్రరావుతో లాంటి దర్శకులతో పనిచేసేటప్పుడు చాలా స్వేచ్ఛ దొరుకుతుంది. వారిలో రాజమౌళి కూడా ఉంటాడు. దర్శకులు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే మనసుపెట్టి సంగీతాన్ని అందిచవచ్చు.

సంగీతం కాకుండా మీకు ఏదంటే బాగా ఇష్టం. ఇతర వ్యాపకాలు ఏమైనా ఉన్నాయా?

Rendu-RellaAaru2
-పుస్తకాలు చదవను. కళ్లు లాగుతాయని భయం. ఏ పుస్తకాన్ని పూర్తిగా చదవలేదు. ఏదో ఒక పేజీ పూర్తిచేసి పక్కనపెడతాను. సినిమాలు చూస్తాను. ఇంట్లో ఉంటే గేమ్స్ ఆడుతాను. లేదంటే ఏ పనిచేయకుండా ఖాళీగా కూర్చోవడం ఇష్టం.

ఓ సినిమా సక్సెస్ క్రెడిట్‌లో సంగీతం ఎంతవరకు దోహదపడుతుందని అనుకుంటున్నారు?

-సినిమాకు మంచి ప్రారంభ వసూళ్లు రావడానికి సంగీతం ఉపయోగపడుతుంది. అయితే ఆ సినిమా ఎక్కువ కాలం థియేటర్లలో నిలబడాలంటే మాత్రం కథ బాగుండాలి. పాటలు ఒక్కటే సినిమాను విజయవంతం చేయలేవు. అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్ పైకి వెళ్లడానికి ప్రారంభంలో నిప్పు కొంత దూరం వరకు వాహకంగా పనిచేస్తుంది. ఒక దశ దాటిన తర్వాత రాకెట్ సొంత బలాన్నే నమ్ముకోవాలి. అలా ప్రారంభంలో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి సంగీతం దోహదం చేస్తుంది. పాటలకు బాగా పేరొస్తే సినిమా చూడాలనే ఉత్సుకత వారిలో ఏర్పడుతుంది.

కొన్నిసార్లు పాటలకు మంచి పేరొచ్చి సినిమా పరాజయం పాలైతే అప్పుడే ఏమనిపిస్తుంది.?

-ఫెయిలైనా చేయగలిగేదీ ఏమీ ఉండదు.

మీ తనయుడు భైరవ గాయకుడిగా మంచి పేరుతెచ్చుకున్నారు. మీ అడుగుజాడల్లోనే అతడిని సంగీత దర్శకుడిని చేస్తారా?

-నాకు ఇద్దరూ అబ్బాయిలు. వారిలో భైరవ సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఇంకో అబ్బాయి ఇటువైపు రాలేదు. సంగీత దర్శకుడావ్వాలనే ఆకాంక్ష భైరవలో బలంగా ఉంది. చాలా సాధన చేయమని చెప్పాను. నా కొడుకు అనే ట్యాగ్ తొలి సినిమా వరకు ఉపయోగపడుతుంది. రెండో సినిమా నుంచి ప్రతిభను నిరూపించుకుంటే రాణించగలుగుతాడు.

మీ మరో తనయుడు దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది.

-రంగస్థలం సినిమాకు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఫొటోగ్రఫీ వైపు ఆసక్తి కనబరుస్తున్నాడు.

-మడూరి మధు

1233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles